ఆశ

Mar 3,2024 09:21 #Sneha, #Women Stories
asa story vempalli sharif

సరళ ఫోన్‌ చేస్తోంది. కట్‌ చేశాను.

గత రెండు రోజుల నుంచి నాది ఇదే కత. ఫోన్‌ తీస్తే తన ఉద్యోగం గురించి అడుగుతుంది. ఏమని చెప్పాలి. ఇవ్వాళ, రేపు అంటూ ఇప్పటికే చాలాసార్లు వాయిదా వేశాను. ఇక నావల్ల కాదు.

సరళది మా ఊరే. మా ఊరి డిగ్రీ కాలేజీలోనే చదువుకుంది. రోజూ మా ఇంటి ముందు నుంచి వెళ్లేది. ఆ పిల్ల కాలేజికి వెళ్తున్నప్పుడే చూసి ఇష్టపడ్డాను. ఆ విషయం చెప్పడానికి ఎంత ప్రయత్నించినా ఆ పిల్ల అవకాశమే ఇవ్వలేదు.

ఈ లోపు నేను జర్నలిస్టు ఉద్యోగంలో చేరి అమరావతికి వచ్చేశాను. ఇక్కడికొచ్చాక ఊరికెళ్లేది వారానికొకసారే. ఆ ఒక్కరోజైనా ఆమెను చూసినట్టు ఉంటుందని సాయంత్రాలు ఆమె ఇంటి ముందు పచార్లు చేసేవాణ్ని. బట్టలు ఉతుకుతూనో, తమ్ముడితో ఆడుకుంటూనో, పూలు అల్లుతూనో, కసువు కొడుతూనో.. ఇలా ఏదో ఒకరూపంలో వాళ్లింటి ముందు కనబడేది. తాను నన్ను చూస్తుంది కానీ చూసినట్టే ఉండదు. ఆ నటన సినిమా హీరోయిన్లకు ఏమాత్రం తగ్గదు. కానీ తన కళ్లలో ఇష్టమో అయిష్టమో ఏదో కనబడాలిగా.. అదేదీ కనబడదు.

నేను ఈ విచారంలో ఉండగానే మూడేళ్లు గడిచిపోయాయి. ఆ పిల్ల డిగ్రీ కూడా అయిపోయింది. తర్వాత ఒకరోజు ఒక ఆదివారం ఇంటి దగ్గరుంటే తన తమ్ముడిని తోడు తీసుకుని నన్ను వెతుక్కుంటూ వచ్చింది. చచ్చేంత ఆశ్చర్యం నాకు. గుండె దడామనింది. తనింటి ముందుగా తిరుగుతున్నందుకు ఆ పిల్లకు కోపం వచ్చి చెడామడా తిట్టడానికి వస్తోందనుకున్నాను. బనియన్‌ మీదున్నవాణ్ని లోనికి పరిగెత్తి చొక్కా వేసుకుని బయట నిలబడ్డాను. రాగానే ఆ పిల్ల ‘హారు..’ అంది. నవ్వాను. ‘మీతో చిన్న పనుంది..’ అంది.

‘అంతకన్నానా.. చెప్పండి..’ అన్నాను. ‘నాకు ఒక చిన్న ఉద్యోగం కావాలి?’ అంది. ప్రతి వాడిలో ఒక వెధవ ఉంటాడుగా… ‘మీకు నన్నే ఎందుకు అడగాలనిపించింది?’ అని వెధవ ప్రశ్న వేశాను. ఆ పిల్ల నవ్వింది.

‘మీరు అమరావతిలో ఉంటారని, చాలా పరపతి ఉందని నా స్నేహితురాలు లత చెప్పింది. మీరు దారిలో వెళ్తుంటే మిమ్మల్ని చూపిస్తూ ఆ మాట అనేసరికి నేను వెంటనే ‘ఇతనా.. నాకు బాగా తెలుసు’ అన్నాను. ఆ పిల్ల ఎంతో ఆశ్చర్యపోయింది. అలా చెప్పినందుకు నేను కూడా ఇబ్బంది పడ్డాను. ‘ఎలా తెలుసు?’ అని అడిగింది.

”తెలుసు అంతే” అని మాట దాటేశాను. కానీ మీతో పరిచయం ఉన్నందుకు నాకు ఎంతో గర్వంగా ఉంది తెల్సా..’ అంది. నేను ఉప్పొంగిపోయాను. ‘గర్వంగానా.. ఎందుకు? నాతో మీకెక్కడ అంత పరిచయం ఉంది’ అన్నాను ఏమీ తెలియనట్టు.

ఆ పిల్ల ‘మీరు రోజూ నాతో మాట్లాడ్డానికి ప్రయత్నిస్తున్న సంగతి నాకు తెలియదా .. ఏంటి?’ అంది కొంటెగా.

అప్పుడు చూశాను ఆమె మొహంలోకి సూటిగా. పురివిప్పిన బుల్లినెమళ్ల వంటి కళ్లు, పొడుగాటి ముక్కు, గుండ్రటి ముఖం, అందరూ ఇష్టపడే రంగు.. కొద్దిగా పొట్టిగా అనిపిస్తుంది కానీ అదేమీ నాకు పెద్ద ఫరక్‌ పడదు. లోలోపల ఎంతో పొంగిపోయాను. ‘నేను తప్పకుండా మీకు ఉద్యోగం ఇప్పిస్తాను కానీ అమరావతిలో అయితే పని తొందరగా అవుతుంది. నాకు అక్కడే ఎక్కువ పరిచయాలు ఉన్నాయి’ అన్నాను.

ఆ పిల్ల ఆనందంతో ఒప్పుకుంది. ‘నేను కూడా అమరావతిలోనే అడుగుతు న్నానండి.. గవర్నమెంటు సెక్టార్‌లో అయితే ఒత్తిడి తక్కువ ఉంటుంది.. పైగా సాయంత్రాలు ఘంటశాల కాలేజిలో మ్యూజిక్‌ నేర్చుకోవచ్చని ఆశ..’ అంది. ‘చాలా ప్లాన్డ్‌గా ఉన్నారే?’ అని మెచ్చుకోలుగా చూసి ‘మీ బయోడేటా నాకు వాట్సప్‌ చేయండి’ అని నెంబర్‌ ఇచ్చి పంపించేశాను. ఆ రాత్రి ఎన్నో కలలు కన్నాను. ఆ పిల్లకు వెంటనే ఉద్యోగం ఇప్పించేసినట్టు హాస్టల్‌లో ఉండే ఆమెను రోజూ చూడ్డానికి వెళ్తున్నట్టు, ఆ పిల్లతో సెకండ్‌ షో సినిమా చూసి ఓ రాత్రి అలాగే రూముకు పిల్చుకున్నట్టు.. ఇలా ఎన్నో స్టుపిడ్‌ ఆలోచనలు కూడా చేశాను. కానీ పనిలోకి దిగితే కానీ లోతేంటో అర్థం కాలేదు. ఫోన్‌ మోగడంతో ఆలోచనల నుంచి తేరుకుని చూశాను. మళ్లీ సరళనే చేస్తోంది. మరీ ఇన్ని సార్లు చేస్తున్నా ఎత్తకపోతే బాగోదని ధైర్యం చేసుకుని ఎత్తాను. ‘నీకే ఫోన్‌ చేయాలనుకుంటున్నాను. నువ్వే చేశావ్‌, వందేళ్లున్నాయి’ -అవలీలగా అబద్ధం ఆడేశాను. ఆ పిల్ల కరిగిపోయింది. ‘అవునా?’ అంది వీలైనంత శాంతంగా. ‘అవునబ్బా. ఏంటి సంగతులు?’ అన్నాను తన ఉద్యోగం గురించి అడుగు తుందేమో అన్న భయం గొంతులో ధ్వనిస్తుండగా.

ఆ పిల్ల ఎంతో మంచిది, అడగలేదు. అసలు ఆ ప్రస్తావనే తేలేదు. తాను ఉద్యోగం అడిగినట్టు, నేను చూస్తానని చెప్పినట్టు, అసలు మా ఇద్దరి మధ్య అలాంటి సంభాషణ ఒకటి జరిగినట్టే ఆ పిల్ల ప్రవర్తించలేదు. ఎంతసేపున్నా ‘సమయానికి తింటున్నావా? ఆరోగ్యం కాపాడుకుంటున్నావా? ఇంకా ఏంటి? ఊరు ఎప్పుడు వొస్తున్నావ్‌’ వంటి ప్రశ్నలే అడిగింది. ఊరు ఎప్పుడొస్తున్నావ్‌? అనే ప్రశ్నకు నాలోని చిలిపి ప్రియుడు మేలుకున్నాడు. ‘వొస్తే ఏం లాభం? కలుస్తావా పాడా? నేను మునుపటి మాదిరే మీ ఇంటి చుట్టూ ప్రదక్షిణలు చేసి రావాలి’ అన్నాను.

‘నీకు తెలుసుగా. మా ఇంట్లో ఎక్కడికీ పంపరబ్బా. పంపినా తమ్ముడ్ని తోడుచేసి పంపుతారు. అందుకే ఆ ఉద్యోగం ఏదో త్వరగా చూస్తే అమరావతిలోనే మనం కలుసుకోవచ్చు’ అంది. పడుకున్న గాడిదను లేపి తన్నించుకున్నట్టయింది నాకు. ‘ఆ పని మీదే ఉన్నానబ్బా. ఏం ఉద్యోగం చూడకపోతే నన్ను కలవ్వా..’ అన్నాను నిష్టూరంగా. ఆ పిల్ల తెగ బాధపడిపోయి ‘ఈసారి ఊరొచ్చినప్పుడు చూద్దాం లే’ అంది.

నాకు మనసంతా ఆనందమైంది కానీ తర్వాత ఆ పిల్ల మాట దాటేస్తుంది. అది కూడా తెలుసు. ఎందుకంటే ఇలా చాలా సార్లే జరిగింది. నిజానికి నాక్కూడా ఆ పిల్లను పనయ్యేంత వరకు కలవాలని లేదు. ఇప్పుడు బలవంతపెట్టి కలిస్తే ఆమె బలహీనతను వాడుకున్నట్టు ఉంది. నాకది ఇష్టం లేదు. ఆ పిల్లకు ప్రేమతో దగ్గరవడమే నాకు కావాలి. అందుకే ఇంకేం మాట్లాడకుండా ఫోన్‌ పెట్టేశాను. మా ఇద్దరి మధ్య ఈ దాగుడు మూతల ఆట మొదలై కూడా ఆర్నెల్లయింది. ఈ లోపు విషయాన్నయితే ఇంత చొరవగా మాట్లాడేదాక తెచ్చాను కానీ ఉద్యోగం సంగతే తేలలేదు. నాకు సూపరింటెండెంట్‌ జయరాజ్‌ గుర్తుకొచ్చాడు. అతను చేస్తోందే ఇదంతా. అతని మీద నాకు విపరీతమైన కోపంగా ఉంది. ఎందుకంటే నేను జర్నలిస్టు అని చెప్పాను కదా.. దమిడీ జీతం లేని ఆ పని ఎప్పుడో మానేశాను. అయితే ఆ ఉద్యోగాన్నే అడ్డం పెట్టుకుని సెక్రటేరియెట్‌లో పరిచయాలు పెంచుకున్నాను. రోజూ రకరకాల పనుల కోసం సెక్రటేరియెట్‌కు వచ్చేవాళ్లతో మాట్లాడి వారి పనులు చేసి, వాళ్లిచ్చే డబ్బులు తీసుకుని అధికారులతో కలసి పంచుకుంటాను. ఒకరకంగా మధ్యవర్తిత్వం చేస్తున్నాను. కష్టం లేని పనే కానీ కాస్త జాగ్రత్తగా చేయాల్సిన బాధ్యత ఇది.

ఒక్కో పనికి ఒక్కో రేటు ఉంది. చాలామంది మంత్రులు, వారి సహాయకులతో కూడా నాకు పరిచయాలు ఏర్పడ్డాయి. నేను పని ఒప్పుకుంటే అధికారులు తప్పక చేసిపెట్టే వాళ్లు. ఎందుకంటే వారి మామూళ్లు వారికి ఠంచన్‌గా పింఛన్‌లా ఇచ్చేది నేనే. నాకు పనిచేసి పెడితే వాళ్లకు ముట్టాల్సింది వాళ్లకు మూడో కంటికి తెలియకుండా ముడుతుంది. ఒక్కోసారి నాతో పనిచేయించుకున్నవాళ్లు డబ్బు ఇవ్వడం ఆలస్యమైనా నేను మాట పోకుండా చేతి నుంచి అధికారులకు ఇచ్చేవాణ్ని. అందుకే నన్ను అందరూ ఇష్టపడతారు. ఆఫీసులకెళ్తే గౌరవంగా పలకరిస్తారు.అయితే ఈ పలకరింపు, ఈ గౌరవం వాళ్లకు డబ్బులు ఇచ్చినంత సేపే అని గుర్తించలేకపోయాను. నాకున్న పరిచయాల్లో ఎక్కువగా ఉద్యోగాలు ఇప్పించే పని చూసేది జయరాజే. అతను పనిచేస్తున్న శాఖ పెద్దది. ఎప్పుడూ అందులో ఏదో ఒక పోస్టు ఖాళీ అవుతూనే ఉంటుంది.నాకు గిరాకి తగలగానే అతనికి ఫోన్‌ చేస్తాను. నాన్చుడు లేకుండా నేరుగా ‘కేసు ఉంది.. తీసుకోవాలి’ అంటాను.

‘తప్పకుండా సార్‌…’ అని ఉత్సాహంగా పలికి అతను ఫోన్‌ పెట్టేస్తాడు.

వెంటనే వాట్సప్‌లో బయోడేటా వెళ్లిపోతుంది. నెల తిరక్కుండానే అదే వాట్సప్‌ లో ‘ఆర్డర్‌ రెడీ..’ అనే మెస్సేజ్‌ వస్తుంది.వెంటనే ఇటు వైపు నుంచి, అతను చెప్పిన అకౌంటులో పర్సెంటేజ్‌ ప్రకారం అమౌంటు పడిపోతుంది. అటువైపు నుండి వెంటనే అదే వాట్సప్‌లో ”అపాయింట్‌ మెంట్‌ ఆర్డర్‌ ” పిడిఎఫ్‌ డాకుమెంటు ఫార్మెట్‌లో వచ్చేస్తుంది.అంత సింపుల్‌గా జరిగే పని అది. ఈసారే నానుతోంది. ఎందుకో మీకు తెలియనిది కాదు. ఈసారి నేను ఉద్యోగం అడుగుతోంది నా వ్యక్తిగత మనిషి కోసం, పైగా ఉచితంగా. నాకు తెలియకుండానే నా గొంతులో ధైర్యం పోయి దైన్యం వచ్చి చేరింది.

జయరాజ్‌కు ఫోన్‌ చేసి -‘అన్నా, ఒక చిన్న పని పడింది. నాకు బాగా తెలిసిన అమ్మాయి. మనం సహాయం చేసి పెట్టాలి. ఆమెకు మన డిపార్టుమెంటులో కంప్యూటర్‌ ఆపరేటర్‌ ఉద్యోగం ఒకటి ఉందిగా.. అది ఇప్పించాలి, ఇంపార్టెంట్‌’ అన్నాను.

అతను నా గొంతులోనే వినయాన్ని పసిగట్టేశాడు. కానీ అదేమీ మాటల్లో కనపడకుండా ‘అయ్యో.. మన కేండేట్‌ అయితే మనకేమన్నా అడ్డు. మనదే డిపార్టుమెంటు. తప్పకుండా చేద్దాం. మీరు బయోడేటా పెట్టండి’ అని ఫోన్‌ పెట్టేశాడు.

తర్వాత ఉలుకు లేదు, పలుకు లేదు. ఒకసారి ఫోన్‌ చేసి అడిగాను. ‘ఇప్పుడు ఖాళీలు లేవు అంటున్నారన్నా డైరెక్టర్‌ గారు. మంత్రి గారితో ఫోన్‌ చేయిస్తే బావుంటుందేమో’ అని సానుభూతి చూపిస్తూ సలహా ఇచ్చాడు.

‘ఓహ్.. అదెంత సేపు’ అని ఆనందంగా ఫోన్‌ పెట్టేశాను. మంత్రి గారు సచివాలయానికి వచ్చినప్పుడు సమయం చూసుకుని విషయం చెప్పి ‘సార్‌.. మీరు ఒకసారి డైరెక్టర్‌ గారికి ఫోన్‌ చేసి చెప్పాలి’ అన్నాను.సచివాలయంలో మంచి మధ్యవర్తిగా పేరున్న నన్ను మంత్రిగారు సులువుగానే గుర్తు పట్టారు. అయితే నేను అడగడంలోని దైన్యతను కూడా అర్థం చేసుకున్నారు.

‘ఓహ్.. అదెంత సేపు, డైరెక్టర్‌కి ఫోన్‌ కలుపు మాట్లాడుతాను’ అన్నారు.వెంటనే ఫోన్‌ కలిపి ‘సార్‌.. నమస్తే.., మంత్రి గారి పేషి నుంచి సార్‌, మంత్రి గారు మాట్లాడుతారు..’ అని చెప్పి ఫోన్‌ ఇచ్చాను.మంత్రిగారి గొంతులో విషయం డైరెక్టర్‌కి కూడా తెలిసిపోయింది. అయితే డైరెక్టర్‌ ఆ విషయం తెలీకుండా ‘ష్యూర్‌.. ష్యూర్‌.. డెఫినెట్లీ..’ అని ఫోన్‌ పెట్టేశాడు.

ఆ డెఫినెట్లీ అన్న పదం సెల్‌ఫోన్‌ నుంచి బయటికి వినపడ్డంతో నేను నిశ్చింతంగా ఊపిరి పీల్చుకుని మంత్రి గారి ముందు వీలైనంత వంగి థాంక్స్‌ చెప్పి అక్కడ్నుంచి బయటపడ్డాను. తిరిగి జయరాజ్‌కు ఫోన్‌ చేసి ‘మినిస్టర్‌ గారితో ఫోన్‌ చేయించానయ్యా.. కొద్దిగా పనయ్యేలా చూడు..’ అని చెప్పాను. అయినా స్పందన లేదు. కిటుకంతా అతని దగ్గరే ఉందని గ్రహించడానికి నాకు ఇంత కాలం పట్టింది. తనకు డబ్బిస్తే అది ఎవరి ద్వారా ఎంతెంత ఎవరికెళ్లాలో వాళ్లకు వెళ్తుంది.. పనవుతుంది. ఇతను కొద్దిగా మనసు చేసుకుని ‘ఇది పర్సనల్‌’ అని పెద్దవాళ్లకు చెప్పి చేయించగలగాలి. అతనలా చెప్పలేడు. ఎందుకంటే పైవాళ్లకు ఇతని పర్సనల్‌తో పని లేదు. ఒకవేళ అది అతని సొంత పనైనా సరే డబ్బులిచ్చే చేయించుకోవాలి. అయితే ఈ విషయాన్ని జయరాజ్‌ మొదటిరోజే నాతో చెబితే సరిపోయేది. అలా చెప్పకుండా ఇంతకాలం నాన్చినందుకు నాకు అతని మీద కోపం కలుగుతుంది. ఎందుకైనా మంచిది చివరి సారిగా మాట్లాడుదామని స్కూటర్‌ వేసుకుని అతని ఆఫీస్‌ దగ్గరికి వెళ్లాను. అతను నన్ను చూడగానే నవ్వు నటిస్తూ కూర్చోమని సీటు చూపించాడు. అతని ఆకారం, ప్రవర్తన విచిత్రంగా ఉంటుంది. పొట్టి మనిషి, బాన పొట్ట, టక్కు, అవసరానికి మించిన వినయం, జోకున్నా లేకపోయినా పెద్దల ముందు ప్రతి దానికి గమ్మత్తుగా రెండు భుజాలు పైకి లేపి కళ్లు చిన్నవి చేసి తలాడిస్తూ నవ్వుతుంటాడు. తొలి పరిచయంలో అతనంత మంచోడు లేడనిపిస్తుంది. అది నిజమే, కాకపోతే పక్కా కమర్షియల్‌… ఈ వ్యవస్థలో ఒక పావు.

‘ఏంటన్నా ఇది. గవర్నమెంటులో  ఆశ ఇలా ఉచితంగా పనిచేయడం కుదర్దు అని ఒక మాట చెప్పేస్తే పోయేదిగా. ఇది తెలుసుకోవడానికి నాకు అర్నెల్లు పట్టింది తెలుసా?’ అన్నాను.అతను పడి పడి నవ్వాడు. అది వాస్తవంగా వచ్చిన నవ్వో లేదా అలవాటు కొద్దీ నవ్వే నవ్వో నేను పోల్చుకోలేకపోయాను. ఓపికున్నంత సేపు నవ్వి చివర్లో అన్నాడు మెల్లగా…’సత్యం ఒకరు చెబితే తెలిసేది కాదు సార్‌.. అనుభవంగా తెలుసుకునేది’ నాకేం చెప్పాలోఅర్థం కాలేదు. మొత్తానికి నేను ఒక బకరా అయ్యానని అర్థమైంది. నాకున్న ఈ కొద్ది సర్వీసులో ఇలాంటి ఫ్రీ కేసు ఎప్పుడూ తగల్లేదు. అసలు ఆ అవసరమే రాలేదు. అడగనిదే జనం ‘ఇంత తీసుకుంటారటగా ఇచ్చేస్తాం’ అనేవాళ్లే.

‘ఎందుకివ్వాలి?’ అని ఒక్కరు కూడా ప్రశ్నించలేదు. ఒకవేళ నాలాంటి వాడు ఎవడైనా డబ్బు వద్దన్నా వాళ్లు నమ్మరు. పని అవుతుందో లేదో అన్న అప నమ్మకంలోకి వెళ్లిపోతారు. డబ్బులు ఇస్తేనే జనానికి సంతృప్తి, నమ్మకం. వాళ్లు నమ్మకాన్ని డబ్బులతో కొనుక్కుంటారు. వాళ్లు అలా కొనుక్కున్నేలా వాళ్లను ట్యూన్‌ చేసింది వ్యవస్థ. విచిత్రం ఏంటంటే ఈ దందాకు ధనిక, పేదా తేడా లేదు. స్థోమత ఉన్నా లేకపోయినా శక్తి కొద్ది ప్రయత్నించి నమ్మకాన్ని కొనుక్కుంటారు. జ్ఞానం మెల్లగా బోధ పడుతుంటే ఇక అక్కడ ఉండలేక ‘సరే సార్‌, ఇంకోసారి కలుస్తాను’ అని చెప్పి వచ్చేశాను. ఇప్పుడు నాకన్నా అతనికే నా పల్స్‌ గురించి బాగా తెలుసు. ఇక జన్మలో నేను ఫ్రీ కేసే కాదు ఏ గిరాకీ కేసు కూడా తీసుకోను. అసలు మధ్యవర్తిత్వం పనే మానేస్తాను. అయితే నాకు ఒకటే ఆలోచన. నేను అనుకుంటే ఇప్పటికిప్పుడు డబ్బులు పెట్టి సరళకు ఉద్యోగం ఇప్పించగలను. కానీ నా ఇన్నాళ్ల పరిచయాలకు అర్థమేంటి? అవన్నీ డబ్బు పరిచయాలేనా? మరి అవన్నీ డబ్బు పరిచయాలైతే వాటిల్లో సరళతో ఉన్న పరిచయం ఎలాంటిది? ఈ ఆర్నెళ్లలో కూడా మా మధ్య ఏమీ మిగిలి లేదా? ఏదో ఆశ లోపల మిణుకు మిణుకుమంటుంటే తేల్చుకోవాలనుకున్నాను. వందేళ్లున్నాయి. సరళనే ఫోన్‌ చేస్తోంది.

  • వేంపల్లి షరీఫ్, 9603429366
➡️