సమురు

Feb 4,2024 09:13 #Poetry
poetry on house

ఎప్పటి లాగే తెల్లారింది

ఓ కిరణం చూరులో నుండి

మోముపై పడి లేచాను

ఉదయాన్ని స్వాగతిస్తూ..

ఏ వారమో తెలియదు

యవ్వారమొక్కటే ఎరుగు

వారం తెలియ క్యాలెండర్‌ లేదు

చూడ అక్షరం నేర్వలేదు..

రేయంతా కలత నిద్రనే

రేపేంటో తెలియక

రెప్పవాల్చ ధైర్యం లేదు

సమురు లేని దీపం

గుడ్డిగా వెలుగుతుంటే

బతుకులో వెలుతురు గురించి

గట్టి నమ్మకం..

జుట్టుకి సమురు లేక రేగుతుంది

దువ్వబోతే రేగు కంపలా

ముంగురులు మాత్రం గాలికి ఊగుతూనే ..

.మా ఇంటోడి చూపులను మరలనీయక

బూదిచ్చిన పొయ్యిల

కట్టె కాలనంటుంది సమురు లేక

నాలుగ్గింజలు ఉడికేదెలా

నాలుగేళ్ళు లోనికి పోయేదెలా

ఆలోచనల్లో బుర్ర గింగిరాలు..

ఇంతలో ఎవరో తలుపు కొట్టిన సప్పుడు

తెర్వంగ ఎదురుగా ఓ జెండాతో నల్గురు

కష్టమే ఎరుగని తీరు ముఖాల్లో

దీపాలు పెట్టండంటూ హుకుం

సమురే లేక సస్తుంటే

కడుపులో సల్ల కదలని ఆజ్ఞ

సుర్రుమంది..

వెలగని మా బతుకుల కోసం

ఒంట్లో సమురుని కాగడానే జేస్తాగాని

దీపం బెట్ట! ఖరాఖండిగా జెప్పా!

దడాలున పడ్డ తలుపు చెక్క ఊడిపోయి

పేదరికం నవ్వింది!

కళ్ళల్లో నీళ్ళు సుళ్ళు తిరిగాయి!!.

 

– గిరిప్రసాద్‌ చెలమల్లు, 9493388201

➡️