‘అమ్మ కోవెల’

Mar 10,2024 10:24 #Kavitha, #Sneha

మన అందరి ‘అమ్మ కోవెల’
ఇప్పుడు పాడుబడిన
పురాతన దేవాలయం అయిపోయింది !
ఒకప్పుడు
మన ‘అయ్య’వారి పాలనలో
దేదీప్యమానంగా
వెలుగులు విరజిమ్ముతూ ఉండేది !
అలాంటి కోవెలలో
ఇప్పుడు చీకట్లు కుమ్మరిల్లుతున్నాయి..!
ఏవి.. ఆ వెలుగులు !
ఎలా మాయమై పోయాయి ?!
నీకూ నాకూ గుర్తే..!
భక్త సుపుత్రుల
అవసరాలు నెరవేరిపోయాక కాబోలు
ఆ వైపు దారే
మూసుకు పోయినట్లైంది కదూ!!
తరువాత తరువాత
నిత్య శ్లోక పఠనం సంగతి సరే
‘అమ్మా’ అన్న పిలుపే కరువై పోయింది !
నిత్య తలపులు తరింపు సంగతి సరే
తలుపు తెరిచి ఉంచిన
తనయుడే కరువయ్యాడు !
నిత్యాన్న సంగతి దేవుడెరుగు
ఏడాది కోసారి
‘దర్శన’ భాగ్యమే కరువై పోయింది !
తుదకు హారతిచ్చి
తలుపులు మూసే కార్యక్రమం కూడా..
సిగ్గు చేటు..! ఇప్పుడు
అనాధాశ్రమాల వంతు అయిపోయింది !!
నువ్వూ నేనూ
కళ్ళు మూసుకున్నా
నిజం నిజమే!
అమ్మ కోవెల
ఇప్పుడు ఎక్కడో మది చివరన
ఎవరకీ పట్టని
పాడుబడిన
పురాతన దేవాలయం !
నువ్వూ నేనూ
తలుచుకుంటే
పూర్వ వైభవం
తేలేమా..!
ఆలోచించు మిత్రమా..!!

తిప్పాన హరిరెడ్డి
9493832412

➡️