రేపటి ఉదయానికి..

Jun 30,2024 09:40 #kavithalu, #Sneha

శ్రమని అమ్ముకునే చేతుల్ని
అక్కడ సిటీ ఆకర్షిస్తుంది!
ఎండమావుల్లో తళుక్కుమనే
నీటి మడుగుల్లా భ్రమల్లో
ముంచేసి బూకరిస్తుంది
పాపం ఆశపడి
సెటిలైన జీవులంతా..
రెక్కలోడ్చిన చెమట చుక్కల్ని
యజమాన్ల..
లిక్కరు బాటిళ్ళలో వొంపేసి
కాలం ఎడారిలో..
తడారిపోయిన గొంతుల్ని
ప్రభుత్వాలిచ్చే సంక్షేమ పథకాల..
శీతల పానీయాల..
సీసాల నురగల్లో ముంచేసి
ఈగల్లా గిలగిలా కొట్టుకుంటూ
జీవితాల్ని ఈడుస్తుంటారు
ఇంటినీ.. పని ప్రదేశాన్నీ..
కలిపే ఇరుకైన ప్రహారీగోడల్ని
పటిష్టంగా నిర్మించుకొని
అందులోనే బతుకు బండిని
గిరికీలు కొట్టిస్తూ
మర్యాదా మన్ననల బ్యాడ్జీని
మెళ్ళో వేసుకొని నిత్యం
ముక్కుతూ మూలుగుతూ
మెకానికల్గా రోజుల్ని
దొర్లిస్తుంటారు
కాలికింద నేల జారిపోతున్నా
చాపకింద నీరు చేరిపోతున్నా
నిశ్చలంగా నిర్గళంగా
సాగుతూనే వుంటారు
రోడ్డు మీద హౌరెత్తిన
నిరసన జెండాల
చూపుడు వేళ్ళు
మొహాన్ని గుచ్చుకుంటున్నా,
నెత్తుటి మడుగుల్లో.. న్యాయం..
గిలగిలా కొట్టుకుంటున్నా
చూపులో బెరుకూ..
వెన్నులో వణుకూ..
పక్కకి తప్పుకోమంటుందే తప్ప
పిడికిళ్ళు బిగించమని
ఏనాడూ ప్రేరేపించదు
మట్టిని నమ్ముకునే
చేతుల్ని మాత్రం
ఇక్కడ గ్రామం..
గొడుగై కాపు కాస్తుంది
అంటుకట్టిన పూల మొక్కై
ఆత్మీయంగా అక్కున చేర్చుకుంటుంది
గిజిగాడు ఒడుపుగా అల్లిన గూడల్లే
మనుషుల్ని తీగలు తీగలుగా పేర్చి
మమతల కొమ్మలకు వేలాడదీస్తుంది
వాళ్ళు గంజి నీళ్ళు
కడుపునిండా తాగి
గుండె కమతాల్లో
ఎర్రపూల వనాల్ని
స్వప్నిస్తారు! వాళ్ళు..
రాగి జావ చేతినిండా జుర్రి
మెదడు కొలుముల్లో
చండ్రనిప్పు కణాల్ని రాజేస్తుంటారు!
దయచేసి మీ నగర జీవన
మైకపు వలల్ని
ఆ అమాయక జీవుల మీద విసరి
వాళ్ళ బతుకుల్ని ఛిద్రం చేయకండి!
రాజ్యం వెన్నులో
వణుకు పుట్టించాలన్నా
చట్టం కన్ను తెరిపించి
మన్ను కరిపించాలన్నా
పేరుకున్న కుట్రల
ముళ్ళ డొంకల్ని నరికి
పళ్ళ వనాలుగా మళ్ళించాలన్నా
వాళ్ళే రేపటి ఉదయానికి
ఈ రాత్రిని సిద్ధం చేయగల
సూర్య బింబాలు!!

పతివాడ నాస్తిక్‌
9441724167

➡️