పచ్చిమిర్చితో పసందుగా..

Feb 18,2024 06:22 #Food, #Sneha
Spicy with green chillies..

మిరపకాయ అనగానే ‘అమ్మో మంట..’ అనిపించినా దానిలోనూ పోషకాలున్నాయి. కారంగా ఉండటానికి మిరపలో ఉండే క్యాప్సైసిన్‌ అనే రసాయనం కారణం. పచ్చిమిరపకాయల్లో ఎ, బి6, సి విటమిన్‌లు, యాంటీఆక్సిడెంట్లు, క్యాల్షియం, జింక్‌, ఐరన్‌ పుష్కలంగా ఉంటాయి. ఆహారంలో పచ్చి మిరపకాయలను సరైన మోతాదులో తీసుకుంటే చర్మం, కళ్ళు, గుండె, ఊపిరితిత్తులు, జీర్ణక్రియ, రోగనిరోధక శక్తిపై మంచి ప్రభావం ఉంటుంది. అందుకే మన సంస్కృతిలో పూర్వం నుంచి పచ్చిమిర్చిని రోజువారీ కూరల్లోనో, రోటి పచ్చడి ద్వారానో తీసుకునే వాళ్ళం. అదీ కాకపోతే పెరుగన్నంలో నంజుకునే అలవాటుంది. మరిన్ని ప్రయోజనాలున్న పచ్చిమిర్చితో కొత్త రుచులు తెలుసుకుందాం.

ఆవకాయ..

కావలసినవి : పచ్చిమిర్చి – 1/4 కేజీ, ఆవ పిండి – 2 స్పూన్లు, మెంతిపిండి – స్పూను, ఉప్పు – 1/4 కప్పు, కారం – 1/4 కప్పు, వెల్లుల్లి – 1, వేరుశనగ నూనె – 100 గ్రా., నిమ్మకాయలు – 2

తయారీ : తాజా పచ్చిమిర్చి తొడిమలు తీసి శుభ్రం చేసుకుని తడిలేకుండా తుడిచి ఆరనివ్వాలి. నిమ్మకాయలు రసం తీసుకుని చిన్న గిన్నెలో ఉంచుకోవాలి. నాలుగు చీలికలుగా లేదా అరంగుళం సైజు ముక్కలుగా చేసి కట్‌ చేసుకుని వెడల్పు పాత్రలో తీసుకోవాలి. ఆవ, మెంతి పిండి, ఉప్పు, కారం, కచాపచాగా దంచుకున్న వెల్లుల్లి ముద్ద అన్నీ పచ్చిమిర్చి ముక్కలకు బాగా కలిసేలా కలపాలి. నూనెపోసి మరలా కలిపి, నిమ్మరసం కూడా కలపాలి. రుచి చూసి అన్నీ సరిపోయాయనుకుంటే సీసాలో పెట్టి మూడు రోజులు కదపకుండా ఉంచి ఆ తర్వాత వాడుకోవచ్చు. స్పైసీ పచ్చిమిర్చి ఆవకాయ రుచి అమోఘం.

కూర..

కావలసినవి : లేత పచ్చిమిర్చి – 1/4 కేజీ, రాజ్‌మా – 100 గ్రా, టమోటా – 1/4 కేజీ, ఉప్పు – తగినంత, నూనె – 4 స్పూన్లు, తాలింపు దినుసులు – 2 స్పూన్లు

తయారీ : ముందుగా మంట తక్కువగా ఉండే లేత మిరపకాయలు తొడిమలు తీసి, శుభ్రం చేసుకోవాలి. వాటిని ఉప్పు, చిన్న గ్లాసు నీళ్లు పోసి మట్టి పాత్రలో ఉడికించాలి. సగం ఉడికిన తర్వాత ఆ నీటిని వంపేసి, టమాటా ముక్కలు, నాలుగ్గంటలు నానబెట్టిన రాజ్‌మా కలిపి మళ్ళీ కొంచెం నీళ్లు పోసి మెత్తగా ఉడికించాలి. (రుచి చూసి అవసరమైతే ఉప్పు వేసుకోవాలి). ఇగురుతున్న సమయంలో గరిటెతో మెదిపినట్లు కలపాలి. కూర గుజ్జుగా అయిన తర్వాత తాలింపు పెట్టుకోవడమే. అంతే ఘుమఘుమలాడే పచ్చిమిర్చి కూర రెడీ.

ఉసిరితో పచ్చడి ..

కావలసినవి : ఉసిరికాయలు – 1/2 కేజీ, నూనె – 1/2 కేజీ, పచ్చిమిర్చి – 300 గ్రా, నువ్వులు – 150 గ్రా., నిమ్మకాయలు – 4, ఉప్పు – తగినంత, పసుపు – 1/2 స్పూను, వెల్లుల్లి – 2 పాయలు, మెంతులు, ఆవాలు పొడి – రెండు స్పూన్లు.తాలింపుకు: జీలకర్ర, మినప్పప్పు, పచ్చిశనగ పప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి -10 రెబ్బలు,

తయారీ : ముందుగా ఉసిరికాయలు, పచ్చిమిర్చి శుభ్రం చేసుకుని తడి లేకుండా తుడిచి ఆరనివ్వాలి. నువ్వులు దోరగా వేయించి పొడి చేసుకోవాలి. వెల్లుల్లి, పచ్చిమిర్చి విడివిడిగానే కచ్చాపచ్చాగా నూరుకోవాలి. బాండీలో రెండు గరిటెలు నూనె, పసుపు, అరస్పూను ఉప్పు, ఉసిరికాయలు వేసి మాడకుండా ఉడికించాలి. గరిటెతో నొక్కి గింజలు తీసివేసి గిన్నెలోకి తీసుకోవాలి. మరో బాండీలో మూడు గరిటెలు నూనె వేడిచేసి తాలింపు దినుసులు అన్నీ మంచి సువాసన వచ్చేలా వేయించి, పక్కన పెట్టుకోవాలి. ఉసిరికాయలు వేయించిన బాండీలో మిగిలిన నూనె కాచి, పచ్చిమిర్చి ముద్ద, వెల్లుల్లి, స్పూను పసుపు, ఉప్పు, వేసి ఐదు నిమిషాలు వేయించాలి. ఇప్పుడు నువ్వుల పొడి, ఆవాలు, మెంతుల పొడి, ఉసిరి ముక్కలు, వేసి బాగా కలపాలి. ముందుగా పెట్టిన తాలింపు బాండీలో ఈ మిశ్రమాన్ని వేయాలి. పచ్చడి చల్లారిన తర్వాత నిమ్మరసం పోసుకుని, బాగా కలపాలి. ఆహా పుల్లపుల్లని నోరూరించే పచ్చిమిర్చి ఉసిరి పచ్చడి రెడీ. ఇది ఫ్రిజ్‌లో నెలరోజుల వరకూ నిల్వ ఉంటుంది.

 

➡️