పయనం

Mar 10,2024 08:25 #Sneha

చక్కగా గోలలూ, గందరగోళాలూ తరువాత, ‘కాస్త వెనుక సీటుకు వెళ్లవయ్యా!’, అంటూ కుర్రాళ్లను తరిమేసి, అందరం ఒకేచోట సీట్లు వచ్చేలా చూసుకుని, మొత్తానికి బస్‌ ఎక్కేశాం. కాస్త సెటిల్‌ అయ్యాక, బ్యాగ్‌లో చూస్తే ఇయర్‌ ఫోన్స్‌ తేవడం మర్చిపోయా. ”ఓV్‌ా నో” అనుకుంటూ తెగ వెతికేసా. లాభం లేదు. చచ్చా ఇప్పుడింత పెద్ద ప్రయాణం ఎలా చెయ్యనూ అనుకుంటూ, అరుపుల డబ్బా టీవీ కేసి చూస్తే, రవితేజా గొడ్డళ్లు, రక్తాలు సినిమా వేశారు. సరిపోయిందిరా బాబు అనుకున్నా.
ఏమీ తోచక పక్కకు చూసా, తేలికైన బూడిద రంగులో అప్పుడే ఆడుకుని వచ్చిన చాప, ఆకాశమై నన్ను ఆకట్టుకుంది. నక్షత్రాలు ఇక్కడ నుండి దూరంగా బిల్డింగుల వెనుకదాకా సిటీ లైట్లయి ముద్దుగా అమాయకంగా మిణుకు మిణుకుమంటున్నాయి. ఇంతలో అనవసరపు బాధల్లో మునిగిన వాడికి నావ అందించినట్టు, అమ్మ జంతికలు, కరకరమనే పప్పుచెక్కలు నిండిన సంచి బయటకు తీశాను. కక్కుర్తిగా దోసిట నిండా అవి నింపేసుకుని, ఇంకో చేత్తో ఒక్కొక్కటీ, ఒకప్పుడు విండో సీటు కోసం గొడవపడే చిన్నారినై, చిన్నగా కొరుకుతూ ఎంతో అమూల్యంగా తింటూ చూసా, ఆ ప్రయాణం అనే మెలోడియస్‌ సినిమాను.
ఎంతమందో మనుషులు, ఎన్నో జీవితాలు, వారి వాహనాలు, వారి వారి ప్రయాణాలు ఎక్కడికో, ఏంటో గమ్మత్తుగా అనిపించాయి. అంతలోనే తెగ గుబురుగా వైల్డ్‌గా పూసేసిన ఎర్ర కాగితం పూల చెట్టు కనపడింది. అర క్షణమే చూడగలిగినా, కళ్లకు నల్ల కాటుక ఇచ్చిన అందమంత ఆనందంగా అనిపించింది. దారిలోని రాళ్ళు, కొన్ని ఎండు చెట్లు, కొద్దిగా దుమ్ము, ఎక్కడపడితే అక్కడ పెరిగేసిన గడ్డి మొక్కల నుండి వచ్చిన ఈ గాలికి ఉన్న ఫ్లేవర్‌ ముందు ఇంకేదీ ఆనదనిపించింది. పాటలు వినడానికి లేని నేను ఆ రోజు నాకిష్టమైన టేలర్‌ స్విఫ్ట్‌ పాట, కిటికీ వైపు ఆనుకుని నెమ్మదిగా పాడుకున్నా. ఆ చల్లని అనుభూతి వివరించలేనిది, వివరించినా నాకే అర్థం కానిది. వాహనాల శబ్దాలు, హారాన్లు, రకరకాల దూరాల్లో ఉంటూ నా పాటకి ఉచితంగా, ప్రేమగా మ్యూజిక్‌ కంపోజ్‌ చేశాయి. ఎప్పుడూ ఒక వాక్యంలో అయిపోయే ప్రయాణంలో ఇప్పుడు ఇంకెన్నో స్టాంజాలు మిగిలున్నాయి.
మొదట అల్లరి చేసి, తరువాత మిఠాయి ఇవ్వగానే మొత్తానికి ఏడుపాపిన పిల్లాడిలాగ, ఆరోజు అలా తన ఫోనులో ఇది రాసుకుంటూ, పడుకునిపోయింది మల్లమ్మ. చల్ల గాలికి తన ముఖం మీద పడుతున్న జుట్టును చెవుల వెనక్కి జాగ్రత్తగా పెడుతుండగా…

సాయి మల్లిక పూలగుర్తి
80089 28587

➡️