రంగుల హోలీ.. ఆనందాల హేళీ..

Mar 25,2024 11:09 #Festivals, #Sneha, #Special Days, #Stories
  • ‘జమ్‌ చిక చిక/ జమ్‌ జమ్‌ చిక చిక/ హేరు రంగేళీ హోలీ/ హంగామా కేళీ.. ఏడాదికోసారి వచ్చింది హోలీ/ జిందగీలో తెచ్చింది ఫుల్‌ రంగేళీ.. లాంటి ఎన్నో జోష్‌లు.. పిల్లలూ పెద్దలూ అనే తారతమ్యం లేకుండా చేసుకునే కుషీలు.. అంతరాలు మరచి ఉత్సాహంగా.. ఉల్లాసంగా.. జరుపుకునే రంగుల పండుగే ఈ హోలీ. మరి పండుగను పండుగలానే జరుపుకుంటున్నామా! లేదే.. రసాయన రంగుల వాడకం వలన.. ఇవి ధరించండి, అవి ధరించండి.. జుట్టు, కళ్ళు, కాళ్ళు, చర్మం కాపాడుకోవాలంటూ అనేక హెచ్చరికలు మనముందు. ఏం! ఇన్ని భయాలతో, ఇబ్బందులతో కాకుండా పండుగను సరదాగా. స్వేచ్ఛగా జరుపుకోలేమా..! అంటే.. ఎందుకు జరుపుకోలేమూ! కాస్త శ్రద్ధ వహించాలి అంతే..! సహజ రంగులతో పండుగ జరుపుకుంటే.. స్వేచ్ఛగా పొందే ఆ ఆనందాన్ని మళ్ళీ సంవత్సరం వరకూ ఆస్వాదించవచ్చు. మానసికోల్లాసాన్ని సొంతం చేసుకోవచ్చు. ఈ నెల 25న జరుపుకునే హోలీని సహజ రంగులతో హాయిగా.. ఆనందంగా.. ఎలా జరుపుకోవచ్చో తెలుపుతూ ఈ ప్రత్యేక కథనం.

వసంత కాలశోభ.. చీకటిని ఛేదించే పున్నమి వెన్నెల.. ప్రకృతి చైతన్యం.. రంగుల సౌందర్యంతో ప్రజలంతా కోలాహలంగా ఈ హోలీ పండుగను జరుపుకుంటారు. హోలీని చెడుపై మంచి సాధించిన విజయంగా కూడా భావిస్తారు. మనదేశంలోనే కాక నేపాల్‌, బంగ్లాదేశ్‌, ప్రవాస భారతీయులు కూడా అత్యుత్సాహంతో జరుపుకునే పండుగ హోలీ. పశ్చిమ బెంగాల్‌, బంగ్లాదేశ్‌లలో దీన్ని దోల్యాత్ర లేదా బసంత-ఉత్సవ్‌ అని.. రాజస్థాన్‌, గుజరాత్‌, ఒడిశా, అస్సాం, త్రిపురలో డోలాజాత్రా అని పిలుచుకుంటారు.

ప్రకృతి పరవశం..
ప్రకృతిలో జరిగే కాలాల మార్పుల కనుగుణంగా జీవరాశి మనుగడలో భాగమే ఈ పండుగలు. అన్ని పండుగల్లానే హోలీకీ ఒక పౌరాణిక గాథ ప్రాచుర్యంలో ఉంది. ప్రహ్లాదుడిని అంతమొందించే ప్రయత్నంలో హిరణ్యకశిపుడి సోదరి హోలిక దగ్ధమయిన సందర్భంగా హోలీ జరుపుకుంటున్నట్లు కథ సారాంశం. కథ, కల్పనలెలా ఉన్నా మార్చి, ఏప్రిల్‌ నెలల్లో చలికాలానికి టాటా చెబుతూ వేసవికి ఆహ్వానం పలుకుతుంది ప్రకృతి. ఆ సమయంలో ప్రాణికోటి జీవన విధానాన్ని ప్రకృతికనుగుణంగా మలుచుకుంటుంది.

కాలాలు మారితే..!
చెట్లు చిగురిస్తాయి. చలికాలం తర్వాత వచ్చే నులివెచ్చని వాతావరణం జీవకోటిని ఆహ్లాదపరుస్తుంది. ఋతువులు మారే సమయంలో బ్యాక్టీరియా, ఇతర సూక్ష్మజీవులు వాటి శక్తిని పుంజుకుని, ఇతర జీవులపై దాడి చేస్తాయి. ఆ దాడి నుండి కాపాడుకుని రోగాల బారిన పడకుండా ఉండేందుకు ప్రకృతిలో కొన్ని ఔషధ పదార్థాలున్నాయి. ఈ పండుగల సందర్భంగా వాటిని ఆహార రూపంలో తీసుకునే సాంప్రదాయం కొనసాగుతోంది అనాదిగా. కాలం మారే తొలిరోజుల్లో తీసుకునే ఈ పదార్థాలు, రోగ నిరోధక శక్తిని పెంచి, రుగ్మతలను ఎదుర్కొనే శక్తినిస్తాయని ఆయుర్వేదం చెబుతోంది. హోలీకి మామిడి పూత, వేప చిగురు, తేనె కలిపిన హోలికా మిశ్రమాన్ని తీసుకోవడం వల్ల వేసవి తాపం, ఇతర ఇబ్బందులను అధిగమించవచ్చని నిపుణుల సూచన. ఎండిపోయిన చెట్ల కొమ్మలు, పుల్లలు కామ దహనం పేరిట కాల్చినప్పుడు వెలువడే పొగ వాతావరణంలో పెరిగే బ్యాక్టీరియాను నివారిస్తుంది. ఏదైనా సహజంగా ఉంటేనే ఫలితం సంతోషంగా ఉంటుంది.


హాయిగా.. ఉత్సాహంగా..
చిన్నా పెద్దా అందరూ ఈ పండుగలో పాల్గొనటం ఆరోగ్యకరం. చిన్నారుల్లో సామాజిక నైపుణ్యాలు పెంపొందటం.. అందరిలో సామాజిక అనుబంధాలు రెట్టింపు కావటం.. తద్వారా ఆటిజం లాంటి వాటి నుంచి బయటపడేంతటి మానసికోల్లాసాన్ని పొందవచ్చనేది నిపుణుల మాట. మనసుకు నచ్చిన పనులు చేసినా, చేసిన పనుల్లో సత్ఫలితాలొచ్చినా ఆ రోజంతా హ్యాపీగా గడిపేస్తాం. హోలీతోనూ మానసికంగా, శారీరకంగా ఈ సంతోషాన్ని సొంతం చేసుకోవచ్చంటున్నారు నిపుణులు. అందరితో కలిసి పాల్గొనటం, ముదురు రంగుల ప్రభావం, ఊపొచ్చే సంగీతానికి అనువుగా స్టెప్పులేయడం.. వారిని చూసి ఆనందించటం.. ఇలాంటివన్నీ మనలో కొత్త ఉత్సాహాన్ని నింపుతాయి. ఆ సమయంలో మనసులోని ప్రతికూల ఆలోచనలు, యాంగ్జైటీ.. వంటివి దూరమవుతాయి. సృజనాత్మక ఆలోచనలు రెట్టింపవుతాయి. ఏకాగ్రత పెరుగుతుంది. ఎలాంటి పనైనా సునాయాసంగా పూర్తిచేయగలుగుతాం. సంతోషమే సగం బలమనేది ఇలాంటి పండుగల ద్వారా నిజమవుతుంది.

ప్రమాద రహితంగా..!
హోలీనే కాదు.. ఏ పండుగైనా ప్రమాద రహితంగా ఉంటేనే ఆనందం. నిరుడు జరిగిన హోలీ సంబరాల్లో జపాన్‌కు చెందిన ఓ మహిళను ఢిల్లీలో కొంతమంది జుగుప్సాకరంగా అవమాన పరచటం.. ఒడిశాలోని జాజ్‌పూర్‌లోని ఖరస్రోటా నదిలో హోలీ ఆడి, స్నానాలు చేస్తుండగా ఆరుగురు బాలురు మరణించారు. అవే కాకుండా రసాయన రంగుల కారణంగా కళ్ళు మండటం, చర్మంపై దద్దుర్లు, ఇతర చర్మ సంబంధిత వ్యాధులకు గురైన సందర్భాలు జరుగుతూనే ఉన్నాయి. వీటిని దృష్టిలో పెట్టుకుని అందరూ అప్రమత్తంగా వ్యవహరించాలి.

తెలుగు రాష్ట్రాల్లో..
తెలుగు రాష్ట్రాల్లో హోలీ సంబరాలు అంబరాన్నంటుతాయి. ఎండు కట్టెలతో కాముని దహనం నిర్వహించి.. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ హోలీ పండుగ జరుపుకుంటారు.

లాఠీ దెబ్బలతో..
ఉత్తరప్రదేశ్‌లోని మధుర, బర్సానా, బృందావన్‌ ప్రాంతాల్లో మహిళలు సరదాగా పురుషుల్ని లాఠీలతో కొడతారు. దెబ్బలను అడ్డుకునేందుకు డాలును ఉపయోగిస్తారు పురుషులు. మధురలో రెండు వారాల పాటు ఈ వేడుకలు జరుగుతాయి.

ఇలా చెబుతారు..
రాజస్థాన్‌ ఉదరుపూర్‌లో తుపాకుల్లో గన్‌పౌడర్‌ను నింపి, గాల్లోకి కాల్పులు జరుపుతారు. పెద్ద ఎత్తున బాణసంచా కాలుస్తారు. దీనికి ఓ చారిత్రక కారణం.. అప్పట్లో మొఘలుల సైన్యంతో పోరాడిన గుర్తుగా 500 ఏళ్ల నుంచి ఇలా నిర్వహిస్తున్నామని స్థానికులు తెలిపారు.
మరింకెందుకాలస్యం.. రంగులకేళి- హోలీతో అందరం ‘కలిసిమెలిసి’ ఆనందాన్ని పంచుకుందామా!

సహజ రంగులతో మజా..
హోలీ అంటేనే ఒంటినిండా రంగులు, మనసు నిండా సంతోషం. అయితే ఈ రంగుల పండక్కి మార్కెట్‌లో లభ్యమయ్యే రంగులు చాలా ప్రమాదకరం. అందుకే సహజసిద్ధంగా రంగుల్ని తయారుచేసుకుంటే అందరికీ ఆరోగ్యం. రంగులను సహజంగా తయారుచేసుకుంటే తక్కువ ఖర్చు.. స్వయంగా చేసుకున్న తృప్తి.. సైడ్‌ఎఫెక్ట్స్‌కి తావుండదు.. పిల్లాపెద్దలకు హానీ ఉండదు. మరి అవి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా!
పసుపు: ఈ రంగు కోసం ఇంట్లోని పసుపు.. అదే కాస్త లేత రంగు కావాలనుకుంటే.. కొంచెం శనగపిండికి, పసుపు కలపటం.. మరింత లేత పసుపు రంగు కోసం పసుపులో కాస్త బియ్యప్పిండిని కలపటమే.
నారింజ: దీని కోసం కమలాపండు తొక్కల్ని బాగా ఎండబెట్టి, పొడి చేసుకోవటమే. ముదురు రంగు కోసం దానిమ్మ తొక్కల పొడి.
ఎరుపు ఈ రంగు కోసం కుంకుమ.. ఇందులో మెరూన్‌, నారింజ, బ్రౌన్‌.. వంటి రంగు కుంకుమలు.. మరోవిధంగా మందార పూల రెక్కలు ఎండబెట్టిన పొడి.
ఆకుపచ్చ: దీని కోసం లేత, ముదురు రంగు ఆకుల పొడి. కరివేపాకు, పుదీనా, పాలకూర, ఇతర చెట్ల ఆకులు.. ఔషధ లక్షణాలూ కలిగి ఉంటాయి. గోరింటాకులు ఆకుపచ్చ రంగులో మరో షేడ్‌ తయారవుతుంది. గులాబీల్లో ముదురు, లేత గులాబీ పూలు ఎండబెట్టి, పొడి చేసుకోవచ్చు.
మెజెంటా పింక్‌: ఈ రంగు కోసం బీట్‌రూట్‌ని చిన్నగా, పలుచటి చిప్స్‌లా చేసి బాగా ఎండబెట్టి పొడి చేసుకుంటే మెజెంటా రంగు రెడీ. బీట్‌రూట్‌ రసంలో బియ్యప్పిండి కలిపి, ఆరబెడితే లేత గులాబీ రంగు లభిస్తుంది.
గోధుమ రంగు: దీని కోసం గంధం పొడి, మెంతి పొడి.. ముల్తానా మట్టి.. ఈ రెండింటినీ కలిపితే ఆకర్షణీయమైన లేత గోధుమరంగు. ముదురురంగు కావాలనుకుంటే.. కాఫీ పొడి, టీ పొడి, దాల్చినచెక్క పొడి కలుపుకోవడమే. కొన్నిరకాల ఫుడ్‌ కలర్స్‌ను వంటల్లో కంటే హోలీ కలర్స్‌గా ఉపయోగించవచ్చు. ఫుడ్‌ కలర్స్‌ని ఒకదానితో ఒకటి కలుపుతూ వివిధ రంగుల్ని తయారుచేసుకోవచ్చు. రంగులే కాదు.. మరి రంగు నీళ్ళూ అంటారా..!
రంగు నీళ్ళ కోసం..!
హోలీకి రంగుల్ని చల్లుకోవడమే కాదు.. వాటిని నీళ్లలో కలుపుకొని హోలీ పిస్టన్‌లో నింపి స్ప్రే చేయటం పరిపాటి కదా. దానికి..
గులాబీరంగు నీళ్ళు.. బీట్‌రూట్‌ ముక్కలు నీళ్లలో వేసి మరిగించాలి. చల్లారిన నీటిని పిస్టన్‌లో నింపుకోవడమే..
నలుపు నీరు.. నల్లద్రాక్ష, పెద్దఉసిరి కాయల కషాయం..
ఆకుపచ్చ నీరు.. ఆకులు, ఆకుకూరల రసాలు లేదా వాటి కషాయం. ఈ సహజరంగుల వలన ఎలాంటి ఇబ్బందులూ లేకపోగా ఔషధీయంగానూ ఉపయోగపడతాయి.

  • సన్నీ, 7095858888
➡️