కాల్‌సెంటర్ల లొల్లి

May 17,2024 20:38

ఐవిఆర్‌ఎస్‌ ద్వారా సర్వే

వస్తున్న ఫోన్లతో విసిగిపోతున్న ప్రజలు

ప్రజాశక్తి-విజయనగరం కోట : ‘నమస్కారం! ఇటీవల జరిగిన ఎన్నికలపై ప్రజాభిప్రాయ సేకరణ చేపడుతున్నాం. ఇందులో ఏ రాజకీయ పార్టీ ప్రమేయం లేదు. ఎన్నికల్లో మీరు ఏ పార్టీకి ఓటు వేశారు? సైకిల్‌ గుర్తుకు ఓటు వేస్తే ఒకటి నొక్కండి. ఫ్యాను గుర్తుకు ఓటు వేస్తే రెండు నొక్కండి. హస్తం గుర్తుకు ఓటు వేస్తే మూడు నొక్కండి. మరెవరికైనా ఓటు వేస్తే నాలుగు నొక్కండి’నాలుగు రోజులుగా ఇదీ వరుస. వరుసపెట్టి ఫోన్లు దంచుతున్నాయి. ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు ప్రతీ ఓటరుకు కనీసం రోజులో నాలుగు సార్లు కాల్‌సెంటర్ల నుంచి ఫోన్లు వస్తున్నాయి. ఎవరికి ఓటు వేశారో చెప్పాలని ఐవిఆర్‌ఎస్‌ సర్వేను చేపడుతున్నాయి. ఈ ఫోన్‌కాల్స్‌తో జనం విసిగిపోతున్నారు.ఈ నెల 13న జిల్లాలో ఎన్నికలు ముగిశాయి. అభ్యర్థుల భవితవ్యం ఇవిఎంలలో నిక్షిప్తమైంది. ఎన్నికల ముందు ఆయా రాజకీయ పార్టీలు అభ్యర్థులు, ప్రభుత్వ పథకం అమలు తీరు, ఆయా పార్టీల నాయకులు పనితీరు గురించి ఫోన్లకు ఐవిఆర్‌ఎస్‌ సర్వే ద్వారా వివరాలు అడిగి తెలుసుకునే వారు. ఎన్నికలు పూర్తయిన తర్వాత కూడా వదలడం లేదు. ఎవరికి ఓటు వేశారో? సర్వే ద్వారా వివరాలను సేకరించే పని చేపడుతున్నారు. ఇప్పటికే ఎన్నికలు ముగియడంతో ఎవరి గెలుపు ధీమాతో వారున్నారు. అయితే జిల్లాలో కొన్ని నియోజకవర్గాల్లో గట్టి పోటీ ఉండటంతో ఎవరు గెలుస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో గెలుపుపై అంచనా వేయడంలో ఇరు పార్టీల నాయకులు తలమునకలై ఉన్నారు. జిల్లాలో దాదాపు అన్ని నియోజకవర్గాల్లోనూ వైసిపి, టిడిపి, జనసేన కూటమి మధ్య పోటాపోటీ ఉంది. దీంతోపాటు ఇండియా వేదిక అభ్యర్థులు గట్టి పోటీ ఇచ్చేలా ప్రచారం చేశారు. దీంతో ఎవరి ఓట్లు చీలిపోతాయేనని భయం ప్రధానంగా అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య నెలకొంది. బయటకు ‘మేమే గెలుస్తాం’ అంటూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నా, గట్టి పోటీ నెలకొందనే భావన వచ్చింది. దీంతోపాటు కొన్ని నియోజకవర్గాల్లో క్రాస్‌ ఓటింగ్‌ బెడద అభ్యర్థులను తీవ్రంగా ఆలోచించేలా చేస్తోంది. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలో ఉన్న ప్రజలు ఎటువైపు ఓటు వేశారో తెలుసుకునే ప్రయత్నం ఐవిఆర్‌ఎస్‌ సర్వే ద్వారా చేస్తున్నారు.మనకెందుకులే! సర్వే ఫోన్లు రావడంతో పార్టీ కార్యకర్తలు, నాయకులైతే వారు ఏ పార్టీకి ఓటు వేశారో చెప్పగలుగుతున్నారు. అంతే తప్ప మధ్యతరగతి, సామాన్య ప్రజలు, రాజకీయ పార్టీలకు దూరంగా ఉంటున్న వారు మాత్రం వాటిని రిజెక్ట్‌ చేస్తున్నారు. వారు వీరు అని కాకుండా ప్రతిఒక్కరికీ ఫోన్‌ చేసి అభిప్రాయాలు సేకరించే పనిలో ఉండటం వల్ల ప్రజలెవరూ దానికి సమాధానం చెప్పకుండా కాల్‌ కట్‌ చేస్తున్నారు. ఎవరికి ఓటు వేశామో చెప్పడం వల్ల మనం ఓటు వేసిన వారు అధికారంలోకి రాకుంటే, ఫోన్‌ ద్వారా సమాచారం సేకరించిన వారు రానున్న కాలంలో నష్టం చేసే అవకాశముంటుందని భావించి సర్వే ఫోన్‌ నంబర్లను రిజెక్ట్‌ చేస్తున్నారు. ఓటింగ్‌ జరిగిన తర్వాత కూడా ఫోన్ల ద్వారా సర్వే చేస్తున్నారంటే పోటీ తీవ్రత ఏ విధంగా ఉందో అర్థమవుతోంది. దీంతోపాటు అభ్యర్థులు కోట్లాది రూపాయలు ఖర్చు చేసి ఎన్నికల్లో పోటీ చేయడం వల్ల నష్టం జరుగుతుందేమోనన్న ఆందోళనలో ఉన్నారనడానికి నిదర్శనం. ఏదేమైనా ఫోన్ల ద్వారా విసిగించేలా సర్వే చేయడమనేది వ్యక్తి స్వేచ్ఛకు భంగం కలిగించడం తప్ప మరొకటి కాదనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. ఇటువంటి ఫోన్‌కాల్స్‌ను ఎన్నికల సంఘం నియంత్రించాలని కొంతమంది కోరుతున్నారు.

➡️