గాజా మృత శిశువులకు ఒక జ్ఞాపిక

Apr 21,2024 11:52

మీ గురించి రాయడానికి నేనెవర్ని ? నేనింకా బతికే వున్నాను.
శవాన్ని చుట్టిన రక్తపు బట్ట వాసన వేస్తున్నాను.
నేను పైకి పలకలేని, అసంపూర్ణ పదాల ఉండ అని
మీ కన్నవాళ్ళు మీకు చెప్పవచ్చు. నేను గడ్డకట్టిన రక్తాన్ని.
నీ తల్లిదండ్రుల గాయాలన్నీ నావే. వాటికి మూలం కూడా నేనే.
నేనే మౌనాన్ని.. నిశ్శబ్దాన్ని. గాఢమైన, చిక్కని చీకటి నిశ్శబ్దాన్ని.
నీ దగ్గరకు చేరడానికి సోలిపోయే రణగొణ ధ్వనిని.
నేను రాత్రిని. నీ తల్లి వెంట్రుకల వంటి రాత్రిని లేదా
నీ చర్మం వెనుక పొంచి వున్న మత్యువులాంటి అంతులేని రాత్రిని.
నీకేమీ జవాబివ్వలేని పట్టపగలుని.
నీ హక్కు అయిన తల్లి ముర్రుపాలని.
పాలివ్వని తల్లి రొమ్ముల సలుపుని.
నేనే కుట్రదారిని,నేనే పీడితురాలిని.
నేను నీకు తెలీదు. ఎప్పటికీ తెలీదు.
చనిపోయినవారికి తమ హంతకుడు ఎవరో తెలీదు.
కానీ హంతకుడికి తాము ఎవరిని వేటాడుతున్నామో తెలుసు.
వాళ్ళు మంచులో నీ పేరుని లెక్కించుకుంటూ రాస్తారు.
నేను ఒలీవ చెట్టును కోసే యంత్రాన్ని.
దాని రంపపు శబ్దమే నిన్ను చంపేస్తుంది.
శరణార్ధుల శిబిరాల్లో మీ నిద్రను కబళించే చుక్కల రాత్రిని నేను.
మీ పేర్లు నాకు తెలీదు. మీకు పేర్లుండే అవకాశం వుందా?
కానీ మీరు నా పేరుని నా నోరిప్పనితనం ద్వారా,
నా అంథకారం ద్వారా,
నా అపరాధం ద్వారా తెలుసుకోవచ్చు.
నాకు విలాసంగా రాసుకోవడానికి వుంది.
జనం ఎందుకు రాస్తారో నీకు తెలుసా?
కొంతమంది తమ న్యూనతని కప్పిపుచ్చుకోవడానికి రాస్తే,
కొంతమంది తిరుగుబాటు చేయడానికి రాస్తారు.
నువ్వే నిర్ణయించు నేనెవరినో.
చినార్‌ చెట్ల జ్ఞాపకాలు.. ఒలీవ చెట్ల జ్ఞాపకాలు..
జ్ఞాపకాలను తరలించే నాఫ్తలీన్‌ గోళీల వంటి దాన్ని నేను.
నేను ఏం చేయలేని జీవచ్ఛవాన్ని.
ఏడువేల కిలోమీటర్ల దూరంలో వుండి ఈసడిస్తూ రాస్తూ వున్నాగానీ
నేను చచ్చిన వాసనే వేస్తున్నాను.
నేను రక్తం, నమ్మకద్రోహం కంపు కొడుతున్నాను.
వీటన్నిటికి సాక్షిగా ఎప్పుడూ వుండకూడదనుకునే సాక్షిని నేను.
నీ కన్నీళ్ళు తుడవలేని పరాజితని.
నీ గురించి రాయడానికి నేనెవర్ని ?

బెంగాలీ : మౌమితా ఆలం
తెలుగు : పి. శ్రీనివాస్‌ గౌడ్‌
9949429449

➡️