మతాలన్నిటిలోనూ స్త్రీల అణచివేతే !

మనది స్త్రీని దేవతగా కొలిచే దేశంగా ప్రతీతి. ఇక్కడి నదీ నదాలూ, అడవులూ చివరికి దేశం సైతం స్త్రీ స్వరూపంగా చూడబడింది. భారతమాతగా మనం మనదేశాన్ని పిలుస్తాం. ఒక భౌగోళిక స్వరూపంగా మాత్రమే కాక, ఒక తల్లిగా దేశాన్ని గౌరవిస్తాం. ప్రతి స్త్రీనీ తల్లిగానే చూసే విశిష్ట సంస్కృతి భారతదేశానిది అని, ఇతరదేశాలకు గొప్పగా ప్రచారం చేసాయి మన పురాణాలూ ఉద్గ్రంధాలు. మరి, ఈ దేశపు స్త్రీ, దేవత వంటి గౌరవం నిజంగా సంపాదించుకున్నది ఐతే, ఆమెకు మనిషిగా ఈ సమాజంలో దక్కాల్సిన హక్కులు, సౌకర్యాలూ ఏమాత్రం దక్కుతున్నాయి? కుటుంబానికి మూలస్తంభంగా స్త్రీ వ్యవహరించే భారత సమాజంలో, ఆమెపై అత్యాచారాలు ఇంత భారీ స్థాయిలో ఎందుకు జరుగుతున్నాయి? స్త్రీలను నడివీధిలో పట్టపగలు దిశమొలతో ఊరేగించే పరమ దుష్ట స్థితికి ఇక్కడి మతోన్మాద, కులోన్మాద మూకలు ఎలా తెగబడ గల్గుతున్నాయి? స్త్రీ ప్రాథమిక హక్కులు, ఆమె ఋతుస్రావం, వివాహం, బిడ్డల పుట్టుక విషయాల్లో ఆమె ఇష్టాలను పరిగణనలోకి తీసుకోవడంలాంటి విషయాల్లో స్త్రీ పరిస్థితి ఏమిటి? వరకట్నం, లాంఛనాలూ అంటూ సృష్టికి మరోరూపం ఐన స్త్రీని గృహహింసకు గురిచేస్తూ, పుట్టింటి నుంచి డబ్బు, బంగారం తెచ్చే యంత్రంగా స్త్రీని ఇవే సంప్రదాయాలు ఎలా హింసించాయి?

రాజకీయ రంగంలో, ఉద్యోగాలు చేయడంలో, ఒంటరిగా ప్రయాణాలు చేయడంలో, స్వతంత్రంగా బతకడంలో ఎలాంటి చట్టాలను ఈ దేశ ప్రభుత్వాలు ముందుకు తెచ్చాయి? ఎంత మాత్రం నెరవేరుస్తున్నాయి? చట్టసభల్లో జనాభా ప్రాతిపదికగా స్త్రీలకు నిజమైన ప్రాతినిధ్యం, ఈ పురుషులు నడిపే ప్రభుత్వాలు, సంస్థలు ఇస్తున్నాయా? స్త్రీకి నిజంగా మేలు చేసిందా? లేక మతం పేరు అడ్డుపెట్టుకుని స్త్రీని, బలహీనమైన మనిషిగా, కులానికీ, ఆచారాలకు, ఇంట్లో మగవారి ఇష్టానికీ తలొగ్గి.. బతకాల్సిన పరిస్థితిలోకి నెట్టేసిందా? స్త్రీకి మతం చేసిన నిజమైన మేలు ఏంటి అనే అంశాలను పరిశీలిద్దాం.

మనుస్మృతి రచించక పూర్వం మనదేశంలో మాతృస్వామ్య వ్యవస్థ ఉండేది. అప్పుడు స్త్రీలు నిర్ణయాధికారంతో ఉండేవారు, ఇల్లు నడిపేవారు.

‘సింధూ నాగరికత, ప్రాచీన భారతదేశ నాగరికత, ఈ నాగరికతలో, స్త్రీ, మాతృస్వామ్య సంస్కృతిలో వ్యక్తిత్వంతో, ఆత్మగౌరవంతో విలసిల్లింది. భరతభూమిలో నదీ నాగరికత, దాని పునాది మీద నుండి రూపొందిన వ్యవసాయ నగర సంస్కృతులలో ఆర్యుల రాక తరువాత ఎన్నో మార్పులు వచ్చాయి. మాతృస్వామ్య వ్యవస్థ అంతమై, పితృస్వామ్య సంస్కృతి మొదలైంది. స్త్రీ వేదకాలంలో స్వేచ్ఛగా ఉందని, పాశ్చాత్య సంస్కృతి సంపర్కం వల్ల ఆ స్థితి చెడిపోయిందనీ చాలా తెలివిగా మన మతాచార్యులు కొందరు తప్పుడు బోధనలు చేస్తున్నారు. సమాజ ప్రగతికి ఎవరైతే ఆధారమో, ఆ స్త్రీకి విలువ లేకుండా అణగదొక్కిన నాటి నుండే మన సంస్కృతి అణగారిపోవడం ప్రారంభించింది’ అని వక్కాణించారు, ప్రముఖ సంస్కృత పండితుడు, హేతువాది, సామాజిక వేత్త, కత్తి పద్మారావు తన ”భారతీయ సంస్కతిలో స్త్రీ” అనే పరిశోధనా గ్రంధంలో.

  • అన్యాయం.. మనువాదం..

మతం స్త్రీకి తీరని అన్యాయం చేసింది. అది ఏ మతమైనా పురుషుడి సృష్టే అన్న సత్యం ఇకనైనా అందరూ గుర్తించాలి. హైందవం, ఇస్లాం, క్రైస్తవ్యం, జైనం.. ఇలా ప్రతి మతమూ పురుషుడి సృష్టే. అందుకే, దేవుళ్ళు కూడా మగవాళ్లే ఉంటారు. దేవతలు ఉన్నా, వారి పాత్రా, ప్రభావమూ పరిమితంగానే ఉంటాయి. పురుషాధిపత్యం నిరాటంకంగా కొనసాగడానికి, స్త్రీని, అలాగే కొన్ని బలహీన సమూహాలనూ బానిసలుగా ముద్ర వేసింది బ్రాహ్మణ్యం. చాతుర్వర్ణ వ్యవస్థ సృష్టి అందుకే జరిగింది. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ మొత్తం విభజనలో స్త్రీలకు ఎలాంటి చోటూ లేదు. స్త్రీలకు తమ తండ్రి, భర్త, కొడుకు ద్వారా తప్ప, విడిగా ఎలాంటి గుర్తింపూ లేకుండా మనువాదం ఆమెను పురుషుడికి, అతడి వంశానికి దాసీని చేసింది. స్త్రీని బిడ్డల్ని కనడం ద్వారా, మగపిల్లల్ని కనడం ద్వారా వంశాన్ని నిలబెట్టాల్సిన యంత్రంగా, పురుషుడికి సమయానికి అన్ని సౌకర్యాలూ సమకూర్చే ఒక పరిచారికగా మాత్రమే మనుస్మృతి స్త్రీని కుదించింది తప్ప, ”స్త్రీకి కూడా పురుషుడితో సమానంగా మెదడు, శరీరం ఉంది” అని చలం చెప్పినట్టు, దానికి ఆలోచన, అనుభవం ఇవ్వాలని ఈ మనువాదులు అనుకోలేదు.

  • రాజ్యాంగం.. హక్కులు..

కాబట్టి, స్త్రీని సంప్రదాయం, కట్టుబాట్లు, అనే చట్రంలో బిగించి, ”పితా రక్షతి కౌమారే, భర్తా రక్షతి యవ్వనే, పుత్రా రక్షతి వార్ధక్యే, న స్త్రీ స్వాతంత్య్రమర్హతి” అని, సృష్టికే మూలం ఐన స్త్రీని, మానవాళిని గర్భాన మోసి జన్మనిచ్చే స్త్రీమూర్తిని, పురుషుడి చెప్పుచేతల్లో.. తుదకు తాను కన్నకొడుకు కంట్రోల్లో ఉండాలని రాసి పారేసారు ఈ సనాతన వాదులు. అందువల్లనే స్త్రీకి ఒక గుర్తింపు, ఒక ఇంటిపేరు, తనదంటూ సొంత ఇల్లు, హక్కులు లేకుండా ఈనాటికీ మనకి కనిపిస్తుంది. బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రాసిన రాజ్యాంగం, స్త్రీల పట్ల ఈ దుర్మార్గాలను, కుట్రలను చెరిపేసి, స్త్రీలకు సమాన హక్కులు కల్పించింది. అందువల్లనే ఈ రోజు చట్టసభల్లోనూ, ప్రభుత్వ కార్యాలయాల్లోనూ, కోర్టుల్లో, పోలీస్‌స్టేషన్లలో, విద్యాలయాల్లో.. ప్రతిచోటా స్త్రీలు సమానస్థాయి పంచుకోగలిగారు. అయితే రావాల్సిన మార్పు పూర్తిస్థాయిలో ఈ దేశ స్త్రీలల్లో రాలేదనే చెప్పాలి.

  • ఆలోచనలపై ముసుగు..

దాదాపు అన్ని మతాలూ స్త్రీలను అణచివేసి ఉంచటానికే ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఇస్లాం స్త్రీల దేహాలతో పాటూ ఆలోచనలకూ ముసుగు వేసి, వారిని నాలుగ్గోడలా మధ్యా సంప్రదాయం పేరుతో ఖైదు చేసింది. స్త్రీని కేవలం శరీరంగా భావించి, ఇతర పురుషులు ఆమెని చూడరాదని, నల్లటి చీకటిలాంటి ముసుగులో జీవితాంతం బంధించింది. అదే మతంలోని పురుషులు మాత్రం ఘోషా లేకుండా అందరినీ చూడొచ్చు, స్త్రీలకు మాత్రం ఆ హక్కు లేకుండా, కనీసం తమ శరీర భాగాలకు ఎండైనా తగలకుండా కనీస స్వేచ్ఛను.. పురుషుల చేత ఈ మతంలో లాక్కోబడింది. ఇస్లాం తమ స్త్రీలను తమతో సమానంగా ప్రార్ధనలు చేయనివ్వదు. మసీదుకి వచ్చి ప్రార్థించే హక్కు ఆ మతంలోని స్త్రీలకు లేదు. ఇళ్లల్లో సైతం ముస్లిం మహిళలు, పురుషులు వేర్వేరుగానే ప్రార్థనల్లో పాల్గొనాలి.

సేవకులను చేసింది..

ఇక క్రైస్తవ్యం సైతం, ఒక మతంగా మారిన తర్వాత, స్త్రీలను పురుషులకు సేవకులుగానే మార్చేసింది. క్రైస్తవ్యాన్ని ఒక మతంగా ప్రచారంలోకి తెచ్చిన పౌలు ఐతే, ”స్త్రీకి సంఘంలో మాట్లాడే హక్కు ఇవ్వను, ఆమె మౌనంగా ఉండవలసిందే” అని తెగేసి చెప్తాడు, ఆయన సంఘాలకి రాసిన ఉత్తరాల్లో.. స్త్రీ అలంకరించుకోవడం, ఎక్కువ మాట్లాడడం, పురుషులకు ఆటంకంగా అభివర్ణిస్తాడు. పురుషుడిని స్త్రీకి శిరస్సుగానూ, స్త్రీని పురుషుడికి లోబడి ఉండాల్సిన దానిగానూ ఆయన నిర్ణయిస్తాడు. అందుకే, క్రైస్తవ్యం సనాతన ధర్మానికి ప్రత్యామ్నాయంగా మనదేశంలోకి ప్రవేశించినా, మత పెద్దలుగానూ నిర్దేశకులుగానూ ఇక్కడా మనకి పురుషులే కనిపిస్తారు. స్త్రీలను ముసుగు వేసుకొని మౌనంగా వినేవాళ్ళుగా, పాస్టర్ల ఆజ్ఞలు పాటించేవారుగా, ఉపవాసాలు ఉండి భర్తల కోసం ప్రార్థనలు చేసేవాళ్ళుగా, సాతానుకి లొంగిపోయిన హవ్వ లాంటి బలహీన మనస్కులుగా, క్రైస్తవ్యం, సృష్టికి కారణమైన స్త్రీని మార్చేయడం చూస్తాం.

ఇవన్నీ గమనిస్తే, మతాలన్నింటి సారమూ స్త్రీని రకరకాల భయాలతోనూ, దైవత్వం అంటూ పురుషాధిపత్య భావజాలం సృష్టించిన కుట్రల్లో పడి, తమను తాము కోల్పోయేలా చేయడమే అని చాలా స్పష్టంగా అర్థమౌతుంది.

– అరుణ గోగులమండ, రచయిత్ర, సామాజిక కార్యకర్త, 88971 07984

➡️