Chartered అకౌంటెన్సీ ఉజ్వల భవితకు మార్గదర్శి

Jun 30,2024 11:02 #ca, #Chartered Accountants, #Sneha, #story

దేశ నిర్మాణంలో చార్టర్డ్‌ అకౌంటెంట్లది కీలక పాత్ర. చార్టర్డ్‌ అకౌంటెన్సీ.. ఉజ్వల భవితకు మార్గం వేసే కామర్స్‌ ప్రొఫెషనల్‌ కోర్సు. ఈ కోర్సు పూర్తిచేస్తే ఆకర్షణీయమైన వేతనాలతో, చక్కటి కెరీర్‌ సొంతమవుతుంది. మరోవైపు సిఎ ఉత్తీర్ణత అంత సులువు కాదనే అభిప్రాయం, పరీక్షలు క్లిష్టంగా ఉంటాయనే భావన చాలామంది విద్యార్థుల్లో ఉంది. దాంతో సిఎ పరీక్షలనగానే ఎంతో ఒత్తిడికి గురవుతుంటారు. వాస్తవానికి కొద్దిపాటి మెళకువలతో సిఎ పరీక్షలో విజయం సాధించొచ్చు. దేశ ఆర్థికాభివృద్ధిలో చార్టర్డ్‌ అకౌంటెంట్ల పాత్రను గుర్తుచేసుకుంటూ ఏటా జులై ఒకటో తేదీన ‘జాతీయ చార్టర్డ్‌ అకౌంటెంట్స్‌ డే’ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక కథనం…

వ్యాపార సంస్థల్లో ఆర్థిక సమగ్రతను కాపాడుకోవడంలో చార్టర్డ్‌ అకౌంటెంట్లు అంతర్భాగం. అకౌంటింగ్‌, ఆడిటింగ్‌, ఫైనాన్షియల్‌ మేనేజ్‌మెంట్‌లో వారి నైపుణ్యం కంపెనీలు నియంత్రణ అవసరాలు, అంతర్జాతీయ ప్రమాణాలకు కట్టుబడి ఉన్నాయని నిర్ధారిస్తుంది. కచ్చితమైన ఆర్థిక సమాచారాన్ని అందించడం ద్వారా, సిఎ వ్యాపారాలకు సమాచారంతో కూడిన నిర్ణయాలు తీసుకోవడానికి వీలుకల్పిస్తుంది. పారదర్శకమైన, నమ్మదగిన వ్యాపార వాతావరణాన్ని పెంపొందిస్తాయి. ఇది విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు, విశ్వాసం కలిగేందుకు తోడ్పడుతుంది. తద్వారా దేశ ఆర్థికాభివృద్ధికి ఉపయోగపడుతుంది.

  • వృత్తి గురించి..
  •  సీఏలు, సీఏ కరిక్యులమ్‌కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది.
  •  సిఎ వృత్తి ఎంతో గౌరవప్రదమైనది.
  •  వృత్తిపరమైన, ఉపాధి అవకాశాలు గ్యారంటీ కెరీర్‌ వృద్ధితో విస్తృతంగా తెరవబడతాయి. ”కింగ్‌ ఆఫ్‌ కెరియర్‌” గా పరిగణించబడతాయి.
  •  గ్లోబల్‌ అకౌంటింగ్‌ సంస్థలతో ”మ్యూచువల్‌ రికగ్నిషన్‌ అగ్రిమెంట్స్‌” ప్రపంచవ్యాప్తంగా వృత్తిపరమైన గుర్తింపు, అవకాశాలకు బాటలువేస్తాయి.
  •  ఐసిఎఐ తన విజన్‌ ”ఐసిఎఐ – 2049” ను ముందుకు తీసుకెళ్లటంలో ”నెక్ట్స్‌”, ”రోడ్‌ అహెడ్‌” అనే వృత్తి విలువలకు రెండు మంత్రాల్లాంటివి.
  •  మనదేశ మాజీ రాష్ట్రపతి డాక్టర్‌ ఏపీజే అబ్దుల్‌ కలాం ఐసీఏఐని ‘దేశ నిర్మాణంలో భాగస్వాములు’ గా గుర్తించారు. ఐసీఏఐ కూడా భారత్‌-2047ను నిశితంగా పరిశీలిస్తోంది.

అవకాశాలు-సవాళ్లు..
మారుతున్న ఆర్థిక, వ్యాపార ప్రపంచానికి అనుగుణంగా సిఎ ప్రొఫెషనల్స్‌ మేధో ప్రతిభను కలిగి ఉంటారు. వారి కార్యకలాపాలలో ప్రధానమైనవి ”పన్ను, అనుబంధ ప్రాంతాలు” గా కొనసాగుతున్నాయి. అయినప్పటికీ వారు వృత్తిపరమైన కార్యకలాపాలతో ఇతర రంగాల్లో ప్రత్యేకత కలిగి ఉన్నారు. సంప్రదాయ, సమకాలీన, భవిష్యత్తు విషయాల్లో వారి విజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు నవీకరించుకుంటారు.
ఈ రోజు చార్టర్డ్‌ అకౌంటెంట్లు ప్రణాళిక, నిర్ణయాలు తీసుకోవడంలో పాల్గొనని ప్రాంతం లేదు. ప్రొఫెషనల్‌ కార్యకలాపాల రంగాన్ని విస్తరించడానికి, చార్టర్డ్‌ అకౌంటెంట్లు తమ క్లయింట్లకు మెరుగైన, సమర్థవంతమైన సేవలను అందించడానికి అధిక అర్హత, సామర్థ్యం కలిగి ఉండటానికి అపారమైన అవకాశం ఉంది. క్లౌడ్‌ కంప్యూటింగ్‌ కంపెనీ ”డిజిటల్‌ ఓషన్‌” ను ప్రారంభించడంలో కీలకపాత్ర పోషించిన ”క్రిస్‌ గ్రాసర్‌” అనే అమెరికన్‌ మాటలు.. ”అవకాశాలు రావు, మనమే వాటిని సృష్టించాలి” అన్నవి గుర్తుచేసుకోవడం సముచితం.

సాంకేతిక రంగంలోనూ..
చార్టర్డ్‌ అకౌంటెంట్లు సాంకేతిక రంగంలో పురోగతికి అనుగుణంగా ప్రావీణ్యం సాధిస్తున్నారు. సభ్యులను అప్‌డేట్‌ చేయడంలో ఐసిఎఐ సరికొత్త పద్ధతులను అభివృద్ధి చేస్తోంది. సభ్యుల నాలెడ్జ్‌ అప్‌ డేట్‌లో ప్రొఫెషనల్‌ ఎడ్యుకేషన్‌ కొనసాగింపు గణనీయమైన పాత్ర పోషిస్తుంది. దీని ద్వారా నిరంతరం వృత్తినైపుణ్యం పెంపొందిస్తూ ఉంటుంది. అకౌంటింగ్‌ వృత్తిలో ప్రపంచ ధోరణులు, పరిస్థితులకు అనుగుణంగా ఐసిఎఐ కొత్త కమిటీలను ఏర్పాటు చేస్తోంది. తాజాగా ఐసిఎఐ – ఏఐ కమిటీ అకౌంటింగ్‌ వృత్తిని ముందుకు తీసుకెళ్లడానికి ఇనిస్టిట్యూట్‌ చొరవ తీసుకుని తీవ్రంగా కృషిచేస్తోంది.

రెగ్యులేటరీ ల్యాండ్‌ స్కేప్స్‌ నావిగేషన్స్‌..
భారతీయ రెగ్యులేటరీ ఫ్రేమ్‌వర్క్‌ సంక్లిష్టమైనది. నిరంతరం మారుతూ ఉంటుంది. ఈ సంక్లిష్టతల ప్రయాణంలో వ్యాపారాలకు సహాయపడటంలో చార్టర్డ్‌ అకౌంటెంట్లు కీలకపాత్ర పోషిస్తారు. వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) అమలు, కంపెనీల చట్టానికి లోబడి ఉండటం అవసరం. అంతర్జాతీయ ఫైనాన్షియల్‌ రిపోర్టింగ్‌ స్టాండర్డ్స్‌ (ఐఎఫ్‌ఆర్‌ఎస్‌) కు కట్టుబడి ఉండటం వంటి అంశాల్లో సీఏలే మార్గదర్శకంగా నిలుస్తారు. వ్యాపారాలు చట్టాలు, నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయని వారు నిర్ధారిస్తారు. చట్టపరమైన సమస్యలు, ఆర్థిక జరిమానాల ప్రమాదాన్ని వీరు తగ్గిస్తారు.

ఐసిఎఐ-నా ఆల్మామేటర్‌, సిఎ వృత్తి
మొదటిది నేను భారతీయుడిని అయినందుకు గర్వపడుతున్నాను. ఆ తర్వాత నేను చెప్పగలిగేది చార్టర్డ్‌ అకౌంటెంట్‌గా సిఎ వృత్తికి చెందినందుకు నేను గర్వపడుతున్నాను.

ఉపోద్ఘాతం..
మనదేశంలో అకౌంటింగ్‌ వృత్తి 1913లో గుర్తింపు పొందింది. అయితే మనదేశ కంపెనీలకు సంబంధించి 1913 రూపంలో చట్టబద్ధమైన నిబంధన ఉంది. ఆ తర్వాత 1932లో అకౌంటెన్సీ బోర్డు స్థాపించబడింది. ఇది ”చార్టర్డ్‌ అకౌంటెంట్స్‌ యాక్ట్‌-1949” (యాక్ట్‌ నెం. శశశV××× ఆఫ్‌ 1949) మనదేశంలో అకౌంటెన్సీ వృత్తిని నియంత్రించడానికి 1949 జులై 1 నుండి అమలులోకి వచ్చే ఒక చట్టబద్ధమైన సంస్థ ”ది ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ చార్టర్డ్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా (ఐసిఎఐ)” స్థాపనకు మార్గం సుగమం చేసింది. శ్రీ గోపాల్‌దాస్‌ పి కపాడియా ఈ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు. కృష్ణాజిల్లాకు చెందిన శ్రీ పర్వతనేని బ్రహ్మయ్య 1962లో ఈ సంస్థకు అధ్యక్షులయ్యారు. ప్రస్తుత ఐసిఎఐ కేంద్ర మండలిలో విశాఖపట్నంకు చెందిన సిఎ.డి. ప్రసన్నకుమార్‌ సభ్యులుగా ఉన్నారు.

పరిణామం..
ఐసిఎఐ స్థాపించబడినప్పుడు ఇది దేశవ్యాప్తంగా సుమారు 1600 మంది సభ్యులను కలిగి ఉంది. న్యూఢిల్లీ నుండి నిర్వహింపబడుతోంది. మూడేళ్ళ తర్వాత 1952లో ముంబయి, చెన్నయి, కోల్‌కతా, కాన్పూర్‌, ఢిల్లీలలో ఐదు ప్రాంతీయ మండళ్లు ఏర్పడ్డాయి. పదేళ్ల తర్వాత 1962లో అహ్మదాబాద్‌, పూనా, బెంగళూరు, కోయంబత్తూరు, మధురై, హైదరాబాద్‌-సికింద్రాబాద్‌లో ఆరు ప్రాంతీయ మండళ్ల శాఖలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం ఐసీఏఐ దేశవ్యాప్తంగా 176 బ్రాంచ్‌లతో తన రెక్కలను విస్తరించింది. ప్రపంచవ్యాప్తంగా ఐసిఎఐ ప్రారంభంలో 1981లో దోహా చాప్టర్‌తో తన ఉనికిని చాటుకుంది. నేడు ఇది 47 దేశాల్లోని 81 నగరాల్లో 50 విదేశీ చాప్టర్లు, 31 ప్రతినిధి కార్యాలయాలను కలిగి ఉంది. ప్రస్తుతం నాలుగు లక్షల మంది సభ్యులుండగా మొత్తం సభ్యుల్లో 1.50 లక్షల మంది వృత్తిలో ఉండగా, మరో 2.50 లక్షల మంది ఉద్యోగ లేదా ఇతర వ్యాపారాల్లో ఉన్నారు. అనేక మంది చార్టర్డ్‌ అకౌంటెంట్లు రాజకీయాలు, కళలు, బ్యాంకింగ్‌, వ్యాపార సంస్థలతో సహా వివిధ ఇతర రంగాల్లో తమ ప్రతిభను చూపించారు. జె.ఆర్‌.డి.టాటా, కుమార్‌ మంగళం బిర్లా, పీయూష్‌గోయల్‌, రామేశ్వర్‌ ఠాకూర్‌, దీపక్‌ పరేఖ్‌, రాకేష్‌ఝునుఝ్వులా, మొతీలాల్‌ ఓస్వాల్‌, అరుణ్‌ పూరీ, ప్రణరు రారు, శేఖర్‌ కపూర్‌ మొదలైన వారు ఇతర రంగాలలో ప్రతిభ కనపరిచారు. చార్టర్డ్‌ అకౌంటెంట్‌గా తన అసాధారణ నైపుణ్యాలను ప్రదర్శించారు. సత్యం కంప్యూటర్స్‌ భవితవ్యాన్ని మలుపు తిప్పడంలో కీలక పాత్ర పోషించిన టి.ఎన్‌. మనోహరన్‌, 2010లో బారత ప్రభుత్వం ఆయనకు ప్రతిష్టాత్మక పద్మశ్రీ పురస్కారాన్ని ప్రదానం చేసింది.

ఐసిఎఐ నినాదం..
”య ఏసా సుప్తేసు జాగృతి” నినాదానికి అనుగుణంగా, అనగా బాహ్య వలయంలో ఇనిస్టిట్యూట్‌, మధ్యలో గరుడ, సంస్కృత శాసనం పేర్లతో ఉన్న ఇనిస్టిట్యూట్‌ యొక్క ఉమ్మడి ముద్ర రూపకల్పనలో చెక్కబడిన ”నిద్రిస్తూ కూడా మేల్కొనే వ్యక్తి” అనే నినాదానికి అనుగుణంగా, మమ్మల్ని సమాజ సంరక్షకుడిగా, ఆర్థిక రంగానికి సంరక్షకుడిగా భావిస్తారు. నైతిక విలువలు వృత్తికి మూలస్తంభం కావడంతో ప్రపంచవ్యాప్తంగా అధిక నాణ్యత కలిగిన వృత్తిపరమైన సేవతో సిఎ వృత్తి నమ్మకం, నిబద్ధతకు ప్రసిద్ధి చెందింది.
”సమగ్రత” గురించి..బ్రిటీష్‌ రచయిత సిఎస్‌ లూయిస్‌ చెప్పినట్లు ”ఎవరూ మీ వైపు చూడనప్పుడు కూడా సరైన పని చేయడానికి ప్రతిరూపం అనేది సిఎ వృత్తికి బాగా నప్పుతుంది”. మన వృత్తి సత్యం, విలువలు, కరుణ, సహానుభూతికి పర్యాయపదం. ఇది ”సమగ్రత”.. అలాంటి బలమైన నైతిక సూత్రాలు, విలువలకు రాజీలేకుండా కట్టుబడి ఉంటుంది.

 

ముగింపు..
చివరగా మనం ”నాలెడ్జ్‌ మేనేజర్లు” గా ఉండి అవకాశాలను సృష్టిద్దాం. ఈ ప్రక్రియలో సవాళ్లు ఉండొచ్చు. మనం కూడా వారిని వెంట తీసుకెళ్దాం. వాటిని అధిగమించి చార్టర్డ్‌ అకౌంటెంట్‌ యొక్క విలువను ప్రపంచానికి చూపిద్దాం. నేను, నాలాగే నాలుగు లక్షల మంది సభ్యులు చేపట్టిన వృత్తి, సంస్థను ఆరాధిస్తాము. ప్రపంచంలోనే అతిపెద్ద అకౌంటింగ్‌ ప్రొఫెషనల్‌ బాడీ అయిన ఐసిఎఐ పూర్వ విద్యార్థిగా గర్వపడుతున్నాను. ఇనిస్టిట్యూట్‌ జెండా ఎల్లప్పుడూ ఎగురుతూ వైభవాన్ని పెంచాలి.!

సి.ఎ.సి.టి.చౌదరి ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ చార్టర్డ్‌ అకౌంటెంట్స్‌
ఆఫ్‌ ఇండియాదక్షిణ భారత ప్రాంతీయ మండలి
విజయవాడ శాఖ మాజీ చైర్మన్‌

➡️