పచ్చి మామిడితో.. పుల్ల పుల్లగా..

Mar 24,2024 08:48 #Cooking, #Sneha

వేసవి అనగానే ఆవకాయ, మామిడి కాయలు ముందు వరుసలో వచ్చి కూచుంటాయి. మార్చి మొదటే ఎండలు దండిగా ఉన్నాయి. ఆ వెంటే మామిడి కాయలూ దర్శనమిస్తున్నాయి. మరి పచ్చి మామిడిని చూడగానే మది నిండా ఎన్ని రుచులో.. మరి నోరూరిపోదూ..! ఇంకొన్ని రోజులు పోతే సంవత్సరమంతా సరిపోయేలా ఆవకాయ, మాగాయ, వరుగులు లాంటి నిలువ పదార్థాలు తయారు చేసుకుంటాం. కానీ అప్పటి వరకూ జిహ్వ చాపల్యం ఆగొద్దూ! అందుకే పచ్చిమామిడి కాయతో ఇన్‌స్టంట్‌గా చేసుకునే కొన్ని రుచులు ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం.

పచ్చి పులుసు..
కావలసినవి : పచ్చిమామిడి కాయ – ఒకటి, నీళ్ళు – గ్లాసున్నర, ఉల్లిపాయ – ఒకటి, బెల్లం – స్పూను, ఉప్పు- తగినంత
తాలింపుకు : నూనె – 2 స్పూన్లు, ఎండుమిర్చి – 2, ఇంగువ – 1/4 స్పూను, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి చీలికలు – 4, కొత్తిమీర
తయారీ : ముందుగా మామిడి కాయను స్టౌ మీద సిమ్‌లో అన్నివైపులా సమంగా కాల్చుకోవాలి. పూర్తిగా కాలిన మామిడికాయను చల్లని నీటిలో వేసి పై పెచ్చు తీసేయాలి. తర్వాత చేతితో నొక్కుతూ గుజ్జునంతా ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఈ గుజ్జుకు పెద్ద గ్లాసుతో గ్లాసున్నర నీళ్ళు ముక్కలు లేకుండా నీటిలో కలిసిపోయేలా కలపాలి. దీనికి ఉల్లిపాయ ముక్కలు, బెల్లం ముక్క, ఉప్పు కలిపి పక్కనుంచుకోవాలి. బాండీలో నూనె వేడిచేసి ఎండుమిర్చి, ఇంగువ, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి చీలికలు, కొత్తిమీరలతో తాలింపు పెట్టి, పచ్చి పులుసుకు కలపాలి. అంతే.. కమ్మని పుల్లని మామిడి కాయ పచ్చిపులుసు రెడీ.

 


మాంసంతో కూర..
కావలసినవి : మటన్‌ – 1/2 కేజీ, మామిడికాయ ముక్కలు – కప్పు, పసుపు – 1/2 స్పూను, ఉప్పు – తగినంత, కారం – ఒకటిన్నర స్పూను, అల్లంవెల్లుల్లి పేస్ట్‌ – స్పూను, ఉల్లిపాయ ముక్కలు – 1/2 కప్పు, నీరు – ముప్పావు లీటరు, నూనె – 1/4 కప్పు
తయారీ : మటన్‌ను శుభ్రం చేసుకోవాలి. కుక్కర్‌ గిన్నెలో నూనె పోసి, వేడయ్యాక దాల్చిన చెక్క (అరంగుళం ముక్క), యాలుకలు (4), లవంగాలు (4), ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి (4) వేసి ఐదు నిమిషాలు వేయించాలి. దీనిలో శుభ్రం చేసి పెట్టుకున్న మటన్‌ వేయాలి. దానికి పసుపు, ఉప్పు వేసి, నీరంతా ఇగరనివ్వాలి. తర్వాత కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్‌ వేసి వేగనివ్వాలి. అవి సరిపడా నీళ్ళు పోసి, మూతపెట్టి ఐదారు విజిల్స్‌ రానివ్వాలి. ప్రెజర్‌ పోయాక మూత తీసి, మామిడికాయ ముక్కలు వేసి, ఉడికించాలి. దీనిని మధ్య మధ్య కలుపుతూ కూర దగ్గరగా అయ్యాక, కొత్తిమీర తరుగు చల్లి దించుకోవడమే. అంతే ఘుమఘుమ రుచులతో మామిడి మటన్‌ కూర రెడీ.

చిన్నముక్కల పచ్చడి..

కావలసినవి : మామిడికాయ ముక్కలు – 5 కప్పులు, ఉప్పు – 3/4 కప్పు, కారం – కప్పు, (ఆవాలు, మెంతులు – 2 స్పూన్లు) ఆవాలు, మెంతి పొడి – 1/4 కప్పు, పసుపు – స్పూను, నువ్వుల నూనె – 175 మి.లీ.
తయారీ : ముందుగా ఆవాలు, మెంతులు దోరగా వేయించి, మెత్తని పొడి చేసుకోవాలి. (ఇక్కడ ఉపయోగించే ప్రతి వస్తువు తడి లేకుండా చూసుకోవాలి.)
టెంకె తయారు కాని మామిడి కాయలను శుభ్రంగా కడిగి, తుడిచి పూర్తిగా ఆరిన తర్వాత చిన్న ముక్కలుగా చేసుకోవాలి. ఒక వెడల్పు గిన్నెలో మామిడి ముక్కలు, కారం, ఉప్పు, పసుపు, ఆవాలు మెంతిపొడి కలపాలి. తడి ఏమాత్రం లేని శుభ్రమైన గరిటెను ఉపయోగించాలి. దీనికి నువ్వుల నూనె పోస్తూ నెమ్మదిగా కలిపి, పన్నెండు గంటల పాటు మూతపెట్టి ఊరనివ్వాలి. అంతే ఘుమఘుమలాడుతూ నోరూరించే చిన్నముక్కల మామిడికాయ పచ్చడి రెడీ. దీనికి తడి తగలకుండా జాగ్రత్తగా వాడుకుంటే పదిహేను రోజులు నిలువ ఉంటుంది.

 

➡️