హృదయాస్తమయం

Feb 18,2024 13:52 #Poetry, #Sneha

ఆమె ఏ దివి సీమలలో దాగి ఉండెనో

ఏ స్వప్నలోకాలలో విహరించుచుండెనో

నేనే నిద్రమత్తులో జోగివుంటినో కానీ

ఇంతకాలం..

ఆమె నడిచే వసంతం అననా

విరబూసిన ఆమని అని చెప్పనా

ఆ నవ్వు ఏ వెన్నెల జలతారులో

ముంచి తీసిందో

ఆ మాట ఏ కనక రాగాల

మిళితమైన సుస్వరమో

ఆ చూపు ఏ దయామయి

కనుకొలకుల నుంచి దానమై గైకొనబడినదో

ఆ సౌందర్యం ఏ సోయగాల

వెలుగు శిఖరాల నుంచి ఉదయించిందో కానీ

కాలమై కన్నుగప్పి

మాయమై భ్రాంతి మిగిల్చి

ఏ చీకటి లోయల్లోకి జారిపోయిందో

అసురసంధ్యలో మరి..

ఏ తీరాలలో వెతకను

అంతా శూన్యమై మిగిలిన చోట

వేరెవ్వరికి వినిపించని నా నవ యవ్వన

ఆలాపన ఇది..

 

  • లోసారి సుధాకర్‌, 9949946991
➡️