జాయింట్‌ ఎల్‌పిఎమ్‌లతో చిక్కులు : తలలు పట్టుకుంటున్న రైతులు

Jan 1,2024 11:44 #farmers
  • సర్వేయర్లపై సర్కారు నెపం
  • ఆర్‌ఒఆర్‌ అభ్యంతరాలపై అప్పీల్‌కు ఏడాది గడువు

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : భూముల రీ సర్వే చేసిన గ్రామాల్లో జాయింట్‌ ఎల్‌పిఎమ్‌లు రైతులకు చిక్కులు తెచ్చిపెట్టింది. రీ సర్వే గ్రామాల్లో ల్యాండ్‌ పార్శిల్‌ మ్యాపింగ్‌ (ఎల్‌పిఎమ్‌) జాయింట్‌గా చేయకూడదని సర్వే తొలిదశలో స్పష్టం చేయకపోవడంతో అనేక గ్రామాల్లో ఇద్దరు, ముగ్గురు రైతుల మొదలు కొన్ని చోట్ల పది మందికి కూడా జాయింట్‌ ఎల్‌పిఎమ్‌లు తయారుచేశారు. క్షేత్రస్థాయిలో రైతులు ఎదురుతిరగడంతో ఆ నెపాన్ని గ్రామ సర్వేయర్లపై నెట్టేందుకు ప్రభుత్వం పూనుకోవడం గమనార్హం. ఇందులో భాగంగానే జాయింట్‌ ఎల్‌పిఎమ్‌లపై లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని మౌఖికంగా ఆదేశించింది. వారి సమాధానం సరిగ్గా లేకపోతే కొందరు సర్వేయర్లపై చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతున్నట్లు తెలిసింది. భూములు రీ సర్వే చేస్తున్న గ్రామాల్లో జాయింట్‌ ఎల్‌పిఎమ్‌లు సృష్టించడంతో ఆయా భూములకు సంబంధించి సర్వే నెంబర్లు రైతులకు ఉమ్మడిగా వస్తున్నాయి. వేర్వేరుగా రావడం లేదు. దీంతో ఆయా గ్రామాల్లో భూ యజమానుల మధ్య గొడవలు చోటుచేసుకుంటున్నాయి. బ్యాంకు లోన్లు, ప్రభుత్వ సబ్సిడీలు అందే పరిస్థితి కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ఎదుర్కొంటున్న సమస్యలను రైతులు, ప్రజా సంఘాలు, రైతు సంఘాల ప్రతినిధులు ఉన్నతాధికారుల దృష్టికి, అర్జీల రూపంలో ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. వీటిపై స్పందించిన ప్రభుత్వం రైతులు జాయింట్‌ ఎల్‌పిఎమ్‌లకు అంగీకరిస్తేనే అలా చేయాలని, లేని పక్షంలో వ్యక్తిగతంగా సర్వే నెంబరు, సబ్‌ డివిజన్‌ వారీ ఎల్‌పిఎమ్‌ నెంబర్లు కేటాయించాలని పేర్కొంది. ఈ విషయంలో కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపింది. ఇందులో భాగంగా జాయింట్‌ ఎల్‌పిఎమ్‌లు ఎందుకు సృష్టించాల్సి వచ్చింది? ఆయా సర్వే నెంబర్లకు సంబంధించి భూ యజమానులు జాయింట్‌ ఎల్‌పిఎమ్‌లు చేసేందుకు అంగీకరించారా? లేదా? ఒక వేళ భూ యజమానులు అంగీకరించని పక్షంలో ఎటువంటి పరిస్థితుల్లో అలా చేయాల్సి వచ్చిందో ప్రొఫార్మాలో అన్ని కాలమ్స్‌ను పూర్తి చేసి జాయింట్‌ ఎల్‌పిఎమ్‌లకు కేటాయించిన నెంబర్ల వారీ గ్రామ సర్వేయర్లు లిఖితపూర్వక వివరణలు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. వివరణ పట్ల సంబంధిత ఆర్‌డిఒ సంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు సంతకం చేయాల్సి ఉంటుందని ప్రభుత్వం పేర్కొంటుంది. అయితే రీ సర్వేలో భాగంగా క్షేత్రస్థాయి సిబ్బందికి టార్గెట్లు పెట్టడంతోపాటు రికార్డుల్లో ఎంట్రీలు వేసే సమయం ప్రభుత్వం ఇవ్వకపోవడంతో తప్పులు దొర్లినట్లు రెవెన్యూశాఖలో చర్చ నడుస్తోంది.

మమ్మల్ని దోషులుగా చూపే యత్నం : గ్రామ సర్వేయర్లు

భూముల రీ సర్వే ప్రారంభ దశలో సరిపడా సమయం ఇవ్వకుండా త్వరితగతిన టార్గెట్లు పూర్తి చేయాలంటూ తమ మెడపై కత్తి పెట్టినట్లు ప్రభుత్వం, ఉన్నతాధికార్లు ఒత్తిడి చేశారని గ్రామ సర్వేయర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భూములు ఎన్‌ఆర్‌ఐలు, ఇతర ప్రాంతాల్లో ఉంటున్న వారి చేతుల్లో ఉన్నాయని, సర్వే సమయంలో ఉమ్మడి సర్వే నెంబర్లకు సంబంధించిన భూ యజమానులు అందుబాటులో లేకపోయినా.. ప్రక్రియ ఆగిపోయే ప్రమాదముందని పేర్కొంటున్నారు. రీ సర్వేలో తమతోపాటు విఆర్‌ఒలు, మండల సర్వేయర్లు, మండల స్థాయి అధికారుల పర్యవేక్షణ కూడా ఉందని, తప్పుల దగ్గరకు వచ్చేసరికి తమను మాత్రమే దోషులుగా చూపేందుకు ప్రయత్నిస్తున్నారని గ్రామ సర్వేయర్లు వాపోతున్నారు.

ఏడాదిలోగా ఉచితంగా ఆర్‌ఒఆర్‌ సవరణలు

భూముల రీ సర్వేకు సంబంధించి ఆర్‌ఒఆర్‌లో జరిగిన తప్పులను సరిచేసుకునేందుకు ప్రభుత్వం ఏడాది సమయం ఇచ్చింది. తమకు అన్యాయం జరిగిందని భావించే భూ యజమానులు ప్రభుత్వం ఇచ్చిన గడువులో అప్పీల్‌ చేసుకునే అవకాశం ఉంది. అప్పీల్‌ సమయంలో ఎటువంటి ఫీజులు వసూలు చేయకుండా రికార్డులను సరిచేస్తారు.

➡️