నిజాయితీ

May 19,2024 11:39 #Sneha, #Stories

అనగనగా ఒక రాజ్యం ఆ రాజ్యానికి ఒక రాజు ఉన్నాడు. అతనికి ఒక అంతుచిక్కని వ్యాధి ఉంటుంది. ఇక తాను ఎక్కువ రోజులు బతకనని రాజు గారు అనుకున్నారు. అందుకు తన రాజ్యానికి ముందుగానే ఒక నిజాయితీ గల యువరాజుని ఎన్నుకోవాలి అనుకున్నాడు.
మరునాడే రాజ్యంలోని యువకులందరినీ పిలిపించి ఈ విషయం చెప్పాడు. అందరికీ తలా ఒక విత్తనం ఇచ్చి, పది రోజుల తర్వాత మొక్కను పెంచి తీసుకొని రమ్మన్నాడు. ఎవరి మొక్క అయితే పెద్దగా, బలిష్టంగా ఉంటుందో వాళ్లే ఈ రాజ్యానికి రాజు అని చెప్పాడు. అందరూ ఆ విత్తనాన్ని ఇంటికి తీసుకువెళ్లి కుండీలలో నాటారు.
పది రోజుల తర్వాత అందరూ ఆ విత్తనం నాటిన కుండీలని తీసుకొని వచ్చారు. కానీ మహేంద్ర అనే ఒక యువకుడు మాత్రం ఖాళీ కుండీని తీసుకొచ్చాడు. అప్పుడు రాజు అందరి కుండీలను పరిశీలించి ఆ ఖాళీ కుండీని తీసుకువచ్చిన మహేంద్ర అనే యువకుడిని ఈ రాజ్యానికి రాజు అని ప్రకటించాడు. దీంతో అందరు యువకులు విస్తుబోయి చూశారు. అంతలో ఒక యువకుడు ఓ మహా రాజా! మేము నాటిన విత్తనాలు మొక్కలుగా మారాయి కానీ, ఆ మహేంద్ర నాటిన విత్తనం కనీసం మొలకెత్తనేలేదు. మీరు అతనిని ఈ రాజ్యానికి రాజును ఎలా చేస్తారనీ అడిగాడు.
అప్పుడు రాజు ‘నేను మీకు ఉడకబెట్టిన విత్తనాలు ఇచ్చాను అలాంటప్పుడు మీకు ఇచ్చిన విత్తనం నుండి మొక్క ఎలా వచ్చింది’ అని ప్రశ్నించాడు. ఆ ప్రశ్నకి ఎవరు జవాబు ఇవ్వలేదు. తాము చేసిన పనికి సిగ్గుతో తలవంచుకున్నారు. రాజ్యానికి రాజు కావడానికి యువకులు అందరూ వేరే విత్తనాలు నాటారు కానీ మహేంద్ర రాజు ఇచ్చిన విత్తనాన్నే నాటి నిజాయితీగా ప్రవర్తించాడు. అప్పటినుండి ఆ రాజ్యానికి మహేంద్రనే రాజుగా ఉన్నాడు. ఆ రాజ్యానికి ఎలాంటి లోటు లేకుండా నిజాయితీతో పరిపాలించ సాగాడు.

– పుల్లగూర్ల శీర్షిక, 9వ తరగతి,
జిల్లాపరిషత్‌ ఉన్నత పాఠశాల ఘనపురం, తొగుట మండలం, సిద్దిపేట జిల్లా.

➡️