‘తూర్పు’పైనే దృష్టి

Feb 6,2024 12:59 #AP Assembly Election, #JanaSena, #TDP
  • టిడిపి, జనసేన మధ్య తేలని సీట్ల సర్దుబాటు
  • ఆశావహుల్లో ఉత్కంఠ

ప్రజాశక్తి- కాకినాడ ప్రతినిధి : రాష్ట్రంలోనే అత్యధిక అసెంబ్లీ స్థానాలు ఉండడంతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాపైనే అన్ని పార్టీలూ దృష్టి పెట్టాయి. ఈ జిల్లాలో అధిక స్థానాలు సాధించిన పార్టీయే రాష్ట్రంలో అధికారం చేజిక్కించుకుంటుందనే సెంటిమెంట్‌ కూడా పార్టీల్లో ఎక్కువగా ఉంది. దీంతో, ‘తూర్పు’లో ఎక్కువ స్థానాలు సాధించేందుకు పార్టీలు కసరత్తులు ప్రారంభించాయి. అధికార పార్టీ కసరత్తులు ఇప్పటికే పూర్తి కావొస్తున్నాయి. ఇప్పుడు టిడిపి-జనసేన పార్టీ కూటమి కూడా దృష్టి సారించింది. ఇందులో భాగంగా టిడిపి అధినేత చంద్రబాబు, జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ రెండు రోజులుగా చర్చలు జరుపుతున్నారు. రాష్ట్రంలో ఎక్కువ స్థానాలను జనసేన పార్టీ ఇక్కడి నుంచే ఆశిస్తోంది. 2019 ఎన్నికల్లో అత్యధికంగా 14 శాతం ఓట్లు ఆ పార్టీకి ఈ జిల్లాలో వచ్చాయి. ఈసారి కూడా ఆ పార్టీ ‘తూర్పు’పైనే ఆశలు పెట్టుకుంది. గతంలో జనసేన పార్టీకి దక్కిన ఏకైక స్థానం రాజోలు సైతం ఈ జిల్లా కావడంతో, ఈసారి దానికి తోడు మరిన్ని సీట్లు కైవసం చేసుకోవాలని చూస్తోంది. దానికనుగుణంగా పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ దాదాపు అర డజనకుపైగా సీట్లను ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి కేటాయించాలని టిడిపి ముందు ప్రతిపాదించినట్టు ప్రచారం సాగుతోంది.

జనసేన ఆశిస్తున్న స్థానాలు ఇవేనా?

జనసేన పార్టీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి ఆశిస్తున్న సీట్లలో ప్రధానంగా రాజోలు, రాజానగరం ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. వీటికి తోడు కాకినాడ రూరల్‌, పిఠాపురం, రాజమహేంద్రవరం రూరల్‌, ముమ్మిడివరం వంటి సీట్లు ఈ జాబితాలో ఉన్నట్టు సమాచారం. కొత్తపేట, రామచంద్రాపురం వంటి స్థానాల్లోనూ జనసేన పార్టీ ఆశావహులు చురుగ్గా కదులుతున్నారు. అమలాపురం, కాకినాడ ఎంపీ సీట్లను కూడా జనసేన పార్టీ లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. ఈ సీట్లలో జనసేన పార్టీకి వేటిని కేటాయిస్తారనే దానిపై ఇప్పటివరకూ స్పష్టతకు రాలేదు. టికెట్లు ఇంకా కేటాయించకపోయినా పిఠాపురం, రాజోలు, రాజానగరం నియోజకవర్గాల్లో జనసేన పార్టీ నాయకులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు.

టిడిపి సహకరిస్తుందా?

జనసేన అడుగుతున్న స్థానాల్లో టిడిపికీ బలమైన అభ్యర్థులు ఉన్నారు. రాజమహేంద్రవరం రూరల్‌ నియోజకవర్గం సిట్టింగ్‌ ఎమ్మెల్యే, సీనియర్‌ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఈ స్థానాన్ని వదిలే ప్రసక్తి లేదని చెబుతున్నారు. తాను రాజమండ్రి రూరల్‌ను ఖాళీ చేయాలంటే రాజమండ్రి సిటీ ఇవ్వాలనే ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. దీంతో, రాజమహేంద్రవరం రూరల్‌ సీటు కేటాయింపు టిడిపికి కత్తిమీద సాములా మారింది. పిఠాపురం మాజీ ఎంఎల్‌ఎ ఎస్‌విఎస్‌ఎన్‌.వర్మ చురుగ్గా ఎన్నికల ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇప్పటికే సమావేశాలు నిర్వహించి స్థానికతను ఆయన తెరపైకి తెచ్చారు. స్థానికేతరుడు అని జనసేన పార్టీ అభ్యర్థిపై వ్యతిరేకత పెంచే ప్రయత్నం కూడా ఆయన ప్రారంభించారు. ఇక్కడ సీటు జనసేన పార్టీకి కేటాయిస్తే గతంలో మాదిరిగా వర్మ రెబల్‌గా బరిలో దిగే అవకాశమూ లేకపోలేదు. 2019లో జనసేన పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన తొలి స్థానం ముమ్మిడివరం. ఈసారి కూడా జనసేన అభ్యర్థిగా అక్కడ నుంచి పితాని బాలకృష్ణ బరిలో ఉండే అవకాశం ఉంది. అయితే, ఇక్కడ టిడిపి నుంచి మాజీ ఎంఎల్‌ఎ దాట్ల బుచ్చిబాబు పోటీకి రెడీగా ఉన్నారు. జిల్లాలో క్షత్రియులకు కచ్చితంగా సీట్లు కేటాయించాల్సి వస్తే పిఠాపురం, ముమ్మిడివరం మాత్రమే టిడిపికి ఆప్షన్లుగా ఉన్నాయి. రాజోలులో ప్రస్తుతానికి జనసేన పార్టీకి లైన్‌ క్లియర్‌గా ఉన్నప్పటికీ టిడిపి మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు అనుయాయుల సహకారంపై అనుమానాలు ఉన్నాయి. సూర్యారావు ఇప్పటికే తన వ్యతిరేకతను వ్యక్తం చేశారు. రాజానగరంలో ఇప్పటికే ఆ సీటును జనసేన పార్టీకి కేటాయించడంతో టిడిపి శ్రేణులు ‘రా… కదలిరా’ సభలో చంద్రబాబు ముందే వ్యతిరేకత వ్యక్తం చేశాయి. చంద్రబాబు వాహనాన్ని కూడా అడ్డుకునే ప్రయత్నం చేశాయి. దీంతో, ఇక్కడ టిడిపి శ్రేణులు ఏ మేరకు సహకరిస్తారనేది ప్రశ్నార్థకంగా ఉంది. కాకినాడ రూరల్‌లో జనసేన పార్టీ నాయకుడు పంతం నానాజీకి టిడిపి నాయకులు సహకారం అందించడం లేదు. పొత్తులో ఆ సీటు జనసేన పార్టీకి కేటాయిస్తే టిడిపి సహకారం అనుమానమే.

➡️