ఒక అమృత వాహిక!

Mar 17,2024 13:32 #Poetry, #Sneha

కాలం ఒక అద్భుత శక్తి
ఒక్క మాటలో చెప్పాలంటే
అన్ని బతుకులకు, ప్రళయాలకు
కాలమే ఆధారం.. కాలమే మూలం..
కాలానికి మంచి చెడులతో సంబంధం లేదు
తన పని తాను చేసుకుపోతుంది
ఒక్క క్షణం ఎవరికోసమూ ఆగదు
తన ధర్మాన్ని ఎన్నడూ విడిచిపెట్టదు..
మనిషి పుట్టుక విత్తనం లాంటిది
పరిణమించి మొగ్గ అనే బాల్యంగా
కాండం అనే కౌమారంగా
పూలు పూచే యవ్వనంగా
పండిపోయే వార్థక్యంగా
చివరికి నేల రాలిపోతుంది..
మండే ఎండలలో మాడిపోయే గ్రీష్మం
జీవితంలో ఎదురయ్యే
మనోవేదనలకు ప్రతిరూపం
మంచి జరిగినప్పుడు కలిగే
హర్షాతిరేకంతో ఆనంద వర్షంలో
తడిచి ముద్దవుతాము
నిర్మలంగా జాలువారే వెన్నెల సోనలకు
స్వచ్ఛతకు ఆనవాలు
శరత్కాలం వణికే చలికి
ముడుచుకు పోయేటట్లు
నచ్చని సంఘటనలకు
వణికించేది హేమంతం..
ఆకులు రాలినట్లు
ఆశలన్నీ రాలిపోయే కాలం శిశిరం
బంధాలు అనుబంధాల నుండి
ఏదో ఒకరోజు దూరంగా ఉండటమే శిశిరం
కాలం ఎన్నో సత్యాలకు ఆలవాలం
సత్యామతమైన కాలానికి మనం
కైమోడ్చాల్సిందే ఆరుగాలం!

– కైకాల సుమ , 9492656255

➡️