ఉగాది వేళ.. వసంత హేల..

Apr 7,2024 07:08 #Festivals, #Sneha, #Stories

ప్రభాత వేళ పసిమనసులు పరవశిస్తాయి. చెట్ల కొమ్మల్లోంచి వచ్చే ఆమని కోయిల కుహూకుహూ రాగాలకు మురిసిపోతూ.. పచ్చని పొలాలు.. పక్షుల కిలకిలలు.. మోడువారిన చెట్ల చిగురింతలు.. రంగురంగుల పువ్వులు.. వాటిపై మంచుబిందువుల హరివిల్లు.. కమ్మని వేపపూత సుగంధం.. మామిడి పిందెల సోయగం.. వాటిని అందుకోవాలని పరితపించే తుమ్మెదల ఝుంకారంతో ప్రకృతి శోభ పరిఢవిల్లుతుంది. ముగ్గుల ముంగిళ్లు, (పచ్చి తాటాకుల) పచ్చని పందిళ్ళు, రంగులతో మురిపించే లోగిళ్లు, గడపలకు మామిడి తోరణాలు, పిండివంటల ఘుమఘుమలు వసంతానికి నీరాజనాలు పలుకుతాయి. జీవితకాలపు భావోద్వేగాలను తనలో ఇముడ్చుకున్న షడ్రుచుల ఉగాది పచ్చడి ఈ పండుగ ప్రత్యేకం. పండుగలు అంటేనే ప్రకృతి శోభ. ప్రాణికోటికి పురోగమన వీచిక. ఈ నెల 9వ తేదీ ఉగాది సందర్భంగా ప్రత్యేక కథనం.

శాస్త్రీయపరమైన అవగాహనలేని కాలంలో మనిషి ప్రకృతికి అనుగుణంగా జీవన విధానాన్ని మలుచుకుంటూ వచ్చాడు. తద్వారా కొన్ని సంస్కృతీ సాంప్రదాయాలు, పద్ధతులు మానవ సంబంధాలు పెంపొందించుకునేలా ఏర్పరచుకున్నాడు. అలా ఏర్పడిన పండుగల్లో తొలి పండుగ ఈ సంవత్సరాది. అయితే కాలానుగుణంగా పండుగల్లో అనేక మార్పులొచ్చాయి.
మరి ఉగాదిలో వచ్చిన ఆ మార్పు పరవశించేలా ఉందా..! పరిహాసం చేస్తుందా..! ఆమని కోయిల ముందే కూసిందా! పుడమితల్లి పురిటినొప్పులు పడుతోందా! బీటలు వారిన నేల.. పిచ్చుక ముట్టని గింజలు.. మనిషి ముందు నాట్యమాడుతున్నాయా..! ఎండల మంటలు.. పండే పంటలు రైతును కాల్చేస్తున్నాయా! మంచు కరిగి ఖండాలను ముంచేస్తుందా! శిశిరాన్ని తలపిస్తున్న చైత్రం మనల్ని వెక్కిరిస్తుందా! ఇవన్నీ చూసి వసంతం భయపడిందా! ఉగాది నాటికి వసంతం జాడ కనుమరుగయిందని చెబుతున్న పరిశోధనలు మనసును కలవరపెడుతున్నాయి.

నులివెచ్చని సంవత్సరాది..
చలికాలానికి, వేసవి కాలానికి మధ్యలో నులి వెచ్చదనం.. మంచు బిందువుల మిలమిలలు.. పచ్చని ఆహ్లాదకరమైన వాతావరణాన్ని మునుపటి ఉగాదులు, వసంతాలు మనకిచ్చాయి. ఉదయాన్నే ఆబాల గోపాలం కలసి చెట్లు చేమలు తిరిగి వేపపూత, మామిడి కాయలు, పత్రి కోసుకుని ఇంటికి చేరేవారు. ముసలి ముతక, తిరిగి తెచ్చుకోలేనివారికి వాటిని పంచుకుంటూ వచ్చేవారు. ఇప్పుడవి కొని తెచ్చుకునే పరిస్థితి. పండుగను మమ అనిపించే పద్ధతి కొనసాగుతోంది.

ప్రకృతి హననం అనర్ధదాయకం..
అయితే కాలాలు మారటం సహజమే. కానీ ఆ మార్పు అసహజమైనప్పుడే వైపరీత్యాలూ మనకెదురవుతాయి. కీకారణ్యాలు కాంక్రీటు భవనాలుగా మారుతున్నాయి. పాడి పంటలు వసివాడుతున్నాయి. మౌలిక వనరులు మృగ్యమైపోతున్నాయి. గలగలపారే నదులు.. చెట్టూ చేమ.. పశుపక్ష్యాదులు.. మొత్తంగా పర్యావరణమే కకావికలమైపోతుంది. ఇప్పటికే వసంతకాలం జాడ కనుమరుగైందని పరిశోధనలిచ్చిన నివేదిక. ఇదిలాగే కొనసాగితే ప్రకృతి ఆకృతిని.. కోయిల గానాన్ని కంప్యూటర్లలో వెతుక్కోవలసి వస్తుందని ఆవేదన చెందుతున్నారు పర్యావరణ ప్రేమికులు. ఇప్పటికే పక్షుల కిలకిలరావాలు సెల్‌ఫోన్‌ల రింగ్‌టోన్‌ల రూపంలో వినాల్సి వస్తోంది. నదీ ప్రవాహాలు, పాడి పంటలు కంటికింపుగా కనిపించని దుస్థితి. ప్రకృతి హననం పెచ్చుమీరితే శిశిరంలో మోడువారిన ఉగాది మన సొంతమవుతుంది.

పురోగమనంలో ప్రతి ఒక్కరూ..
పురోగమనానికి బాటలు వేయాల్సిన పరిస్థితి మనముందుంది. పచ్చదనానికి నాంది పలుకుదాం. అడవులను కాపాడుకుందాం. ముందొచ్చే ఉగాదులను జీవిత సొగసులుగా మార్చుకుందాం. ప్రకృతిని కాపాడుకోవటం ప్రతి ఒక్కరి బాధ్యత. సమిష్టి కృషితోనే అది సాధ్యం. సామరస్యతతో.. సరికొత్త ఆలోచనతో.. ఉగాదిని ఆహ్వానిద్దాం.

పచ్చడిలో పరమార్థం..
ఉగాది అనగానే ఆరు రుచులతో చేసుకునే ఉగాది పచ్చడిదే ప్రత్యేకం. తీపి, చేదు, పులుపు, కారం, ఉప్పు, వగరు.. ఇన్ని రుచుల మేళవింపు మరే సందర్భంలోనూ చవిచూడం.
కావలసినవి : పచ్చి మామిడికాయ (సన్నని తరుగు)- కప్పు, వేపపూత (పూరేకులు మాత్రమే)- 1/2 కప్పు, కొత్త చింతపండు గుజ్జు – 1/2 కప్పు, బెల్లం తరుగు – 1/2 కప్పు, ఉప్పు – చిటికెడు, మిరియాల పొడి – 1/4 స్పూను, జీలకర్ర – 1/2 స్పూను
తయారీ : మామిడికాయ తరుగును వెడల్పు గిన్నెలోకి తీసుకోవాలి. దానిలో వేపపూత (రెండు చేతుల మధ్య సున్నితంగా నలిపి చెరిగితే వచ్చే పువ్వు రేకులు), కొత్త చింతపండు గుజ్జు, కొత్త బెల్లం తరుగు, ఉప్పు, మిరియాల పొడి, జీలకర్ర, ఇష్టమైతే అరటిపండు ముక్కలు వేసి అన్నీ కలిసేలా చేతితోనే కలపాలి. అంతే షడ్రుచుల సమ్మేళనం రెడీ.
సంవత్సరాది నుంచి మళ్ళీ వచ్చే ఉగాది వరకు జీవితంలో అనేక ఒడిదుడుకులను, సవాళ్ళను ఎదుర్కొనాలనే సందేశం మనకు ఇస్తున్నట్లు అనిపిస్తుంది ఈ ఉగాది పచ్చడి.

➡️