చందమామ అదృశ్యమైతే..!

May 12,2024 11:05 #moon, #Sneha

‘చందమామ రావే.. జాబిల్లి రావే!’ అని పిల్లలను మురిపించే రోజులు దూరమయ్యాయి. అయినా ఏదో ఒక సమయంలో చందమామను చూసి ఆనందపడతారు పిల్లలు, పెద్దలు. అయితే ఇటీవల చంద్రుని గురించిన పరిశోధనల్లో చాలా వింతలు వెలుగులోకి వస్తున్నాయి. కొద్దికాలం క్రితం వాతావరణంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా చందమామ భూమి నుంచి నెమ్మదిగా దూరంగా జరుగుతుందనే విషయం తెలిసింది. ఇప్పుడేమో అసలు చంద్రుడే అదృశ్యమయ్యే పరిస్థితులు వస్తున్నాయని అంటున్నారు శాస్త్రవేత్తలు.

చందమామ 450 కోట్ల సంవత్సరాలకు పైగా భూమికి ఉపగ్రహంగా కొనసాగుతోంది. భూమి మీద ఉన్న జీవరాశులపై దీని ప్రభావం ఎక్కువగా ఉంది. ఇటీవల పరిశోధనలు కొనసాగుతున్న సమయంలోనే నాసా సైంటిస్ట్‌ల మధ్య కొన్ని ఊహాజనిత ఆలోచనలు వచ్చాయి. వాటిల్లో ‘చంద్రుడు అకస్మాత్తుగా అదృశ్యమైతే’..! అనే విచిత్రమైన ఆలోచన ఒకటి. ప్రాణికోటికి చల్లని వెన్నెలని పంచే చందమామ అకస్మాత్తుగా అదృశ్యమైతే.. అది ఊహకే అందని విషయం. కానీ అలా జరిగే అవకాశాలు ఉన్నాయంటున్నారు శాస్త్రవేత్త పెట్రో.

అదృశ్యం ఇలానే..
చంద్రుడు ఎలా ఏర్పడ్డాడో.. అదేవిధంగా చంద్రుడు అదృశ్యమయ్యే పరిస్థితులూ ఉన్నాయని అంటున్నారు నాసాలోని ఖగోళ భౌతిక శాస్త్రవేత్త నోహ్ పెట్రో. చంద్రుడు ఏర్పడటానికి గల పరిస్థితులు ఖగోళ చరిత్రలో ఎలా నిలిచిపోయాయి. అవే చంద్రుని మాయం చేస్తాయంటున్నారు. ఈ విషయం మీద పెట్రో పరిశోధనలు జరిపారు. అధ్యయనం అనంతరం ‘చంద్రుడిని అదృశ్యం చేసే ఒక ఖగోళ సంఘటన జరుగుతుంది. అది చంద్రుని లేకుండా చేస్తుంది. చంద్రుడు ఏర్పడటానికి ఒక పెద్ద వస్తువు ఎలా కారణమయిందో.. అలాంటి మరో పెద్ద వస్తువే చంద్రుని ఉనికి లేకుండా చేసే ఛాయలు కనిపిస్తున్నాయని నేను భావిస్తున్నాను. ఈ పరిస్థితి భూమిపై ఉన్న పర్యావరణంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది’ అని పెట్రో అంచనా వేస్తున్నారు.

చంద్రుని పుట్టుక..
విశ్వంలో సూర్యుడు, గ్రహాలు ఏర్పడిన తర్వాత కొన్ని గ్రహశకలాలు (ఆస్టరాయిడ్లు) వాటి ఆకర్షణకు లోనై, చుట్టూ తిరిగేవి. కాలక్రమేణా అవే వాటికి ఉపగ్రహాలుగా మారాయి. అయితే చంద్రుడు ఏర్పడటం దీనికి విరుద్ధంగా ఉంది. భూమి ఏర్పడిన తొలిరోజుల్లో పెద్ద గ్రహం ఒకటి వచ్చి భూమిని ఢకొీట్టింది. అప్పుడు భూమిలోని కొంతభాగం, ఆ ఢకొీన్న గ్రహంలోని కొంతభాగం అంతరిక్షంలోకి విసిరి వేయబడ్డాయి. ఆ భాగాలు భూమి గురుత్వాకర్షణకు లోనై, అవి భూమి చుట్టూ తిరుగుతూ క్రమేణా గోళాకారంగా మారాయి. అలా ఏర్పడినదే చంద్రుడు అని శాస్త్రీయ నివేదిక.

భూమిపై ఆ ప్రభావం..!
ఆ చంద్రుడు అదృశ్యమైతే.. తక్షణమే మహాసముద్రాలపై ఆ ప్రభావం ఉంటుంది. చంద్రుని గురుత్వాకర్షణ శక్తి కారణంగానే ఆటూ పోట్లూ ఏర్పడతాయి. ఆటూ పోట్లూలో కలిగే మార్పుల కారణంగా సముద్రపు అలలు గణనీయంగా తగ్గుతాయి. సముద్ర జీవుల ఉనికికి తీవ్ర అంతరాయం కలుగుతుంది. ఎలాగంటే.. ఆటూ పోట్లూ తక్కువగా ఉన్నప్పుడు నీటి పైభాగానికి, ఎక్కువగా ఉన్నప్పుడు జలచరాలు నీటి అడుగుకు చేరతాయి. అంతేకాదు- ఇంటర్‌టైడల్‌ జోన్‌, నెరిటిక్‌ జోన్‌లో నివశించే ప్రాణుల ఉనికిపై చంద్రుని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. తద్వార తీర ప్రాంత జీవావరణ వ్యవస్థ శాశ్వతంగా నశించిపోయే అవకాశం ఉంది.

సముద్రాలలో..
నెరిటిక్‌ జోన్‌ అంటే – సముద్రపు నీటిలో సూర్యకాంతి ప్రసరించి, ప్లాంక్టోనిక్‌ ద్వారా కిరణజన్య సంయోగక్రియ జరుగుతుంది. భూమికి సమీపంలో ఉండటంతో పోషకాలతో కూడిన జీవులు, ఆల్గే, బ్యాక్టీరియా, పగడాలు ఈ జోన్‌లోనే ఉంటాయి. వీటి ద్వారా క్యాల్షియం కార్బోనేట్‌లు ఉత్పత్తి అవుతాయి. వీటిపైనా చంద్రుని అదృశ్య ప్రభావం తీవ్రంగానే ఉంటుంది. చంద్రుని గమనానికి భూమి చలనం, గురుత్వాకర్షణ శక్తి సాపేక్ష ఆధారితాలు.
చంద్రుని ప్రభావంతోనే జీవ, పర్యావరణ పరిణామాలు అభివృద్ధి చెందాయి. సహజ ప్రక్రియలన్నీ చంద్రుడు లేకపోవడంతో పర్యావరణానికి సవాలుగా మారతాయి. ప్రత్యేకించి అనేక జీవుల మనుగడకు, ఆహారం, ఆర్థిక కార్యకలాపాలపై చంద్రుడు లేని ప్రభావం తీవ్రంగానే ఉంటుంది. కాలాలు గతంగా మారిపోవచ్చు. వాతావరణంలో తీవ్ర మార్పులు చోటుచేసుకుంటాయి. జీవరాశి మనుగడే ప్రశ్నార్థకంగా మారుతుంది. చంద్రుని అదృశ్యం ఇన్ని అల్లకల్లోల మార్పులకు కారణమవుతుందని ఆ నివేదిక పేర్కొంది.

➡️