మమతానుబంధాలు

story on sankranti festival

సందడులే.. సందడులే.. సంక్రాంతి సందడులే.. ఊరూరా.. ఎక్కడ చూసినా.. ఎక్కడ విన్నా.. సంక్రాంతి సంబరాలే.. సంబరాలు.. సాంస్కృతిక వైభవాలు.. సంక్రాంతి అనగానే కళకళలాడే పల్లెలే కనుల ముందు నిలుస్తాయి. రంగు రంగుల రంగవల్లులు.. గాలిపటాలు.. కోడి పందేలు.. ప్రకృతితో సహజీవనం చేసే అసలైన పండుగ సంక్రాంతి. కొత్త పంటలు, వంటల గుభాళింపులు, పల్లెటూరిలోని పైరుల అందం.. గుమ్మాల్లో మామిడితోరణం.. అంబరాన్ని తాకేలా పతంగుల విహారం.. తెలుగు లోగిళ్లలో రంగవల్లుల హారం.. హరిదాసుల మధుర గీతం.. బసవన్నల సుందరనాట్యం.. అవధుల్లేని కోడిపందాల జోరు.. కొత్త అల్లుళ్లు.. కోడళ్లు హొయలు.. అందరి జీవితాల్లో వెలుగులే సంక్రాంతి అనుబంధాలు.. ఆత్మీయతల్ని పెంచే పండుగల్లో ముఖ్యమైంది కూడా..! తెలుగు ప్రజల సంస్కృతీ, సంప్రదాయాలకు ప్రతీక. ప్రతి ఇల్లూ ధాన్యపు రాశులతో కళకళలాడతాయి. ‘మా ఇంటికి రండి..’ అంటూ ఆహ్వానించే గొబ్బెమ్మలు.. ముంగిటలో ఇంద్రధనుస్సును తలపించే రంగవల్లులు.. భోగిమంటలు.. బొమ్మల కొలువులు.. చిరునవ్వులు చిందిస్తూ భోగిపండ్లు పోసుకునే చిన్నారులు, ఆటలు, పాటలు, కోలాటాలు సందళ్లతో పండగ జరుపుకుంటారు. నేడు సంక్రాంతి సందర్భంగా ప్రత్యేక కథనం..

ఆచార, వ్యవహారాల సమ్మేళనాల్లో భాగమైన పండుగలే మనుషులకూ, సమాజానికి మధ్య అనుబంధాల వారధులు. డబ్బే ప్రధానం కాకుండా, వ్యవసాయం, రైతు, ప్రకృతి సమన్వయం చేసుకునే పలు వృత్తుల అనుసంధానం కూడా వీటిలో భాగమే. భిన్నత్వంలోని ఏకత్వానికి అద్దం పడుతూ ఆయా కాలాలు, ప్రాంతాలు ప్రజల ఆచార సాంప్రదాయాలకు ప్రతిబింబంగా నిలుస్తాయి. కలిసి మెలిసి బతికేలా తరతరాల బంధాలకు అర్థం చెబుతూ ఊళ్లకు ఊళ్లు సందోహంగా కదిలే సాంస్కృతిక సంబరానికి ఆనవాళ్లే సంక్రాంతి సంబరాలు. కుల, మత, ప్రాంతీయ భేదాలకు అతీతంగా అందరూ కలిసి చేసుకునేది ఈ పెద్ద పండుగలోనే. కొన్నిచోట్ల నెలరోజుల ముందుగానే సంబరాలు మొదలవుతాయి. వీటిలో అణువణువునా కుటుంబాల్లో ఐక్యత..అడుగడుగునా జాతీయ సమైక్యత పరిఢవిల్లుతుంది. పెద్దలు.. పంటలు.. పశువుల పండుగగా కూడా సంక్రాంతిని పిలుస్తుంటారు. కుటుంబం మొత్తానికి అంటే చిన్నా-పెద్దా, ఆడా-మగా, పిల్లా-మేక, పక్షీ-పశువూ.. సమస్త మానవాళికి సంబంధించిన పండుగ. ఉషోదయాన్నే హరిదాసుల కీర్తనలు.. డూడూ బసవన్న అంటూ గంగిరెద్దులవాళ్ల దీవెనలు.. ఇంటిముందు అందమైన రంగవల్లులు.. గొబ్బెమ్మలు.. భోగిమంటలు.. వేకువజామునే జంగమ దేవరల జే గంటలు.. ఢమరుక నాదాలూ.. పిట్టలదొరల బడాయి మాటలు.. తెలుగు లోగిళ్లలో కొత్త వెలుగులు నింపే సంక్రాంతికిదే నిదర్శనం. దేశ విదేశాల్లో ఉన్న వాళ్లను సైతం సొంత ప్రాంతాలకు రప్పించేది సంక్రాంతి మాత్రమే. ఆకాశమంత ఆనందం. భూమండలమంత సంతోషం.. జత కలిస్తే ఎలా ఉంటుందో సంక్రాంతి కూడా అలాగే ఉంటుంది. పతంగుల కోలాహలం.. కోడిపందేలా జోరు సంక్రాంతిలో ప్రత్యేక ఆకర్షణగా చెప్పొచ్చు. కొత్త కోడళ్లు, అల్లుళ్లు.. ఆట పట్టించే మరదళ్లు.. బంధుమిత్రులతో ఇళ్లన్నీ కళకళలాడుతూ ఉంటాయి.

హరిదాసులు ప్రత్యేక ఆకర్షణ

తొలిపొద్దులో మంచుతెరలు తొలగకముందే శ్రావ్యసంగీతంతో వినసొంపైన సంకీర్తనలు పాడుకుంటూ ఊరందరినీ మేలుకొల్పేది హరిదాసులే. నెత్తిన అక్షయ పాత్ర, ఒక చేతిలో చిడతలు, మరో చేతిలో సితార, మెళ్లో రంగురంగుల కాగితపు పూల దండలు అలంకరణలతో అలరిస్తుంటారు. ప్రతి లోగిళ్లనూ వీరి పలకరింపులతో కొత్త అందాన్ని తీసుకొస్తారు.

అభ్యుదయమే సంక్రాంతి

పుష్యమాసంలో సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించే పుణ్యదినాన్ని తెలుగు వారు సంక్రాంతిగా జరుపుకొంటారు. ‘సం’ అంటే మిక్కిలి ‘క్రాంతి’ అంటే అభ్యుదయం అని అర్థం. మంచి అభ్యుదయాన్నే ఇచ్చే క్రాంతి కాబట్టి దీన్ని ‘సంక్రాంతి’గా పేర్కొన్నారు. సూర్యుడు నెలకొక రాశిలోకి మారుతున్నందున ఏడాదికి 12 సంక్రాంతులు వస్తాయని పెద్దలు చెబుతారు.

భోగి :

సంక్రాంతికి ముందురోజు వచ్చే పండుగ. ప్రతిఒక్కరూ తెల్లవారుజామునే లేచి తలస్నానాలు చేస్తారు. సూర్యోదయానికి ముందే భోగిమంటలు వేస్తారు. పాత సామాన్లు అన్నీ తీసుకొచ్చి మంటల్లో వేస్తారు. కొత్తదనానికి, ఆనందానికి, అభ్యుదయానికి చిహ్నంగా ఈ పండుగను భావిస్తారు. చలిని తొలగించటం, నూతన జీవితం ప్రారంభించటానికి గుర్తుగా భోగి మంటలు వేస్తారు. పిల్లలకు తలపై రేగిపండ్లు పోస్తారు. గుమ్మడికాయతో వంటకాలు చేయటం మరో ప్రత్యేకత. కొత్తధాన్యంతో పరమాన్నం చేస్తారు.

సంక్రాంతి :

పెద్ద పండుగగా జరుపుకుంటారు. కళకళలాడే పంట పొలాలు, ఇంటికి వచ్చే ధాన్యపు దిగుబడులతో అన్నదాత ఎంతో సంతోషంగా ఉంటారు. శ్రమ సంపదకు గొప్ప స్థానమిచ్చే ఈ పండుగను పేద, ధనిక అనే తేడా లేకుండా అందరూ జరుపుకుంటుంటారు. కొత్త దుస్తులు ధరిస్తారు. దానాలు చేస్తుంటారు.

కనుమ :

ఏడాదంతా శ్రమించిన మూగజీవాలకు రైతులు పూజలు చేస్తారు. పశుపక్ష్యాదుల కోసం ఇంటి గుమ్మానికి ధాన్యం కంకులు కడతారు. వివిధ నైవేద్యాలు చేసి గ్రామదేవతలను పూజిస్తారు. కనుమకు మినుములు తినాలని నానుడి. అందుకే గారెలు చేస్తారు. ఒంటికి వేడి సమకూరుతుందని భావన.

క్రిమికీటకాలు మాయం

హేమంత రుతువులో భూమి సూర్యునికి దూరంగా జరగటం వల్ల వాతావరణం చల్లగా ఉండి, క్రిమికీటకాలతో వ్యాధులు ప్రబలే అవకాశం ఉంటుంది. దానిని నివారించటానికి ఇంటి ముంగిళ్లలో పేడనీళ్లు చల్లి, గుల్ల సున్నంతో ముగ్గులేయటం వల్ల సున్నంలోని క్యాల్షియం క్రిమికీటకాల సంహారిణిగా తోడ్పడుతుంది. వంగి ముగ్గులేయటం వల్ల శరీరానికి వ్యాయామం అవుతుంది. గతంలో ఎప్పుడో విన్న, చూసిన ముగ్గులను గుర్తుకు తెచ్చుకుంటూ తిరిగి వేయటం ద్వారా ధారణ శక్తి పెరుగుతుందని పెద్దలు చెబుతారు.

పల్లెగూటికి పండుగొచ్చింది

దేశంలోని అన్ని ప్రాంతాల్లో సంక్రాంతి వేడుకలు ఎంతో వైవిధ్యంగానూ, విభిన్నంగానూ జరుపుకోవటం తెలిసిందే. ఈ ఏడాది జనవరి 14 నుంచి 16 వరకూ మూడురోజులపాటు ఈ పండుగ జరుగుతుంది.

తెలుగు రాష్ట్రాల్లో :

భోగి, మకర సంక్రాంతి, కనుమ పండగకు ఎంతో విశిష్టత ఉండటంతో ఎంతో వైభవంగా జరుపుకుంటారు. కొన్ని ప్రదేశాల్లో ముక్కనుమగా చేస్తుంటారు. తెలుగు లోగిళ్లలో భోగి మంటలు, రంగురంగుల రంగవల్లులు, వాటి మధ్య గొబ్బెమ్మలు, హరిదాసుల కీర్తనలు, కుర్రకారు కేరింతలు, పల్లెపడుచుల అందాలు, కోడిపందేలు, ఎడ్ల పందాలు ఎంతో హుందాగా జరుపుకుంటారు. పట్టణాలకు వలస వెళ్లిన ప్రతిఒక్కరూ తమ పల్లెటూర్లకు చేరుకుంటారు.

రైతు ఇంట సందడి

యాంత్రీకరణ పెరిగినా సన్న, చిన్నకారు రైతులు పశువులను పెంచుతున్నారు. పల్లెల్లో నేటికీ పంట ఉత్పత్తుల చేరవేసేందుకు, దుక్కులు చేసుకొనేందుకు ఎద్దులు, ఎడ్ల బండ్లనే వినియోగిస్తున్నారు. తమ జీవనంతో విడదీయరాని అనుబంధం ఉన్న పశువులకు కూడా సంక్రాంతి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

పిండివంటల ఘుమఘుమలు

షుడ్రుచుల విందు భోజనాలు, సంప్రదాయ పిండి వంటలు సంక్రాంతిలో భాగం. వారం పదిరోజుల ముందు నుంచే పిండి వంటల హడావుడి కనిపిస్తుంది. పల్లెల్లో ఏ ఇంట చూసినా వంటకాల తయారీనే సాక్షాత్కరిస్తుంది. అరిసెలు, బూరెలు, కారప్పూస, చెక్కలు, పూర్ణాలు, బొబ్బట్లు, లడ్డూలూ, కజ్జికాయలు, బూందీ వంటి వంటకాల తయారీలో మహిళలు బిజీగా ఉంటారు.

పల్లెపాటలు.. జనుల హాస్యాలు

కల్లా కపటం లేని బతుకులతో, పరస్పరం సాయం చేసుకునే బుద్ధులతో, అన్నా, మామా, అత్తా, అన్న వరసలతో పల్లె అంతా ఒక్క కుటుంబంగా కనబడేదీ సంక్రాంతిలోనే. పల్లె జనుల హాస్యాలు, సరసాలు, ప్రోత్సాహాలు, అన్నీ అమాయక ధోరణిలో ఎంతో ఆహ్లాదాన్ని కల్గిస్తుంటాయి. చక్కని సహజ ధోరణిలో పల్లెపాటలు, మాటలు గ్రామీణ జీవనంలో భాగమై పెనవేసుకుని ఉంటాయి. ‘కడివెడు నీళ్లూ కళ్ళాపి చల్లి గొబ్బిళ్లోరు.. గొబ్బిళ్లూ’ అని కాళ్ల మువ్వలు ఘల్లు ఘల్లుమనగా గొబ్బి తట్టే ఉషారైన ఆడపిల్లలూ, పాడిచ్చే గోవులకు పసుపూ, కుంకుమ, పనిచేసే బసవనికీ పత్రీ పుష్పం’ అంటూ పాటలు వినిపిస్తాయి. ‘సంక్రాంతి అంటే సందళ్ల పుట్ట.. సరదాల గుట్ట.. జ్ఞాపకాల తుట్టె’ అని ఓ సినీకవి అన్నారు. పొలాలనన్నీ హలాల దున్నీ, ఇలాతలంలో హేమంపిండగ, జగానికంతా సౌఖ్యం నిండగ, విరామమెరుగక పరిశ్రమించే’ అంటూ శ్రీశ్రీ రైతు శ్రమ గురించి వివరించారు. గొబ్బెమ్మల చుట్టూ పిల్లలు చేరి గొబ్బి పాటలు, చేసే నృత్యాలు ఐక్యతా భావాన్ని-సమైక్యతా స్ఫూర్తిని ప్రస్ఫుటిస్తాయి. అరకు, పాడేరు వంటి ప్రాంతాల్లో కళాజాతర్లలో తుడుము, సన్నాయి వాయిద్యం, డప్పు కోలాటం, జంగాల పాటలు, ఉద్దానపు జానపదాలు, అభ్యుదయ గీతాలు, రేలా రేలా రే జానపదాలు, బుర్రకథ, కూచిపూడి నృత్యం, నాగిని డ్యాన్స్‌, ఎరుకల వారి సోది, మిమిక్రీ వంటి కళారూపాలు సమ్మోహితుల్ని చేస్తాయి.

కోడిపందేలకు గోదావరి జిల్లాలు

రాష్ట్రంలోనే పెద్దమొత్తంలో ఉభయగోదావరి జిల్లాల్లో కోడిపందేలు జరుగుతాయి. కొన్ని జిల్లాల్లో ఎద్దులు, కబడ్డీ, పందుల పోటీలతో పాటు కొన్ని స్వచ్ఛంద సంస్థలు నిర్వహించే పరుగు పందేలు, ముగ్గుల పోటీలు, కుర్చీలాట.. రకరకాల పోటీలు పండగ సందర్భంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఉభయ గోదావరి జిల్లాల్లోని పందెం పుంజులకూ డిమాండ్‌ భారీగానే ఉంటుంది. కాకి, డేగ, నెమలి, పచ్చకాకి, సేతువ తదితర జాతులు, వివిధ రంగుల్లో వీరి వద్ద అందుబాటులో ఉన్నాయి. పుంజు రంగు, ఎత్తు, బరువును బట్టి ఒక్కో పుంజు మూడువేల నుంచి పది వేల రూపాయల వరకు ధర పలుకుతున్నాయి. భీమవరం, నరసాపురం, కైకలూరు, కంకిపాడు వంటి ప్రాంతాల్లో జరిగే పోటీల్లో సినీ ప్రముఖులు సైతం సందడి చేస్తుంటారు. క్రీడాప్రాంగణం, జనసందోహం, తినుబండారాల దుకాణాలు, సాంస్కృతిక కార్యకలాపాలు వంటివన్నీ జాతర వాతావరణాన్ని తలపిస్తాయి.

వివిధ రకాల పోటీలు

కృష్ణాజిల్లాలోని గుడివాడలో ఏటేటా జాతీయస్థాయి ఎడ్లు, గొర్రె పొట్టేళ్ల పోటీలు నిర్వహిస్తుండటం తెలిసిందే. ఎన్టీఆర్‌ జిల్లాలో నందిగామలో, రాయలసీమ కర్నూలు, కడప జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో సంక్రాంతి సందర్భంగా రాతి దూలం లాగుడు పోటీలు నిర్వహిస్తారు. చిత్తూరు జిల్లాలో డిసెంబరు 20 నుంచే కబడ్డీ పోటీలు మొదలవుతాయి. కులాలవారీగా వీటిని నిర్వహించడం కనపడుతుంది. పశువుల పండగ అని పిలిచే జల్లికట్టును ఆంధ్రా, తమిళనాడు సరిహద్దు గ్రామాల్లో ముఖ్యంగా ఎనిమిది నియోజకవర్గాల్లో నిర్వహిస్తారు. రాష్ట్ర నలుమూలల నుంచి వేల సంఖ్యలో ప్రజలు వస్తారు. కోనసీమ కోడిపందేలు తర్వాత ఈ జల్లికట్టుకు విశేష ఆదరణ లభిస్తోంది.

గుర్రాల పోటీలూ

విశాఖ జిల్లాలో దేశవాళీ ఎడ్లతో మైసూరు జాతికి చెందిన ఎద్దుల పోటీలు జరుగుతాయి. కె. జె.పురం, చోడవరం, కొత్తపెంట, వేచలం, చీడికాడ, కొత్తపల్లి తదితర గ్రామాల్లో తేలికపాటి బళ్లను లాగుతూ అత్యంత వేగంగా పరుగెత్తే ఎద్దు పోటీలకు ఆదరణ ఉంది. అచ్యుతాపురం, పరవాడ, చోడవరం, లక్కవరం తదితర గ్రామాల్లో గుర్రం పెంపకందార్లు ఉండటంతో గుర్రపు పోటీలు కూడా నిర్వహిస్తున్నారు. అనకాపల్లి సమీపంలోని బొజ్జన్న కొండ కనుమరోజున జనంతో కిటకిటలాడుతుంది. రాష్ట్రంలోని చాలా బౌద్ధారామాలు సంక్రాంతి రోజుల్లో సందర్శక కేంద్రాలుగా కళకళలాడతాయి.

కోనసీమలో ప్రభలకు ఆదరణ

కోనసీమలో ఊళ్లకు ఊళ్లు కలిసి చేసుకునే ‘ప్రభల ఉత్సవం’ 400 సంవత్సరాల నుంచి కొనసాగుతోంది. కొత్తపేట, జగ్గన్నతోట, వాకలగరువు, పల్లెపాలెం (ముమ్మిడివరం మండలం), చెయ్యేరు (కాట్రేటికోన మండలం) ప్రభల ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి. మొసలపల్లి, పాలగుర్రు, ముక్కామల, లేదులూరు, ఇరుసుమండ, వ్యాఘ్రేశ్వరం, గంగలకుర్రు, పెదపూడి, గంగలకుర్తి అగ్రహారం, పుల్లేటికుర్తి, వక్కలంక గ్రామాల నుంచి ‘ఏకాదశ రుద్రుల’ పేరుతో ప్రభలు వస్తాయి. అంబాజీపేట మండలం మొసలపల్లి నుంచి మొదటిప్రభ ముందుగా సందర్శనా స్థలానికి చేరుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ప్రతి ఏడాది సంక్రాంతి పండుగ మరుసటి రోజు కనుమనాడు ఈ ఉత్సవం నిర్వహిస్తారు.

సినిమాల్లోనూ..

సంక్రాంతి పేరుతో సినిమాలు కూడా వచ్చాయి. సంక్రాంతి, ఊరూర సంక్రాంతి, పల్లెగూటికి పండగొచ్చింది వంటివి. ‘సందళ్లే.. సందళ్లే.. సందళ్లే’ అంటూ శతమానంభవతి సినిమాలో పాట ఉత్సాహంగా సాగుతుంది. చాలా సినిమాల్లో సంక్రాంతిపై పాటలు ఉన్నాయి. పండగ ప్రాముఖ్యత తెలియజేస్తూ జానపదాలు కోకొల్లలు.

సెలవుల్లో టూర్లు..

పిల్లలకు ఎక్కువ రోజులు సెలవలు రావటంతో పెద్దలు విహార యాత్రలకు సంక్రాంతి సెలవురోజుల్లో వెళ్తుంటారు. విదేశాల నుంచి ప్రవాస భారతీయులు (ఎన్‌ఆర్‌ఐ) కూడా వస్తుంటారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రవాస భారతీయ తెలుగు సంఘాల (ఎపిఎన్‌ఆర్‌టిఎస్‌) కోసం తిరుపతి, శ్రీకాళహస్తి, సింహాచలం, అన్నవరం, దుర్గగుడి తదితర ప్రాంతాల్లో దర్శనం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్టీసీ ద్వారా ప్రత్యేక సర్వీసులు కూడా దూరప్రాంతాలకు నడుపుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 6,795 ప్రత్యేక బస్సులను సాధారణ ఛార్జీలతోనే నడుపుతోంది. ప్రయివేటు ఆపరేటర్లపై నియంత్రణ లేకపోవటంతో డబుల్‌ ఛార్జీలు వసూలు చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. పండుగ రద్దీని దృష్టిలో పెట్టుకుని, దక్షిణమధ్య రైల్వే జనవరి 10 నుంచి 15వ తేదీ వరకూ ప్రత్యేక రైళ్లను నడుపుతుంది.

విదేశాల్లో ..

చదువు, వృత్తి, ఉద్యోగాల కోసం అమెరికా, జపాన్‌, జర్మనీ, నెదర్లాండ్స్‌, కెనడా, ఆస్ట్రేలియా, మలేషియా, సింగపూర్‌ వంటి దేశాలతోపాటు ఉపాధి పనులకు కోసం గల్ఫ్‌ దేశాలకు వెళ్లిన తెలుగు వారు కూడా ఆయా ప్రాంతాల్లో సంక్రాంతి జరుపుకుంటుంటారు. మనదేశంలో గంగాసాగర్‌, హరిద్వార్‌, ప్రయాగ, నాసిక్‌, ఉజ్జయిని వంటి ప్రదేశాల్లో మతవిశ్వాసాలతో పోటెత్తినట్లే మలేషియా, నేపాల్‌, బంగ్లాదేశ్‌, శ్రీలంక, కాంబోడియా వంటి దేశాల్లోనూ వాతావరణం ఉంటుంది.

అమెరికా : తెలుగు ప్రజలున్న అన్ని ప్రాంతాల్లో సంక్రాంతిని సంబరంలా కళాత్మకంగా, సాహితీ సాంస్కృతిక కార్యక్రమాలతో ఎంతో వైభవంగా జరుపుకుంటున్నారు. తెలుగు సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించే వేడుకల్లో ఇతర మతాలకు చెందినవారు కూడా ఉత్సాహంగా పాల్గొంటారు.

నేపాల్‌ : మాఘె సంక్రాంతిగానూ, మరికొన్ని చోట్ల కిచిరి సంక్రాంతి అని కూడా పిలుస్తారు. సాగర సంగమ ప్రదేశాల్లోనూ పుణ్యస్నానాలు చేస్తారు. భాగమతి, గండకి, నారాయణినదులు, దేవఘాట్‌, కాళీగండకీ, కోశి నదుల్లో పవిత్ర స్నానాదులు ఆచరిస్తారు. లడ్డు-నెయ్యి-రత్నపురి దుంప కలిపి చేసిన స్వీట్‌ ఇక్కడ ప్రధాన వంటకం.

బంగ్లాదేశ్‌ : పౌష్‌ సంక్రాంతి లేదా సంక్రెయిన్‌గా పిలుస్తారు. ఘౌరి ఉత్సబ్‌గా ఢాకాలో ఏటా పతంగుల పండుగ ఘనంగా నిర్వహిస్తారు. రాత్రిళ్లు బాణాసంచా కాల్చుతారు.

శ్రీలంక : సూర్యప్రకరణ్‌గా రైతులంతా భూమాత, సూర్యుడికి పూజలు చేస్తారు. థారు నెలలో వచ్చే పండుగైనందున థారు పొంగల్‌గా పిలుస్తారు.

పాకిస్తాన్‌ : తిర్‌మూర్‌ పండుగగా పిలుస్తారు. తల్లిదండ్రులు పెళ్లయిన కూతుర్లకు స్వీట్లు పంపిస్తారు.

కాంబోడియా : మోహసాంగ్‌క్రాన్‌గా పంటలు వచ్చే ఏప్రిల్‌ నెలలో 14 నుంచి 16 వరకూ వేడుకలు చేసుకుంటారు.

థాయ్ లాండ్‌, వియత్నాం : హిందువులు, భౌద్ధులు కూడా కలివిడిగా వేడుకలు చేసుకుంటారు.

గంగిరెద్దుల మేళాలు

‘అయ్యగారికి, అమ్మగారికి దండం పెట్టు’ అంటూ గంగిరెద్దులను ఆడించేవారు, పిట్టల దొరలు, విచిత్ర వేషధారులు వంటి కళాకారులంతా ఈ పండుగ దినాల్లో వచ్చి తమ కళలలను ప్రదర్శిస్తుంటారు. ఎవరికి వారు ఇచ్చే కానుకలను స్వీకరిస్తూ, చివరగా ఒక పాత వస్త్రాన్ని ఇమ్మని కోరి, భుజాన వేసుకుని ‘సుభోజ్యంగా ఉండాలమ్మా’ అంటూ దీవించి వెళతారు. కళాకారులెవ్వరినీ ఉట్టి చేతులతో పంపకుండా తమకున్న దాంట్లోనే దానంగా ఇచ్చి పంపుతుంటారు. పిట్టల దొరల బడాయిలు, కొమ్మదాసర్లు, బుడబుక్కల మేళాలు, భట్రాజులు, జంగం దేవర్ల సందళ్లు చెప్పనలవి కాదు. లయబద్ధంగా సాగుతున్న పాటకు అనుగుణంగా జానపదులు గుంపులుగా వేసే కోలాట బృందాలు చూడముచ్చటగా సాగుతూ ఆకట్టుకుంటాయి.

వివిధ రాష్ట్రాల్లో..

కర్ణాటక : ఉడిపిలోని కృష్ణుడు ఆలయ క్షేత్రంలో వేడుకలు కోలాహలంగా నిర్వహిస్తుంటారు. గర్భగుడిలో కృష్ణుడిని కిటికీల్లో నుంచి చూస్తుంటారు. గ్రామాల్లో కంబాల పోటీలు నిర్వహిస్తారు. నువ్వులు, బెల్లం, కొబ్బరి, శెనగ పప్పుతో తయారుచేసిన ప్రసాదాన్ని దానంగా ఇస్తారు.

తమిళనాడు : మర్గలినెలలో 15 నుంచి 18 వరకూ పొంగల్‌, థారుపొంగల్‌, కానుం పొంగల్‌గా పిలుస్తారు. నాలుగు రోజులపాటు ఉత్సవాలు చేస్తారు. సూర్యుడికి ప్రత్యేక పూజలు చేస్తారు. పొంగిలి, చెరకు గడలను నైవేధ్యంగా పెట్టి పంచుతారు. జల్లికట్టు పోటీలు జరుగుతాయి.

ఉత్తరప్రదేశ్‌ : గంగానదిలో పవిత్ర స్నానాదులు, అలహాబాద్‌లో మాఘమేళ వంటివి జరుగుతాయి. పేదలకు దానాలు చేస్తారు. గుజరాత్‌ : పంటల పండుగగా స్నేహితులు, కుటుంబీకులకు బహుమతులు అందజేస్తుంటారు. గాలిపటాలను ఎగరేస్తారు.

పశ్చిమబెంగాల్‌ : గంగాసాగర్‌ ఉత్సవం ఆకట్టుకుంటుంది. సూర్యుడికి ప్రత్యేకపూజలుంటాయి.

రాజస్థాన్‌ : జైపూర్‌, జోద్‌పూర్‌లో పతుంగుల సంబరాలు జరుగుతాయి. లడ్డూలు, మూగ్‌ ఫాలి, గజక్‌, దాల్‌ పకోడి వంటి వంటకాలు చేసుకుని ఇంటిల్లపాదీ ఆనందిస్తారు.

మహారాష్ట్ర : నల్లరంగు దుస్తులు ధరిస్తారు. నువ్వులతో వివిధ వంటకాలు చేసుకుని తింటారు. పండుగ రోజున నువ్వులు, చెరకు దానం చేస్తుంటారు.

యువత సన్మార్గానికి..

యువతను సన్మార్గంలో పయనింప జేయటానికి మహిళా, యువజన సంఘాల ఆధ్వర్యంలో ఏటేటా సంక్రాంతి ఆటల పోటీలు జరుగుతున్నాయి. రాష్ట్ర, జిల్లా, మండల, నియోజకవర్గ స్థాయిల్లో ఈ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతి ప్రధానం చేస్తున్నాయి. పశ్చిమగోదావరి ఆకివీడు ప్రాంతంలో ఐదు దశాబ్దాల నుంచి యువజన సంఘం ఆటల పోటీలు నిర్వహిస్తోంది. ఆ ఆనవాయితీని ఇప్పుడు చాలా జిల్లాల్లో యువజన, మహిళా సంఘాలు కొనసాగిస్తున్నాయి. ఆటలు, పాటలు, ముగ్గులు వంటి సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. యువజన సంఘం ఆధ్వర్యంలో 1983లో ప్రారంభమైన ఈ వేడుకలు మొదట ఒకే ఒక క్రీడ చెడుగుడుతో ప్రారంభించారు. నేడు రాష్ట్రస్థాయిలో ఈ క్రీడలు 10 విభాగాలకు పైగా విస్తరించాయి. విజయవాడ కేంద్రంగా ఉన్న మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా సంక్రాంతి సంబరాలు వైభవంగా జరుగుతున్నాయి. బాలోత్సవాల సంబరాల్లో సంక్రాంతి వైభవాన్ని తెలిపే కళారూపాల ప్రదర్శనలు పెద్దఎత్తున సాగుతున్నాయి. జానపదాలు, కళారూపాలు కోకొల్లలుగా ఉన్నాయి. పాఠశాలలు, కళాశాలలు, విద్యాలయాల్లో సంక్రాంతిని భావితరాలకు తెలియజేసేలా ప్రభుత్వ, ప్రయివేటు సంస్థలు సంక్రాంతి సంబరాలను జరుపుతుండటం తెలిసిందే.

అందరూ తమ ఊళ్లకు వెళ్లి పండుగను బాగా జరుపుకుని తిరిగి తమ వలస గూటికి క్షేమంగా చేరుకోవాలని కోరుకుందాం..!

  • యడపల్లి శ్రీనివాసరావు, 9490099214
➡️