అధిక రక్తపోటు.. ఉండాలి అదుపు..

May 12,2024 10:10 #Sneha, #special story

అధిక రక్తపోటు అనేది భారతీయులలో చాలా సాధారణ సమస్య. మారిన జీవనశైలి కారణంగా ఎక్కువ మంది ప్రజలు దీని బారిన పడుతున్నారు దీనిని హైపర్‌టెన్షన్‌ అని పిలుస్తారు. ఇది దాదాపు శరీరంలోని ప్రతి భాగాన్ని ప్రభావితం చేస్తుంది. అనియంత్రిత అధిక రక్తపోటు రోగులలో వైకల్యం, జీవన నాణ్యత తగ్గుదల అధిక మరణాల రేటుకు కారణమవుతుంది. నేడు ‘ప్రపంచ రక్తపోటు దినోత్సవం’. ఆ సందర్భంగా ఈ ప్రత్యేక కథనం..

హైపర్‌ టెన్షన్‌ని తెలుగులో రక్త పీడనం అంటారు. దీన్ని సైలెంట్‌ కిల్లర్‌ అని ఎందుకంటారంటే.. బీపీ చాలా ఎక్కువుగా ఉన్నప్పటికీ చాలామందిలో ఎలాంటి లక్షణాలూ కనిపించవు. శరీరం లోపల ఉండి వినాశనాన్ని కలిగిస్తుంటుంది. కొన్ని సందర్భాలలో లక్షణాలు కనిపించేటప్పటికే ప్రమాదస్థితికి చేరుకుని ఉంటారు. అందుకనే దీన్ని సైలెంట్‌ కిల్లర్‌ అంటారు. అధిక రక్త పీడనం కలిగించే చెడు అంతా ఇంతా కాదు. గుండెపై భారాన్ని పెంచుతుంది. గుండెకు రక్తప్రసరణను తగ్గిస్తుంది. గుండె కండరాలను బలహీనపరిచి, వైఫల్యానికి దారితీస్తుంది.

మెదడులోని రక్తనాళాలు సున్నితత్వాన్ని కోల్పోయి, చిట్లిపోయి బ్రెయిన్‌ స్ట్రోక్‌ గురై  పక్షవాతం బారిన పడే అవకాశం పెరుగుతుంది. అధిక రక్తపోటు వల్ల మూత్రపిండాలలో ఉన్న రక్తనాళాలు దెబ్బతిని, వాటి వైఫల్యానికి దారితీస్తుంది. అధిక రక్తపోటు వల్ల కళ్ళలో ఉన్న రక్తనాళాలు దెబ్బతిని, కంటిచూపు పోయే ప్రమాదం ఉంది. దీనిని హైపర్టెన్సివ్‌ రెటినోపతి అంటారు. పురుషులలో లైంగిక జీవితాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. అంగస్తంభనకు రక్త ప్రసరణ అవసరం. అధిక రక్తపోటు వలన పురుషాంగానికి రక్తప్రసరణ తగ్గి, నపుంసకత్వం సంభవించవచ్చు.

శరీరంలో ప్రధాన బాగాలైన మెదడు, కళ్ళు, కిడ్నీ, మూత్రపిండాలను దెబ్బతీసే స్థితిని బట్టి ఈ వ్యాధి తీవ్రతను అర్థంచేసుకోగలం. ఈ తీవ్రతను అర్థం చేసుకొని, హైపర్‌ టెన్షన్‌ రాకుండా చూసుకోవాలని; వచ్చినా అదుపులో ఉంచుకోవాలని; సాధారణ ప్రజలకు తెలియజేయడానికి మే 17వ తేదీన ‘ప్రపంచ హైపర్‌ టెన్షన్‌ డే’ ని జరుపుకుంటున్నాం.
ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) ఇటీవల చేసిన ఒక అధ్యయనంలో.. భారతీయులు దీన్ని పెద్దగా పట్టించుకోవడం లేదని, చాలా తేలిగ్గా తీసుకుంటున్నారని వెల్లడైంది. ఇంటర్నేషనల్‌ జర్నల్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ (ఐజేపీహెచ్‌) లో ఈ అధ్యయనం ప్రచురితమైంది. ఇందులోని సమాచారం ప్రకారం 18-54 ఏళ్ల మధ్య ఉన్న భారతీయుల్లో 30 శాతం మంది బీపీని అసలు తనిఖీ చేసుకోరని తేలింది. అంటే ప్రతి పది మందిలో ముగ్గురు బీపీని చూసుకోవట్లేదన్న మాట.

కారణాలు ..
అధిక రక్తపోటుకు అనేక కారణాలున్నాయి. వయసు పెరిగేకొద్దీ అధిక రక్తపోటు వచ్చే అవకాశం పెరుగుతూ ఉంటుంది. 65 ఏళ్ల వయసు వరకు పురుషులలో అధిక రక్తపోటు వచ్చే అవకాశం ఎక్కువ. 65 ఏళ్ల తర్వాత మహిళలలో అధిక రక్తపోటు వచ్చే అవకాశం ఎక్కువ. ఊబకాయం (బరువు ఎక్కువ) ఉంటే మన శరీర కణజాలం ఎక్కువగా ఉందని అర్థం. ఈ కణజాలాలకు అవసరమైన ఆక్సిజన్‌, పోషకాలను సరఫరా చేయడానికి ఎక్కువ రక్తం అవసరం. రక్తనాళాల ద్వారా రక్త ప్రసరణ పరిమాణం పెరగడంతో ధమని గోడలపై ఒత్తిడి బాగా పెరుగుతుంది. తద్వారా రక్తపోటు పెరుగుతుంది.

కుటుంబ చరిత్ర ..
జన్యు సంబంధిత కారణాల వల్ల అధిక రక్తపోటు రావచ్చు. మన పూర్వీకులలో ఎవరికైనా చిన్న వయసులోనే రక్తపోటు వచ్చి ఉంటే ఆ కుటుంబ సభ్యులలో బీపీ వచ్చే అవకాశం ఎక్కువ. హార్మోన్ల అసమతుల్యత కిడ్నీకి పైభాగంలో అడ్రినలిన్‌ అనే పిలవబడే గ్రంధి ఉంటుంది. ఈ గ్రంధికి క్యాన్సర్‌ గానీ మరి ఏదైనా ట్యూమర్స్‌ వచ్చినా, మెదడులో ఉండే పిట్యూటరీ గ్రంధికి క్యాన్సర్‌ లాంటి గడ్డలు ఏర్పడినా   హార్మోన్ల అసమతుల్యత పెరిగి, రక్త పీడనం ఎక్కువయ్యే అవకాశం ఎక్కువ. శారీరకంగా చురుకుగా లేనివారికి హృదయ స్పందన రేటు ఎక్కువ. హృదయ స్పందన ఎక్కువగా ఉంటే, ప్రతి సంకోచంలో గుండె ఎక్కువగా కష్టపడాలి. ధమనులపై ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. శారీరక శ్రమ లేకపోవడం అధిక బరువుకు కూడా కారణమవుతుంది. తత్ఫలితంగా అధిక రక్తపోటుకు గురవుతారు.

పొగాకు.. ఉప్పు..
పొగాకు కారణంగా తాత్కాలికంగా బీపీ పెరగడమే కాకుండా, శాశ్వతంగా ధమనుల లైనింగ్‌ దెబ్బతిని రక్తపోటు జీవితకాలం పాటు కొనసాగే అవకాశం ఉంది.
ఉప్పు ఎక్కువగా తినడం మన ఆరోగ్యానికి పెద్ద ముప్పు. ఉప్పులో సోడియం అనే రసాయనం ఉంటుంది. ఈ సోడియం జీవకణాలలో నీటి నిల్వను పెంచి, రక్తపోటు కారణమవుతుంది.

పొటాషియం అవసరం ..
మనకు ప్రధానంగా పొటాషియం పండ్లలో దొరుకుతుంది. పొటాషియం మన కణాలలో సోడియంను సమతుల్యం చేస్తుంది. ఆహారంలో తగినంత పొటాషియం తీసుకోకపోతే రసాయనాల సమతుల్యత దెబ్బతిని, సోడియం మోతాదు ఎక్కువవుతుంది. తత్ఫలితంగా రక్తపోటు పెరుగుతుంది.

దీర్ఘకాలిక వ్యాధులు..
మూత్రపిండాల వ్యాధి, మధుమేహం, గుండె జబ్బు, స్లీప్‌ అప్నియా (నిద్రలో ఊపిరాడకపోవడం) లాంటి కొన్ని దీర్ఘకాలిక వ్యాధులు కూడా రక్తపోటు వచ్చే అవకాశాన్ని పెంచుతాయి. మనదేశంలో అధిక రక్తపోటుకు ముఖ్య కారణం అధికంగా ఉప్పు తినే అలవాటు. ఉప్పు తినడాన్ని తగ్గిస్తే బీపీ వచ్చే అవకాశం, వచ్చినా అదుపులో ఉంటుందని పరిశోధనలు చెబుతున్నాయి. పచ్చళ్ళు, చట్నీలు, అప్పడాలు, వడియాలు, మ్యాగీ, బిస్కెట్ల నుంచి బయటకు దొరికే దాదాపు అన్ని ఆహార పదార్థాలలో మనకు తెలియకుండానే అధికమోతాదులో ఉప్పు ఉంటుంది. ప్రతి మనిషికి రోజుకు 2.5 గ్రాములు ఉప్పు మాత్రమే అవసరం. ప్రపంచ ఆరోగ్య సంస్థ గరిష్టంగా ఐదు గ్రాములకు మించకూడదని సూచించింది. మన దేశంలో సగటున ప్రతి మనిషి 10-15 గ్రాముల ఉప్పు తింటున్నారు. దీనివల్ల ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయి. ఉప్పు రుచి పుట్టుకతో వచ్చినది కాదు, మనం అలవాటు చేసుకున్నది. కొద్ది రోజులు తక్కువ తినడంతో మన నాలుకకు అదే అలవాటవుతుంది. కాబట్టి అధిక రక్తపోటు రాకుండా ఉండాలన్నా, వచ్చినా తగ్గించుకోవాలన్నా మనం తింటున్న ఉప్పును సగానికి తగ్గించాలి.

మనదేశంలో దరిదాపుగా 30% జనాభా అధిక రక్తపోటుతో బాధపడుతున్నారు. అంటే ప్రతి నాలుగో వ్యక్తికి అధిక రక్తపోటు ఉంది. అధిక రక్తపోటు ఉన్నవారిలో దాదాపు సగం మందికి తమకు అధిక రక్తపోటు ఉన్నట్లు తెలియదు. రక్తపోటు ఉందని తెలిసిన వారిలో దాదాపు సగం మంది మాత్రమే వైద్యం చేయించుకుంటారు. వైద్యం చేయించుకుంటున్న వారిలో దాదాపు సగం మంది మాత్రమే వైద్యం కొనసాగిస్తారు. అంటే వందమందికి అధిక రక్తపోటు ఉంటే అందులో 10-12 మంది మాత్రమే సరైన వైద్యం చేయించుకుంటారు. దీనిని రక్తపోటు సగం సగం (Role of halfs) సూత్రం అంటారు. ఇది 1970లో అమెరికాలో రూపొందించిన సూత్రమైనప్పటికీ దరిదాపుగా మనదేశంలో ఈ సూత్రం అమలవుతూనే ఉంది. సగం, సగం సూత్రం ప్రకారం రక్తపోటు ఉన్నవారిలో సగం మందికి రక్తపోటు ఉన్నట్లు తెలియదు. అందుకే వ్యాధి లక్షణాలు కనిపించేలోపే ముందుగానే రక్తపోటు ఉందా? లేదా? అన్నది తెలుసుకోవడం అవసరం. అధిక రక్తపోటు వంశ చరిత్ర కలిగిన వారందరూ 25 ఏళ్ల వయసు పైబడినప్పటి నుంచి సంవత్సరానికి ఒక్కసారైనా బి.పి చెక్‌ చేసుకోవాలి. అధిక రక్తపోటు వంశ చరిత్ర లేకపోయినా 30 ఏళ్ల వయస్సు పైబడిన వారందరూ ఏడాదికి ఒక్కసారి తప్పక బీ.పీ చెక్‌ చేసుకోవాలి. ఇలా చేయగలిగితే రక్తపోటును ముందుగానే గుర్తించగలం. గుర్తించిన వారంతా తప్పక వైద్యం చేయించుకుని, తగిన జాగ్రత్తలు తీసుకుంటే రక్తపోటును అదుపులో పెట్టుకోవచ్చు. అధికరక్త పోటు గురించి పెద్దగా భయపడవలసిన అవసరం లేదు.

అలవాట్లు మారాలి..
మన అలవాట్లను మార్చుకుంటే రక్తపోటును అదుపులో పెట్టుకోవచ్చు. పొగ తాగడం, పొగాకు వాడకం అలవాటు మానుకోవాలి. బరువుని అదుపులో పెట్టుకోవాలి. ప్రతి వ్యక్తి ఎత్తుకు తగిన బరువు ఉండాలి.

ఆరోగ్యకరమైన ఆహారం మాత్రమే తీసుకోవాలి. మన ఆహారంలో పుష్కలంగా కాయగూరలు, పళ్ళు, దినుసులు, కొవ్వు తక్కువుగా ఉన్న పాలు, పెరుగు, మొదలైన పదార్థాలు ఉండటం మంచిది. నూనెలు, నేతులు వాడేటప్పుడు అసంతృప్త కొవ్వు ఆమ్లాలు (unsaturated fatty acids) సంతృప్త కొవ్వు ఆమ్లాలు ( saturated fatty acids ) కంటే మంచివి. కొన్నిరకాల చేప నూనెలు (fish oils) ఈ సందర్భంలో మంచివి. ప్రతిరోజూ అరగంటకి తక్కువ కాకుండా, కొద్దిగానైనా చెమట పట్టే వరకూ వ్యాయామం చేయాలి. రోజూ సాధ్యం కాకపోతే వారానికి ఐదు రోజులైనా చేయాలి. అదీ సాధ్యం కాకపోతే వారంలో ఒక రోజైనా రెండున్నర గంటల సేపు వ్యాయామం తప్పక చేయాలి. ఉప్పు తగ్గించి తినాలి.

అనారోగ్యకర అలవాట్లు…
ఈ రోజుల్లో ప్రాసెస్డు ఫుడ్‌ ఎక్కువగా తీసుకుంటున్నారు. వీటిల్లో మాంసం, చిప్స్‌, కుర్కుకురేలు ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో సోడియం మోతాదు పెరుగుతుంది. అంతేకాకుండా వీటివల్ల బరువు పెరుగుతారు. తత్ఫలితంగా బిపీ పెరుగుతుంది. ఈ మధ్యకాలంలో నిద్రలేమి, మానసిక ఒత్తిడి ఎక్కువయ్యాయి. మనిషికి కనీసం రోజుకు ఆరు గంటల నిద్ర అవసరం. ఎనిమిది గంటలు నిద్ర ఉంటే మరీ మంచిది. గతం కంటే ఇప్పుడు ప్రజలలో మానసిక ఆందోళన ఎక్కువైంది. నిద్ర తగ్గినా, మానసిక ఆందోళన పెరిగినా శరీరంలో హార్మోన్లు అసమతుల్యతకు గురై, రక్తపోటు పెరిగే అవకాశం ఎక్కువవుతుంది.

డాక్టర్‌ ఎం.వి. రమణయ్య
అధ్యక్షులు, ప్రజారోగ్య వేదిక,
ఆంధ్ర్రప్రదేశ్‌ కమిటీ.

➡️