కో’ఢీ’ఆగేనా..!

  • ప్రతియేటా అమలుకాని హైకోర్టు ఉత్తర్వులు
  • పండుగ మూడు రోజులు పోలీసు, రెవెన్యూ అధికారులు మౌనముద్ర
  • ఉమ్మడి జిల్లాలో గతేడాది 400కుపైగా బరుల్లో పందేల జోరు
  • యథేచ్ఛగా గుండాట, మూడు ముక్కలాట
  • ఈసారైనా పందేలకు అడ్డుకట్ట వేయాలని అంతా ఎదురుచూపు

ప్రజాశక్తి – ఏలూరు ప్రతినిధి : కోడి పందేలను అడ్డుకోవాలంటూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల అమలులో పోలీస్‌, రెవెన్యూ అధికారులు ప్రతియేటా విఫలమవుతున్నారనే విమర్శలు విన్పిస్తున్నాయి. ఇప్పుడు మరోసారి కోడి పందేలను అడ్డుకోవాలంటూ హైకోర్టు జారీ చేసిన ఆదేశాలు అమలయ్యేనా అంటూ చర్చలు సాగుతున్నాయి. కోడి పందేలను అడ్డుకుంటామంటూ కలెక్టర్‌, ఎస్‌పి నుంచి కిందిస్థాయి అధికారులు వరకూ ప్రకటనలు గుప్పించడం, పండుగ మూడు రోజులు మౌనముద్ర పాటించడం ప్రతియేటా పరిపాటిగా మారిపోయింది.

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ప్రతియేటా 400కుపైగా బరుల్లో కోడి పందేలు సాగుతున్నాయి. దాదాపు రూ.200 కోట్లకుపైగా సొమ్ము చేతులు మారుతోంది. ప్రధాన రహదారులకు పక్కగా టెంట్లు వేసి, ఫ్లడ్‌లైట్ల వెలుగుల్లో కోడిపందేలు జరుగుతున్నా పోలీసులు అటువైపు కన్నెత్తి చూడని పరిస్థితి ఉంటోంది. కోడి పందేలపై గతంలో కొంతమంది హైకోర్టును ఆశ్రయించగా పందేలను అడ్డుకోవాలంటూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటి వరకూ ఒక్కసారి కూడా కోర్టు ఆదేశాలను అమలు చేసిన పరిస్థితి లేదు. కోడి పందేలతోపాటు గుండాట, మూడు ముక్కలాట సైతం యథేచ్ఛగా బరుల వద్ద సాగుతున్నాయి. సామాన్య ప్రజానీకం ఎంతోమంది పందేలకు ఆకర్షితులై జేబులు ఖాళీ చేసుకుని రోడ్డున పడుతున్నారు. ఈ ఏడాది సైతం కోడిపందేలకు పందెంరాయుళ్లు అన్ని ఏర్పాట్లూ చేస్తున్నారు. ఇప్పటికే బరుల ఏర్పాటుకు స్థలాల ఎంపికతోపాటు, అతిధులకు ఆహ్వానాలు సైతం పంపించేశారు. పందెం కోళ్లకు పెద్దఎత్తున తర్ఫీదు ఇస్తున్నారు. ప్రస్తుతం ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో పందేలు పెద్దఎత్తున నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. భీమవరం, కాళ్ల, పాలకొల్లు, తాడేపల్లిగూడెం, ఆకివీడు, ఉండి వంటి మండలాలతోపాటు ఏలూరు జిల్లాలో పెదవేగి, జంగారెడ్డిగూడెం, దెందులూరు, ఉంగుటూరు వంటి అనేక మండలాల్లో పందేలకు జోరుగా ఏర్పాట్లు సాగుతున్నాయి. ఈసారి 300కుపైగా బరుల్లో పందేలు నిర్వహించనున్నట్లు పందెంరాయుళ్లు చెబుతున్నారు. దీనికోసం పోలీసులకు, రెవెన్యూ అధికారులకు పెద్దఎత్తున మాముళ్లు సైతం ముట్టజెప్పేందుకు సిద్ధమయ్యారు. ఎన్నికల తరుణంలో ప్రభుత్వం కోడిపందేలను మరింత ప్రోత్సహిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే అదునుగా పందెంరాయుళ్లు మరింత రెచ్చిపోతున్నారు. ఏలూరు, భీమవరం వంటి పట్టణాల్లో ఇప్పటికే ముందస్తుగా హోటల్‌ గదులు సైతం బుక్‌ చేసినట్లు తెలుస్తోంది. సంప్రదాయం ముసుగులో కొంతమంది పందెంరాయుళ్లు వీటిని ప్రోత్సహిస్తున్నారు. వీరికి రాజకీయ నేతల అండ ఉండటంతో ఆడింది ఆట.. పాడింది పాట అన్నట్లు సాగుతోంది. పోలీసుల బైండోవర్‌ కేసులు, బరుల తొలగింపు లెక్కలన్నీ కేవలం కోర్టుకు చూపించడానికే తప్ప కోడి పందేలను నిరోధించడానికి కాదని స్పష్టంగా అర్థమవుతోంది. సంక్రాంతి వస్తుండటంతో మరోసారి కోడిపందేలను అడ్డుకుంటామంటూ అధికారులు ప్రకటనలు గుప్పిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం అందుకు విరుద్ధంగా కన్పిస్తోంది. బరులు నిర్వహించే నిర్వాహకులను పిలిపించుకుని పోలీసులు తమ వాటాలు మాట్లాడుకుంటున్నట్లు ప్రచారం సాగుతోంది. ఈసారైనా హైకోర్టు ఆదేశాలను అమలు చేసి కోడిపందేలకు అడ్డుకట్ట వేయాలని జిల్లా ప్రజానీకం కోరుతున్నారు.

➡️