సిఎఎ మాకొద్దు !

Mar 15,2024 12:33 #CAA
  • తక్షణమే వెనక్కి తీసుకోవాలి
  • లేకుంటే ప్రతిఘటన తప్పదు

నరేంద్ర మోడీ నాయకత్వంలోని బిజెపి ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) అమలుకోసం నిబంధనలు ప్రకటించడంపై విద్యార్థులు, యువజనులు, మహిళలు, ప్రగతిశీలవాదులు, వామపక్షాలు, ఇతర ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. రాజ్యాంగ విరుద్ధం, దేశ సమైక్యతకు ప్రమాదకరమూ, ముస్లిం మైనారిటీలను వేధించడమే లక్ష్యంగా తీసుకొచ్చిన ఈ సిఎఎ నిబంధనలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశాయి. 2019లో ఆమోదించిన సిఎఎను ప్రజాందోళన వల్ల అయిదేళ్లు మూలన పెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు..కొద్ది రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్‌ వస్తుందనగా దాన్ని అమలు పరిచేందుకు నిబంధనల నోటిఫికేషన్‌ ప్రకటించడం స్పష్టంగా ఎన్నికల్లో ప్రయోజనం పొందేందుకు బిజెపి ఆడుతున్న ప్రమాదకరమైన నాటకంలో భాగమే. ఈ చట్టం వల్ల దేశంలో ఉద్రిక్తతలు ఏర్పడతాయి. మనలాంటి రాష్ట్రంలో అశాంతి నెలకొంటుంది.

నష్టం ఇలా…!
కేంద్ర ప్రభుత్వం 2019లో చేసిన పౌరసత్వ సవరణ చట్టం దేశంలోని ప్రజలను మతాలవారీగా విడగొడుతుంది. కుల, మత, ప్రాంతీయ, భాషా భేదాలకు అతీతంగా దేశ పౌరులందరూ చట్టం ముందు సమానమేనని చెబుతున్న భారత రాజ్యాంగానికి విరుద్ధంగా ఈ చట్టం దేశంలోని ముస్లిం ప్రజానీకం పట్ల తీవ్రమైన వివక్షను ప్రదర్శిస్తుంది. దీనితోబాటు అస్సాంలో జారీ చేసిన జాతీయ పౌరసత్వ రిజిస్టరు (ఎన్‌ఆర్‌సి)ని దేశమంతటికీ విస్తరించడానికి చేస్తున్న ప్రయత్నాలు భారతదేశ లౌకిక స్వభావాన్ని నాశనం చేసి, దాన్ని నిరంకుశ హిందూమత రాజ్యంగా మార్చడానికి ఆర్‌ఎస్‌ఎస్‌ ఎప్పటినుండో చేస్తున్న ప్రయత్నాల్లో భాగమే. దీని వల్ల దేశంలోని ముస్లిం ప్రజలకే కాకుండా హిందువులు, ఇతర ప్రజానీకానికి కూడా నష్టం జరుగుతుంది. ఎందుకంటే దేశంలోని 140 కోట్ల జనాభా అంతా తాము భారత పౌరులమేనని నిరూపించుకోవాలి. సరైన పత్రాలు లేనివారంతా విదేశీయులు గా ముద్రపడి శరణార్ధి శిబిరాల్లో బ్రతకాల్సి ఉంటుంది. ఇప్పటికే ఈ చట్టంపట్ల దేశవ్యాపితం గా ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవు తోంది. అస్సాంతో సహా ఈశాన్య రాష్ట్రాల్లోని మూల వాసులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు.

నోరు విప్పని వైసిపి, టిడిపి,జనసేన
సిపిఎం, కాంగ్రెస్‌ ఇతర ప్రతిపక్షాలు బిజెపి ప్రభుత్వ దుష్ట చర్యను ఖండించాయి. కేరళ, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయబోమని ప్రకటించాయి. కానీ అన్ని విషయాల్లోనూ బిజెపికి మోకరిల్లిన మన రాష్ట్రంలోని వైసిపి, తెలుగుదేశం, జనసేన పార్టీలు మాత్రం దీనిపై నోరుమెదపడం లేదు. వైసిపి రాష్ట్ర ప్రభుత్వం కూడా అమలు చేయబోమని ప్రకటించాలి. 2019లో పార్లమెంటులో ఈ చట్టం చేసినప్పుడు కూడా ఈ పార్టీలు దానికి మద్దతిచ్చాయి. ఈ చట్టంవల్ల మత విద్వేషాలు ప్రజ్వరిల్లడమేకాకుండా దేశం మరో పాకిస్తాన్‌లాగా అస్థిరంగా మారే ప్రమాదం వుంది.

రాజ్యాంగ విరుద్ధం…
పౌరసత్వ సవరణ చట్టం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమైనది. రాజ్యాంగంలో 5వ అధికరణం నుండి 11వ అధికరణం వరకు పౌరసత్వం గురించిన విధి విధానాలను నిర్దేశించారు. వాటి ఆధారంగా ఉనికిలోకి వచ్చిందే ‘పౌరసత్వ చట్టం-1955’. ఈ చట్టం ప్రకారం ఈ దేశంలో పుట్టిన ప్రతి వ్యక్తీ, ఆ వ్యక్తి వారసులుగా ఉన్న ప్రతి వ్యక్తీ, భారతీయుడేనని తేల్చి చెప్పింది. ఈ దేశంలో నివసించటానికి సిద్ధపడిన వారికి కూడా సహజసిద్ధంగా పౌరసత్వం సంక్రమిస్తుందని ఈ చట్టం స్పష్టం చేసింది. కానీ ప్రస్తుతం బిజెపి ప్రభుత్వం ఆమోదించిన పౌరసత్వ చట్టం- కుల, ప్రాంత, లింగ, జాతి, సాంస్కతిక పరమైన వివక్షలకు అతీతంగా భారతీయులందరికీ సమాన పౌరసత్వ హక్కు కల్పించాలన్న రాజ్యాంగ స్ఫూర్తిని తుంగలో తొక్కుతోంది. అందువల్ల పౌరసత్వ సవరణ చట్టం ఈ దేశంలోని ముస్లింల సమస్య కాదు. అది దేశ రాజ్యాంగానికీ, లౌకిక, ప్రజాస్వామ్యానికీ ముంచుకొస్తున్న ప్రమాదానికి సంబంధించిన సమస్య. లౌకిక, ప్రజాస్వామ్య రాజ్యాంగం స్థానంలో హిందూరాష్ట్ర ఏర్పాటుకు ఆర్‌ఎస్‌ఎస్‌-బిజెపిలు చేస్తున్న ప్రయత్నాల్లో నాడు బాబ్రీమసీదు కూల్చివేత, నేడు జమ్మూ-కాశ్మీర్‌ను చీల్చడం, 370వ అధికరణం రద్దు, ప్రస్తుత పౌరసత్వ సవరణ చట్టం తేవడం… ఇవన్నీ ఒక భాగం.

తిప్పికొట్టాల్సిందే…!
ఈ దశలోనే సిఎఎను తిప్పికొట్టకపోతే అమిత్‌ షా చెప్పినట్లు రేపు దేశమంతటా ఎన్‌ఆర్‌సి అమలుకు నిరాఘాటంగా పూనుకుంటారు. అప్పుడు భారతీయులమైన మనం భారతీయులమేనని నిరూపించుకోడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్యూ లైన్లలో నిలుచుని పత్రాలు సమర్పించాల్సి వస్తుంది. పత్రాలు లేకపోతే మనమంతా స్వదేశంలో అక్రమ వలసదారులం అవుతాం. కాబట్టి మతాలకతీతంగా ప్రజలంతా ఏకమవ్వాలి. పౌరసత్వ చట్టం అమలును తిప్పికొట్టాలి. ఏమిటీ చట్టం..! 1955 పౌరసత్వ చట్టానికి కొన్ని సవరణలు చేసి ఈ పౌరసత్వ సవరణ చట్టం (2019) తీసుకువచ్చారు. కొత్త చట్టం ప్రకారం పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌, ఆఫ్ఘనిస్థాన్‌ల్లో మతపరమైన అణచివేతవల్ల 2014కు ముందు వలస వచ్చిన ప్రజల్లో ముస్లింలకు మినహా మిగిలిన మతాల ప్రజలకు అంటే హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్శీలు, క్రైస్తవులకు భారతీయ పౌరసత్వాన్ని ఇస్తారు. ముస్లిం ప్రజలకు మాత్రం పౌరసత్వం ఇవ్వరు. గతంలో భారత పౌరసత్వం ఇవ్వడానికి 11 సంవత్సరాలు దేశంలో నివసించాలన్న నిబంధన ఉండేది. దాన్ని కొత్త చట్టంలో అయిదేళ్లకు కుదించారు. దేశాన్ని ముక్కలు చేసే ప్రమాదమున్న పౌరసత్వ చట్టాన్ని సమర్థించుకోడానికి ప్రభుత్వం అనేక కుంటి సాకులు చెబుతున్నది. పొరుగు దేశాల్లో మతపరమైన హింసకు గురవుతున్న ప్రజలను ‘మానవతా దృష్టితో’ ఆదుకునేందుకే ఈ చట్టం తెచ్చినట్లు ప్రభుత్వం చెబుతోంది. మానవతా దృష్టితోనే ప్రభుత్వం ఈ చట్టం తెచ్చినట్టయితే కేవలం మూడు దేశాలకే ఎందుకు పరిమితం చేయాల్సి వచ్చింది? మన పొరుగున ఉన్న మయన్మార్‌లో మైనార్టీలైన రొహింగ్యా ముస్లింలు, హిందువులు శ్రీలంకలో క్రైస్తవ తమిళులు తీవ్రమైన హింసాకాండకు గురయ్యారు. వారిని ఎందుకు ఈ చట్టంలో చేర్చలేదు అంటే ప్రభుత్వం వద్ద సమాధానం లేదు. చివరికి పాకిస్తాన్‌ ముస్లింలలో అనేక మైనార్టీ తెగలు, ఉదాహరణకు అహ్మదీ తెగ వారు తీవ్రమైన హింసాకాండకు గురవుతున్నారు. మరి బిజెపి ప్రభుత్వ ‘మానవతా’ జాబితాలో వారు ఎందుకు చేరలేదు? వీటన్నిటి బట్టి చూస్తే దీని వెనుక ‘మానవత’ లేదనీ, ఒక రాజకీయ వ్యూహంతో ఇదంతా చేస్తున్నదనీ అర్ధమవుతోంది.

➡️