మున్సిపల్‌ టీచర్లకు వేతనాలొచ్చేనా?

Apr 21,2024 04:18 #salaries, #Teachers
  • జిపిఎఫ్‌ ఖాతా నెంబరు మెలికతో కష్టాలు 
  • ఆందోళనలో ఉపాధ్యాయులు, ఉద్యోగులు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఏప్రిల్‌ నెల వేతనాలు తమకు పడతాయా? లేదా? అని మున్సిపల్‌ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. సాధారణ ప్రావిడెంట్‌ ఫండ్‌ (జిపిఎఫ్‌) లేదా కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీం (సిపిఎస్‌) అకౌంట్లు అప్‌డేట్‌ నెంబర్లు లేనివారికి వేతనాలు డ్రా చేయడానికి వీలుండదని ఆర్థికశాఖ ఇచ్చిన ఆదేశాలు ఉపాధ్యాయులతోపాటు ఆ శాఖ ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. వేతనాల కోసం జిపిఎఫ్‌, పర్మినెంటు రిటైర్‌మెంటు అకౌంట్‌ నెంబర్‌ (ప్రాన్‌) నెంబర్‌ సమర్పించాలని ఆర్థికశాఖ తమ వెబ్‌సైట్‌లో పేర్కొంది. ఏళ్ల తరబడి మున్సిపల్‌శాఖ పరిధిలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, ఉద్యోగులకు ఇప్పటివరకు జిపిఎఫ్‌, సిపిఎస్‌ ఖాతాలు లేవు. వీటిని ఏర్పాటు చేయాలని ఉపాధ్యాయ సంఘాలు, మున్సిపల్‌ ఉద్యోగ సంఘాలు చాలా సార్లు రాష్ట్ర ప్రభుత్వానికి వినతిపత్రాలు అందించినా ఫలితం లేకుండా పోయింది. రాష్ట్రంలో 2,114 మున్సిపల్‌ పాఠశాలలున్నాయి. మొత్తం 13,948 ఉపాధ్యాయ మంజూరు పోస్టులుండగా, 12,006 మంది పనిచేస్తున్నారు. 1,942 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పాఠశాలల్లో పనిచేస్తున్న బోధన, బోధనేతర సిబ్బంది పర్యవేక్షణను పాఠశాల విద్యాశాఖ పరిధిలోకి తీసుకొస్తూ 2022 జూన్‌లో మున్సిపల్‌శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మండల, జిల్లా పరిషత్‌ ఉపాధ్యాయులకు ఉన్న జిపిఎఫ్‌ వంటి సౌకర్యాలను కల్పిస్తామని హామీ ఇచ్చింది. ఉత్తర్వులు విడుదలై రెండేళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు ఇచ్చిన హామీ నెరవేరలేదు. ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుల వేతనాలు ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులకు మండల విద్యాశాఖ అధికారి (ఎంఇఒ) ఇచ్చేలా డిడిఒ అధికారాలను ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. జిపిఎఫ్‌ నెంబర్లు ఏర్పాటులో రాష్ట్ర ప్రభుత్వం విఫలమవ్వడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఖాతాల ఏర్పాటుకు సంబంధించిన ఫైల్‌ ఆర్థికశాఖ, పాఠశాల విద్యాశాఖ, మున్సిపల్‌శాఖ, సిఎఫ్‌ఎంఎస్‌ చుట్టూ చక్కర్లు కొడుతుందే తప్ప పరిష్కారం కాలేదు. ఈ అంశంపై ఆయా శాఖల అధికారులు ఇప్పటి వరకు రెండుసార్లు సమావేశమయ్యారు. జిపిఎఫ్‌ రూపకల్పన, ప్రత్యేక వెబ్‌సైట్‌ కోసం భారీగా ఖర్చవుతుందని మున్సిపల్‌శాఖకు సిఎఫ్‌ఎంఎస్‌ తెలిపింది. ఈ నిధులను విడుదల చేయాలని ఆర్థికశాఖకు మున్సిపల్‌శాఖకు సుమారు రెండు నెలల క్రితం లేఖ రాసింది. అయితే ఇప్పటి వరకు దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఖాతాల ఏర్పాటుపై త్వరలో మరోసారి సమావేశం ఉంటుందని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. సాధ్యమైన మేరకు ఈ అంశాన్ని పరిష్కరిస్తామని చెబుతున్నారు.
ప్రత్యేక విషయంగా పరిగణించాలి : యుటిఎఫ్‌
విద్యాశాఖ ప్రత్యేక విషయంగా పరిగణించి జిపిఎఫ్‌ ఖాతాలను ప్రారంభించాలని యుటిఎఫ్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎన్‌ వెంకటేశ్వర్లు, కెఎస్‌వి ప్రసాద్‌ కోరారు. ఈ సమస్య పరిష్కరించాలని అధికారులందరికీ యుటిఎఫ్‌ తరపున ప్రాతినిధ్యం వహిస్తూ పోరాటాలు చేశామని తెలిపారు. ఇప్పటికీ పరిష్కరించకపోవడంతో వేతనాలు నిలిచిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయని పేర్కొన్నారు. ఉపాధ్యాయుల వేతనాలు ఆలస్యం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.

➡️