డైనో.. టైటానో సార్‌లు..

Mar 17,2024 07:39 #dinosar, #Sneha

భూమి మీద అతిపెద్ద జంతువుగా పిలువబడిన డైనోసార్‌ సమూహంలోని అత్యంత పురాతన జంతువు టైటానోసార్‌ల శిలాజాలను అర్జెంటీనాలోని పటగోనియన్‌ అడవుల్లో శాస్త్రవేత్తలు కనుగొన్నారు. టైటానోసార్‌లు సౌరోపాడ్స్‌ అని పిలువబడే పెద్ద డైనోసార్‌ సమూహంలోని, నింజటిటాన్‌ జపటై అనే జాతికి చెందినవని పరిశోధకులు తెలిపారు. అర్జెంటీనాలోని నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ సైంటిఫిక్‌ అండ్‌ టెక్నికల్‌ రీసెర్చ్‌ పరిశోధకులు, అధ్యయన ప్రధాన రచయిత పాబ్లో గల్లినా ఈ పరిశోధనల వివరాలు తెలిపారు. ‘ఇది ఒక్క అర్జెంటీనాకు మాత్రమే సంబంధించినది కాదు. ప్రపంచ వ్యాప్తంగా పరిశోధించిన పురాతన రికార్డు. టైటానోసార్‌ల నమూనాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. పరిశోధనలూ అంతటా జరిగాయి. ఇప్పటి నివేదికలో పూర్వ సమాచారానికి అదనంగా ఆధునిక సమాచారం నమోదు చేయబడింది’ అంటున్నారు ఆయన.

శాస్త్రవేత్తలు టైటానోసార్‌ల ఎముకల పెరుగుదలను అధిక మాగ్నిఫికేషన్‌లో అధ్యయనం చేశారు. ఎముకల్లో ఉండే ఖనిజాల సూక్ష్మ నమూనాలు, రక్తనాళాలు, రక్త కణాల సాంద్రత, నిర్మాణాలను పరీక్షించారు. ఎముకకు రక్త సరఫరా ఎంత దట్టంగా ఉంటే ఆ జంతువు అంత వేగంగా పెరుగుతుందని గుర్తించారు. ఇది సజీవ జంతువులకూ వర్తిస్తుంది. ఈ నమూనాలు జీవి పెరుగుదల రేటుతో పాటు జీవన ప్రమాణం, వయస్సులను ప్రతిబింబించాయి. ఎముకలపై చేసిన పరిశోధనలు టైటానోసార్‌ పరిమాణంలో అతిపెద్ద పరిణామం చోటుచేసుకుంది. కొన్ని దశాబ్దాల కాలంలో తిమింగలాల వంటి క్షీరదాల పెరుగుదలకు సమానంగా వాటి పెరుగుదల ఉందని తెలుపుతున్నాయి. ఇవి 60 సంవత్సరాల కంటే ఎక్కువ సంవత్సరాలు జీవించినట్లు పరిశోధనలు సూచిస్తున్నాయి.
శరీర ఉష్ణోగ్రత..
శిలాజ దంతాలు, గుడ్డు పెంకుల అధ్యయనంలో, టైటానోసార్ల శరీర ఉష్ణోగ్రత వెల్లడైంది. వాటి శరీరం 95 నుండి 100.5 డిగ్రీల ఫారెన్‌హీట్‌ ఉష్ణోగ్రతలతో ఉండేవని నిర్ధారించారు. ఇది మొసళ్ళు, ఎలిగేటర్ల కంటే ఎక్కువ.. ఒక రకంగా ఆధునిక క్షీరదాల శరీర ఉష్ణోగ్రతకు సమానంగా.
కోప్రొలైట్స్‌ (శిలాజ మలం), దంతాలపై గీతలు, శరీరం మీద కనిపించే గుంటలు, టైటానోసార్‌ల ఆహార వివరాలను సూచిస్తున్నాయి. టైటానోసార్‌లు మొక్కలను విపరీతంగా తిని, వాటి శరీరాలను పెంచుకున్నాయని.. విభిన్నమైన ఆహారాన్ని తీసుకుంటాయని.. నేల లోపల ఉండే మొక్కలను తినేవని సూచిస్తున్నాయి. అంతేకాదు.. నేలస్థాయి మొక్కల నుండి చెట్ల ఆకులు, కొమ్మల వరకు ప్రతిదీ తిన్నట్లు తెలుస్తోంది.


రెండింటి లక్షణాలు..
మరో విచిత్రం టైటానోసార్ల జీవన విధానం అద్భుతంగా ఉంటుంది. సరీసృపాలు, క్షీరదాలు రెండింటి లక్షణాలను మిళితం చేసుకుని, ఒక ప్రత్యేకమైన జీవన విధానాన్ని రూపొందించుకున్నాయని ఈ పరిశోధనలలో తేలినట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
భూమి పొరల్లో కనిపించిన వీటి గూళ్ళు, వాటిలో గుడ్లు పెట్టడానికి టైటానోసార్లు పదేపదే వచ్చిన గుర్తులు పరిశోధకులు గుర్తించారు. ఆ గూళ్ళు కూడా ఒకదానికొకటి దగ్గరగానే ఉన్నాయి. అయితే టైటానోసార్‌ పెరిగిన తర్వాత గూడును ఉపయోగించేందుకు, స్వేచ్ఛగా కదలడానికి అవకాశం లేదు. టైటానోసార్‌లు, సరీసృపాల మాదిరిగానే హ్యాండ్‌-ఆఫ్‌ పేరెంటింగ్‌ స్టైల్‌ను కలిగి ఉంటాయి. అంటే గూడును సంరక్షించుకోవడానికి, పొదుగుతున్న పిల్లలను చూసుకోవడానికి ఎక్కువ సమయం గడిపేవి కావని వెల్లడయింది..

 

➡️