నిరుద్యోగినై సాగిపోతున్నా..

Feb 25,2024 11:35 #kavitalu, #Sneha

స్వాతంత్రపు జెండా నీడలో

పురుడు పోసుకున్న

ఎన్నో కొత్త జెండాలు…

జెండాలు మారితే

బ్రతుకులు మారుతాయన్నారు

ఏ జెండా నిరుద్యోగి పాలిట

చిరునవ్వుల సంతకం అయింది!

చిరిగిన బ్రతుకులకు భరోసా అయింది!

జెండాల నీడలో చిందులేసే

జీవితాలు బాగానే వున్నాయి

చదువులమ్మ నీడలో

సాగాలనే బతుకులు సాగడం లేదు

నేడు నిరుద్యోగం బతుకు మీద

శివతాండవం చేస్తుంది

ఉద్యోగాల వేటలో ఎందరు

భగమవుతున్నారో..?

బోలెడన్ని జీవితాలు

బానిసగా మారిపోతున్నాయి

ఆశలతో ఎదురుచూసి చూసి

ఆశలు హృదయంలోనే ఆవిరైపోతున్నాయి

బతుకులంతా ఆశల అలల మీద

సాగిపోతున్నాయి

ఎక్కడి నుంచో తెలియదు

నిరుద్యోగమనే నిప్పురవ్వలు

కురుస్తున్నట్టుంది బతుకు మీద

కానీ ఎదురుచూపుల్లో

బతుకు మీద ఆశ చావడం లేదు

అందుకే నిరుద్యోగిగా సాగిపోతున్నా ..!!

లక్ష్మీ శ్రీనివాస్‌

9676601192

➡️