రాష్ట్రంలో 4.08 కోట్ల ఓటర్లు

Jan 23,2024 09:01 #4.08 crore, #State, #voters
  • మహిళా ఓటర్లే అధికం
  • ముసాయిదా జాబితా కంటే 5.8 లక్షలు పెరిగిన ఓట్లు
  • సిఇఒ ముకేష్‌కుమార్‌ మీనా

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : 2024లో జరగనున్న సాధారణ ఎన్నికలకు సంబంధించి తుది ఓటర్ల జాబితాను సిఇఒ ముకేష్‌కుమార్‌ మీనా సోమవారం విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో మొత్తం 4,08,07,256 మంది ఓటర్లుగా నమోదైనట్లు, డ్రాఫ్ట్‌ పబ్లికేషన్‌లో (ముసాయిదా) 4,02,21,450 మందిగా ఉన్న ఓటర్లు తుది జాబితాలో 5.8 లక్షల మంది పెరిగినట్లు గణనీయంగా పేర్కొంది. పురుష ఓటర్లు 2,00,09,275 మంది కాగా, మహిళా ఓటర్లు 2,07,37,065 మంది ఉన్నారు. థర్డ్‌ జెండర్‌గా 3,482 మంది ఓటర్లు ఉన్నారు. సర్వీస్‌ ఓటర్లుగా 67,434 మంది నమోదు కాగా, అందులో పురుషులు 65,047 మంది, మహిళా ఓటర్లు 2,387 మంది ఉన్నారు.

5,64,487 ఓట్ల తొలగింపు

రాష్ట్ర వ్యాప్తంగా వివిధ రాజకీయ పార్టీల నుంచి ఓటర్ల జాబితాలో అవకతవకలపై ఎన్నికల కమిషన్‌కు అత్యధిక సంఖ్యలో ఫిర్యాదులు అందాయి. మొత్తమ్మీద వివిధ కారణాలతో 14,48,516 దరఖాస్తులు అందగా, విచారణ అనంతరం 5,64,497 ఓటర్లను అనర్హులుగా గుర్తించి జాబితా నుంచి ఎన్నికల కమిషన్‌ తొలగించింది. 5,86,530 ఓటర్లు పెరిగారు. జిల్లాల వారీ పరిశీలిస్తే మొత్తమ్మీద 1.46 శాతం ఓట్ల సంఖ్య పెరిగింది. తొలగించిన ఓట్లలో అత్యధికంగా చిరునామా లేకుండా ఒకే ఇంట్లో పదుల సంఖ్యలో ఓట్లు నమోదు కావడం, తప్పుడు చిరునామాలతో నమోదైన వారు, మరణించిన వారి పేర్లతో నమోదైన ఓట్లు ఉన్నట్లు గుర్తించినట్లు సిఇఒ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.

తప్పులు చేసిన వారిపై 70 కేసులు

నకిలీ ఓటర్ల పేరుతో ఫారం-7 ఇచ్చిన అర్హులను తొలగించినట్లు వచ్చిన ఫిర్యాదులపై విచారణ జరిపి అందుకు బాధ్యులైన 70 మందిపై కేసులు నమోదు చేసినట్లు సిఇఒ ముకేష్‌కుమార్‌ మీనా పేర్కొన్నారు. కొత్త ఓటర్లకు సంబంధించి అసెంబ్లీ, జిల్లా స్థాయిలో కలెక్టరు సమీక్షలు నిర్వహిస్తారని తెలిపారు. 80 ఏళ్లు దాటిన వృద్ధులు 5.76 లక్షల మంది ఉన్నారని, వీరందరూ ఇంటి నుంచే ఓటు వేసే సౌకర్యం కల్పించినట్లు పేర్కొన్నారు. ఇంటి నుంచే ఓటు వేసేందుకు 4,87,594 మంది వికలాంగులు దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. కేసులు నమోదైన వారిలో నెల్లూరు జిల్లా ఆత్మకూరు, కోవూరు, ఉదయగిరి నియోజకవర్గాల్లో 8 మంది, బాపట్ల జిల్లా పర్చూరులో 16 మంది, నంద్యాల జిల్లా బనగానిపల్లెలో ఒకరు, అనంతపురం జిల్లా అనంతపురం అర్బన్‌, రాప్తాడు నియోజకవర్గాల్లో నలుగురు, బిఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లా కొత్తపేటలో ముగ్గురు, కాకినాడ జిల్లా కాకినాడ సిటీ నియోజకవర్గంలో 23 మంది, అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గంలో ఇద్దరు, శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలో ఇద్దరు, తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో 10 మంది, గుంటూరు జిల్లా గుంటూరు వెస్ట్‌లో ఒకరిపై కేసులు నమోదయ్యాయి.

అభ్యంతరాల పరిశీలనకు ప్రత్యేక సెల్‌

ఓటర్ల తుది జాబితా ప్రకటన నేపథ్యంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్‌కుమార్‌ మీనా సోమవారం సచివాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజకీయ పార్టీలు వ్యక్తం చేసిన సందేహాలను నివృత్తి చేశారు. ఓటర్ల తుది జాబితా సవరణపై ఎటువంటి అభ్యంతరాలున్నా వాటిని పరిష్కరించేందుకు ప్రత్యేక సెల్‌ పనిచేస్తుందన్నారు. ఎన్నికలు జరిగేంత వరకు ఓటర్ల నమోదు తొలగింపు కార్యక్రమం జరుగుతూనే ఉంటుందని తెలిపారు. ఎన్నికల తేదీకి పదిరోజులు ముందుగా అందిన వివరాలను మాత్రమే పరిగణనలోకి తీసుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఓటర్ల జాబితా సవరణపై ప్రతి వారం జిల్లా ఎన్నికల అధికారి, ఇఆర్‌ఒ స్థాయిల్లో సమీక్షలు జరుగుతాయన్నారు. సమావేశంలో సిపిఎం ప్రతినిధులు జె జయరామ్‌, కె హరికిశోర్‌ మాట్లాడుతూ.. గిరిజన ప్రాంతాల్లో ప్రత్యేకంగా పోలింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేయాలని తాము కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లిన విషయంపై ఎటువంటి చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. ఈ విషయంపై సిఇఒ స్పందిస్తూ.. ఈ విషయాన్ని ఎన్నికల కమిషన్‌ సీరియస్‌గా తీసుకుందని, స్థానిక పరిస్థితులను పరిశీలించాలని కలెక్టర్లను ఆదేశించినట్లు ఆయన సమాధానమిచ్చారు. ఈ సమావేశంలో వైసిపి ప్రతినిధులు లేళ్ల అప్పిరెడ్డి, లోకేష్‌, టిడిపి ప్రతినిధులు వర్ల రామయ్య, పి అశోక్‌బాబు, బిజెపి ప్రతినిధి మట్టా ప్రసాద్‌, కాంగ్రెస్‌ నుంచి వేమల శ్రీనివాసరావు పాల్గొన్నారు.

➡️