‘ఆమె’ అంటేనే పోరాటం

'Her' means struggle
  • నింగిలో, నేలలో, జనాభాలో, ఆదాయంలో, అభివృద్ధిలో, పరిశ్రమలో, వ్యవసాయంలో, పోరాటంలో….అన్నింట్లో ఆమె అర్ధ భాగం. ఆమె లేనిదేదైనా అసంపూర్ణమే. కానీ తనకు న్యాయంగా అందాల్సిన హక్కుల కోసం ఆమె కొంగు బిగించాల్సి వస్తోంది. లైంగిక వేధింపులకు పాల్పడిన వారికి బుద్ధి చెప్పి, తమకు న్యాయం చెయ్యండంటూ దేశ రాజధాని వీధుల్లో బైఠాయించాల్సి వస్తోంది. జాతుల మధ్య ఘర్షణలో ఆమె కాయం గాయపడుతుంటే, నగంగా ఊరేగిస్తుంటే.. ఆ మానవ మృగాలపై చర్యలు తీసుకొమ్మని ఆమె ఆగ్రహించాల్సి వస్తోంది. చట్ట ప్రకారం వేతనాలు ఇమ్మని చెయ్యి చాచి అడగాల్సి వస్తోంది. 

హక్కుల సాధన కోసం, న్యాయం కోసం ఈ ఏడాది కాలంలో ఆమె చేసిన సాహసోపేత పోరాటాలు, నడిపిన స్ఫూర్తిదాయక ఉద్యమాలు ఎన్నో మన ముందున్నాయి. లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా మహిళా రెజ్లర్లు రాజధాని వీధుల్లో పోరాడాల్సి వచ్చింది. తమ పతకాల ద్వారా భారత ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన వీరు ఖాకీ క్రౌర్యాన్ని, పాలకుల నిర్లక్ష్యాన్ని చవిచూడాల్సి వచ్చింది. మణిపూర్‌లో రెండు తెగల మధ్య రగిలిన చిచ్చు నేపథ్యంలో అమాయకపు మహిళలను వివస్త్రలను చేసి, వీధుల్లో ఊరేగించిన వైనం చూసి సభ్యసమాజం సిగ్గుతో తల దించుకుంది. హత్యాచారాలకు తెగబడిన వారిని శిక్షించాలంటూ పెద్ద పోరాటమే చేయాల్సి వచ్చింది.

చిన్నారులు, మహిళల ఆరోగ్యాన్ని, పోషణను కంటికి రెప్పలా కనిపెట్టుకునే లక్షలాది మంది అంగన్వాడీలు, ఆశాలు కనీస వేతనాల కోసం దేశవ్యాప్తంగా పోరాడుతున్నారు. అక్రమ తొలగింపులు, వ్యవస్థాగత దోపిడీ, పని ప్రాంతాల్లో లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా గుర్గావ్‌లోని చెల్సియా మిల్స్‌ కంపెనీ మహిళా కార్మికులు పోరుబాట పట్టారు. వీరిలో బీహార్‌, యు.పి, పశ్చిమ బెంగాల్‌, ఉత్తర భారత రాష్ట్రాలకు చెందిన మహిళలే అధికం. ఉపాధి కోసం అంత దూరం నుంచి వలస వచ్చిన వీరికి భోజన విరామం కూడా వుండదు. పై అధికారుల లైంగిక వేధింపులు తట్టుకోలేక చెప్పుకున్నా చర్యలే వుండవు.

గ్రాట్యుటీ కోసం, వేతన పెంపు కోసం సంఘం పెట్టుకున్నందుకు అధికార పార్టీ టిఎంసి ఆగ్రహానికి గురికావాల్సి వచ్చింది పశ్చిమబెంగాల్‌ అంగన్వాడీ వర్కర్లు. వారికి అందాల్సిన ఫండ్‌ని నిలిపివేయడంతో అప్పులు చేసి మరీ సెంటర్లు నడపాల్సిన పరిస్థితి. దాంతో పోరు బాట పట్టారు. ఉత్తర ప్రదేశ్‌ పోలీసు అత్యవసర సర్వీస్‌ ‘డయల్‌ 112’లో పనిచేస్తున్న మహిళా కాంట్రాక్టు ఉద్యోగులు ‘ఈ అరకొర జీతాలతో పని చేయలేం. పెంచండి మహాప్రభో..’ అని యోగి ఆదిత్యనాథ్‌కి ఎన్నిమార్లు మొరపెట్టుకున్నా ప్రయోజనం శూన్యం. అప్పుడు వారు పోరాటాన్ని ఎంచుకున్నారు. ముంబై ఆశా వర్కర్లకు అందేది గౌరవ వేతనమే. అదీ ఇన్‌స్టాల్‌మెంట్ల మీద చేతికొస్తుంది. 24 గంటలూ అందుబాటులో వుండేవారికి మాత్రం ఆరోగ్య బీమా లేదు. స్థిరమైన వేతనం అందదు. వేతనం పెంచాలని, పర్మినెంట్‌ చేయాలని కోరుతూ ఉద్యమించారు. ‘కొద్ది నెలలుగా జీతం అందడం లేదు. రూ.2500 తో కుటుంబాల్ని ఎలా నడపాలి? కోవిడ్‌ వచ్చినప్పుడు, ఇతరత్రా సందర్భాలలో మమ్మల్ని ప్రశంసలతో ముంచెత్తుతుంటారు. కానీ మా జీతాలు మాత్రం ఎందుకు పెంచర’ని ప్రశ్నిస్తోంది ఆశ వర్కర్‌ కుశువాహ. అక్టోబర్‌లో 16 రాష్ట్రాలకు చెందిన 10 వేల మంది ఆశా వర్కర్లు జంతర్‌ మంతర్‌ దగ్గర ర్యాలీ చేశారు. నలభైకి పైగా విధులు నిర్వహించే ఆశాలు తమకు న్యాయంగా అందాల్సిన రూ.26 వేల జీతాన్నివ్వమని అడుగుతున్నారు. 45, 46 ఇండియన్‌ లేబర్‌ కాన్ఫరెన్స్‌ సిఫార్సులకు అనుగుణంగా కనీస వేతనాలు ఇవ్వాలని, రెగ్యులరైజ్‌ చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.

‘నారీ శక్తి, డాటర్స్‌ ఆఫ్‌ ఇండియా (భారత పుత్రికలు)’ వంటి సంబోధనలతో మహిళల ఓట్లు దండుకోవాలనుకొనే మోడీ, ఆయన మిత్రులు… పైన చెప్పుకున్న దుశ్శాసన పర్వాలపై ఒక్కసారి కూడా పార్లమెంట్‌లో నోరు మెదపలేదు. ‘బేటీ బచావో బేటీ పఢావో’ వంటి తేనె పలుకులు పలుకుతూనే… బిల్కిస్‌ బానోపై దారుణానికి ఒడిగట్టిన వారిని విడిచిపెట్టిన 56 అంగుళాల ఛాతీ వారిది. మహిళల రక్షణను గాలికొదిలేసి… మతం పేర ప్రజలను చీలుస్తూ, సామాన్యుడికి ధరల మోత మోగిస్తూ, కార్పొరేట్లకు మాత్రం దేశాన్ని కట్టబెడుతున్న ‘మోడీ అండ్‌ కో’ కు ఈసారి ఎన్నికల్లో బుద్ధి చెబుదాం. పోరు మార్గాన్ని కొనసాగిద్దాం.

– కె. అంజన, 9490099025

➡️