స్త్రీవిముక్తికి మార్గదర్శనం.. అక్టోబర్‌ విప్లవం..

The path to women's emancipation.. October Revolution..
  • ”మహిళలు సంపూర్ణ స్వేచ్ఛ పొందనంతవరకు శ్రామికవర్గం పూర్తిస్థాయి స్వేచ్ఛ పొందలేదు” అన్న లెనిన్‌ మాటలు మహిళా విముక్తి ప్రాధాన్యతను చాటిచెప్పే తిరుగులేని సత్యాలు. వీటినే ఆచరణలో చేసి చూపించారు. మహత్తర అక్టోబర్‌ విప్లవం తర్వాత ఆవిర్భవించిన సోవియట్‌ సోషలిస్టు రష్యాలో మహిళలు నేర్వని విద్య లేదు. రాణించని రంగం లేదు. ఆటలు దగ్గర నుంచి అంతరిక్షం వరకూ మహిళలు పురోగమించారు. నిరంకుశ జార్‌ ప్రభుత్వాన్ని కూలదోయడంలో వీరోచిత పాత్ర పోషించారు. ఆ తర్వాత అసమానతలకు తావులేని సమసమాజ నిర్మాణంలోనూ కీలకభూమిక వహించారు. ఆ విధంగా నవశకానికి నాంది పలికారు.

అక్టోబర్‌ విప్లవం ఎందరో వీరులనే కాదు, వీర నారీమణులను కూడా అందించింది. మహిళల పట్ల వివక్ష, అసమానతలను రూపుమాపే చట్టాలను తీసుకొచ్చింది. సామాజికోత్పత్తిలో స్త్రీ-పురుష శ్రమ విభజనలో, కుటుంబంలోనూ స్త్రీ వికాసానికి బాటలు వేసింది.స్ఫూర్తినిచ్చిన విధానాలు..విప్లవం వచ్చిన తొలి ఆరునెలల్లోనే బూజుపట్టిన భావాలకు పాతరేసి, ప్రగతిశీల చట్టాలను రష్యా తీసుకొచ్చింది. స్త్రీ-పురుష వివక్షకు తావులేని చట్టాలను తెచ్చింది. భూస్వామ్య విధానాన్ని రద్దు చేసింది. భూమిని పేద రైతులకు పంపిణీ చేసేలా తొలి ఉత్తర్వులను ఇచ్చింది. లెనిన్‌ సంతకం చేసిన ఈ ఉత్తర్వు మహిళా రైతులకూ భూమిపై సమానహక్కును కల్పించింది. అక్టోబర్‌ విప్లవానంతరం నవంబర్‌ 11వ తేదీన 8 గంటల పనిదినాన్ని ప్రవేశపెట్టే ఉత్తర్వునిచ్చింది. శ్రామిక మహిళలకు 16 వారాల కనీస ప్రసూతి సెలవును ప్రకటించింది. ప్రపంచంలోనే తొలిగా స్త్రీలకి నెలసరి సమయంలో ఐచ్ఛిక సెలవుని ఇచ్చింది. ప్రసూతి సదుపాయాల్ని మరింత విస్తృతం చేస్తూ 1918లో పసిబిడ్డలకు పాలిచ్చేందుకు తల్లులకు ప్రతి మూడు గంటలకోసారి విరామ సమయాన్ని కేటాయించింది. స్త్రీలకు సమాన వేతనాన్ని కల్పించేలా కనీసవేతన ఉత్తర్వు తెచ్చింది. స్త్రీలకు ఓటు హక్కు..సోషలిస్టు ప్రభుత్వం 1918లో తొలి రాజ్యాంగాన్ని స్వీకరించింది. స్త్రీలకూ ఓటు హక్కు కల్పించింది. అన్ని రంగాల్లోనూ స్త్రీలకు సమానహక్కు పొందేలా సంస్థాగత ఏర్పాట్లు చేసింది. బ్రిటన్‌ కరటే దశాబ్దం ముందే రష్యా మహిళలు ఓటు హక్కు పొందారు. అమెరికాలో స్త్రీలకు ఓటు హక్కు 1920లో లభించింది. నిర్బంధ విద్యావ్యాప్తికి కూడా ఉత్తర్వును జారీ చేసింది. భారత్‌లో అక్షరాస్యతా కార్యక్రమం చేపట్టి ‘ప్రతి ఒక్కరం ఇంకొకరికి బోధిద్దాం’ అన్న నినాదాన్ని సోషలిస్టు రష్యా 1919 డిసెంబర్‌లోనే చట్టంగా తెచ్చింది. దీంతో 20 ఏళ్లలో రష్యా స్త్రీలలో నిరక్షరాస్యత దాదాపుగా కనుమరుగైంది. ఇవన్నీ కుటుంబ చట్ట పరిధిలో తీసుకున్న విప్లవాత్మక చర్యలే. కుటుంబంలో నెలకొన్న పురుషాధిపత్యాన్ని, పాశ్చాత్య స్త్రీ వాదులు సవాల్‌ చేయడానికి కొన్ని దశాబ్దాల ముందే తొలి సోషలిస్టు ప్రభుత్వం పితృస్వామిక చట్టాలను, కుటుంబ కట్టుబాట్లను కూడా రద్దు చేసేసింది. ఈ విజయాల్ని సమీక్ష చేస్తూ లెనిన్‌ ‘మేం అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలో సాధించిన విజయాల్లో కనీసం వందోవంతైనా ప్రపంచంలోని ఏ ఒక్క ప్రజాతంత్ర పార్టీగానీ, ఎంతో పురోగమించామని చెప్పుకునే బూర్జువా రిపబ్లిక్కులుగానీ చేయలేకపోయాయ’ని పేర్కొన్నారు.నాడే అలాంటి మార్పు..పెళ్లి, విడాకులు, శిశు సంరక్షణ, భరణం, ఆస్తిలో సమానవాటా వంటివన్నీ నాడే తీసుకొచ్చారు. చిన్నారుల సంరక్షణ బాధ్యత ప్రభుత్వమే స్వీకరించింది. మన దేశంలో ఇప్పటికీ దీనిపై సరైన విధానం లేదు. అద్భుతమైన ప్రగతి..ఆ తర్వాత స్టాలిన్‌ నాయకత్వంలో స్త్రీలు అద్భుతమైన ఆర్థిక ప్రగతిని సాధించారు. ఆ సమయంలో భిన్నమైన సవాళ్లు కూడా ఎదురయ్యాయి. దేశ సంరక్షణ కోసం స్టాలిన్‌ స్ఫూర్తితో చేసిన సాహసోపేతమైన పోరాటంలో స్త్రీలు వీరోచిత పాత్ర పోషించారు. అయితే ఈ కాలంలో మరీ ముఖ్యంగా రెండో ప్రపంచ యుద్ధానంతరం పోరు వల్ల ధ్వంసమైన దేశాన్ని పునర్నిర్మించడంలో కుటుంబం పాత్ర కీలకమైంది. ఒకప్పుడు వ్యతిరేకించిన తల్లి ప్రాధాన్యతను పునరుద్ధరించారు. అలాగే గర్భస్రావం చేయించుకునే హక్కు తలకిందులైంది. దీంతో 1955లో తిరిగి దానిని తీసుకొచ్చారు. కుటుంబంలో స్త్రీ ప్రాధాన్యతను తిరిగి ప్రవేశపెట్టారు. స్త్రీలు, చిన్నారుల సంరక్షణకు ప్రవేశపెట్టిన చట్టంతోపాటు యుద్ధానంతర కాలంలో చేపట్టిన అనేకాంశాల్లో పరాజయం ప్రారంభమైంది. ‘కుటుంబ నిర్మాణాలు, స్త్రీ-పురుష వ్యక్తిగత సంబంధాలు సవాళ్లను ఎదుర్కొంటూనే ఉంటాయి.. మారుతూనే ఉంటాయి..’ అని ఏడు దశాబ్దాల సోషలిస్టు అనుభవం నిరూపించింది. ఈ విషయాన్ని సోవియట్‌ తీవ్ర విమర్శకులు సైతం అంగీకరించాల్సిన వాస్తవం.మహిళా నేతల పాత్ర..రాజకీయాలు, ఉపాధి, చట్టపరమైన అంశాల్లో స్త్రీలకు శిక్షణ ఇచ్చేందుకు ప్రత్యేక మహిళా విభాగాన్ని ఏర్పాటు చేసింది. విప్లవోద్యమ కాలంలో రష్యన్‌ కమ్యూనిస్టు పార్టీలో స్త్రీలు 10 శాతం మాత్రమే. ఆ తర్వాత మహిళా విభాగం ద్వారా కోట్లాదిమంది మహిళలకు చేరువైంది. సైద్ధాంతిక శిక్షణ ఇచ్చేందుకుగానూ మహిళా కమ్యూనిస్టు కార్మికుల కోసం ప్రత్యేకంగా పత్రికలను తీసుకొచ్చింది. తొలి పదేళ్లలో అన్ని స్థాయిల్లోనూ 40 శాతం మహిళలు ఎన్నికయ్యారు. కుటుంబం లోపల, బయట పురుషాధిపత్య ధోరణులను మహిళా నేతలు ధీటుగా ఎదిరించారు. అలెగ్జాండ్రా కొల్లంతారు, ఇనెస్సా అర్మాండ్‌, ఎన్‌.కృపస్కయా, కె.శామ్లినోవా, మరియా ఉల్యనోవా, సోఫియా స్మిదోవిచ్‌, ల్యుద్మిలా స్టల్‌, రోసాలియ జ్మెలియాచిక, ఎనోవా స్టసోవా, వెరా గొలులెవ, పోలీనా వి, అలెగ్జాండ్రా అల్టుఖినా, వెరా లెబెడెవా వంటి వీర నారీమణులు ఈ పోరాటాల నుంచి వచ్చినవారే. మహిళా నేతల వ్యక్తిగత చరిత్రలన్నీ సాహిత్య రూపంలో అనేక పుస్తకాల్లో అందుబాటులో ఉన్నాయి. సోవియట్‌ యూనియన్‌ విచ్ఛిన్నమైన తర్వాత అభివృద్ధి నిరోధక శక్తులు మళ్ళీ తలెత్తాయి.

  • – శాంతిశ్రీ, 8333818985
➡️