అడుగంటిన జలాశయాలు

Mar 25,2024 09:54 #reservoirs
  • శ్రీశైలంలో 34.788 టిఎంసిలు
  • తుంగభద్రలో 5.48 టిఎంసిలు
  • రబీ సాగును విరమించుకున్న రైతులు
  • తాగునీటికీ కటకట

ప్రజాశక్తి-కర్నూలు ప్రతినిధి : గత దశాబ్ద కాలంలో ఉమ్మడి కర్నూలు జిల్లా రైతులు ఎన్నడూ లేని దుర్భిక్షాన్ని ఎదుర్కొంటున్నారు. ఆంధ్ర రాష్ట్రంతోపాటు పక్క రాష్ట్రాలకు సాగు, తాగు నీటిని అందిస్తున్న శ్రీశైలం జలాశయంతోపాటు తుంగభద్ర జలాశయాలు డెడ్‌ స్టోరేజీకి చేరుకుంటున్నాయి. ఫలితంగా నిన్న మొన్నటి దాకా కాస్తో కూస్తో నీరు ఉండిన కెసి కెనాల్‌, లో లెవల్‌ కెనాల్‌ (ఎల్‌ఎల్‌సి), శ్రీశైలం రైట్‌బ్యాంకు కెనాల్‌ (ఎస్‌ఆర్‌బిసి), తెలుగు గంగ, గాజులదిన్నె ఎండిపోయాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రధాన జలాశయాలతోపాటు చిన్న నీటి వనరుల ద్వారా దాదాపు ఆరు లక్షల ఎకరాలు సాగవుతోంది. ఖరీఫ్‌ సీజన్‌లోనూ కెసి కెనాల్‌, ఎల్‌ఎల్‌సి, ఎస్‌ఆర్‌బిసి, తెలుగు గంగ తదితర ప్రధాన కాలువల ద్వారా అతికష్టం మీద అధికారులు నీటిని విడుదల చేశారు. రబీలో ఆరుతడి పంటలకైనా నీరు ఇస్తారేమోనని రైతులు ఎదురు చూసినా నిరాశే మిగిలింది. జలశయాల్లో నీటి నిల్వలు పడిపోవడంతో రబీ పంటలకు నీరు ఇవ్వలేమని అధికారులు చేతులెత్తేశారు. దీంతో రైతులు సాగును విరమించుకున్నారు. రబీలో దాదాపు ప్రధాన కాలువల కింద ఉమ్మడి కర్నూలు జిల్లాలో మూడు లక్షల ఎకరాలకు సాగునీరు అందాలి. ఈసారి ఒక్క ఎకరాకు కూడా సాగునీరు అందివ్వకపోవడంతో పొలాలన్నీ బీడువారాయి.
మన రాష్ట్రంతో పాటు పక్క రాష్ట్రాలైన తెలంగాణ, తమిళనాడుకు కూడా తాగునీరందించే ఏకైక మార్గంగా ఉన్న శ్రీశైలం జలాశయంలో ప్రస్తుతం 34.788 టిఎంసిల నీరు మాత్రమే నిల్వ ఉంది. గత సంవత్సరం ఇదే సమాయానికి 35.3770 టిఎంసిల నీరు నిల్వ ఉండేది. ఈ జలాశయం నీటి నిల్వ సామర్థ్యం 215 టిఎంసిలు కాగా, గత సంవత్సరం దాదాపు ఏడు సార్లు జలాశయం పూర్తిగా నిండడంతో దిగువకు నీటిని విడుదల చేశారు. ఈ సారి మొదటి నుంచి ఆ పరిస్థితి లేదు. తుంగభద్ర జలాశయం నీటి నిల్వ సామర్థ్యం 105.788 టిఎంసిలు కాగా గత సంవత్సరం ఇదే సమయానికి 50 టిఎంసిల నీరు నిల్వ ఉంది. ప్రస్తుతం 5.48 టిఎంసిల నీరు మాత్రమే నిల్వ ఉందని, ఎగువ నుంచి చుక్కనీటి ప్రవాహం కూడా జలాశయంలోకి రావడం లేదని, ఈ పరిస్థితుల్లో జూన్‌ వరకు తాగునీటి అవసరాలను ఏవిధంగా తీర్చాలో అర్థం కాని పరిస్థితి నెలకొందని జలవనరుల శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. గత దశాబ్ద కాలంలో తుంగభద్ర జలాశయంలో ఈ పరిస్థితి నెలకొనడం ఇదే మొదటిసారి అని అంటున్నారు.
కర్నూలుకు తాగునీటి అవసరాలు తీరుస్తున్న సుంకేసుల జలాశయంలో పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 1.2 టిఎంసిలు కాగా, ప్రస్తుతం 0.881 టిఎంసిలు మాత్రమే ఉన్నాయి. తాగునీటి అవసరాల కోసం ప్రతి రోజూ 159 మిలియన్‌ లీటర్ల నీరు అవసరం. గాజులదిన్నె జలాశయంలో 4.5 టిఎంసిల నీటి నిల్వ సామర్థ్యానికిగాను 1.845 టిఎంసిలు ఉన్నాయి. జూన్‌ వరకు ఎమ్మిగనూరు, కోడుమూరు, డోన్‌తోపాటు కర్నూలు తాగునీటి అవసరాలను ఈ కొద్దిపాటి నీటితో ఎలా సర్దుబాటు చేయాలో అర్థం గాక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. కృష్ణగిరి జలాశయంలో 0.164 టిఎంసిలకుగాను 0.68 టిఎంసిలు ఉన్నాయి. జూన్‌ వరకు తాగునీటి అవసరాలను ఉమ్మడి కర్నూలు జిల్లా ప్రజలకు ఏ విధంగా అందించాలో అర్థం కావడం లేదని జలవనరుల శాఖ అధికారులు చెబుతున్నారు.

➡️