భారీగా తగ్గిన మామిడి దిగుబడి

May 20,2024 03:34 #mango yield, #vijayanagaram
  • ప్రకృతి వైపరీత్యాలతో పాటు తెగుళ్ల ప్రభావం

ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి : మధురమైన భంగినపల్లి, నోరూరించే సువర్ణరేఖ, చెరుకు రసాలు, పనుకులు వంటి ఎన్నో రకాల మామిడి పండ్లకు విజయనగరం ప్రసిద్ధి. ఈ ఏడాది ప్రకృతి అనుకూలించకపోవడం, తెగుళ్లు ఆశించడంతో ఏకంగా 60 నుంచి 70 శాతం వరకు దిగుబడి తగ్గిపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా 8,55,000 ఎకరాల విస్తీర్ణంలో మామిడి తోటలు సాగవుతున్నాయి. ఇందులో ఉమ్మడి చితూర్తు, కృష్ణా జిల్లాలు ప్రథమ, ద్వితీయ స్థానాల్లో ఉండగా, ఉమ్మడి విజయనగరం జిల్లా సుమారు లక్షా 25వేల ఎకరాల్లో సాగవుతూ తృతీయ స్థానంలో నిలిచింది. మూడేళ్ల ఒప్పందంతో లీజుదారుడి వద్ద రైతులు అడ్వాన్సులు తీసుకుంటారు. భూసారం, మామిడి చెట్ల రకాలు, గొప్పులు, తదితర సదుపాయాలను బట్టి ఎకరాకు 15 టన్నుల నుంచి 20 టన్నుల వరకు దిగుబడి వస్తుంది. కోల్‌కత్తా, ఢిల్లీ, ముంబై, చెన్నై తదితర మహానగరాలకు ఇక్కడి నుంచి ఎగుమతి చేస్తారు.
సాధారణంగా రకాన్ని బట్టి రెండు లేదా మూడుసార్లు పంట పూతకు వస్తుంది. ముఖ్యంగా తొలిదశ పూత సమయంలో (గడిచిన డిసెంబర్‌, జనవరి నెలలో) కురిసిన అకాల వర్షాలతో చాలా వరకు పూత దెబ్బతింది. ఫిబ్రవరిలో పొగమంచు, చీడపీడల తెగుళ్లు వంటివి మరికొంత దెబ్బతీశాయి. సువర్ణరేఖ రకం తొలిదశ పూత పిందెకట్టినప్పటికీ ఫిబ్రవరిలో రెండు దఫాలుగా మారిన వాతావరణ పరిస్థితులు, పొగమంచు కారణంగా పిందెకట్టు చాలా వరకు తగ్గిపోయింది. బంగినపల్లి రకానికి పొగమంచు, రాత్రి పూట ఉష్ణోగ్రతలు తగ్గిపోవడంతో పాటు తామరపురుగు, బూడిద తెగులు తేనెమంచు పురుగు ఉధృతి ఎక్కువగా కనిపించాయి. పనుకులు ఒకటి, రెండు దశల్లో వచ్చిన పూతలో పిందెకట్టు బాగానే ఉన్నప్పటికీ, మూడో దశలో చాలా తక్కువగా నిలబడింది. ఫలితంగా దిగుబడి గణనీయంగా తగ్గిపోయింది. ఎకరాకు నాలుగు నుంచి ఐదు టన్నులకు మించి దిగుబడి రావడం లేదని పలువురు రైతులు తెలిపారు.

వాతావరణ పరిస్థితులతో ఇబ్బందులు : జమదాగ్ని, జిల్లా ఉద్యాన శాఖ అధికారి
ఈ ఏడాది వాతావరణ పరిస్థితులు మామిడి సాగుకు అనుకూలించలేదు. దీనికి తోడు తెగుళ్లు, పొగమంచు కూడా తోడయ్యాయి. రైతులకు కొంతమేర నష్టం జరిగిన మాట వాస్తవమే.

ఎకరాకు రూ.20వేలు వరకు నష్టం : కెల్ల శ్రీనివాసరావు,రాజుల రామచంద్రపురం, దత్తిరాజేరు మండలం
సొంత మామిడితోటతో పాటు మా చుట్టుపక్కల గ్రామాల్లో రైతుల వద్ద లీజుకు తీసుకున్నాను. 70 శాతం దిగుబడి తగ్గిపోయింది. ఎకరాకు రూ.25 వేలు చొప్పున మదుపు పెట్టాను. ఇందులో చాలా విస్తీర్ణంలో రూ.ఐదు వేలకు మించి ఆదాయం రాలేదు. దీంతో, ఎకరాకు దాదాపు రూ. 20వేల వరకు నష్టం వాటిల్లింది.

➡️