మహిళా ఉపాధి సాధికారత అభివృద్ధి..

  • జి- 20 దేశాల సదస్సు ఆ మధ్య మన దేశంలో జరిగింది. ఈ సదస్సు విడుదల చేసిన ప్రకటనలో మహిళల నాయకత్వంలో ప్రపంచ దేశాలు అభివృద్ధి సాధించాలని పిలుపునిచ్చింది. నిజంగానే మహిళల నాయకత్వంలో అభివృద్ధి సాధనకు అవసరమైన ఏర్పాట్లు మనదేశ ప్రభుత్వం ఎంతవరకు చేసింది. ఏ దేశ అభివృద్ధిలోనైనా స్త్రీ, పురుషుల శ్రమ ఫలితంగా జరిగే ఉత్పత్తి వలన ఆ దేశంలో అభివృద్ధి సాధ్యమవుతుంది. స్త్రీలు ఇంటికే పరిమితం అయితే వారి శ్రమశక్తి ఉత్పత్తిలో భాగం కాదు. ఫలితంగా ఆ దేశ ఆర్థికవ్యవస్థ కుంటుపడుతుంది. అందువల్లనే ఆధునిక సామాజిక, రాజకీయ, ఆర్థిక నిపుణులు.. స్త్రీలు ఉత్పత్తిలో భాగమవడం అవసరమని భావిస్తున్నారు. స్త్రీలు ఉత్పత్తి రంగంలో ఎంతమంది భాగస్వాములయ్యారు అన్న అంశం ఆధారంగానే ఆర్థికాభివృద్ధిని అంచనా వేస్తున్నారు. మనదేశంలో స్త్రీల ఉపాధి పెరిగినట్లయితే 2025 నాటికి మన దేశ జాతీయ ఆదాయం 58,019 వేల కోట్ల రూపాయలకు పెరుగుతుందని అంచనా.

మన దేశంలో మహిళల ఉపాధి క్రమంగా తగ్గుతున్నది. 2018 నాటికి 21.9 శాతం మహిళలు భద్రత కలిగిన ఉపాధిలో ఉన్నారు. 2022- ’23 నాటికి ఈ మహిళల సంఖ్య 15.9 శాతానికి పడిపోయిందని కార్మిక సర్వే తెలియజేసింది. మహిళలలో 90 శాతం మంది మహిళలు అసంఘటిత రంగంలో పనిచేస్తున్నారు. వాస్తవంగా పనిచేసే మహిళలు గణనీయంగా పెరుగుతున్నారు. కానీ వారంతా భద్రత, నిలకడలేని పనులు చేయవలసి వస్తుంది. 2018- ’19 నాటికి 55.3 శాతం మంది మహిళలు వ్యవసాయ రంగంలో పనిచేస్తుండగా 2022 – ’23 నాటికి ఆ సంఖ్య 64.3 శాతానికి పెరిగింది. కార్మిక శక్తులలో మహిళల శాతం పెరుగుతుంది. అజీమ్‌ ప్రేమ్‌జీ యూనివర్సిటీ చేసిన సర్వే నివేదిక ప్రకారం కుటుంబ ఆదాయాలు పడిపోవడంతో మహిళలు బలవంతంగా, అనివార్యంగా ఏదో ఒకపని చేయాల్సి వస్తుందని తేలింది. ఇందులో అత్యధికులు స్వయం ఉపాధి పనులు చేసుకుంటున్నారు. 2018తో పోలిస్తే 22 నాటికి స్యయం ఉపాధి పనులు 14 శాతం నుంచి 65 శాతానికి పెరిగింది. తట్టా, బుట్టా నెత్తిన పెట్టుకుని అమ్ముకునే పని, పట్టణ ప్రాంతాలకు వెళ్లి పెద్దఎత్తున ఇళ్లల్లో పనిచేయడం వంటివి గణనీయంగా పెరిగాయి. ఫలితంగా కార్మిక శక్తిలో మహిళల సంఖ్య పెరుగుతూ ఉంది. అయితే వారి ఆదాయం గణనీయంగా తగ్గుతుంది. ఇంతకుముందు 2019లో వంద రూపాయలు సంపాదించే మహిళలు 2020-’23 నాటికి 85 రూపాయలు మాత్రమే సంపాదిస్తున్నారు. ఫలితంగా స్త్రీ పురుషుల మధ్య వేతన వ్యత్యాసం కొనసాగుతూ ఉంది. స్త్రీల సంపాదన పురుషుల సంపాదనలో 76 శాతం మాత్రమే. ముద్రా యోజన లాంటి పథకాలలో 80 శాతం మంది మహిళా లబ్దిదారులే. కానీ చాలా స్వల్ప మొత్తాల్లో మాత్రమే వారికి రుణాలుగా అందుతున్నాయి. వారికి ఏ రకమైన మార్కెటింగ్‌ సదుపాయాలు లేక నామమాత్రమైన ఆదాయాలతో దారిద్య్రం తాండవమాడుతోంది.

  • అత్యల్ప వేతనాలు..

భద్రత లేని ఉపాధి, తక్కువ వేతనాల వలన స్త్రీల సాధికారత కాగితాలకే పరిమితమైంది. ఐక్యరాజ్య సమితి 2030 నాటికి మహిళలు స్థిరమైన అభివృద్ధిని సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నది. 2023, డిసెంబర్‌ 27న జరిగిన జి 20 సదస్సు లక్ష్యాలలో 12 శాతం మాత్రమే సాధించినట్లు గుర్తించింది. లోపం ఎక్కడ ఉంది? స్త్రీలు పనిచేయగలిగే శక్తివంతులు కాదా? ఇటీవల మనదేశంలో 3.75 లక్షల మందికి ప్రపంచ సంస్థ ఒకటి (వీబాక్స్‌) నిర్వహించిన పరీక్షలో పురుషుల కంటే స్త్రీలు ఎక్కువ ఉద్యోగ నైపుణ్యం (ఉద్యోగార్హత) కలిగిన వారని తేలింది. ఆ పరీక్షలో 52.8 శాతం మహిళలు అర్హత పొందగా, 47.2 శాతం పురుషులు మాత్రమే అర్హులయ్యారు (ఇండియా స్కిల్స్‌ రిపోర్ట్‌). కానీ మహిళలకు వారి నైపుణ్యానికి తగిన ఉద్యోగం, వేతనం, భద్రత కల్పించలేని స్థితి దేశంలో ఉంది.

అందుకు కారణం మన దేశ ఆర్థిక విధానాలు. సామాజిక పరిస్థితులు. దేశంలో జరుగుతున్న ఆర్థికాభివృద్ధికి అనుగుణంగా ఉద్యోగాలు, ఉపాధి పెరగడం లేదు. దేశంలో సేవారంగం గత నాలుగేళ్లుగా స్తబ్దతలో ఉంది. 2017 నుండి ఇప్పటికి తయారీ రంగం 31 శాతం పడిపోయింది. ఫలితంగా నిరుద్యోగం పెరుగుతోంది. డిగ్రీ పూర్తిచేసిన యువతలో 89 శాతం మంది ఇంటర్న్‌షిప్‌ కోసం ఎదురుచూసే వాళ్లున్నారట. జూన్‌ 22 నాటికి 25 సంవత్సరాల లోపు యువత 42.3 శాతం మంది నిరుద్యోగులుగా ఉన్నారు. ఈ వయసు దాటిన తర్వాత ఏదో ఒక పని చేయాల్సిన స్థితికి నెట్టబడుతున్నారు. ఫలితంగా ఉత్పాదకత తగ్గుతుంది.

  • ఉన్నత విద్యాభ్యాసంలో..

మహిళలు మెరుగైన ఉద్యోగాలు పొందాలంటే ఉన్నత విద్యావంతులు కావాలి. ఉన్నత విద్యలో తీవ్ర అంతరాలు కొనసాగుతున్నాయి. డిప్లమో కోర్సులలో పురుషులు 65 శాతం, స్త్రీలు 49.2 శాతం మాత్రమే. టెక్నికల్‌ కోర్సులలో అమ్మాయిలు 20 శాతం మాత్రమే ఉన్నారు. సమానత – సమానావకాశాలు అనేవి ఆధునిక భావాలు. పారిశ్రామిక విప్లవం వచ్చాకే మహిళలు కుటుంబ చట్రం నుండి బయటకు రాగలిగారు. స్వతంత్రంగా వృత్తుల ఎంపిక ప్రారంభమైంది. పారిశ్రామిక కార్మికులుగా లక్షలాది మహిళలు ఉత్పత్తిలో భాగమయ్యారు. మహిళలు మార్కెట్లోకి రావడంతో పరిశ్రమలకు లేబర్‌ సరఫరా పెరిగింది. తద్వారా వేతనాలు తగ్గించి, యజమానులకు ఎక్కువ లాభాలు పొందగలిగారు. మరోవైపు స్త్రీలు పురుషులతో పాటు సమానమైన వేతనాల కోసం, కనీస హక్కుల కోసం పోరాడడం ప్రారంభమైంది. ఫలితంగా ఆధునిక రాజ్యాంగాలలో సమాన హక్కుల సాధన కోసం తీసుకోవలసిన చర్యలు పొందుపరిచారు. 1947లో స్వాతంత్య్రం పొందిన తర్వాత 1950లో ఆమోదించుకున్న మన రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 14,15,16 స్త్రీ-పురుషుల సమానత్వాన్ని విస్పష్టంగా పేర్కొన్నది. సమానత్వ సాధనకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. 75 సంవత్సరాల తర్వాత పరిస్థితి ఏమిటి అని పరిశీలించినప్పుడు రాజ్యాంగ లక్ష్యాలు నెరవేరలేదని సమానత సాధించ లేకపోయామని స్పష్టమవుతోంది.

ప్రపంచ ఆర్థిక వేదిక లింగ సమానతలో 156 దేశాలలో మన దేశం 140వ స్థానంలో ఉన్నదని పేర్కొన్నది. ఆర్థిక భాగస్వామ్యం, అవకాశాలు, విద్యా స్థితి, ఆరోగ్యము, రాజకీయ ప్రాతినిధ్యము, మనుగడ తదితర అంశాల ఆధారంగా లింగ సమానతను లెక్కిస్తారు. ఆర్థిక సమానత సాధించడానికి మన దేశంలో 267.6 సంవత్సరాలు పడుతుందని అంచనా! అంటే అభివృద్ధిలో కూడా మనది నత్తనడకే. ఉన్నత ఉద్యోగాలు పొందడానికి ఉన్నత విద్య ఉండాలి. కానీ మహిళలు ఉన్నత విద్యలో వెనకబడి ఉన్నారు. రాజకీయ రంగంలో స్త్రీలు కనీసం మూడో వంతు ఉంటే అవసరమైన చట్టాలు చేయటంలో, వాటిని అమలు చేయటంలో సక్రమంగా ఉంటుందన్న అంచనా కనుగుణంగా 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న డిమాండ్‌ చేశారు. కానీ 1996 నుండీ రిజర్వేషన్లను వమ్ము చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు మోడీ మోసం చేయడంలో అందరినీ మించిపోయాడు.

భాగస్వామ్యం ప్రధానం..

జి-20 సదస్సు తీర్మానం అవసరమైన తీర్మానమే. దేశం ఆర్థికాభివృద్ధి సాధించాలంటే అన్ని రంగాలలో సమానత సాధిస్తూ ఉత్పత్తిలో మహిళలు సంపూర్ణ భాగస్వాములు కావాలి. సాంప్రదాయకంగా ఇంటిపని స్త్రీలది. వంటపని, కుటుంబ నిర్వహణ, పిల్లల పెంపకం, పెద్దల బాధ్యత స్త్రీలను ఉపాధికి దూరం చేస్తున్నాయి. ఈ పనులు ఉత్పత్తిలో భాగం కాదు. పైగా ఉత్పత్తిలో భాగమయ్యేందుకు ఆటంకం కూడా. మహిళల ఉపాధి పెంచేందుకు పిల్లల సంరక్షణ కేంద్రాలు, సబ్సిడీ మీద ఆహార క్యాంటీన్‌లు, రవాణా తదితర ఏర్పాట్లు పెద్ద ఎత్తున జరగాలి. ఇంటిపనిలో స్త్రీ-పురుషులు ఇద్దరూ సమాన భాగస్వాములుగా మారాలి. స్త్రీల శ్రమకు తగిన గుర్తింపు, వేతనం ఉండాలి. తద్వారా ఆత్మవిశ్వాసంతో సాధించాలన్న పట్టుదల, స్వయంగా ఎదగడానికి ప్రయత్నం పెరుగుతుంది. కానీ పురుషాధిక్యత కారణంగా స్త్రీల పని గుర్తించరు. నిరుత్సాహపరుస్తారు. స్త్రీల సాధికారత సాధనలో సామాజిక పరిస్థితుల మార్పు, ఆర్థిక, రాజకీయ మార్పులు ఏకకాలంలో సాగాలి. ఇవి పరస్పరం ఒకదాని మీద మరొకటి ఆధార పడతాయి. ఉపాధి అవకాశాలు తరిగిపోవడం ద్వారా సామాజిక మార్పులు కూడా వెనకపడతాయి. ఆర్థిక రంగంలో మౌలిక సదుపాయాల మీద ప్రభుత్వ పెట్టుబడి తగ్గిపోవడం ద్వారా స్త్రీల మీద భారం మరింత పెరుగుతోంది. జెండర్‌ బడ్జెట్‌ 5.2 శాతం నుండి 5 శాతానికి ఈ సంవత్సరం తగ్గించారు. అభివృద్ధికి సూత్రధారిగా ఉండవలసిన కేంద్ర విధానాల వలన ఆర్థిక, సామాజిక అసమానతలు పెరుగుతున్నాయి. రాజకీయంగా మనువాద ఆలోచనల మూలంగా ఆధిపత్య ధోరణులు వేగంగా పెరుగుతున్నాయి. రాష్ట్రపతులుగా, మంత్రులుగా మహిళలు ఉన్నప్పటికీ వారు పేరుకే! స్త్రీలను అణచివేసే పద్ధతులు అమలు జరుగుతూనే ఉన్నాయి. నిర్ణయాత్మక శక్తులుగా కాక అనుచరులుగా మార్చబడుతున్నారు.అభివృద్ధిని ఆకాంక్షించేవారు ఎవరైనా అన్ని రూపాలలో, సారాంశంలో మహిళల ఉపాధి పెంచేందుకు పూనుకోవాలి. అందుకు ఆటంకంగా ఉన్న ఆర్థిక విధానాలను ప్రశ్నించాలి, చర్చించాలి. మహిళలను, సాధారణ ప్రజలను భాగస్వాముల్ని చేసే విధానాలు కావాలి. స్త్రీలు ఏమీ చేయలేరన్న పాత భావాలను వదిలించుకోవాలి. వారి శక్తికి తగిన విధంగా అవకాశాలు కల్పించే ఆర్థిక, సామాజిక విధానాలను రూపొందించాలి. మహిళలు లేకుండా అభివృద్ధి లేదు. సమానత లేకుండా సాధికారత లేదు. అందుకు ఎదురవుతున్న సవాళ్లను అధిగమించాలి.

  • 2024 థీమ్‌: ‘ఇన్‌స్పైర్‌ ఇన్‌క్లూజన్‌’

అంతర్జాతీయ మహిళా దినోత్సవం 2024 థీమ్‌ ‘ఇన్‌స్పైర్‌ ఇన్‌క్లూజన్‌’ దీనర్థం ఏమిటంటే, విభిన్న నేపథ్యాల నుండి వచ్చిన మహిళలను మనం అభినందించినప్పుడు, గౌరవించినప్పుడు వారు మరింత ఉత్తేజంగా పనిచేస్తారు. వారు ఎక్కడి నుండి వచ్చినా.. ఆర్థికంగా, రాజకీయంగా భాగస్వామ్యం చేసి, ఒక నమ్మకం కలిగించగలగాలి. దీంతో ప్రపంచంలో ప్రతి ఒక్కరూ మెరుగుపడతారు. తద్వారా ప్రపంచాభివృద్ధి సాధ్యమవుతుంది. మహిళలు మనకు చెందినవారని, ముఖ్యమైన వారిగా భావించాలి. అప్పుడు వారు బలమైన, శక్తిమంతులుగా కచ్చితంగా భావిస్తారు.

– డి.రమాదేవి, ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

➡️