విరాళాలా ? అవినీతి విష వలయాలా ?

Mar 16,2024 10:27 #Corruption
  • ఐటి, ఇడి దాడులు..తరువాత బాండ్ల కొనుగోళ్లు.. బిజెపికి విరాళాలు
  • 18 కంపెనీల నుంచే 2,010 కోట్లు !
  • 200 కోట్లు లాభమొచ్చిన ఫ్యూచర్‌ గేమింగ్‌ విరాళం 1300 కోట్లు!

న్యూఢిల్లీ : ఎన్నికల బాండ్ల కొనుగోళ్ల వివరాలను పరిశీలిస్తే… అవినీతి విషవలయాలను తలపిస్తున్నాయి. వీటన్నింటిలోనూ ఉమ్మడి అంశం ఒకటుంది. అధికంగా విరాళాలు ఇచ్చిన జాబితాలో వున్న పలు కంపెనీలు గత ఐదేళ్లలో ఏదో ఒక సమయంలో అటు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ దాడులనో లేదా ఇటు ఆదాయపన్ను సోదాలనో ఎదుర్కొన్నాయన్నది ఆసక్తి రేపే అంశం. కొన్ని కేసుల్లో అయితే, ఇటువంటి దాడులు జరిగిన రోజుల వ్యవధిలోనే ఈ సంస్థలు పెద్ద సంఖ్యలో బాండ్లను కొనుగోలు చేశాయి.
ఎన్నికల బాండ్ల ద్వారా రాజకీయ పార్టీలకు పెద్ద మొత్తంలో విరాళాలు అందజేసింది ఫ్యూచర్‌ గేమింగ్‌ అండ్‌ హోటల్‌ సర్వీసెస్‌ పిఆర్‌. మూడేళ్లలో రూ.200కోట్ల మేరకు నికర లాభాలను ఆర్జించిన కంపెనీ ఎన్నికల బాండ్ల ద్వారా ఏకంగా రూ.1368 కోట్ల మేరకు విరాళాలను అందజేయడం విశేషం. 2023 మే లో చెన్నైలో కంపెనీ మేనేజింగ్‌ డైరెక్టర్‌, లాటరీ కింగ్‌ శాంటియాగో మార్టిన్‌ నివాసంలో ఇడి సోదాలు నిర్వహించింది. పిఎంఎల్‌ఎ నిబంధనల కింద కోయంబత్తూరులోని కంపెనీ సముదాయంలోనూ దాడులు చేసింది. అంతకు ఏడాది ముందు అంటే 2022 ఏప్రిల్‌ 2న ఈ కంపెనీ, దాని అనుంబంధ సంస్థలపై నమోదైన లాటరీ కుంభకోణం కేసులో రూ.410 కోట్ల విలువైన చరాస్తులను ఇడి జప్తు చేసింది. ఆ తర్వాత ఐదు రోజులకే అంటే ఏప్రిల్‌ 7న కంపెనీ వంద కోట్ల విలువైన ఎన్నికల బాండ్లను కొనుగోలు చేసింది. ఒకే రోజు జరిగిన అతిపెద్ద లావాదేవీ అదే. మొత్తంగా రూ.1368 కోట్లు అందచేస్తే, అందులో 50శాతం నిధులు ఇడి సోదాలకు ముందు, మరో 50శాతం సోదాల తర్వాత అందచేసింది.
ఇదే బాటలో వెళ్ళిన ఇతర కంపెనీలు కెవెంటర్‌ ఫుడ్‌ పార్క్‌ ఇన్‌ఫ్రా లిమిటెడ్‌, ఎంకెజె ఎంటర్‌ప్రైజెస్‌ లిమిటెడ్‌, మదన్‌లాల్‌ లిమిటెడ్‌. ఈ మూడు సంస్థలు కూడా కోల్‌కతాలో ఒక అడ్రస్‌తో రిజిస్టర్‌ అయ్యాయి. మూడు కంపెనీలకు ఒక ఉమ్మడి డైరెక్టర్‌ కూడా వున్నారు. ఆయనే సిద్దార్ధ గుప్తా. కానీ ఆ మూడు కంపెనీలు వేర్వేరు సంవత్సరాల్లో ఏర్పాటయ్యాయి. 1982లో ఎంకెజె ఎంటర్‌ప్రైజెస్‌ ఏర్పాటవగా, 1983లో మదన్‌లాల్‌, 2010లో కెవెంటర్‌ ఫుడ్‌ పార్క్‌ ఏర్పాటయ్యాయి. ఈ మూడు కంపెనీలు కలిసి రూ.573 కోట్లు విరాళమిచ్చాయి. కొనుగోళ్లన్నింటినీ కలిపి చూసినట్లైతే, ఇది మూడవ అతిపెద్ద మొత్తంగా వుంది. ఈ రూ.573 కోట్లలో రూ.195 కోట్ల విలువైన బాండ్లను కెవెంటర్‌ కొనుగోలు చేసింది. అది కూడా 2019 ఏప్రిల్‌ మే మాసాల మధ్య మూడు దఫాలుగా కొనుగోలు జరిపింది. మదన్‌లాల్‌ లిమిటెడ్‌ 2019 మే 8-10 తేదీల మధ్య రూ.185కోట్ల విలువైన బాండ్లను కొంది.
మెట్రో డెయిరీలో తనకున్న వాటాను రాష్ట్ర ప్రభుత్వం కెవెంటర్‌ ఆగ్రోకు 2017లో విక్రయించడంతో పశ్చిమ బెంగాల్‌ కాంగ్రెస్‌ శాఖ చీఫ్‌ ఆదిర్‌ రంజన్‌ చౌదరి పిల్‌ వేశారు. ఆ నేపథ్యంలో మదన్‌లాల్‌, ఎంకెజె ఎంటర్‌ప్రైజెస్‌లతో కలిసి ఇ మెయిల్‌ డొమైన్‌ పంచుకుంటున్న కెవెంటర్‌ ఆగ్రో కంపెనీ వివాదంలో చిక్కుకుంది. 2017లో రూ.85కోట్లకు మెట్రో డెయిరీలోని 47శాతం వాటాలను కెవెంటర్‌ ఆగ్రోకు బెంగాల్‌ ప్రభుత్వం విక్రయించింది. అదే ఏడాది, సింగపూర్‌కి చెందిన ప్రైవేట్‌ సంస్థ కెవెంటర్‌ ఆగ్రోలో 15శాతం వాటాలను రూ,170కోట్లకు కొనుగోలు చేసింది. ప్రస్తుతం మయాంక్‌ జలన్‌ కెవెంటర్‌ ఆగ్రో మేనేజింగ్‌ డైరెక్టర్‌గా, మెట్రో డెయిలీ డైరెక్టర్‌గా వున్నారు. మెట్రోడెయిరీలో ప్రభుత్వ వాటాలను విక్రయించడంపై ఇడి 2019లో దర్యాప్తు చేపట్టింది. మెగ్రో డెయిరీ వాటాలను విక్రయించిన 2017లో అప్పటి రాష్ట్ర ఫైనాన్స్‌ కార్యదర్శిగా వున్న హెచ్‌.కె.ద్వివేదితో సహా పలువురు ప్రభుత్వ అధికారులకు సమన్లు జారీ చేసింది. తదనంతర కాలంలో కూడా అంటే 2020 జూన్‌లో, 2021 మార్చిలో రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు సమన్లు జారీ అయ్యాయి. ఈ దర్యాప్తుతో సంబంధమున్న కెవెంటర్‌ ఆగ్రో లిమిటెడ్‌ కార్యాలయంలో కూడా 2021 ఫిబ్రవరిలో ఇడి అధికారులు సోదాలు నిర్వహించారు. అదిర్‌ రంజన్‌ చౌదరి వేసిన పిల్‌ను 2022 జూన్‌లో కలకత్తా హైకోర్టు కొట్టివేయడంతో దర్యాప్తు వేగం తగ్గింది. కలకత్తా హైకోర్టు ఆదేశాలను 2022 సెప్టెంబరులో సుప్రీం కోర్టు సమర్ధించింది.

హైదరాబాద్‌లోని యశోదా సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి గ్రూపు పలు దఫాలుగా రూ.162 కోట్లను విరాళంగా ఇచ్చింది. 2021 అక్టోబరు నుండి 2023 అక్టోబరు మధ్య కాలంలో ఈ మొత్తాలు అందాయి. 2020 డిసెంబరులో ఆదాయపన్ను శాఖ అధికారులు ఈ గ్రూపు కార్యాలయాలపై దాడులు చేశారు.

ఢిల్లీ ప్రభుత్వం రద్దు చేసిన లిక్కర్‌ పాలసీలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ అరబిందో ఫార్మా డైరెక్టర్‌ శరత్‌ రెడ్డిని 2022 నవంబరు 10న ఇడి అరెస్టు చేసింది. అరెస్టయిన ఐదు రోజుల తర్వాత అంటే నవంబరు 15న కంపెనీ రూ.5 కోట్ల విలువైన బాండ్లను కొనుగోలు చేసింది. ఏడాది తర్వాత అంటే 2023 నవంబరులో రూ.25 కోట్ల విలువైన బాండ్లను కొనుగోలు చేసింది. మొత్తంగా 2021 ఏప్రిల్‌, 2023 నవంబరు మధ్య కాలంలో పలు దఫాలుగా రూ.52 కోట్ల విలువైన బాండ్లను కొనుగోలు చేశారు. అందులో రూ.30 కోట్ల బాండ్లు రెడ్డీని అరెస్టు చేసిన తర్వాత కొన్నవే.

2023 డిసెంబరు 18న కడప శివార్లలోని ఇండిస్టియల్‌ డెవలప్‌మెంట్‌ ఏరియాలో షిర్డి సాయి ఎలక్ట్రికల్స్‌ లిమిటెడ్‌ ఫ్యాక్టరీ సముదాయంలో ఐటి దాడులు నిర్వహించారు. అదే సమయంలో హైదరాబాద్‌ కార్యాలయంలో, ఉన్నతాధికారుల నివాసాల్లో కూడా దాడులు జరిగాయి. 2024 జనవరి 11న కంపెనీ రూ.40కోట్ల విలువైన ఎన్నికల బాండ్లను కొనుగోలు చేసింది. రియల్‌ ఎస్టేట్‌ డెవలప్‌మెంట్‌ సంస్థ అయిన కల్పతరు ప్రాజెక్ట్స్‌ అంతర్జాతీయ కార్యాలయాలు, ఆ కంపెనీ కి చెందిన కొంతమంది డైరెక్టర్లు, ఎగ్జిక్యూటివ్‌లకు చెందిన నివాసాల్లో 2023 ఆగస్టులో ఐటి సోదాలు జరిగాయి. 2023 ఏప్రిల్‌, అక్టోబరు మధ్య రూ.25.5 కోట్ల విలువైన బాండ్ల ను కంపెనీ కొనుగోలు చేసింది.

                                       ఫిబ్రవరిలోనే చెప్పిన ఆన్‌లైన్‌ వెబ్‌సైట్లు న్యూస్‌ లాండ్రీ, ది న్యూస్‌ మినిట్‌
కేంద్ర దర్యాప్తు సంస్థల నుంచి దాడులను, చర్యలను ఎదుర్కొన్న తర్వాత 30 కంపెనీలు బిజెపికి రూ.355 కోట్లను విరాళాలుగా అందజేశాయని ఫిబ్రవరిలో ఆన్‌లైన్‌ వార్తా వెబ్‌సైట్‌లైన న్యూస్‌లాండ్రీ, ది న్యూస్‌ మినిట్‌ పేర్కొన్నాయి. కానీ మరో 11 కంపెనీలు కూడా పాలక పార్టీకి రూ.62.3కోట్లు విరాళమిచ్చి ఇదే బాటలో పయనించినట్లు మూడు రోజుల క్రితం వెల్లడైంది.
అంటే మొత్తంగా 41 కంపెనీలకు గానూ 18 కంపెనీలు గత రాత్రి ఎన్నికల కమిషన్‌ విడుదల చేసిన ఎన్నికల బాండ్ల కొనుగోలుదారుల జాబితాలో వున్నాయి. ఈ 18 కంపెనీలు ఏకంగా దాదాపు రూ.2,010.5 కోట్ల విలువైన బాండ్లను కొనుగోలు చేశాయి. అంటే గతంలో 41 కంపెనీలు బాండ్ల రూపంలో అందజేసిన విరాళాల మొత్తం కన్నా ఐదు రెట్లు ఎక్కువ. వాటిలో కొన్ని సంస్థల వివరాలిలా ఉన్నాయి.

                                                                        ఐఆర్‌బి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలపర్స్‌

ముంబయికి చెందిన ఈ కంపెనీ దాని అనుబంధ సంస్థలు కలిపి 2014 నుండి 2023 వరకు రూ.84 కోట్లను బిజెపికి విరాళంగా అందజేశాయి. గత రాత్రి ఎన్నికల కమిషన్‌ అందజేసిన డేటా ప్రకారం ఐఆర్‌బి-మోడరల్‌ రోడ్‌ మేకర్స్‌, ఐఆర్‌బి ఎంపి ఎక్స్‌ప్రెస్‌వే, ఐడియల్‌ రోడ్‌ బిల్డర్స్‌ – కలిపి ఇచ్చిన రూ.84 కోట్లలో మోడరల్‌ రోడ్‌ మేకర్స్‌ రూ.53 కోట్లను, ఐఆర్‌బి ఎంపి ఎక్స్‌ప్రెస్‌ వే రూ.25 కోట్లను, ఐడియల్‌ కంపెనీ రూ.6కోట్లను అందజేశాయి.

                                                                                   రామ్‌కో సిమెంట్స్‌

తమిళనాడుకు చెందిన ప్రధాన సిమెంట్‌ తయారీ గ్రూపు అయిన రామ్‌కో సిమెంట్స్‌ 2022 అక్టోబరు 10 నుండి, 2023 నవంబరు 15 మధ్య రూ.54కోట్ల విలువైన బాండ్లను కొనుగోలు చేసింది.

                                                                               కెజెఎస్‌ గ్రూపు

మధ్యప్రదేశ్‌కి చెందిన కెజెఎస్‌ సిమెంట్స్‌ 2019 ఏప్రిల్‌ 20, 2019 మే 9 మధ్య రూ.14కోట్ల విలువైన బాండ్లు కొనుగోలు చేసింది.

                                                                 ఐఎల్‌ఎబిఎస్‌ టెక్నాలజీ సెంటర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌

హైదరాబాద్‌కి చెందిన ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాట్‌ఫారమ్‌ అయిన ఈ కంపెనీ 2023 ఏప్రిల్‌ 10న రూ.5 కోట్ల విలువైన బాండ్లు కొనుగోలు చేసింది. 2019 మే లో కూడా బిజెపికి రూ.5కోట్లు విరాళమిచ్చింది.

                                                                       ఎస్‌పిఎంఎల్‌ ఓం, మెటల్‌ జెవి

ఓం కొఠారి గ్రూపునకు చెందిన ఈ కంపెనీకి జల విద్యుత్‌, రియల్‌ ఎస్టేట్‌, ఆటో డీలర్‌షిప్‌లు, హోటళ్లు, వినోద కేంద్రాల్లో వ్యాపారాలు వున్నాయి. 2020 జులో ఐటి దాడులవగానే రూ.5కోట్లు విరాళంగా ఇచ్చింది. తిరిగి 2021లో అక్టోబరు 4న మరో రూ.5కోట్లు విలువైన బాండ్లను కొంది.

                                                                                      సోమ్‌ డిస్టిలరీస్‌

దాడి జరిగిన వెంటనే విరాళమిచ్చిన కంపెనీల్లో మధ్యప్రదేశ్‌కి చెందిన సోమ్‌ డిస్టిలరీస్‌ ఒకటి. అరెస్టయిన తన ప్రమోటర్లను విడుదలైన పది రోజుల్లో రూ.3కోట్లు విరాళంగా ఇచ్చింది.

                                                                                  హెటెరో గ్రూపు

హైదరాబాద్‌కి చెందిన హెటెరో గ్రూపు ఒక ఫార్మస్యూటికల్‌ సంస్థ. బిఆర్‌ఎస్‌కి చెందిన రాజ్యసభ సభ్యుడు, సంపన్నుడైన ఎంపి అయిన పార్ధసారధి రెడ్డి సారధ్యంలో ఇది నడుస్తోంది. మొదట వెబ్‌సైట్‌లు విడుదల చేసిన 30 కంపెనీల జాబితాలో ఇది వుంది. మూడు కంపెనీలతో కూడిన ఈ గ్రూపు 2022 ఏప్రిల్‌ 7 నుండి 2023 అక్టోబరు 12 మధ్యలో రూ.60కోట్ల విలువైన ఎన్నికల బాండ్లను కొనుగోలు చేసింది.

                                                               రూ.140 కోట్ల బాండ్లు కొనుగోలు చేసిన మేఘా

హైదరాబాదుకు చెందిన మేఘా ఇంజినీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ (ఎంఇఐఎల్‌) గత సంవత్సరం ఏప్రిల్‌ 11న రూ.140 కోట్ల విలువైన ఎన్నికల బాండ్లను కొనుగోలు చేసింది. దానికి నెల రోజుల ముందే ఆ కంపెనీకి రూ.14,400 కోట్ల విలువైన థానే-బొరివాలీ జంట టన్నెల్‌ ప్రాజెక్ట్‌ టెండర్‌ దక్కడం గమనార్హం. మొత్తంమీద ఈ కంపెనీ అత్యధిక విలువ కలిగిన బాండ్లను (రూ.821 కోట్లు) కొనుగోలు చేసిందని ఎన్నికల కమిషన్‌ వెల్లడించిన వివరాలను బట్టి తెలుస్తోంది. టన్నెల్‌ ప్రాజెక్టు కోసం ఎంఈఐఎల్‌ కంపెనీ ఒక్కటే టెండర్‌ దాఖలు చేసింది. టన్నెల్‌ నిర్మాణం కోసం ఎల్‌ అండ్‌ టీ సంస్థ దాఖలు చేసిన బిడ్లు తిరస్కరణకు గురయ్యాయి. దీనిపై ఆ సంస్థ బాంబే హైకోర్టును ఆశ్రయించినా ప్రయోజనం కలగలేదు.

                                                                       రూ.55కోట్లు విరాళమిచ్చిన నవయుగ

దేశంలో పోలవరం, ఉత్తరాఖండ్‌లో సిల్క్యారా సొరంగం సహా పలు ప్రాజెక్టుల పనులు చేపట్టిన నవయుగ ఇంజనీరింగ్‌ కంపెనీ రూ.55కోట్ల విలువైన బాండ్లను కొనుగోలు చేసింది. ఈ కంపెనీ ఆదాయపన్ను నిబంధనలు ఉల్లంఘించిందని, మనీ లాండరింగ్‌కు పాల్పడిందని ఆరోపిస్తూ 20మంది సభ్యుల ఐటి అధికారుల బృందం దాడులు జరిపింది. 2018 అక్టోబరులో కంపెనీ మొదటిసారిగా ఐటి దాడులను ఎదుర్కొంది. ఆ తర్వాత ఆరు మాసాలకే రూ.30కోట్ల విలువైన బాండ్లను మొదటిసారిగా కొనుగోలు చేసింది.
2019లో ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం మారింది. దీంతో ఆ ఏడాది అక్టోబరు 22న కంపెనీ మూడు ఎదురుదెబ్బలు ఎదుర్కొంది.
2017లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా వున్నప్పుడు నవయుగకు పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టు వచ్చింది. జగన్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత నవయుగ నుండి ఆ ప్రాజెక్టు చేజారిపోయింది. ఈ నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు కూడా 2019 అక్టోబరు 22న సమర్ధించింది. అదే సమయంలో అంటే అక్టోబరు 10న నవయుగ రూ.15కోట్ల విలువైన బాండ్లు కొనుగోలు చేసింది. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణపట్నం పోర్టు టిడిపి అధికారంలో ఉన్నప్పుడు నవయుగ గ్రూపునకు వెళ్లింది. దీనిపై కన్నేసిన అదానీ గ్రూపు 2021లో దాన్ని స్వాధీనం చేసుకుంది. ఆ తరువాత 2022 అక్టోబరు 10న నవయుగ మళ్లీ రూ.10కోట్ల విలువైన బాండ్లు కొనుగోలు చేసింది.

➡️