మౌనం మింగేస్తున్న జ్ఞాపకాలు..!!

Feb 18,2024 13:56 #Poetry, #Sneha

 

ఆ రేయి మనసు ఎందుకో చికాకు వేసింది

వీచే చిరుగాలి గుండుసూదుల్లా గుచ్చుతూ

తనువంతా తూట్లు పొడుస్తున్నట్లుగా ఉంటే

ప్రసరించే ఎర్రని రక్తంలో భయం కనిపించే..

మబ్బుల బొంతను కప్పుకుంటే

ఆకాశంలో చంద్రబింబం నవ్వుతుంది

చుక్కలన్నీ ఆశ్చర్యంగా చూస్తుంటే

కంట్లో కన్నీరు ముళ్ళులా గుచ్చుకుంటుంది

నిశ్శబ్దంగా హృదయంపైన వాలే కోరికలు

మౌనం మింగేస్తున్న జ్ఞాపకాలు

గుండెపై రాళ్ల దెబ్బలు తగులుతుంటే

అక్కడక్కడ నాలుకల బుసలు

వినిపిస్తున్నాయి.

దూరాన నల్లని ఆకారం ఒకటి నడుస్తుంది

ఉదయపు నీడలాగా భ్రమ గలుగుతూ

మనసు అలజడిలో

జడి వానలా కమ్ముకొని

ఆ రాత్రంతా కురుస్తూనే ఉంది

మనసుపై భారంగా..

చీకటి వెన్నెల చేసిన గాయాలెన్నో

దేహంపై వాలి కనురెప్పలను

సతాయిస్తున్నాయి

కరిగిపోయేకాలం ముఖాన్ని మారుస్తుంటే

రోగంలా వణుకుతూ తనువును క్షీణిస్తుంది..

అర్ధరాత్రి ఉలిక్కిపడి కళ్ళు తెరిస్తే

కన్నీటి అంచున ఒక నీటి బిందువు పలకరించే

మేలుకొన్నందుకు కన్నీటి చుక్క ప్రశ్నిస్తుంటే

మరో రేయి కోసం పగలంతా ఎదురుచూస్తుంది..

 

  • కొప్పుల ప్రసాద్‌, 9885066235
➡️