22 నుంచి ఉచిత స్పోకెన్‌ ఇంగ్లీషు తరగతులు

Apr 17,2024 12:10 #SPOKEN ENGLISH

ప్రజాశక్తి-విజయవాడ
మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో ఈనెల 22 నుంచి నెలరోజులపాటు ఉచితంగా స్పోకెన్‌ ఇంగ్లీషు తరగతులు నిర్వహిస్తున్నామని ఆ సంస్థ కార్యక్రమాల నిర్వహణా కమిటీ కన్వీనర్‌ యు.వి.రామరాజు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతిరోజూ ఉదయం 8 నుంచి 9.30 గంటల వరకూ ఈ తరగతులను ఎంఎస్‌సి, ఎంఎ (పిహెచ్‌డి) చేసిన పాగోలు రాజు బోధిస్తారని తెలిపారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో నెగ్గుకు రావాలంటే కేవలం డిగ్రీలు ఉంటే సరిపోదనీ, అనుకున్న లక్ష్యాన్ని సాధించాలంటే ఆత్మ విశ్వాసం, పట్టుదలతో పాటుగా నలుగురిని ఆకట్టుకునే రీతిలో మాట్లాడగల చాతుర్యం కూడా ఉండాలని సూచించారు. సంభాషణా ప్రావీణ్యం అలవర్చుకోవడం తప్పనిసరిగా మారిందని గుర్తుచేశారు. ఏదైనా ఇంటర్వ్యూలో విజయం సాధించాలన్నా, ఉద్యోగంలో ఓ మెట్టు పైకి ఎదగాలన్నా ఇంగ్లీషులో నైపుణ్యం, భాషపై పట్టు చాలా అవసరమని వివరించారు. ప్రొజెక్టర్‌ ద్వారా స్మార్ట్‌ క్లాసులు, ఆధునిక పద్ధతులతో సులభంగా బోధిస్తారన్నారు. ఇంగ్లీషును సులువుగా నేర్పించటమే కాకుండా ప్రతిరోజూ క్లాసులో మాట్లాడటం, సాధన చేయిస్తారన్నారు. ఈ వేసవి సెలవులను ఉపయోగించుకుని ఇంగ్లీషుపై పట్టు సాధించటానికి వచ్చిన ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని విద్యార్థులను కోరారు. 10వ తరగతి పరీక్షలు రాసినవారు, ఇంటర్‌, డిగ్రీ వారు హాజరుకావచ్చునని సూచించారు. ఈ ఉచిత స్పోకెన్‌ శిక్షణా తరగతులు గవర్నరుపేట రాఘవయ్యపార్కు వద్ద ఆకులవారివీధిలోని మాకినేని బసవపున్నయ్య విజ్జాన కేంద్రం (ఎంబివికె)లో జరుగుతాయని వివరించారు. ఆసక్తికలవారు ఈనెల 21లోగా తమ కార్యాలయంలోగానీ, సెల్‌ : 9490098408, ఫోన్‌ : 08662578044లో సంప్రదించాలని కోరారు. విద్యార్థినీ విద్యార్థులతోపాటుగా ఉద్యోగులు, గృహిణులు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా యు.వి.రామరాజు కోరారు.

➡️