ప్రజాస్వామ్యానికి చేటుకాలం

Dec 31,2023 11:22 #Cog, #Election Commission
  • చట్టసభలలో నియంతృత్వ పోకడలు
  • ప్రభుత్వ జేబు సంస్థలుగా ఈసీ, కాగ్‌
  • బిజెపిలోనూ పెరుగుతున్న సీల్డ్‌ కవర్‌ సంస్కృతి

న్యూఢిల్లీ   :   భారత ప్రజాస్వామ్య వ్యవస్థకు చేటు కాలం దాపురించిందని పలువురు పరిశీలకులు, రాజ్యాంగ నిపుణులు, సీనియర్‌ పాత్రికేయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల కమిషన్‌, కాగ్‌ వంటి ప్రజాస్వామిక సంస్థలపై మోడీ ప్రభుత్వ పెత్తనం పెరిగిపోతోందని వారు గుర్తు చేశారు. చివరికి భారత పార్లమెంట్‌ సైతం టర్కీ అధ్యక్షుడు రిసెప్‌ తయ్యిప్‌ ఎర్డగాన్‌కు చెందిన గ్రాండ్‌ నేషనల్‌ అసెంబ్లీ మాదిరిగా కన్పిస్తోందని వ్యాఖ్యానించారు. తమది ప్రజాస్వామిక పార్టీ అని ఘనంగా చెప్పుకునే బిజెపిలోనూ సీల్డ్‌ కవర్‌ సంస్కృతి ”వర్ధిల్లుతోంది”. ఇటీవల హిందీ రాష్ట్రాలైన మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌ శాసనసభ ఎన్నికలలో బీజేపీ సాధించిన విజయాలు మోడీలో సమధికోత్సాహాన్ని రేకెత్తించాయి. బీజేపీని సంస్థాగతంగా కేంద్రీకృతం చేసే పని దిగ్విజయంగా పూర్తయింది. ఆంతరంగిక నిపుణుల సలహా మేరకు అమిత్‌ షా నిర్ణయించిన వ్యక్తులే ముఖ్యమంత్రులు అయ్యారు. గతంలో మాదిరిగా పార్లమెంటరీ బోర్డు ఆమోదం, కేంద్ర పరిశీలకుల నివేదికలు వంటి ప్రక్రియలకు అవకాశమే లేకుండా పోయింది. దీనికి బదులుగా ముఖ్యమంత్రి పదవులకు అధిష్టానం ఎంపిక చేసిన వ్యక్తుల పేర్లతో ఉన్న సీల్డ్‌ కవర్లు తీసుకొని, కేంద్ర పరిశీలకులు రాష్ట్రాలకు వచ్చారు. వాటిని శాసనసభాపక్ష సమావేశాలలో తెరిచి, ముఖ్యమంత్రుల పేర్లను ప్రకటించారు. సీల్డ్‌ కవర్‌ సంస్కృతి అంటే అందరికీ తెలిసిందే. దానిని శాసనసభ్యులందరూ విధిగా గౌరవించి, శిరసావహించాల్సిందే. సీఎం అంటే తోలుబొమ్మేశాసనసభ్యులలో మెజారిటీ సభ్యుల అభిప్రాయం మేరకు ముఖ్యమంత్రిని ఎంచుకునే పాత రోజులు పోయాయి. ఇప్పుడు ఎంపికైన ముఖ్యమంత్రులు పార్టీ ఎమ్మెల్యేలకు కాకుండా అధిష్టానానికే జవాబుదారీగా ఉండాలి. అధిష్టానం చెప్పింది చేయడం…అంటే తోలుబొమ్మల్లా వ్యవహరించడం మినహా వారు చేసేదేమీ ఉండదు. కాదంటే తక్షణమే పదవి ఊడిపోతుంది. ఉత్తరాఖండ్‌లో తిరత్‌ సింగ్‌ రావత్‌ నాలుగు నెలల పాలనకు చివరికి ఏమైందో తెలుసు కదా!. సీల్డ్‌ కవర్‌ సంస్కృతి గుజరాత్‌తోనే మొదలైంది. 2021లో విజయ్ రూపానీ స్థానంలో భూపేంద్ర పటేల్‌ ముఖ్యమంత్రి కావడంతో ఇది మొదలైంది. అదే విధానం ఇప్పుడు భజన్‌లాల్‌ శర్మ, మోహన్‌ యాదవ్‌, విషుదేవ్‌ శారు ఎంపిక విషయంలోనూ కొనసాగింది. వీరి ఎంపికలో అనుసరించిన ఏకైక సూత్రం వీరి విధేయత… వీరి గురించి ఇతర రాష్ట్రాలలో ఎవరికీ తెలియదు. స్వరాష్ట్రంలోనూ తెలిసింది బహు తక్కువ మందికే. వీరికి ఉన్నదల్లా బీజేపీ అధిష్టానం మద్దతు. అంతే…

చట్టసభలోనూ నియంతృత్వ పోకడలే

ఇప్పుడు పార్లమెంటులో సైతం ఇదే తరహా నియంతృత్వ పోకడలు కన్పిస్తున్నాయి. ఇటీవల ముగిసిన శీతాకాల సమావేశాలలో 146 మంది ఎంపీలపై… (లోక్‌సభకు చెందిన వంద మంది, రాజ్యసభకు చెందిన 46 మంది…) సస్పెన్షన్‌ వేటు వేశారు. ఘనత వహించిన మోడీ పాలనలో 71 సందర్భాలలో సస్పెన్షన్లు, బహిష్కరణలు చోటుచేసుకోవడం గమనార్హం. 2019 నుండి సభ్యులను చీటికీమాటికీ సస్పెండ్‌ చేయడం సభాపతులకు ఆనవాయితీగా మారింది. శీతాకాల సమావేశాలలో ఈ ధోరణి పరాకాష్టకు చేరింది. లోక్‌సభలో స్పీకర్‌, రాజ్యసభలో ఛైర్మన్‌ ప్రతి రోజూ సభ్యుల పేర్లతో జాబితాను రూపొందించుకొని, క్రమశిక్షణను ఉల్లంఘించారని చెబుతూ వారి పేర్లు చదివి సస్పెండ్‌ చేసినట్లు ప్రకటించేవారు. ఓ సందర్భంలో అయితే సభలో లేని సభ్యుడి పేరు సైతం చదివారు. అయితే ఆ సభ్యుడు జరిగిన పొరబాటును ఎత్తిచూపడంతో నాలిక కరుచుకొని సస్పెన్షన్‌ను ఎత్తివేశారు.

ప్రశ్నించడమే నేరమా?

లోక్‌సభలో చొరబడిన యువకులపై చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద కేసులు పెట్టిన పోలీసులు వారు సభలో ప్రవేశించేందుకు వీలుగా పాస్‌లు ఇచ్చిన బీజేపీ ఎంపీని మాత్రం వదిలేశారు. ఎందుకంటే ఆయన తిలకధారుడు. నుదుటిపై త్రిశూలం నేపథ్యంలో విభూతి పెట్టుకుంటారు. ఇంతకీ సస్పెన్షన్‌కు గురైన ప్రతిపక్ష ఎంపీలు చేసిన మహాపరాధం ఏమిటంటే పార్లమెంటులో చోటుచేసుకున్న భద్రతా వైఫల్యంపై ప్రధాని, హోం మంత్రి సభలో ప్రకటన చేయాలని కోరడమే. ఇది వారికి ఉన్న చట్టబద్ధమైన హక్కు. గతంలో కూడా ప్రధానిని, కేంద్ర హోం మంత్రిని వివరణ కోరిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. సభ్యుల నిరసనల విషయంలో సభాపతులు ఉదారంగా వ్యవహరించే వారు.

అప్పుడలా…ఇప్పుడిలా

2001లో పార్లమెంటుపై దాడి జరిగినప్పుడు అప్పటి ప్రధాని వాజ్‌పేయి, హోం మంత్రి అద్వానీలు మోడీ-షా ద్వయం మాదిరిగా కాకుండా సభకు వచ్చి దాడిపై విచారణ జరుపుతున్నట్లు ప్రకటించారు. ఈ ఘటనపై ప్రభుత్వం ఉభయసభలలో స్వల్పకాలిక చర్చలకు కూడా అనుమతించింది. బీజేపీ ప్రతిపక్షంలో ఉండగా బగ్గు కేటాయింపులపై వారాలతరబడి సభా కార్యక్రమాలను స్తంభింపజేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు సభాపతులు పార్లమెంటరీ క్రమశిక్షణ ఉల్లంఘన అని దేని గురించి అయితే చెప్పారో మోడీ ప్రభుత్వంలో కీలక మంత్రులైన సుష్మా స్వరాజ్‌, అరుణ్‌ జైట్లీ అప్పట్లో దానిని తీవ్రంగా వ్యతిరేకించారు. 2012 సెప్టెంబర్‌ 7న సుష్మా స్వరాజ్‌ ఏమన్నారో ఓసారి గుర్తుకు తెచ్చుకోండి. ‘పార్లమెంట్‌ కార్యకలాపాలు సజావుగా సాగకుండా అడ్డుకోవడం ప్రజాస్వామిక నిరసనకు ఓ రూపం’. 2011 జనవరి 20న మోడీకి అత్యంత సన్నిహితుడైన జైట్లీ ఏమన్నారంటే ‘కొన్ని విషయాలను పార్లమెంట్‌ విస్మరిస్తుంటే సభను అడ్డుకోవడం అప్రజాస్వామికం కాదు’. వీరిద్దరూ ఇప్పుడు సజీవులై లేరు. కానీ అప్పటి వారి మాటలకు, ఇప్పటి మోడీ ప్రభుత్వ చేతలకు ఎక్కడా పొంతన లేదు.

ప్రతిపక్షాలు లేకుండా…

శీతాకాల సమావేశాలలో ప్రతిపక్ష సభ్యులు సభలో లేకుండానే కీలక బిల్లులన్నీ క్షణాల మీద ఆమోదం పొందాయి. క్రిమినల్‌ న్యాయ వ్యవస్థపై ప్రభావం చూపే మూడు బిల్లులను అమిత్‌ షా సభలో ప్రవేశపెట్టి మూజువాణీ ఓటుతో ఆమోదింపజేసుకున్నారు. వీటిపై మరింత చర్చ జరగాలంటూ సాక్షాత్తూ బీజేపీకి చెందిన మహిళా ఎంపీలు కోరినా అరణ్యరోదనే అయింది. అనేక ఇతర కీలక బిల్లులు సైతం ఎలాంటి చర్చ జరగకుండానే సభ ఆమోదం పొందాయి.

ఈసీ స్వతంత్రతకు విఘాతం

తాజాగా జరిపిన చట్ట సవరణ ప్రకారం ఇప్పుడు ఎన్నికల కమిషనర్ల నియామకం విషయంలో ప్రభుత్వం మాటే చెల్లుబాటు అవుతుంది. నియామక కమిటీలో గతంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సభ్యుడిగా ఉండేవారు. ఇప్పుడు ఆయన స్థానంలో ప్రధాని నియమించిన కేంద్ర మంత్రి ఒకరు సభ్యుడిగా ఉంటారు. ఇక కమిటీలో ప్రతిపక్ష నేత అభిప్రాయానికి విలువేముంటుంది? దీనిపై రిటైర్డ్‌ న్యాయమూర్తి, మాజీ సొలిసిటర్‌ జనరల్‌ రోహింటన్‌ ఎఫ్‌ నారిమన్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ బిల్లు ఎన్నికల కమిషన్‌ స్వతంత్రతను కాలరాస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మృతప్రాయమైన కాగ్‌

ఇక కాగ్‌ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ప్రభుత్వ వ్యవస్థలలోని లోపాలను ఎత్తిచూపే ఈ సంస్థ ఇప్పుడు పూర్తిగా నిర్వీర్యమైపోయింది. 2020లో గుజరాత్‌ కేడర్‌ అధికారి గిరీష్‌ ముర్మును అధిపతిగా నియమించినప్పుడే కాగ్‌ మృతప్రాయమైంది. ప్రధాని మోడీకి ముర్ము నమ్మకస్తుడైన సహాయకుడు. మోడీ గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. అమిత్‌ షాతో కూడా ఆయన కలిసి పనిచేశారు. ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలలో జరిగిన తప్పులను ఎత్తి చూపడానికే ముర్ము పరిమితమాయ్యరు. కేంద్ర ఖాతాల పరిశీలనను ఆయన ఉద్ద్దేశపూర్వకంగానే దాటవేశారు. అయినప్పటికీ ఆ వ్యవస్థలోని కొందరు నిజాయితీపరులైన అధికారుల కారణంగా కేంద్ర ప్రాజెక్టులలో లసుగులపై అనేక నివేదికలు వెలుగు చూశాయి. అయితే అలాంటి అధికారులకు బదిలీలే బహుమతులయ్యాయి. ఆయుష్మాన్‌ భారత్‌, ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వే అమలులో జరిగిన అవకతవకలను ఆ అధికారులు ఎత్తిచూపారు. కాగ్‌ సమర్పించిన కొన్ని నివేదికలైతే పార్లమెంట్‌ ముందుకు సైతం రాలేదు.ఏదేమైనా మోడీ హయాంలో ప్రజాస్వామిక సంస్థలన్నీ నిస్తేజమైపోయాయని, ప్రభుత్వ అడుగులకు మడుగులత్తే సంస్థలుగా మారాయని సీనియర్‌ పాత్రికేయుడు పి.రామన్‌ వ్యాఖ్యానించారు.

➡️