2016-17 నుండి రెండింతలకు పైగా పెరిగిన చెలామణీలో ఉన్న నగదు

ముంబయి : 2016-17 నుండి చెలామణిలో ఉన్న నగదు రెండింతలకు పైగా పెరిగింది. పెద్ద నోట్ల రద్దు మరియు యుపిఐ (డిజిటల్‌ చెల్లింపులు) ప్రారంభం కావడం, అలాగే దశల వారీగా రూ.2,000 నోట్లను ఉపసంహరించుకోవడం వంటివి చెలామణీలో ఉన్న నగదు పెరగడానికి ప్రధాన కారణాలుగా సర్వే తేల్చింది. హెచ్‌ఎస్‌బిసి పిఎంఐ (హెచ్‌ఎస్‌బిసి ఇండియా మాన్యుఫ్యాక్చరింగ్‌ పర్చేజింగ్‌ మేనేజర్స్‌ ఇండెక్స్‌) మరియు సిఎంఎస్‌ (క్యాష్‌ మేనేజ్‌మెంట్‌ సర్వీసెస్‌) నగదు సూచీలు నగదు మరియు డిజిటల్‌ చెల్లింపులు రెండింటిలో వృద్ధిని కనబరుస్తూ నగదు నిరంతర పెరుగుదలను నొక్కి చెప్పాయి.

చెలామణిలో ఉన్న నగదు పెరుగుతూ ఉందని, 2017 మార్చిలో రూ.13.35 లక్షల కోట్లుగా ఉండగా, 2024 మార్చి చివరి నాటికి రూ.35.15 లక్షల కోట్లకు చేరుకుంది. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బిఐ) 2023 మేలో చెలామణిలో ఉన్న రూ.2000 నోట్లను వెనక్కు తీసుకోవాలని నిర్ణయం తీసుకుంది. ఫలితంగా బ్యాంకుల నుండి సెంట్రల్‌ బ్యాంక్‌ 97.83 శాతం రూ.3.56 లక్షల కోట్ల విలువైన రూ.2,000 నోట్లను పొందింది.

2016లో యుపిఐ ద్వారా డిజిటల్‌ చెల్లింపులు ప్రారంభమైనప్పటికీ.. 2020 కరోనా మహమ్మారి అనంతరం వేగాన్ని అందుకుని, దాదాపు తొమ్మిది రెట్లు పెరిగింది. నెలవారీ యుపిఐ చెల్లింపుల విలువ మార్చి 2020లో రూ.2.06 లక్షల కోట్లు ఉండగా, ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి రికార్డు స్థాయిలో రూ.18.07 లక్షల కోట్లకు చేరాయి.
నగదు చెలామణి అధికంగా పండుగ సమయాల్లో, సార్వత్రిక ఎన్నికలకు ముందు ఉంటుందని ఆర్‌బిఐ అంచనా వేసింది. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ రంగంలో గణనీయమైన వృద్ధి సాధించిన సమయంలో నగదు డిమాండ్‌ అధికంగా ఉంటుందని పేర్కొంది.

నగదు నిర్వహణ, ఇతర వ్యాపార సేవలను అందించే సిఎంఎస్‌ ఇన్‌ఫో సిస్టమ్స్‌తో పాటు హెస్‌బిసి పర్చేజింగ్‌ మేనేజర్స్‌ ఇండెక్స్‌ సూచీ (పిఎంఐ)తో పాటు ట్రెండింగ్‌లోకి వచ్చాయి. సిఎంఎస్‌ ఇండెక్స్‌ సూచీని 2017లో ప్రారంభించారు. 2017 ఏప్రిల్‌లో సిఎంఎస్‌ నగదు ఇండెక్స్‌ 100కి పెరగగా, మార్చి 2024 నాటికి 1256కి చేరుకుంది. అదే సమయంలో హెచ్‌బిసి పిఎంఐ నగదు సూచీ 100 నుండి 117కి చేరుకుంది. వాణిజ్య కార్యకలాపాల స్థాయి, నగదు ఖర్చు మధ్య బలమైన సంబంధం ఉన్నట్లు ఈ సూచీలు స్పష్టం చేస్తున్నాయి.

ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందడానికి, చెల్లింపుల్లో అన్ని రకాల లావాదేవీలను అనుమతించాల్సి వుంటుంది. నగదు చెల్లింపులు మొబైల్‌, ఎలక్ట్రానిక్‌, ఇతర రకాల డిజిటల్‌ చెల్లింపులకు ఒక అనివార్యమైన కారకంగా మారాయని సిఎంఎస్‌ అధ్యక్షుడు అనుష్‌ రాఘవన్‌ తెలిపారు. భారత్‌ వంటి వినియోగ ఆధారిత ఆర్థిక వ్యవస్థకు ఈ సమతుల్యత చాలా అవసరం. ఇక్కడ ఖర్చుచేసే నగదు విలువ మొత్తం ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేస్తుంది.

సిఎంఎస్‌ నగదు సూచీ రెండు కారకాలతో కూడుకున్న సమర్థవంతమైన సూచిక. ఎటిఎం ద్వారా చెల్లింపులు, వ్యవస్థీకృత రిటైల్‌ ఛానెల్స్‌ నుండి వినియోగదారుల కొనుగోళ్ల తర్వాత సేకరించిన నగదు రెండింటినీ పరిగణనలోకి తీసుకుంటుంది. దేశవ్యాప్తంగా నగరాలు, పట్టణాల్లో జరిగిన చెల్లింపులను సిఎంఎస్‌ నగదు సూచీ లెక్కలోకి తీసుకుంటుంది.

సిఎంఎస్‌ ఇన్‌ఫో సిస్టమ్స్‌ ”అన్‌ఫోల్డింగ్‌ ఇండియాస్‌ కన్జప్షన్‌ స్టోరీ 2024” విడుదల చేసిన తాజా నివేదికలో వినియోగదారుల అవసరాలు, ఎఫ్‌ఎంసిజి సెక్టార్‌, ప్రయాణాలు, ఎంటర్‌టైన్‌మెంట్‌ సంబంధిత చెల్లింపులు అధికంగా ఉన్నట్లు తెలిపింది. 2023-24 సంవత్సరంలో చెల్లింపుల కోసం ఎటిఎం నుండి నగదు విత్‌డ్రాలు ఢిల్లీ, తమిళనాడు, ఉత్తరప్రదేశ్‌, పశ్చిమబెంగాల్‌, కర్ణాటకలలో అత్యధికంగా పెరిగాయని నివేదిక తెలిపింది.

➡️