సెలబ్రేట్‌ టైం…

Dec 31,2023 10:15 #ruchi, #Sneha

కొత్త సంవత్సరం రోజు వెరైటీగా ఏమైనా చేసుకుని తింటే బాగుంటుంది కదా! ఆ రోజు బంధువులు, స్నేహితులు రావొచ్చు. బిర్యాని అంటే.. పిల్లలు కడుపునిండా తింటారు.. సంతోషిస్తారు. పిల్లలు అయితే కేక్‌ చేయమని అడుగుతారు. కొత్త సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ నోరు తీపి చేసుకోవాలి. మరీ స్వీటు తప్పనిసరి. అందుకే ఈ రోజు రుచుల్లో ఆ మూడు వెరైటీలు ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం..

స్పాంజి కేక్‌

కావలసినవి : మైదా – కప్పు, పంచదార- 1/2కప్పు, బేకింగ్‌ సోడా – 1/4 స్పూను, బేకింగ్‌ పౌడర్‌- 1 స్పూన్‌, కోడిగుడ్లు- మూడు, వంట నూనె- 1/3 కప్పు(శనగనూనె వాడకూడదు), ఉప్పు- చిటికెడు, పాలు- రెండు స్పూన్లు, వెనీలా ఎసెన్సు-3/4 స్పూన్‌.(ఈ కేక్‌ తయారీకి ఒవెన్‌ అవసరం లేదు)

తయారీ : మైదా పిండిని జల్లెడ పట్టుకుని ఒక గిన్నెలో పోసుకోవాలి. బేకింగ్‌ పౌడర్‌, బేకింగ్‌ సోడా వేసుకుని కలుపుకోవాలి. మిక్సీజార్‌లోకి పంచదార తీసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. దానిలో పంచదార, ఉప్పు, నూనె, కోడుగుడ్లు, కాచి చల్లార్చిన పాలు, వెనీలా ఎసెన్స్‌ వేయాలి. క్రీమిగా వచ్చేంతవరకూ మిక్సీ పట్టుకోవాలి. దీన్ని మైదా పిండి మిశ్రమంలోపోసి, బాగా కలుపుకోవాలి.వెడల్పు తక్కువ, లోతు ఎక్కువగా ఉన్న గిన్నె తీసుకుని అడుగున వెన్న రాసి కేక్‌ మిశ్రమాన్ని పోయాలి. ఇప్పుడొక మందపాటి, వెడల్పాడి గిన్నె లేదా కుక్కర్‌ తీసుకుని పాత్ర అడుగున కళ్ళుప్పు కానీ, ఇసుక గానీ సమంగా పరచాలి. దీనిలో చిన్న స్టాండ్‌ పెట్టుకుని మీడియం ఫ్లేం మీద బాగా వేడి చేయాలి. కేక్‌ మిశ్రమం ఉన్న గిన్నె పెట్టాలి. ఆవిరి బయటకు పోకుండా మూత పెట్టాలి. చిన్న మంట ఉడికించాలి. 45 నిమిషాల తర్వాత మూత తీయాలి.  కేక్‌ ఆరాక ప్లేట్‌లోకి తీసుకుంటే సరిపోతుంది. రుచికరమైన మెత్తని స్పాంజి కేక్‌

చికెన్‌ బిర్యానీ

కావలసినవి : మాంసం – 1 కిలో, బాస్మతీ బియ్యం – 1 కిలో, ఉల్లిపాయలు -250 గ్రాములు, పెరుగు – 250 గ్రా||, అల్లం వెల్లుల్లి ముద్ద – 3 టీ స్పూన్‌, కొత్తిమిర – 1/2 కప్పు, పుదీన – 1/2 కప్పు, పచ్చిమిర్చి – 3, పసుపు – తగినంత, కారం పొడి – 2 టీ స్పూన్‌, ఏలకులు – 4, లవంగాలు – 8, దాల్చిన – 2, షాజీర – 2 టీ స్పూన్‌, గరం మసాలా పొడి – 2 టీ స్పూన్‌, కేసర్‌ రంగు – 1/4 టీ స్పూన్‌, పాలు – 1 కప్పు, ఉప్పు తగినంత, నూనె – తగినంత.

తయారీ: పొయ్యిమీద ఒక గిన్నె పెట్టి, నూనె పోసి, వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయలు ఎర్రగా వేయించి పెట్టుకోవాలి. ఉల్లిపాయలు, కొత్తిమీర, పుదీనా, పెరుగు, కారంపొడి, పసుపు, మాంసానికి తగినంత ఉప్పు వేసి మిక్సి పట్టుకోవాలి. ఒక గిన్నెలో శుభ్రపరచిన మాంసం, మిక్సిపట్టిన మిశ్రమం, గరం మసాలా వేసి బాగా కలియబెట్టి కనీసం గంట అలా వదిలేయాలి. బిర్యానీ రైస్‌ కడిగి తగినన్ని నీళ్లు పోసి అరగంటపాటు నాననిస్తే చాలు.మందపాటి గిన్నె తీసుకొని నూనె వేసి దానిమీద కలిపి ఉంచిన మాంసం, మసాలా వేసి సమానంగా అడుగున పరచి పక్కన పెట్టుకోవాలి. ఇంకో పెద్ద గిన్నెలో బిర్యానినీ మూడింతలు నీళ్ళు పోసి, ఉప్పు వేసి మరిగించాలి. ఏలకులు, లవంగాలు, దాల్చిన చెక్క ముక్కలు, షాజీర వేయలి. బియ్యం వేసి సగం ఉడకగానే గంజి వార్చాలి. సగం ఉడికిన అన్నాన్ని మాంసంపై సమానంగా పరవాలి. పైన కొన్ని ఎర్రగా వేయించిన ఉల్లిపాయలు, సన్నగా తరిగిన కొత్తిమిర, పుదీనా కొద్దిగా, నెయ్యి, పాలు, కేసర్‌ రంగు వేసి మూత పెట్టాలి. ఆవిరి బయటకు పోకుండా బరువు పెట్టాలి. అరగంట తర్వాత ఘుమఘుమలాడే చికెన్‌ బిర్యాని రెడీ.

స్వీట్‌

కావలసినవి : శనగపిండి-1/4 కేజీ, పంచదార- ఒక కప్పు, నీళ్లు-1/3 కప్పు, నెయ్యి- 3/4 కేజీ, పాలు- పావు స్పూన్లు, ఫుడ్‌ కలర్‌- ఒక స్పూను, యాలకులు- అర స్పూను, బటర్‌ పేపర్‌- ఒకటి, డ్రైఫ్రూట్స్‌- ఒక కప్పు.

తయారీ : ఒక గిన్నెలో శనగపిండి పోయాలి. మూడు స్పూన్లు నెయ్యి, గోరువెచ్చని మూడు స్పూన్ల పాలు వేసి పొడి పొడిగా కలపాలి. దీన్ని బరకగా మిక్సీ పట్టుకోవాలి. దీన్ని గిన్నెలోకి తీసుకుని 20 నిమిషాలు పక్కనపెట్టుకోవాలి. మరొక పాన్‌లోకి నెయ్యి పోసి వేడి చేయాలి. శనగపిండి మిశ్రమం వేసి గోల్డెన్‌ కలర్‌ వచ్చే వరకూ కలపాలి. తర్వాత ఫుడ్‌ కలర్‌ వేయాలి. కొంచెం కొంచెంగా పాలు పోస్తూ మిశ్రమాన్ని కలపాలి. రెండు నిమిషాల తర్వాత పొయ్యి కట్టేసి, మిశ్రమాన్ని నెయ్యి రాసిన ప్లేట్‌లో సమంగా పరచాలి. పైన డ్రైఫ్రూట్స్‌ ముక్కలు వేయాలి. గంట తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్‌ చేయాలి. అంతే మోహన్‌థాల్‌ స్వీట్‌ రెడీ.

➡️