దళిత సంఘటనాత్మక కవిత్వం

Feb 11,2024 06:41 #book review
damanakanda book review

కులాధిపత్యం, మతాధిపత్యం, ఆర్థికంగా రాజకీయంగా ఎదిగిన, ఎదుగుతున్న భూస్వాముల ఆగడాలకు సామాన్యులు బలౌతున్నారు. పాలకుల అండదండలతో ఎస్సీలు, ఎస్టీలపై అనేకచోట్ల దాడులు జరుగుతూనే వున్నాయి. అన్నిరంగాల్లోనూ అనాదిగా అన్యాయానికి, అణచివేతకు గురవుతున్న ఈ అట్టడుగు వర్గాలు నేటి ఆధునిక యుగంలోనూ పీడనకు, అణచివేతకు గురవుతూనే వున్నాయి. వారిపై నిత్యం ఏదోక రూపంలో దమనకాండ కొనసాగుతూనే వుంది. ఇది తరతరాల చరిత్ర. ఇప్పటికీ కొనసాగుతోన్న ఆధునిక చరిత్ర. ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఏర్పడినా దళితులు, బహుజనులు అంటరాని మంటల్లో కాలుతూ, ఊరి పొలిమేరల్లోనే జీవనం సాగిస్తున్న దైన్యం నేటికీ ఒక సజీవచిత్రం. ఈ కథలు, వ్యధలు, వేదనలపై కథలు, కవితలు, పరిశోధనా గ్రంథాలు అనేకం వచ్చాయి. వీరిపై జరుగుతున్న దాడులు, మారణహోమాలు, కుల దురహంకారానికి బలైపోయిన అబలల ఆక్రందనలు, కూటికోసం, గుడ్డకోసం, అస్తిత్వం కోసం జరుగుతున్న దళితుల పోరాటాలపై ‘దమనకాండ- దళిత సంఘటనాత్మక కవిత్వం’ అన్న పిహెచ్‌డి గ్రంథాన్ని వెలువరించారు డాక్టర్‌ బద్దిపూడి జయరావు. సమాజ స్వరూపాన్ని, సామాజిక అంతరాల్లోని వికృతతత్వాన్ని తన పరిశోధనలో వెలుగులోకి వచ్చిన అనేక వాస్తవిక ఘటనలను కళ్లకు కట్టినట్లుగా ఈ గ్రంథంలో పేర్కొన్నారు. ముఖ్యంగా ఈ గ్రంథంలో ముందుగా సంఘటనల గురించి, వాటి పూర్వాపరాల గురించి వివరిస్తూనే, ఆయా సంఘటనలపై వచ్చిన స్పందనలు, విస్తృంగా వచ్చిన కవిత్వాన్ని విశ్లేషించారు రచయిత. 1969లో జరిగిన కంచికచర్ల కోటేశు హత్యోదంతం పూర్వాపరాల నుంచి మొదలై… కారంచేడు, చుండూరు, వేంపెంట సంఘటనల వరకూ విశ్లేషణాత్మకంగా… భవిష్యత్తరాలు తెలుసుకునే విధంగా నాటి చరిత్రను రికార్డు చేసిన పరిశోధన ఇది. ఈ గ్రంథానికి ముందుమాట రాసిన డాక్టర్‌ కత్తి పద్మారావు ‘రుధిర క్షేత్రంపై ఎగరేసిన నీలిజెండా’ ఈ గ్రంథం అంటారు. దళితుల చెమట చుక్కల్లోనూ, రక్తధారల్లోనూ ముంచి తీసిన వాసన ఈ పుస్తకమంతా పరుచుకొని వుంది. ఈ పుస్తకంలోని అనేక సంఘటనలు మండుతున్న ప్రతిఘటనా ప్రజ్వలనాలు దృశ్యమానమై పఠితులను ఉత్తేజపరుస్తాయి. ఈ క్రమంలో రచయిత… ఈ పోరాటంలో పాల్గొన్న సైనికుడిలా కనబడతాడు.ఈ గ్రంథం చదివితే.. దళిత ఉద్యమం, దళిత సాహిత్య ఉద్యమాల తాత్వికతా, స్వరూప స్వభావాలు కూడా మనకు స్పష్టంగా అర్థమవుతాయి. వివిధ కోణాల నుంచి వాటిని రచయిత అధ్యయనం చేసి, అంచనా కట్టిన తీరు ఆశ్చర్యం గొలుపుతుంది. వాస్తవానికి ఇది ఒక దశాబ్ది కృషి. రచయిత మస్తిష్కఘోష ఈ పుస్తకమంతా పరవళ్లు తొక్కుతుంది. అందుకే ఈ గ్రంథం హృదయాన్ని కదిలిస్తుంది. దళితులపైన, స్త్రీలపైన, దేశభక్తికి సంబంధించి, ప్రకృతిపరంగా ఆయా సందర్భాల్లో ఎంతో సాహిత్యం వచ్చింది. అయితే, దళితులపై జరిగిన దాడులు, ఆ సంఘటనలనే నేపథ్యంగా చేసుకొని సిద్ధాంత గ్రంథాలు ఇంతకుముందు రాలేదు. కంచికచర్ల కోటేశు సజీవ దహనం సంఘటన, కారంచేడు, నీరుకొండ, తిమ్మసముద్రం, చుండూరు, చలకుర్తి, వేంపెంట – సంఘటనల పూర్వాపరాలు వివరిస్తూనే, ఆయా సంఘటనలు జరిగిన నేపథ్యంలో ఉవ్వెత్తున ఎగసిపడిన ప్రజాస్పందన, సాహిత్యం కలిపితే ఈ గ్రంథం. ‘నేనింకా నిషిద్ధ మానవుణ్ణే/ నాది బహిష్కృత శ్వాస/ నా మొలకు తాటాకు చుట్టి/ నన్ను నలుగురిలో/ అసహ్య మానవ జంతువుని చేసిన మనువు/ నా నల్లని నుదిటి మీద బలవంతంగా/ నిషిద్ధముద్ర వేసినప్పుడే/ నా జాతంతా/ క్రమక్రమంగా హత్య చేయబడింది’ వంటి పదునైన కవిత్వం మొత్తం దళిత జాతినే కాదు.. యావత్‌ దేశాన్నే కదిలించింది. కనుకనే.. డాక్టర్‌ బద్దిపూడి జయరావు రచించిన ఈ పరిశోధనా గ్రంథం- ఈ శతాబ్దపు దళితుల నెత్తుటి చరిత్ర. అణగారిన కులాల ఆక్రందన. ప్రతి ఒక్కరూ కచ్చితంగా చదవాల్సిన పుస్తకం. వ్యక్తిగత లైబ్రరీలో వుండాల్సిన ఉత్తమ గ్రంథం.

పుస్తకం : దమనకాండ

రచయిత : డా|| బద్దిపూడి జయరావు

ధర : 300/-

ఫోన్‌ : 9949065296

  • రాజాబాబు కంచర్ల, 9490099231
➡️