14 లక్షల ఎకరాల్లో .. పంట నష్టం

Dec 2,2023 09:05 #Crop Damage
  • ఎన్యూమరేషన్‌ కొలిక్కి
  • ఇన్‌పుట్‌ సబ్సిడీకి 844 కోట్లు కావాలి
  • కేంద్రాన్ని అడిగేది 503 కోట్లు

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి- అమరావతి : ఖరీఫ్‌లో ప్రభుత్వం ప్రకటించిన కరువు మండలాల్లో వ్యవసాయ పంటల నష్టం అంచనాలు ఎట్టకేలకు పూర్తయ్యాయి. తొలుత ప్రాథమికంగా 7.14 లక్షల మంది రైతులకు చెందిన 15 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బ తిన్నాయని ఎస్టిమేట్‌ చేశారు. రైతుల వివరాలతో సహా సమగ్ర ఎన్యూమరేషన్‌ అనంతరం మొదట వేసిన అంచాల కంటే నష్టం స్వల్పంగా తగ్గింది. చివరికి 6.68 లక్షల మంది రైతులకు సంబంధించిన 14.21 లక్షల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లిందని తేల్చారు. స్టేట్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ రెస్పాన్స్‌ ఫండ్‌ (ఎస్‌డిఆర్‌ఎఫ్‌) నిబంధల ప్రకారం నవంబర్‌ 14న ప్రభుత్వం జారీ చేసిన జిఒఎంఎస్‌ నెం.5లో పేర్కొన్న విధంగా పంటలు నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ చెల్లింపుల కోసం రూ.844.14 కోట్లు కావాలని అంచనా వేశారు. నేషనల్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ రెస్పాన్స్‌ ఫండ్‌ (ఎన్‌డిఆర్‌ఎఫ్‌) నిబంధనల ప్రకారం ఇన్‌పుట్‌ సబ్సిడీ చెల్లింపుల కోసం రూ.503.11 కోట్లు అవసరమవుతాయని, కేంద్రం ఆ నిధులివ్వాలని కోరనున్నారు. ఇదిలా ఉండగా రైతుల వివరాలతో రూపొందించిన లబ్ధిదారుల జాబితాలను సోషల్‌ ఆడిట్‌ కోసం గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాల్లో ప్రదర్శనకు పెట్టారు. అభ్యంతరాలు, వినతుల పరిశీలన అనంతరం తుది జాబితాలను శుక్రవారం నాటికి కలెక్టర్ల ద్వారా రాష్ట్ర కేంద్రానికి పంపాలని ఆదేశించారు. కాగా మరో ఒకటి రెండు రోజులు సమయం కావాలని కిందిస్థాయి సిబ్బంది గడువు కోరాగా అందుకు అంగీకరించారు. ఈ అంచనాలు కేవలం 7 జిల్లాల్లో ప్రకటించిన 103 మండలాలకే పరిమితం. ఉద్యానవన పంటల అంచనాలు వేరేగా ఉన్నాయంటున్నారు. కాగా రాష్ట్ర వ్యాప్తంగా కరువు తాండవిస్తున్న దృష్ట్యా మరిన్ని మండలాలను గుర్తించాలన్న రైతుల డిమాండ్‌ను సర్కారు పట్టించుకోలేదు.

table
table
➡️