పిల్లల కోసం స్వరం పెంచుతా..!

May 26,2024 08:06 #celebrity, #kapoor, #Sneha

ముంబైలో నటుడు రణధీర్‌కపూర్‌, బబితకు జన్మించారు కరీనా. ఆమె అక్క కరిష్మా కూడా నటే. ఆమె తాత (తండ్రికి తండ్రి) రాజ్‌కపూర్‌ ప్రముఖ బాలీవుడ్‌ నటులు. కరీనా తల్లి గర్భం దాల్చినప్పుడు ఆమె చదివిన ”అన్న కరెనినా” పుస్తకం పేరునే ”కరీనా” అని పేరు పెట్టారట. ఇంటినిండా నటులే కావడంతో సినిమాలపై ఎక్కువ ఆసక్తి కలిగిందనీ, నటి నర్గీస్‌, మీనాకుమారి తనకు ఆదర్శమని ఓ ఇంటర్వ్యూలో కరీనా చెప్పారు.
నటుల కుటుంబమే అయినా స్త్రీలు సినిమాల్లోకి రావడానికి తండ్రి మొదట అంగీకరించలేదు. దాంతో ఆమె తల్లితండ్రులిద్దరూ విడిపోయారు. అందుకే ఆమె బాల్యంలో తల్లి పెంపకంలో పెరిగారు. కరిష్మా సినిమాల్లోకి వచ్చేవరకూ బబితా వివిధ పనులు చేసి, వారిని పోషించారు. తరువాత కరీనా తల్లిదండ్రులు మళ్లీ కలిశారు. ముంబైలోని జమ్నాబారు నర్సీ స్కూల్లోనూ, డెహ్రాడూన్‌లోని వెల్హం గర్ల్స్‌ స్కూల్లో చదువుకున్నారు. గణిత శాస్త్రం అంటే ఆమెకు చాలా ఇష్టం. ముంబైలో మిథిబై కళాశాలలో కామర్స్‌ చదివారు. న్యాయశాస్త్ర విద్య వైపు మక్కువ పెంచుకున్న ఆమె, ఒక సంవత్సరం లా చదివి, మధ్యలోనే ఆపేశారు. నటన వైపు తన కెరీర్‌ మలచుకున్నారు.
యాక్టింగ్‌ ఇనిస్టిట్యూట్‌లో శిక్షణ తీసుకున్న కరీనాకు ట్రైనింగ్‌లో ఉన్నప్పుడే హృతిక్‌ రోషన్‌ నటించిన ‘కహో నా.. ప్యార్‌ హై (2000)’ సినిమాలో నటించేందుకు అవకాశం వచ్చింది. అయితే మొదట్లో ఒప్పుకున్నా, తర్వాత సినిమా నుంచి తప్పుకున్నారు ఆమె. అభిషేక్‌ బచ్చన్‌ సరసన రెఫ్యూజీ సినిమాతో తెరంగేట్రం చేశారు. ఈ సినిమాలోని ఆమె నటనకు మంచి ప్రశంసలు లభించాయి. మొదటి సినిమాకే ఫిల్మింఫేర్‌ ఉత్తమ నటి డెబ్ల్యూ పురస్కారం అందుకున్నారు. ”చమేలీ” సినిమాలో వేశ్య పాత్రలో ఆమె నటనకు ప్రేక్షకుల, విమర్శకుల ప్రశంసలు లభించాయి. ఈ సినిమా ఆమె కెరీర్‌లో టర్నింగ్‌ పాయింట్‌గా మారింది. 2002 గుజరాత్‌ అల్లర్ల నేపథ్యంలో తీసిన సినిమాలో ఒక ముస్లిం పాత్రలో కనిపించారు కరీనా. ఇలా ఎన్నో సినిమాలతో తన కెరీర్‌లో ముందుకు సాగుతున్నారు.


ఈ నెల 4న ఐక్యరాజ్య సమితికి అనుబంధ సంస్థ అయిన యునిసెఫ్‌ ఇండియా తన కొత్త జాతీయ ప్రచారకర్తగా బాలీవుడ్‌ కథానాయిక కరీనా కపూర్‌ను నియమించినట్లు ప్రకటించింది. ఈ సందర్భంగా కరీనా మాట్లాడుతూ..’పిల్లల హక్కులు, భవిష్యత్తు తరం ముఖ్యంగా విద్య, లింగ సమానత్వంలాంటి తదితర ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. ఇప్పుడు అంబాసిడర్‌గా యునిసెఫ్‌తో నా అనుబంధాన్ని మరింత ముందుకు తీసుకెళ్తున్నందుకు గర్వంగా ఉంది. బలహీనవర్గాలకు చెందిన పిల్లల హక్కులను రక్షించడం, వారికి గొప్ప భవిష్యత్తును అందించడం కోసం నా వంతు కృషి చేస్తాను. నేను ఒక స్వచ్ఛంద సంస్థ తరఫున సెలబ్రిటీ అడ్వకేట్‌గా దేశమంతా తిరిగాను. పిల్లల హక్కులు, విద్య ఆరోగ్యంపై పనిచేశాను. ఈ క్రమంలో చాలామంది ఉపాధ్యాయులు, తల్లిదండ్రులను కలిశాను. వాళ్ల కథలు, కలలు, ఆశయాలు.. మాతో పంచుకున్నారు. యునిసెఫ్‌ ప్రచారకర్తగా ఇప్పుడు చేయాల్సిన పనిని పదేళ్ల కిందటే చేశాను. ఒక నటిగా నా గొంతు లక్షల మందిని తేలికగా చేరుతుందనే అంబాసిడర్‌గా ఎంపిక చేశారనుకుంటున్నా. ఈ పదవిని ఒక బాధ్యతగా భావిస్తున్నా. దేశంలోని పిల్లల హక్కుల కోసం నా స్వరం పెంచుతాను’ అన్నారు కరీనా.

పుట్టిన తేది : 21 సెప్టెంబరు 1980న
నివాసం : ముంబై
వృత్తి : నటి
భర్త : సైఫ్‌ అలీ ఖాన్‌
పిల్లలు : తైమూర్‌ అలీ ఖాన్‌ పటౌడీ
అవార్డులు : దేవ్‌ (2005)కి ఉత్తమ నటి (క్రిటిక్స్‌) అవార్డు, ఓంకార (2007) కోసం ఉత్తమ నటి (క్రిటిక్స్‌) అవార్డు, జబ్‌ వీ కోసం ఉత్తమ నటి అవార్డు మెట్‌ (2008), వీ ఆర్‌ ఫ్యామిలీ (2011) ఇంటర్నేషనల్‌కి ఉత్తమ సహాయ నటి అవార్డు, ఇలా చాలా అవార్డులు అందుకున్నారు.

➡️