‘కనీస మద్ధతు ధర’కు కేంద్రం కొర్రీలు

Center Corries for 'Minimum Support Price'
  •   రూ.17 లక్షల కోట్ల భారమంటూ తప్పుడు ప్రచారం 
  • అన్నదాతకు కేంద్రం బడ్జెటరీ మద్దతు కరువు

న్యూఢిల్లీ : కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి)కు చట్టపరమైన గ్యారంటీ ఇవ్వాలంటూ రైతులు గ్రామీణ భారత్‌ బంద్‌ను విజయవంతంగా నిర్వహించారు. ‘ఢిల్లీ చలో’ కార్యక్రమం ఐదోరోజూ కొనసాగింది. కార్పొరేట్లకు ఏటా లక్షల కోట్ల రూపాయలు కట్టబెడుతున్న మోడీ సర్కారు ఎంఎస్‌పికి చట్టబద్ధత కల్పిస్తే ప్రభుత్వానికి ఆర్థికంగా భారం పడుతోందంటూ తప్పుడు వాదనలను ముందుకు తెస్తోంది. తనకు అనుకూలంగా ఉన్న మీడియాకు తప్పుడు సమాచారాన్ని అందిస్తూ ప్రజలను గందరగోళంలో పడేసే ప్రయత్నం చేస్తోంది. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని, ఎంఎస్‌పికి చట్టపరమైన గ్యారంటీ ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ రైతన్నలు గతంలో దేశ రాజధానిలో సుదీర్ఘ ఆందోళన సాగించిన విషయం తెలిసిందే. రైతుల నిరసనకు తలవంచిన మోడీ ప్రభుత్వం వ్యవసాయ చట్టాలను రద్దు చేసినప్పటికీ కనీస మద్దతు ధర అమలు చేయడం లేదు.

ప్రైవేటు కొనుగోలుదారులపై ఒత్తిడి తెస్తే…

రెండు రకాలుగా కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించవచ్చునని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. అందులో మొదటిది… పంట ఉత్పత్తులకు ఎంఎస్‌పి చెల్లించాలని ప్రైవేటు కొనుగోలుదారులపై ఒత్తిడి తేవడం. ఈ పద్ధతిలో ఎంఎస్‌పి కంటే తక్కువ ధరకు ఏ పంటనూ కొనుగోలు చేయకూడదు. మార్కెట్లలో జరిగే వేలంలో కూడా ఎంఎస్‌పియే ప్రారంభ ధరగా ఉంటుంది. ప్రైవేటు కొనుగోలుదారులు ఎంఎస్‌పి చెల్లించడానికి ఓ పద్ధతి ఉంది. చెరకు పంటకు సంబంధించి కేంద్రం నిర్ణయించిన గిట్టుబాటు ధరకే చక్కెర మిల్లులు పెంపకందారులకు ధరను చెల్లించాల్సి ఉంటుంది. దీనికి చట్టబద్ధత ఉంది. ఉత్తరప్రదేశ్‌, హర్యానా రాష్ట్రాలు కేంద్రం సూచించిన ధర కంటే ఎక్కువ ధరనే నిర్ణయిస్తున్నాయి. సరఫరా చేసిన 14 రోజుల్లో సొమ్ము చెల్లించాల్సి ఉంటుంది. మరే ఇతర పంటలోనూ ప్రభుత్వం ప్రకటించిన ఎంఎస్‌పి ప్రైవేటు వ్యాపారులు చెల్లించాలన్న నిబంధన లేదు.

ప్రభుత్వమే కొనుగోలు చేస్తే…

ఇక రెండో మార్గం… రైతులు పండించిన పంట మొత్తాన్ని ప్రభుత్వమే ఎంఎస్‌పికి కొనుగోలు చేయడం. దీనివల్ల ప్రభుత్వంపై అదనపు ఆర్థిక భారం పడుతుంది. 2019-20లో ఎఫ్‌సిఐ, భారత జాతీయ వ్యవసాయ మార్కెటింగ్‌ సమాఖ్య, కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా వంటి ప్రభుత్వ సంస్థలు 77.34 మిలియన్‌ టన్నుల ధాన్యాన్ని, 38.99 మిలియన్‌ టన్నుల గోధుమలను సేకరించాయి. ధాన్యం సేకరణ కోసం రూ.140,834 కోట్లు, గోధుమల సేకరణ కోసం రూ.75,060 కోట్లు చెల్లించాయి. దీంతో పాటు రూ.28,202 కోట్లతో 105.23 పత్తి బేళ్లను కూడా కొనుగోలు చేశాయి. రూ.10,238 కోట్ల ఎంఎస్‌పితో 2.1 మిలియన్‌ టన్నుల శనగలు, రూ.4,176 కోట్లతో 0.7 మిలియన్‌ టన్నుల బఠానీలు, రూ.3,614 కోట్లతో వేరుశనగ, రూ.3,540 కోట్లతో 0.8 మిలియన్‌ టన్నుల మినుములు, రూ.987 కోట్ల ఖర్చుతో 0.1 మిలియన్‌ టన్నుల పెసలను కూడా ప్రభుత్వం కొనుగోలు చేసింది.

వాస్తవానికి దూరంగా…

ఎంఎస్‌పీకి చట్టబద్ధత కల్పిస్తే ప్రభుత్వ ఖజానాపై రూ.17 లక్షల కోట్ల భారం పడుతుందని మోడీ సర్కారు చెబుతోంది. ఈ వాదనలో ఏ మాత్రం వాస్తవం లేదు. లక్షిత పథకం లేదా ధరల స్థిరీకరణ నిధిలో భాగంగా ఎంఎస్‌పి చెల్లింపుల కోసం ప్రభుత్వంపై పడే భారం రూ.50 వేల కోట్లకు మించదని నిపుణులు స్పష్టం చేశారు. ఎంఎస్‌పి వర్తించే 23 పంటల మొత్తం ఉత్పత్తి విలువ 2019-20లో రూ.10.78 లక్షల కోట్లు. పైగా ఈ ఉత్పత్తులన్నింటినీ మార్కెట్‌ చేయరు. వీటిలో కొంత భాగాన్ని రైతులు సొంత అవసరాల కోసం భద్రపరచుకుంటారు. తదుపరి పంట కోసం విత్తనాలుగా వినియోగిస్తారు. పశువుల దాణాకు కూడా ఉపయోగిస్తారు.

ఇదంతా పోను మార్కెట్‌కు చేరే పంట విలువ రూ.8 లక్షల కోట్లు ఉంటుంది. ప్రభుత్వం ఇప్పటికే ధాన్యం, గోధుమలు, పత్తి, పప్పులు, చమురు గింజలను ఎంఎస్‌పికి కొనుగోలు చేస్తోంది. చెరకును చక్కెర మిల్లులే కొంటున్నాయి. కాబట్టి ప్రభుత్వంపై పడే అదనపు భారం పెద్దగా ఉండదు.

అడుగడుగునా వివక్షే

రైతుల విషయంలో ప్రభుత్వం వివక్ష చూపుతోంది. రైతులకు బడ్జెటరీ మద్దతు ఉండడం లేదు. వ్యవసాయం, దాని అనుబంధ కార్యకలాపాల కోసం బడ్జెటరీ కేటాయింపులు తగ్గిపోతున్నాయి. 2022-23లో వాస్తవ వ్యయంతో పోలిస్తే ఈ కేటాయింపులు 22.3% తగ్గాయి. 2023-24 సవరించిన బడ్జెట్‌లో సైతం 6% తగ్గాయి. మోడీ ప్రభుత్వం వరుసగా పదోసారి రైతు వ్యతిరేక బడ్జెట్‌ ప్రవేశపెట్టిందని ఇటీవల ఆల్‌ ఇండియా కిసాన్‌ సభ (ఎఐకెఎస్‌) విమర్శించింది. రైతులు దీర్ఘకాలంగా డిమాండ్‌ చేస్తున్న ఎంఎస్‌పికి బడ్జెట్‌లో కేటాయింపులే లేవని గుర్తు చేసింది.

కోతల బడ్జెట్‌…

2022-23లో వ్యవసాయ సబ్సిడీకి అయిన వాస్తవ ఖర్చుతో పోలిస్తే 2024-25లో రూ.87,339 కోట్లు తక్కువ కేటాయించారు. ఆహార సబ్సిడీ కేటాయింపులో కూడా రూ.67,552 కోట్ల కోత పడింది. గ్రామీణాభివృద్ధి పథకాలు, ప్రధానమంత్రి కిసాన్‌ సంచాయి యోజన, సహకారం, ఆహార నిల్వ-గిడ్డంగులు, ప్లాంటేషన్‌, వరద నివారణ-డ్రైనేజీ, భూసంస్కరణలు, ఎరువుల సబ్సిడీ, ఆహార సబ్సిడీ, పాడి పరిశ్రమ అభివృద్ధి, నేల-నీటి పరిరక్షణ, నీటిపారుదల, పౌష్టికాహారం, గ్రామీణ రోడ్లు, గృహ నిర్మాణం, విద్య, ఆరోగ్య రంగాలకు కూడా బడ్జెట్‌లో కోత విధించారు. రైతులు, గ్రామీణ ప్రాంతాలకు బడ్జెట్‌లో మోడీ ప్రభుత్వం తగినంత ప్రాధాన్యత ఇవ్వడం లేదు. ప్రభుత్వం తన ద్రవ్య విధానంలో ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహిస్తోంది. రైతుల సంక్షేమాన్ని, ఆర్థిక బాగోగులను ఫణంగా పెట్టి కార్పొరేట్‌ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తోంది.

➡️