ఇంటి పంట ఇంటామె…

Mar 3,2024 08:37 #Sneha, #Women Stories, #Women's Day
  • ప్రతి వ్యక్తికీ తమదైన వ్యక్తిత్వం వున్నట్లే.. తమదైన అభిరుచులు, అలవాట్లు వుంటాయి. మంచి సంగీతాన్ని ఆస్వాదించడం, పుస్తకాలు చదవడం, ప్రకృతితో మమేకమైపోవడం వంటి ఎన్నో అభిరుచులుంటాయి. మిద్దెతోట, పెరటితోట పెంపకం కూడా ఈ కోవలోకే వస్తుంది. పూల మొక్కలు, ఆకుకూరల దగ్గర నుంచి.. పండ్ల చెట్ల వరకూ మిద్దె తోటలో పెంచుతున్నారు. ఒకప్పుడు ఆహ్లాదం, పచ్చదనం కోసం ఇంటిచుట్టూ మొక్కలు పెంచుకునేవారు. ఇప్పుడు అవసరం, ఆరోగ్యానికి ప్రాధాన్యతనిస్తూ మిద్దె పంటలను ఇంట్లో వంటలకు వాడుకుంటున్నారు. ఎలాంటి రసాయనాలు వాడకుండా పశువుల పేడ, కిచెన్‌ వ్యర్థాలతో తయారు చేసుకున్న కంపోస్ట్‌ వినియోగిస్తూ ఆరోగ్యకరమైన పంటలను పండిస్తున్నారు. అంతేకాదు.. అందరిలోనూ ఆరోగ్య స్పృహ పెరుగుతోంది. కొత్తగా వస్తున్న వైరస్‌లు, వ్యాధుల భయం కూడా పెరిగింది. దీంతో కాస్తంత ఖాళీస్థలం దొరికినా నాలుగు ఆకుకూరలు పండించుకుందాం.. అన్న స్పృహ ప్రతి ఒక్కరిలోనూ పెరుగుతోంది. ముఖ్యంగా మిద్దెతోట, పెరటితోట పెంపకంలో మహిళలదే అగ్రస్థానం.

అన్ని రంగాల్లో దూసుకుపోతున్నట్టే మహిళలు వ్యవసాయరంగంలోనూ ముందంజలో ఉంటున్నారు. రైతు కూలీలుగానే కాదు.. రైతులుగానూ మారి లాభసాటి వ్యవసాయం చేయడానికి ముందుకు వస్తున్నారు. ముఖ్యంగా వ్యవసాయరంగంపై ఆధారపడిన మనదేశంలో మహిళలు కొత్త పంథాలను అనుసరిస్తూ అధిక దిగుబడిని సాధించడంతోపాటు పర్యావరణాన్ని పరిరక్షించేలా సేంద్రియ వ్యవసాయాన్ని అనుసరిస్తున్నారు. మహిళా రైతుల సంఖ్య భారతీయ వ్యవసాయ రంగంలో నానాటికీ పెరుగుతూనే ఉంది. జాతీయస్థాయిలో నిర్వహించిన సర్వే నివేదికలు పరిశీలిస్తే 75 శాతం మహిళా శ్రామికులు వ్యవసాయక్షేత్రంలోనే ఉంటున్నారు. రెండున్నర ఎకరాల పొలంలో సగటున మహిళలు 3,845 గంటలు పనిచేస్తున్నారు. ‘ఎక్కడమ్మా నీవులేనిది?/ ఏమిటీ నీవు చేయలేనిది?/ నాట్లు వేశావు/ కలుపులు తీశావు/ కోతలుకోశావు/ నూరిపిడిచేశావు/ వ్యవసాయంలో నువులేకుంటే/ నోటికాటికి కూడే రాదు..’ అంటారు కవి దేవేంద్ర. గృహిణిగా తన బాధ్యతలు నిర్వర్తిస్తూనే.. కూలీగాను, రైతుగాను బహుముఖ పాత్ర పోషిస్తున్నారు నేటి మహిళలు. పొలం గట్లపైన, ఇంటి పెరటిలోనూ పూలమొక్కలు, ఆకుకూరలు, కాయగూరలు పండించడంలోనూ మహిళల పాత్రే అధికం.

ప్రస్తుతం గ్రామాలు, పట్టణాలనే తేడా లేకుండా మిద్దె తోటలు, పెరటి తోటల పెంపకానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. కొందరు డాబాలపై, ఆవరణల్లో కూరగాయలు సాగు చేస్తున్నారు. ముఖ్యంగా గృహిణులు ఈ అంశంపై ఎక్కువగా దృష్టి సారించడమేకాక సాంకేతికతను జోడిస్తున్నారు. జిల్లాల వారీగా సిటీ ఆఫ్‌ టెర్రస్‌ గార్డెన్‌ (సిటిజి) వంటి వాట్సప్‌ గ్రూపులు ఏర్పాటు చేసుకుని, మిద్దెపంటల సాగుపై పరస్పరం సలహాలు, సూచనలు ఇచ్చుకుంటున్నారు. స్థానికంగా దొరకని మొక్కలను ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేసి తెప్పించుకుంటున్నారు. యూట్యూబ్‌లోనూ ఇంటిపంట, పెరటిపంటలకు సంబంధించిన అనేక వీడియోలు అందుబాటులో వున్నాయి. విత్తనాల దగ్గర నుంచి మొక్కలు పెంచడం, ఎరువుల తయారీ, క్రిముల నిర్మూలన వంటి అనేక అంశాలపై మిద్దెతోటలు పెంచుకుంటున్న అనేకమంది ఔత్సాహికులు తమ అనుభవాలను, తాము పండించిన పంటలను వీడియోలుగా పెడుతున్నారు. ‘తమ తోట నిండా కూరగాయలేనని, వాటిని తెంపుతుంటే కలిగే ఆనందం, వండుకుని తినేప్పుడు కలిగే అనుభూతి, తద్వారా పొందే ఆరోగ్యం.. మాటల్లో చెప్పలేనిదంటారు. ఈ అనుభూతి ముందు మిద్దెతోట పెంచడానికి పడే శ్రమ చాలా స్వల్పం అనిపిస్తుంది’ అంటారు ఇందిరా టెర్రస్‌ గార్డెనర్‌. మ్యాడ్‌ గార్డెనర్‌ మాధవి.. తమ మిద్దెతోటలోను, పెరటితోటలోను పెద్ద సంఖ్యలో పూల మొక్కలు, కాయగూరలు పెంచుతుంటారు. ‘ఇది కూరగాయల షాప్‌ కాదు.. మన మిద్దెతోట పంటే’ అని బోలెడంత ఆత్మవిశ్వాసంతో చెబుతుంటారామె. మా కుటుంబానికి సరిపడా కాయగూరలను పండించడమే కాకుండా.. బంధువులకు, మిత్రులకు కూడా పంపుతుంటానంటారామె. వీరంతా తమ పంటల నుంచి విత్తనాలను సేకరించి.. తదుపరి పంట వేసుకునే సమయానికి అనువుగా తయారు చేసుకుంటారు. అంతేకాదు.. అడిగిన వారికి లేదనకుండా విత్తనాలు ఇస్తుంటారు. ఎక్కువగా పండించేవారు దగ్గరలో వున్న మార్కెట్‌కు కూడా సరఫరా చేస్తున్నారు. ఇలా.. ఒకరా ఇద్దరా.. వందలాదిమంది మహిళలు నేడు మిద్దెతోటల పెంపకంలో మేటిగా నిలుస్తున్నారు. గృహిణిగా, కార్మికురాలిగా, వ్యవసాయ కూలీగా, ఉద్యోగినిగా, రైతుగా బహుముఖ పాత్రలు నిర్వహిస్తూనే.. కుటుంబానికి ఆరోగ్యాన్ని, ఆదాయాన్ని అందించడంలో తమవంతు పాత్రను నిర్వర్తిస్తున్నారు. రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందులు వాడకుండా.. ఇంటి పంటలోనూ మేమే మేటి అని నిరూపిస్తున్నారు.

– రాజాబాబు కంచర్ల, 9490099231

➡️