బిజెపి హటావో దేశ్‌ బచావో

Jan 8,2024 10:56 #BJP hatao desh bachao, #DYFI, #Rally
  • టిఎంసి హటావో బెంగాల్‌ బచావో
  • డివైఎఫ్‌ఐ భారీ ర్యాలీలో వక్తల పిలుపు

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : దేశాన్ని కాపాడేందుకు కేంద్రంలో మతతత్వ-కార్పొరేట్‌ అనుకూల బిజెపి ప్రభుత్వాన్ని ఓడించాలని, అవినీతి, హింసతో బెంగాల్‌ను భ్రష్టు పట్టించిన తృణమూల్‌ కాంగ్రెస్‌ను ఇంటికి సాగనంపాలని ఆదివారం నాడిక్కడ జరిగిన డివైఎఫ్‌ఐ మహా ర్యాలీ పిలుపునిచ్చింది. ప్రజాసమస్యలపై పోరాటాన్ని రెట్టించిన పట్టుదలతో కొనసాగిస్తామని ప్రతిన బూనింది. అందరికీ విద్య, ఉపాధి కల్పించాలని, అవినీతి, హింసను రూపుమాపాలని, సామాన్య ప్రజల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బెంగాల్‌ డివైఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ చేపట్టిన రాష్ట్రవ్యాపిత ఇన్సాఫ్‌ యాత్ర 50 రోజుల పాటు 22 జిల్లాల్లో 2,400 కి.మీ పొడవునా సాగింది. ఈ యాత్ర ముగింపు సందర్భంగా కొల్‌కతాలోని బ్రిగేడ్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో నిర్వహించిన మహా ర్యాలీకి రాష్ట్ర నలుమూలల నుంచి యువత దండులా కదలివచ్చింది. వీరికి వ్యవసాయ కార్మిక సంఘం సంఘీభావం తెలిపింది. నగరంలోని ఏడు సెంటర్ల నుంచి ప్రదర్శనగా బయల్దేరి కొల్‌కతా పుర వీధుల గుండా సాగి బ్రిగేడ్‌ పరేడ్‌ మైదానానికి చేరింది. ‘బిజెపి హటావో దేశ్‌ బచావో, టిఎంసి హటావో బెంగాల్‌ బచావో’ అంటూ నినాదాలతో గర్జించారు. ‘పని హక్కు, విద్య హక్కు అమలు కావాలి, అవినీతి, అల్లర్లను తరిమికొట్టాలి, దేశాన్ని, బెంగాల్‌ను కాపాడాలి’ వంటి నినాదాలతో కొల్‌కతా హౌరెత్తింది. అంతకుముందు కళాకారులు గీతాలు, సంగీత నృత్యాలతో ప్రజలను ఆలోచింపజేశారు. ఈ ర్యాలీకి తరలివచ్చిన అశేష జనవాహినితో బ్రిగేడ్‌ పరేడ్‌ మైదానం పులకించిపోయింది. ర్యాలీలో పాల్గొనేందుకు వచ్చిన వారిని కొన్ని చోట్ల పోలీసులు అడ్డుకున్నారు. డార్జిలింగ్‌ వంటి సుదూర ప్రాంతాల నుంచి అనేక కష్ట నష్టాలకోర్చి యువతీ యువకులు ఒక రోజు ముందుగానే కొల్‌కతా నగరానికి చేరుకున్నారు. దేశ సమైక్యత, సమగ్రతలను కాపాడతామని ర్యాలీలో పాల్గొన్న వారంతా ప్రతిన బూనారు. వీరిచేత డిఐఎఫ్‌ఐ బెంగాలÊ రాష్ట్ర కార్యదర్శి మీనాక్షి ముఖర్జీ ఈ ప్రమాణం చేయించారు. మాజీ ముఖ్యమంత్రి , డివైఎష్‌ఐ మొట్ట మొదటి కార్యదర్శి బుద్ధ దేవ్‌ భట్టాచార్య ఇన్సాఫ్‌ ర్యాలీకి తన సందేశాన్ని పంపారు. ఈ ర్యాలీ నుద్దేశించి డివైఎఫ్‌ఐ అఖిల భారత మాజీ అధ్యక్షులు మహ్మద్‌ సలీం,డివైఎఫ్‌ఐ ఆలిండియా అధ్యక్ష, కార్యదర్శులు ఎఎ రహీం, హిమఘ్నరాజ్‌ భట్టాచార్య, డివైఎఫ్‌ఐ పశ్చిమ బెంగాల్‌ రాష్ట్ర మాజీ కార్యదర్శి అవాస్‌ రారు చౌదరి, డివైఎఫ్‌ఐ పశ్చిమ బెంగాల్‌ రాష్ట్ర అధ్యక్షులు ధ్రువజ్యోతి సాహా, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి సృజన్‌ భట్టాచార్య తదితరులు మాట్లాడారు.

మహ్మద్‌ సలీం తొలుత మాట్లాడుతూ.. రాష్ట్రంలోని టిఎంసికి వ్యతిరేకంగా తమ పోరాటాన్ని కొనసాగిస్తాయని స్పష్టం చేశారు. ‘ఒకప్పుడు పాకిస్తాన్‌, పుల్వామా దాడులు పేరుతో జాతీయవాద భావాలను రెచ్చగొట్టడానికి ప్రయత్నించిన వారు (2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు) ఇప్పుడు కులం, మతాల ఆధారంగా ప్రజల మధ్య విభేదాలను సృష్టిస్తున్నారని విమర్శించారు. కేంద్ర దర్యాప్తు సంస్థల నుండి తమ నాయకులను రక్షించడానికి ‘బిజెపితో టిఎంసి అంతర్గత అవగాహన’ కలిగి ఉందని దుయ్యబట్టారు.

అసలు ఆట ఇప్పుడు మొదలైంది : మీనాక్షి ముఖర్జీ

డివైఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి మీనాక్షి ముఖర్జీ మాట్లాడుతూ.. బ్రిగేడ్‌ పరేడ్‌ గ్రౌండ్‌లోని ఈ మైదానంలో డివైఎఫ్‌ఐ ఇన్సాఫ్‌ యాత్ర ముగిసిందని, అయితే తమ అసలు పోరాటం ఇక్కడి నుంచే మొదలైందని అన్నారు. ఇప్పుడు మనం ఆడాల్సింది ‘టెస్టు మ్యాచ్‌లు’ తప్ప ‘టి-20’ కాదు. మొత్తం వ్యవస్థను మార్చేందుకు పోరాడాలి. రాష్ట్రంలోని ప్రతి ప్రాంతానికి చెందినవారు ఇందులో కలసి రావాలని కోరారు. ‘ఆట’ మొదలెట్టేందుకు మైదానాన్ని తమ అధీనంలోకి తీసుకోడానికి పశ్చిమ బెంగాల్‌ యువత వచ్చారని మీనాక్షి ముఖర్జీ అన్నారు. ‘మేము న్యాయం కోసం పోరాటంలోకి ప్రవేశించాం, వెనక్కి తగ్గే ప్రశ్న లేదు. న్యాయం కోసం పోరాటం తాత్కాలికమైనది కాదు, నిరంతరమైనదని ఆమె స్పష్టం చేశారు. డివైఎఫ్‌ఐ అఖిల భారత అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎఎ రహీం, హిమఘ్నరాజ్‌ భట్టాచార్య మాట్లాడుతూ.. దేశంలో నిరుద్యోగం, అవినీతి, యవతకు ద్రోహం వంటి వాటి వల్ల యువత కలలు పూర్తి కాలేదని అన్నారు. దేశంలో 23.5 శాతం యువత ఉద్యోగం లేక నిరుద్యోగులుగా ఉన్నారని, అందులో మీ కుటుంబ సభ్యులు, మీ స్నేహితులు, మీ పక్కింటి వారు ఉన్నారని గుర్తు చేశారు. దేశంలో నిరుద్యోగం, అవినీతి తీవ్రమైన సమస్యలని అన్నారు. ‘మోడీ పకోడీలు వేసుకోమంటున్నారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దిండ్లు చేసుకోమంటున్నారు’ అని విమర్శించారు.

పశ్చిమ బెంగాల్‌ సంస్కృతి, కళలకు కేంద్రమని, అయితే మమతా బెనర్జీ హయాంలో బెంగాల్‌ అవినీతికి, బంధుప్రీతికి రాజధానిగా మారిందని ఎద్దేవా చేశారు. ఈ ర్యాలీ మన వర్తమానాన్ని దోచుకుని, మన భవిష్యత్తును తాకట్టు పెట్టే వారికి మేల్కొలుపు అని అన్నారు. ఈ సందేశం కోల్‌కతా నుండి ఢిల్లీ వరకు ప్రతిధ్వనించాలని పిలుపునిచ్చారు. యువత కలలను ముక్కలు చేస్తే వారు మౌనంగా ఉండరని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించారు. తాము ఐక్యం అవుతామని, నిరుద్యోగం, అవినీతికి వ్యతిరేకంగా హిందూ, ముస్లీం, క్రైస్తవ, ఆదివాసులందరం ఐక్యమై పోరాడుతామని అన్నారు.

➡️