అవగాహనతోనే అడ్డుకట్ట..!

story in women trafficking precautions

 

  • ‘హలో! మా పార్లర్‌కి రండి.. నిమిషాల్లో మిమ్మల్ని అందంగా మార్చేస్తాం’. ‘విదేశాలకు పంపించండి! మంచి జీతం వస్తుంది’. ‘మసాజ్‌ కావాలా..!’ ఇలా అనేక ప్రలోభాలు, యాప్‌లూ.. ప్రేమ మైకం.. సినిమాల్లో చేరాలనే వ్యామోహం.. ఆర్థిక అవసరాలు.. ఇలా ఎన్నిఅవకాశాలున్నాయో అన్నీ ఈ మానవ అక్రమ రవాణాకు సహకారాలే. ‘అయ్యో! మా పాప కనిపించట్లేదు..’ ‘ఇక్కడే ఆడుకుంటున్న మా బాబు మాయమయ్యాడే..’ ‘కాలేజీకెళ్ళిన మా అమ్మాయి ఇంకా రాలేదు..!’ ఇలా ఎంత మంది తల్లిదండ్రులు అల్లాడిపోతున్నారో.. దుర్గ గుడిలోనా.. మన ఊరి బడిలోనా.. నిన్నగాక మొన్న ఈస్ట్‌కోస్ట్‌ రైల్లోనా.. ఇక్కడా అక్కడా అని లేదు. ప్రపంచ వ్యాప్తంగా ఈ మానవ అక్రమ రవాణా కొనసాగుతూనే ఉంది. ఇటువంటి సామాజిక విపత్తును ఖండిస్తూ ప్రపంచదేశాలు జనవరి 11న ‘అంతర్జాతీయ మానవ అక్రమ రవాణాపై అవగాహనా దినోత్సవం’ జరుపుతున్నాయి. ఈ సందర్భంగా దీనిపైనే ప్రత్యేక కథనం..

 

అనాదిగా మనుషులను మనుషులే రకరకాలుగా దోచుకుంటున్నారు. అంతటితో తృప్తి పడటంలేదు. అవసరమైతే చంపేస్తున్నారు. అందులో లింగభేదం లేదు. స్త్రీ, పురుషులు, చిన్నా, పెద్ద అనే తేడాలేం లేవు. వ్యక్తుల అక్రమ రవాణాకు, మానవ అక్రమ రవాణాకు దగ్గరి సంబంధం ఉంది. కానీ కారణాలు మాత్రం ఒక్కటే. ఉపాధి కోసం చాలా మంది వలసదారులుగా మారుతున్నారు. స్మగ్లర్లు తమ అక్రమ రవాణా క్రాసింగ్‌ కోసం వలసదారులను బలవంతం చేస్తున్నారు. ఆడపిల్లలే పెట్టుబడిగా వ్యభిచార గృహాలు నడుపుతున్నారు. దీనికోసం మహిళల అక్రమ రవాణా, అవయవాల కోసం మానవ అక్రమ రవాణా సాగిస్తున్నారు. దోపిడీ విస్తృతంగా పెరుగుతున్న నేపథ్యంలో ఎన్నో ఘోరాలు జరుగుతున్నాయి. ఎందరో మోసపోతున్నారు. ఇలా తీసుకెళ్ళిన వారిని బానిసలుగా, దొంగలుగా మార్చేస్తున్నారు. మహిళలు లైంగిక అకృత్యాలకు నెట్టబడుతున్నారు. పేదరిక బలహీనతతో రకరకాలుగా మభ్యపెడుతున్నారు. మరెన్నో రకాలుగా హింసిస్తున్నారని ఐక్యరాజ్యసమితి నిర్వహించిన అధ్యయనాలే చెబుతున్నాయి. ఈ పరిస్థితులు పేద, మధ్యతరగతి కుటుంబాలలో ఎక్కువగా కనబడుతున్నాయి.

అందుకే జనవరి 11న మానవ అక్రమ రవాణా బాధితుల దుస్థితి గురించి అవగాహన పెంచడం, అలాగే వారి హక్కులను ప్రోత్సహించడం, రక్షించడం లక్ష్యంగా.. ప్రభుత్వాలు, అధికారులు పనిచేయాలి.

  • ఎలా ఇలా..?!

బయటకు వెళ్ళి మళ్ళీ ఇంటికి రాలేదనే మిస్సింగ్‌ కేసుల్లో ఎక్కువమంది అక్రమ రవాణాకే గురవుతున్నారు. అంతేకాదు.. పేదరికం, చదువు లేకపోవడం, నిరాధార కుటుంబాలు తప్పని పరిస్థితుల్లో ఈ దళారీల చేతుల్లో పడుతున్నారు. ఎంత చేసినా ఎదుగూ బొదుగూ లేని జీవితాలని విసిగిపోయి దుబారులాంటి గల్ఫ్‌ కంట్రీస్‌కి ప్రయాణమవుతున్నారు. అక్కడికెళ్ళాక తెలుస్తుంది దూరపుకొండలు నునుపని. తక్కువ జీతాలకు గొడ్డుచాకిరీ చెయ్యాల్సిన దుస్థితి.

  • చిన్నారులనూ..

ఇదిలా ఉంటే.. చిన్నారులనూ వదలడం లేదు. స్కూల్లో.. ఆట స్థలాల్లో.. ఎక్కడ వీలైతే అక్కడ మాయం చేస్తున్నారు. అవయవాలు అమ్ముకోవడం, నిర్దాక్షిణ్యంగా వారి శరీర భాగాలు తీసేసి, అడుక్కునేవారిగా చేయడం, దొంగలుగా మార్చడం, సెక్స్‌వర్కర్స్‌గా హింసించడం. చిన్నపిల్లలనే బలవంతంగా వివాహం చేసుకోవడం.. ఒకటేమిటి.. ఎన్నెన్నో అకృత్యాలు నిత్యం మనకు కనిపిస్తున్నాయి.. వినిపిస్తున్నాయి. మరి, బాల కార్మికుల చట్టాలేం చేస్తున్నాయో తెలీని పరిస్థితి.

  • గణాంకాలు..

మనదేశంలో అయితే ప్రతి ఎనిమిది నిమిషాలకు ఒక చిన్నారి మిస్‌ అవుతుందని నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో ఇన్వెస్టిగేషన్‌ (ఎన్‌సిఆర్‌బి) ప్రకటించింది. వారిలో 40 శాతం మంది వరకూ ఆచూకీనే దొరకడం లేదని ప్రభుత్వ గణాంకాలే చెబుతున్నాయి. ఎంత దయనీయ పరిస్థితిలో ఉన్నాం. సెక్స్‌వర్కర్స్‌గా ఉన్నవారిలో ఐదు నుంచి పద్దెనిమిది సంవత్సరాల లోపువారు నలభై శాతం పైనే ఉన్నారు. చాలా మంది పిల్లలు గణంకాలకే దొరకడంలేదు.

  • మహిళలు..

వెనుకబడిన ప్రాంతాలకు చెందిన మహిళలు ఎక్కువగా ఈ అక్రమ రవాణా ఊబిలో కూరుకుపోతున్నారు. ఒంటరి మహిళలు త్వరగా ఈ ట్రాక్‌లో చిక్కుకుంటున్నారు. కొందరు తమ జీవితాలను నాశనం చేసుకోవడమే కాక ఇతర స్త్రీలు, పిల్లలను రవాణా చేయడంలోనూ పాలుపంచుకుంటున్నారు. వ్యభిచార గృహ ఏజంట్లుగా, పనులు చూపించే బ్రోకర్లుగా, పెళ్ళి సంబంధాలు కుదర్చడంలాంటి వ్యవహారాలు జరపడం ద్వారా మానవత్వాన్ని మర్చిపోతున్నారు.

  • యువకుల్లోనూ..

పెరిగిన టెక్నాలజీ ఎంత శాతం మనకు ఉపయోగపడుతుందో తెలీదుగానీ.. ఆ ప్రభావం మాత్రం యువకులను నిర్వీర్యం చేస్తుంది. మత్తుకు బానిసలవుతున్నారు. డబ్బు మాయలోపడి స్పా, మసాజ్‌ సెంటర్లలో పనిచేస్తున్నారు. ఫలితంగా వ్యభిచార ఊబిలో కూరుకుపోతున్నారు. అక్రమ రవాణాలో ఇరుక్కుంటున్నారు. వీటికి బాధ్యత ఎవరిది..? విద్య, ఉద్యోగ అవకాశాలు సరిగా ఉంటే ఈ పరిస్థితి ఏర్పడదు కదా!

  • అవయవాల దోపిడీ..

అవయవాల అక్రమరవాణా అనేది ఒక వ్యవస్థీకృత నేరం. దీనిలో పరిస్థితుల ప్రభావం వల్ల గానీ, బలవంతం పెట్టడం ద్వారాగానీ, అసలు వ్యక్తికి తెలియకుండానే.. ఈ అవయవాల దోపిడీ జరుగుతోంది. దీనికి పిల్లలు, వలస కార్మికులు, నిరాశ్రయులు, నిరక్షరాస్యులు ఎక్కువగా బలవుతున్నారు. ఈ సస్యశ్యామల దేశంలో అవయవాలను అమ్ముకుని, కుటుంబాలను పోషించుకోవాల్సిన దుస్థితి ఎందుకెదురవుతోంది..? ప్రభుత్వ నిధులు ఎవరికందుతున్నాయి?

  • ఎక్కడ.. ఏమిటి ..?!

నేపాల్‌, బంగ్లాదేశ్‌లలో అక్రమ రవాణా పెద్దఎత్తున జరుగుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. కేవలం లైంగిక వ్యాపారం కోసం ఏటా 12,000 – 50,000 మంది మహిళలు, మైనర్‌ బాలికలను అక్రమంగా రవాణా చేస్తున్నారని ఎన్‌జీఓల అంచనా. రాజస్థాన్‌, అసోం, మేఘాలయ, బీహార్‌, ఉత్తరప్రదేశ్‌, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రలలో ఎక్కువగా మైనర్‌ బాలికలను ఎంపిక చేసుకుంటున్నారు. ఢిల్లీ, గోవా ప్రధాన కేంద్రాలుగా రవాణా జరుగుతున్నట్లు ఎన్‌సిఆర్‌బి సమాచారం.

  • అంతర్జాతీయ విపత్తు..

ఈ అక్రమ రవాణా మన దేశానికే పరిమితం కాలేదు. ప్రపంచం యావత్తూ అలుముకుంది. ఇదొక తీవ్ర సామాజిక విపత్తుగా మారింది. బాధితులను మభ్యపెట్టి, నమ్మించి వారి ఇష్ట ప్రకారమే వెళ్ళినా.. అది మానవ హక్కుల ఉల్లంఘనే. ఆ ఉద్దేశ్యంతోనే మానవ అక్రమ రావాణా అరికట్టేందుకు చట్టాలూ పుట్టాయి. కానీ పుట్టిన చట్టాలు పురిటిలోనే ఉన్నాయి. మత్తు పదార్థాలు-నేరాల నిరోధక కేంద్రం (యుఎన్‌ఓడిసి) నివేదిక 2020-2022లో గణాంకాలను పరిశీలించి, ఒక నివేదిక విడుదల చేసింది. దాని ప్రకారం అక్రమ రవాణా 28 శాతం పెరిగిందని తేలింది. బాధితుల్లో 44 శాతం మంది చిన్నారులేననీ చూపుతోంది.

  • స్వచ్ఛంద సంస్థల చేయూత..

అక్రమ రవాణా ద్వారా వ్యభిచారంలోకి నెట్టబడిన మహిళలు ఏదో ఒక విధంగా బయటికొచ్చినా భయంగానే జీవితాలను గడుపుతున్నారు. అటువంటి వారికి ‘షాహీన్‌, ప్రజ్వల, మై ఛాయిస్‌, రెడ్స్‌’ వంటి తదితర స్వచ్ఛంద సంస్థలు చేయూతనిస్తున్నాయి. బాధితుల కన్నీరు తుడిచి, ధైర్యం చెబుతున్నాయి. నష్టం జరిగిన తర్వాత ఎంత చేయూతనిచ్చినా ఏమి ప్రయోజనం..?! ప్రభుత్వాలు అలసత్వం వహించినంత కాలం.. ఎన్ని సంస్థలు, ఎన్ని సంఘాలు పూనుకున్నా ఉడుత సాయమే అవుతుంది. మరేం చేయాలి అంటే.. చట్టబద్ధ నిర్మూలనే దీనికి పరిష్కారం. అవగాహన కల్పించడంతో వీటికి ప్రధానంగా అడ్డుకట్ట వేయగలమనేది నిపుణులు చెప్తున్న మాట.

  • చట్టాలు ..

భారత రాజ్యాంగం ప్రకారం ‘అనైతిక రవాణా నివారణ చట్టం’ అని ఆర్టికల్‌ 23(1)ని 1956లోనే తీసుకొచ్చారు. లైంగిక వేధింపులు, అశ్లీలత వంటి నేరాల నుండి పిల్లలను కాపాడడానికి, వాణిజ్యపరమైన లైంగిక దోపిడీని నిరోధించడానికి 2012లో పోక్సో (పిఓసిఎస్‌ఓ) చట్టం ఉంది. ఐరాస కూడా ఈ సంవత్సరం ‘బాధితులను ఎవ్వరినీ వదలకుండా కలవండి’ అనే లక్ష్యాన్ని ముందుకు తీసుకొచ్చింది. అదే లక్ష్యం దిశగా చట్టాల అమలు చిత్తశుద్ధితో జరుగుతుందని ఆశిద్దాం.

 

  • పద్మావతి, 94900 99006
➡️