పోస్ట్‌.. పోస్ట్‌..

Jun 30,2024 11:15 #postal, #Sneha, #workes

‘పోస్ట్‌.. పోస్ట్‌.. వాయిదాల వరాలయ్యా.. ఎంఎ, ఎల్‌ఎల్‌బి.. పోస్ట్‌.. పోస్ట్‌..!’ అంటూ ట్రింగ్‌ ట్రింగ్‌ మని సైకిల్‌ బెల్‌ మోగిస్తూ.. పోస్ట్‌మ్యాన్‌ పిలుపును ‘రుద్రవీణ’ సినిమాలో అందరూ వినే ఉంటారు. ఆ కమ్మని ‘పోస్ట్‌.. పోస్ట్‌!’ అనే పిలుపులు ఇప్పుడు అంతగా వినబడటం లేదు. ఎన్నో యోగక్షేమాలను, నోటీసులను, నోటిఫికేషన్లను మోసుకొచ్చే పోస్టుమ్యాన్‌ సైకిల్‌ బెల్లు నేడు వినిపించడం లేదు. ప్రస్తుతం ఎన్ని రకాల సమాచార వ్యవస్థలు అందుబాటులోకొచ్చినా.. పోస్టల్‌ సర్వీసులను ఆదరించేవారు, వాటితో అనుబంధం కొనసాగిస్తున్న వారూ లేకపోలేదు. కాలానుగుణంగా జరుగుతున్న మార్పులతో పాటు సాంకేతిక పరిజ్ఞానాన్నీ అందిపుచ్చుకుంటూ తపాలాశాఖ తన సేవలను విస్తృతం చేసుకుంటోంది. బ్యాంకింగ్‌ సేవలనూ అందిస్తూ అన్ని వర్గాల అభిమానాన్నీ చూరగొంటోంది. పోస్టాఫీసు, పోస్టల్‌ వర్కర్‌కు ఉన్న ప్రాధాన్యాన్ని కాపాడుకునే దిశగా ఆ శాఖ సిబ్బంది కృషి చేస్తోంది. జులై 1వ తేదీన ‘జాతీయ పోస్టల్‌ వర్కర్‌ దినోత్సవం’ నేపథ్యంలో ప్రత్యేక కథనం..!

మారుమూల ప్రాంతాలకు పోస్టల్‌ శాఖ తన సేవలను 1854లో ప్రారంభించింది. మనదేశంలో రైల్వే శాఖ తరువాత రెండో అతిపెద్ద వ్యవస్థ పోస్టల్‌ శాఖ. సెల్‌ఫోన్‌ వచ్చిన తరువాత ఉత్తరాలు రాసే వారు తగ్గిపోయారు. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని సరికొత్త సేవలు మెరుగుపరచి పోస్టల్‌ వ్యవస్థ విస్తరించింది. మొదట్లో ఉత్తరాల వరకే సేవలు కొనసాగినప్పటికీ, కాలానుగుణంగా అనేక సేవలు కొత్తగా ప్రారంభించింది పోస్టల్‌ శాఖ. జాతీయ, అంతర్జాతీయంగా స్పీడ్‌ పోస్ట్‌, స్పీడ్‌ నెట్‌, వారెంట్‌ పేమెంట్‌ స్కీం, ఈ పోస్ట్‌, డైరెక్ట్‌ పోస్ట్‌, ఎలక్ట్రానిక్‌ మనీ ఆర్డర్‌, ఎటిఎం సేవలతో పాటు, మరెన్నో సేవలు పోస్టల్‌ శాఖ అందిస్తోంది. ప్రైవేట్‌ రంగంలో కొరియర్‌ సేవలు విస్తరించినా, పోస్టల్‌ శాఖపై ప్రజల ఆదరణ తగ్గలేదు.
ఎవరి నుండైనా ఉత్తరం అందుకొని, చదివితే ఆ అనుభూతే వేరు. ఉత్తరం ఊసులన్నీ పోగేసి, భావాలలో ముంచేసేది. అది ప్రేమలేఖ కావొచ్చు.. కలం స్నేహం కావొచ్చు.. ఉద్యోగ సమాచారం కావొచ్చు, బంధుమిత్రుల్లో ఎవరిదైనా మరణవార్త కావొచ్చు.. ఎలాంటి భావోద్వేగాల్నైనా బట్వాడా చేస్తుంది. సామాజిక మాధ్యమాలు (ఫేస్‌బుక్‌, వాట్సప్‌, ఇన్‌స్టా, ఎక్స్‌) వచ్చాక.. పోస్టల్‌ శాఖ వన్నె తగ్గిందనే చెప్పాలి.

చరిత్ర, ప్రాముఖ్యత..
ఒకసారి చరిత్రలోకి వెళ్తే మెసెంజర్ల రూపంలో తపాలా సర్వీసులుండేవి. అంతకుముందు పక్షులు, గుర్రాలను ఉపయోగించి రాయబారాలు చేరవేసేవారు. 1600 – 1700 సంవత్సరాల్లో అనేక దేశాలవారు జాతీయ తపాలా వ్యవస్థలను నెలకొల్పుకొని, ఆయా దేశాల నడుమ తపాలా సౌకర్యాల్ని కల్పించుకునేందుకు ద్వైపాక్షిక ఒప్పందాలు చేసుకున్నారు. 1800 నాటికి ఈ సంఖ్య భారీగా పెరిగింది. దీంతో అంతర్జాతీయ తపాలా పంపిణీ క్లిష్టంగా మారిపోయింది. అయితే స్కాట్లాండ్‌లోని సంక్వార్‌లోని హైస్ట్రీట్‌లో ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన పోస్టాఫీసు ఉందని బ్రిటిష్‌ పోస్టల్‌ మ్యూజియం పేర్కొంది. ఇక్కడి ఆధారాల ప్రకారం ఈ పోస్టాఫీసు 1712 నుంచి నిరంతరాయంగా పనిచేసింది. ఆ రోజుల్లో గుర్రాలు, స్టేజ్‌ కోచ్‌లు మెయిల్స్‌ తీసుకెళ్లేవి.

మన దేశంలో..
ఈస్ట్‌ ఇండియా కంపెనీ మన దేశంలో మొదటగా ముంబై, చెన్నరు, కోల్‌కతాలో 1764-1766 మధ్య ‘కంపెనీ మెయిల్‌’ పేరుతో పోస్టాఫీసులు ప్రారంభించింది. వారెన్‌ హేస్టింగ్స్‌ గవర్నరుగా ఈ తపాలా సర్వీసులను ప్రజలందరికీ అందుబాటులోకి తెచ్చారు. 1776లో లార్డ్‌ క్లైవ్‌ తపాలా వ్యవస్థను ఏర్పాటు చేశారు. 1774లో వారన్‌ హేస్టింగ్స్‌ కోల్‌కతా ఆఫీసును ప్రారంభించగా, తర్వాత 1786లో మద్రాస్‌ జనరల్‌ పోస్టాఫీసును, 1793లో ముంబయి జనరల్‌ పోస్టాఫీస్‌లను ఏర్పాటు చేశారు. 1854లో లార్డ్‌ డల్హౌసీ ద్వారా క్రౌన్‌ సర్వీస్‌గా మార్పు చేశారు.

వ్యవస్థాగత మార్పులు..
తపాలా వ్యవస్థ మన ప్రభుత్వంలో సమాచార మంత్రిత్వశాఖలోనే భాగమై ఉంది. దీని నియంత్రణ ‘తపాలా సర్వీస్‌ బోర్డు’ ఆధీనంలో ఉంటుంది. ప్రస్తుతం మనదేశంలో మొత్తం 23 తపాలా సర్కిల్స్‌ ఉన్నాయి. ప్రతీ సర్కిల్‌కు ప్రధాన తపాలా జనరల్‌ అధికారి ఉంటారు. ఇవికాకుండా భారత రక్షణ వ్యవస్థ కోసం ప్రత్యేకమైన సర్కిల్‌ ఏర్పాటు చేయబడింది.
తాజా గణాంకాల ప్రకారం.. దేశంలో 810 హెడ్‌ పోస్టాఫీసులు, 24,599 సబ్‌ పోస్టాఫీసులు, 1,31,312 బ్రాంచి పోస్టాఫీసులు, 4,44,266 పోస్టు బాక్సులు ఉన్నాయి. ప్రస్తుతం చూస్తున్న లెక్కల ప్రకారం.. 2017తో పోలిస్తే చాలా వరకూ సంఖ్య తగ్గిందనే చెప్పొచ్చు. వ్యవస్థలో చోటుచేసుకుంటున్న మార్పులు, ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా తపాలా వ్యవస్థ వెనుకబడిపోతోంది. అనేక కొత్త సర్వీసులను తపాలా కార్యాలయాలతో అనుసంధానిస్తామని చెబుతున్నారు. అయితే ఆచరణ అంత సులభసాధ్యం కాలేదు. ప్రభుత్వం చేపట్టాల్సిన ముందు జాగ్రత్తల్లో లోపం కొట్టొచ్చిన్నట్లు కనిపిస్తోంది.

సుబ్రమణియన్‌ కమిటీలో..
తపాలా విభాగాన్ని అన్నివిధాలా పరిపుష్టీకరించాలని సుబ్రమణియన్‌ కమిటీ ఏనాడో ప్రతిపాదించింది. బ్యాంకింగ్‌ ఒక్కటే కాదు.. బీమా, ఇ-కామర్స్‌ సేవల విస్తరణనూ తపాలాతో ముడిపెట్టాలని ప్రభుత్వానికి సూచించింది. ఇతర దేశాల పురోగతిని సోదాహరణంగా ఆ సంఘం తేటతెల్లం చేసింది. విస్తత తపాలా వ్యవస్థ గల భారత్‌లో స్పీడ్‌పోస్టు కేంద్రాల సంఖ్య 200కు చేరడానికే ఎంతో కాలం పట్టింది. ఉపాధి హామీ పథకం అమలులో భాగంగా నిధుల విడుదల, చెల్లింపు బాధ్యతల్ని చాలాకాలం పాటు తపాలాశాఖ నిర్వహించింది.

ప్రస్తుత సేవలు..
తపాలా శాఖ పొదుపు ఖాతా, ఇండియా పోస్టు పేమెంట్‌ బ్యాంకు, సుకన్య సమృద్ధి యోజన, మొబైల్‌ మనీ ట్రాన్స్‌ఫర్‌, తపాలా జీవిత బీమా, పీఎం సురక్షా బీమా యోజనతోపాటు, సరుకు రవాణా, ఈ-కామర్స్‌ డెలివరీలు, కొరియర్‌, పెన్షన్‌, పాస్‌పోర్టు, ఆధార్‌, పుస్తకాలు, మందుల వ్యాపారం తదితర సేవల్లో బిజీ అయింది. ఆర్థిక అవసరాలరీత్యా ప్రస్తుతం వాణిజ్యపర సేవలతో లాభాలు ఆర్జించే పనిలో పడింది.

కాలం చెల్లిన విధానాలు..
పల్లెసీమల్లోని తపాలా కార్యాలయాలకు అధునాతన స్వైపింగ్‌ మిషన్లు అందజేస్తామని, వాటి ద్వారా గ్రామీణులు డబ్బు లావాదేవీలు సాగించవచ్చని కేంద్రం చెబుతున్నా పూర్తిగా ఆచరణలో లేదు.. నూట పాతికేళ్ల చరిత్ర కలిగిన ‘మనియార్డర్‌’ విధానం కేవలం ఓ జ్ఞాపకంగా మిగిలిందిప్పుడు. ‘టెలిగ్రామ్‌’ తరహాలోనే దానికీ ముగింపు పలికారు. ‘ఎలక్ట్రానిక్‌’, ‘ఇన్‌స్టంట్‌ ఎంఓ’ లు వచ్చాక పాత పద్ధతులు కనుమరుగయ్యాయి. నగదును 24 గంటల్లోగా పోస్టాఫీసు ద్వారా సంబంధిత వ్యక్తికి అందజేయడమే ‘ఈఎంఓ’ విధానం. తక్షణ ప్రయోజనాలు కలిగించే ‘ఐఎంఓ’లూ ఉన్నాయి. నిమిషాల వ్యవధిలోనే ఆన్‌లైన్‌లో నగదు బదలాయింపు చేయవచ్చు. బ్యాంకు ఖాతా లేకున్నా, చేతిలో చరవాణి ఉంటే చాలు, దాని సాయంతో ఒకరి నుంచి మరొకరికి సొమ్ము బదిలీలూ జరిగిపోతున్నాయి. అంతేకాదు- బ్యాంకుకు వెళ్లి నేరుగా ఎవరి ఖాతాలోనైనా సొమ్ము డిపాజిట్‌ చేసే సౌకర్యమూ ఉన్నప్పుడు, కాలం చెల్లిన విధానాలతో ఇక పనేమిటి? నూతన ప్రక్రియలతో ముందడుగు వేస్తున్నామని పదేపదే ప్రకటించే కేంద్ర ప్రభుత్వం, అందుకు తగిన స్థాయిలో జాగ్రత్తలు తీసుకోలేకపోతోంది. వ్యవస్థాగత లోటుపాట్లతో పాటు పలు నిర్వహణ లోపాలు, సాంకేతిక సంబంధ అవరోధాలు, క్షేత్రస్థాయిలోని సిబ్బందికి శిక్షణ వసతుల కొరత – ఇప్పటికీ వేధిస్తున్నాయి. దేశంలోని తపాలా కార్యాలయాల్ని ఉపాధి కల్పన కేంద్రాలుగా తీర్చిదిద్దుతామని చాటిచెప్పినా, వాస్తవానికి ఆ వేగమేదీ కనిపించడం లేదు. వాతావరణ సమాచారాన్ని రైతులకు పక్కాగా తెలియజేసేలా తపాలాశాఖ ఓ ఒప్పందాన్ని శాస్త్ర, సాంకేతిక విభాగంతో కుదుర్చుకుంది. ఫలితం అంతంత మాత్రమే. వినియోగదారులకు మరెంతో దగ్గరయ్యామని ప్రకటించుకోవడమే గానీ, ఆచరణలో అదే లోపిస్తోంది. యాభై కిలోమీటర్ల పరిధిలోని ప్రతి పోస్టాఫీసులోనూ వివిధ రకాల సేవల విస్తరణ- హామీ దశ దాటని పరిస్థితే ఇప్పటికీ కనిపిస్తోంది.

ఆసక్తికర అంశాలు
ప్రపంచంలోనే 1,54,965 కార్యాలయాలతో అతిపెద్ద తపాలా వ్యవస్థ ఉన్న దేశంగా భారత్‌ రికార్డు సాధించింది. దీంతో తపాలా శాఖలన్నింటిలో మనదేశం తపాలా రారాజుగా నిలుస్తుంది. మన దేశంలో మార్చి 2017 నాటికి 1,55,015 తపాలా కార్యాలయాలు ఉండగా, ఇందులో 1,39,067 (89.86%) గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి. అయితే దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు ఉన్న తపాలా కార్యాలయాలు 23,344 మాత్రమే. ఈ లెక్కన దేశంలో ప్రతి 21.16 చదరపు కిలోమీటర్లకు ఒక పోస్టాఫీసు ఉంది. ప్రతి 6,623 మందికి ఒక పోస్టాఫీసు అందుబాటులో ఉన్నట్లు లెక్క.

  •  ‘మిర్రర్‌’ పత్రిక కథనం ప్రకారం ప్రపంచంలో అన్నింటికంటే విలువైన పోస్టల్‌ స్టాంప్‌ 55,50,000 పెన్నీలు (బ్రిటీష్‌ పెన్నీ) ఇటీవలి కాలంలో బ్రిటీష్‌ మెజెంటా స్టాంప్‌ విలువ మునుపటి కంటే ఎక్కువగా 95 లక్షల డాలర్లలో ఉంది. ఇది 1856లో బ్రిటిష్‌ గయానాలో పరిమిత సంఖ్యలో జారీ చేయబడింది. ప్రస్తుతం ఒకటి మాత్రమే ఉనికిలో ఉంది. బ్రిటిష్‌ రాయల్‌ ఫిలాటెలిక్‌ సేకరణలో ప్రాతినిధ్యం వహించని ఏకైక ప్రధాన తపాలా బిళ్ల ఇది.
  •  మారుతున్న సాంకేతికతకు తగ్గట్లుగా మనదేశ తపాలా శాఖ ఈ-పోస్ట్‌ సదుపాయాన్ని ప్రవేశపెట్టింది. ‘ఈ-పోస్ట్‌’ మనదేశంలో 1,31,312 పోస్టాఫీసుల ద్వారా ప్రజలు తాము స్కాన్‌ చేసిన బొమ్మలను ఈ-మెయిల్‌ ద్వారా పంపించేందుకు ఉద్దేశించింది. ఇంటర్నెట్‌, ఈ-మెయిల్‌ లేని అవతలి వ్యక్తికి అదేరోజున దాన్ని అందజేయడం దీని ప్రత్యేకత. దీనిద్వారా ప్రజా సమాచార వ్యవస్థలో డిజిటల్‌ అంతరాలను తగ్గించవచ్చు.
  •  మన దేశంలో మొదటిసారి పోస్టల్‌ స్టాంప్‌ను 1852లో విడుదల చేశారు. కాగా క్వీన్‌ విక్టోరియా చిత్రంతో మొదటి సచిత్ర పోస్టల్‌ స్టాంప్‌ 1, అక్టోబర్‌ 1854లో విడుదలయ్యింది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మొదటి పోస్టల్‌ స్టాంప్‌ను నవంబరు 21, 1947న విడుదల చేశారు. అప్పుడు విడుదల చేసిన ఈ స్టాంప్‌ విలువ 1.5 అణాలు. దేశంలో అతిపెద్ద పోస్టల్‌ స్టాంప్‌ మాత్రం ఆగస్ట్‌ 20, 1991న విడుదలైంది.
  •  గాంధీజీ చిత్రంతో కూడిన పోస్టల్‌ స్టాంప్‌ వేలంలో ఐదు లక్షల పౌండ్లకు ఇంగ్లండ్‌లో అరుదైన పోస్టల్‌ స్టాంప్‌లను 2017 ఏప్రిల్‌లో వేలం వేశారు. అక్కడ రూ.10 విలువ కలిగిన గాంధీబొమ్మ ఉన్న నాలుగు స్టాంప్‌లను ఐదు లక్షల పౌండ్లకు కొనుగోలు చేశారు.
  •  ఉత్తరాల బట్వాడాలో వేగం, కచ్చితత్వాన్ని సాధించడానికి 1972 ఆగస్టు 15న మన దేశంలో పిన్‌కోడ్‌ (పిఐఎన్‌-పోస్టల్‌ ఇండెక్స్‌ నంబర్‌) విధానాన్ని ప్రవేశపెట్టారు. పిన్‌కోడ్‌లో ఆరు అంకెలు ఉంటాయి. మొదటి అంకె జోన్‌ను, రెండో అంకె సబ్‌జోన్‌ను, మూడో అంకె జిల్లాను, చివరి మూడంకెలు డెలివరీ పోస్టాఫీసును తెలియజేస్తాయి. దేశాన్ని మొత్తం తొమ్మిది పిన్‌కోడ్‌ జోన్లుగా విభజించారు.

మైలురాళ్లు..

  •  1854లో పోస్ట్‌ ఆఫీస్‌ చట్టం
  •  1880లో మనీ ఆర్డర్‌ సేవలు ప్రారంభం
  • 1986లో నేషనల్‌ స్పీడ్‌ పోస్ట్‌ ప్రారంభం
  •  1994లో ఇంటర్నేషనల్‌ స్పీడ్‌ పోస్ట్‌ సేవలు ప్రారంభం
  •  2004లో ఈ పోస్ట్‌ ప్రారంభం
  •  2005లో డైరెక్ట్‌ పోస్ట్‌ ప్రారంభం
  •  2008లో ఎలక్ట్రానిక్‌ మనీఆర్డర్‌
  •  2009లో ఎటిఎం సేవలు
  •  2011 పార్సెల్‌ సేవలు ప్రారంభం
  •  1850లో ప్రారంభించిన టెలిగ్రామ్‌ సేవలు, జులై 15 2013న రద్దు చేశారు.
  •  మొదటి టెలిగ్రామ్‌ను కోలకతా నుండి డైమండ్‌ హార్బర్‌కు పంపారు
  •  1972లో ఆగష్టు 15న మనదేశంలో పిన్‌కోడ్‌ వ్యవస్థ ప్రారంభం
  •  ప్రపంచంలో మొదటి తపాలా బిళ్ల బ్రిటన్‌లో విడుదలైంది.
  •  మనదేశంలో మొదటి తపాలా బిళ్ల 1852లో కరాచీలో విడుదలైంది. దీని పేరు సింధ్‌ డాక్‌.
  •  మనదేశంలో అత్యంత ఎత్తయినది హిమాచల్‌ప్రదేశ్‌లోని కాజా పోస్టాఫీస్‌. ఇది సముద్ర మట్టానికి 4700 మీటర్ల ఎత్తులో ఉంది.
  •  భారత్‌లో 100వ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా దేశంలో తొలి మహిళా తపాలా ఆఫీస్‌ను ఢిల్లీలో ప్రారంభించారు. ఇక్కడ పనిచేసే వారందరూ మహిళలే.

సంస్కరణల ఫలితం..

దేశంలో ఆర్థిక సంస్కరణల ఫలితంగా ప్రభుత్వరంగ సంస్థల అభివృద్ధి దశాబ్దాలుగా ప్రకటనలకే పరిమితమయ్యాయి. గ్రామీణుల గుండె చప్పుడుగా ఉండే తపాలా శాఖకు డిజిటల్‌ వన్నెలద్దాలని చెబుతున్నప్పటికీ ఆచరణ సాధ్యం కావడంలేదు. శతాబ్దాల చరిత్ర కలిగిన తపాలా శాఖ అందించాల్సిన సేవలను అనేక ప్రైవేటు ఈ కార్ట్‌లు ప్రజలకు అందుబాటులోకి తెస్తున్నాయి. ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా ప్రజల వస్తువుల భద్రతకు ఏమాత్రం ఆస్కారం లేని ప్రైవేటు సంస్థలు రాజ్యమేలుతున్నాయి. ఫలితంగా అనేక మంది లబ్దిదారులు మోసానికి గురవుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి సాంప్రదాయ సేవలకు ప్రతీక అయిన తపాలాకు.. ఆధునిక సాంకేతిక విలువల జోడింపు ద్వారా ఉనికిని నిలబెట్టి.. కనుమరుగవుతున్న పోస్టుకార్డుకు భవిష్యత్‌లోనైనా పూర్వవైభవం తీసుకురావాలని ఆశిద్దాం.
తపాలా వ్యవస్థ కేంద్ర ప్రభుత్వంలో సమాచార మంత్రిత్వ శాఖలోని భాగము. దీని నియంత్రణ ‘తపాలా సర్వీస్‌ బోర్డు’ ఆధీóనంలో ఉంటుంది. ప్రస్తుతం మన దేశంలో మొత్తం 23 తపాలా సర్కిల్స్‌ ఉన్నాయి. ప్రతీ సర్కిల్‌కు ప్రధాన తపాలా జనరల్‌ అధికారి. ఇవి కాకుండా భారత రక్షణ వ్యవస్థ కోసం ప్రత్యేకమైన సర్కిల్‌ ఏర్పాటు చేయబడింది.

ఆర్థిక లావాదేవీలు..
పోస్టాఫీసులలో తపాలా సర్వీసులు కాకుండా, ఆర్థిక లావాదేవీలు కూడా విరివిగా జరుగుతున్నాయి. ఇవి ఎక్కువగా బ్యాంకులు లేని మారుమూల పల్లెలలో కేంద్రీకరించబడ్డాయి.

పబ్లిక్‌ ప్రావిడెంట్‌ నిధి
జాతీయ పొదుపు సర్టిఫికెట్‌
కిసాన్‌ వికాస్‌ పత్రం
పొదుపు ఖాతా
నెలసరి ఆదాయ పథకము
పొదుపు ఖాతా
తపాలా పెట్టెలు
ఈ రోజు జాతీయ పోస్టల్‌ వర్కర్స్‌ డే సందేశాలను ప్రపంచవ్యాప్తంగా కష్టపడి పనిచేసే తపాలా ఉద్యోగులతో పంచుకునే రోజు. ప్రతి సంవత్సరం జులై 1వ తేదీన జాతీయ పోస్టల్‌ వర్కర్‌ దినోత్సవాన్ని జరుపుకుంటుంది. ఎంతో శ్రమకోర్చి పనిచేస్తున్న పోస్టల్‌ ఉద్యోగులను మనమందరం అభినందించి, గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది. మన భావోద్వేగాలను పంచే సారథులు, ఆర్థికపరమైన బట్వాడాలు చేసేందుకు తోడ్పడే తంతితపాలా సేవలు మరవలేనివి. ఈ సందర్భంగా పోస్టల్‌ ఉద్యోగుల అందరికీ పోస్టల్‌ వర్కర్‌డే శుభాకాంక్షలు.

➡️