ఆర్థికమంతా అప్పులే – కాగ్‌ నివేదిక వెల్లడి

Feb 9,2024 09:53 #CAG report, #debt, #Finance Sector
  • రూ.15 వేల కోట్లకు లెక్కల్లేవు
  • వెలిగొండలో అదనపు చెల్లింపులు

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రాష్ట్ర ఆర్థికస్థితి పూర్తిగా అప్పుల్లో కూరుకుపోయిందని, అనుకున్నదానికంటే ఎక్కువ అప్పులు చేశారని, అంతర్గత రుణాలే రూ.45,579 కోట్లకు చేరుకున్నాయని నివేదిక వెల్లడించింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబందించి కాగ్‌ నివేదికను రాష్ట్ర ప్రభుత్వం గురువారం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఆర్థిక అంశాలతోపాటు, పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టులో తనిఖీ చేసిన అంశాలనూ వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం రిజర్వు బ్యాంకు నుండి గతేడాది అడ్వాన్స్‌లు 166 రోజులు సాధారణ పద్ధతుల్లోనూ, 23 ప్రత్యేక డ్రాయింగ్‌ సదుపాయంతోనూ, 152 రోజులు ఓవర్‌ డ్రాఫ్ట్‌ల రూపంలోనూ తీసుకుందని నివేదిక పేర్కొంది. వేజ్‌ అండ్‌ మీన్స్‌ అడ్వాన్స్‌లపై వడ్డీ రూ.149 కోట్లు చెల్లించారనీ పేర్కొన్నారు. 7.29 శాతం నుండి 8.07 శాతం వరకూ మార్చుకోదగిన వడ్డీ రేటు ప్రకారం రూ.57,479 కోట్లు బహిరంగ రుణాలు తీసుకున్నట్లు నివేదికలో పేర్కొన్నారు. వీటిల్లో రూ.2,099 కోట్లు ఆర్‌బిఐ రుణాలు, బహిరంగ ఆర్థిక సంస్థలకు చెందిన రూ.1,155 కోట్లు తిరిగి చెల్లించారని తెలిపారు. ఇప్పటి వరకూ అంతర్గత రుణం రూ.45,579 కోట్లు ఉందని పేర్కొన్నారు. రెవెన్యూలోటు రూ.42,487 కోట్లు, 2023 మార్చి 31 నాటికి ద్రవ్యలోటు రూ.52,508 కోట్లు ఉందని పేర్కొన్నారు. గత ఐదేళ్లలో, రెవెన్యూ లోటులోనే ఉందని పేర్కొంది.2018-19లో రెవెన్యూలోటు రూ.13,889 కోట్లు ఉంటే 2023-24 నాటికి రూ.43,487 కోట్లకు చేరిందని పేర్కొంది. ఆర్థిక లోటు 2018-19లో 35,467 కోట్లు ఉంటే 2022-23 నాటికి రూ.52,508 కోట్లకు చేరిందని నివేదికలో వెల్లడించింది. మొత్తంగా రూ.15 వేల కోట్లకు లెక్కలు లేవని తెలిపింది.పెరుగుతున్న ఆదాయం పన్నుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి వస్తున్న ఆదాయం ఏటా పెరుగుతోందని కాగ్‌ పేర్కొంది. మొత్తం ట్యాక్స్‌ రెవెన్యూ రూ.1,16,203 కోట్లు ఉందని తెలిపారు. రాష్ట్ర సొంత ట్యాక్స్‌ రెవెన్యూ 2019లో రూ.50,031 కోట్లు ఉంటే, 2022-23 ఆర్థిక సంవత్సరం నాటికి రూ.78,026 కోట్లకు పెరిగింది. సొంత పన్నుల్లో ఎస్‌జిఎస్‌టి వాటా 2019లో రూ.20,611 కోట్లు ఉంటే 2022-23 ఆర్థిక సంవత్సరం నాటికి రూ.27,981 కోట్లకు పెరిగింది. వ్యాపార, వాణిజ్య రంగం ద్వారా రూ.18,004 కోట్లు వస్తోంది, స్టేట్‌ ఎక్సైజ్‌ ద్వారా వచ్చే అదాయం 2019లో రూ.6220 కోట్లు ఉంటే గతేడాదికి రూ.14,798 కోట్లకు చేరింది. వాహనాల మీద పన్నులు గత ఐదేళ్లలో రూ.331 కోట్ల నుండి రూ.4,320 కోట్లకు పెంచారు. స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ అదాయం ఐదేళ్లలో రూ.5,428 కోట్ల నుండి రూ.8,022 కోట్లకు చేర్చారు. మొత్తంగా ఐదేళ్లలో పన్నులు విపరీతంగా పెంచేశారు. దీంతోపాటు ఎలక్ట్రిసిటీ డ్యూటీ ఈ ఏడాది అమాంతంగా రూ.4,243 కోట్లు వసూలు చేశారు.

వెలిగొండలో అధిక చెల్లింపులు

వెలిగొండ ప్రాజెక్టులో అగ్రిమెంటు చేసుకున్న ధరల కంటే అదనపు చెల్లింపులు చేశారని కాగ్‌ నివేదిక వెల్లడించింది. లెక్కల్లోనూ తప్పులున్నట్లు తేల్చారు. సొరంగాలు, రిజర్వాయర్‌, కాలువ, డిస్ట్రిబ్యూషన్‌ నెట్‌వర్కు అమలులో పెద్దఎత్తున లోపాలను గుర్తించినట్లు నివేదిక పేర్కొంది. సొరంగాల కంటే తక్కువ విడుదల సామర్థ్యంతో ఫీడర్‌ కెనాల్స్‌లో ఏర్పాటు చేశారని, దీనివల్ల ఆశించిన దానికంటే తక్కువ ఆయకట్టు సాగవుతుందని గుర్తించినట్లు పేర్కొన్నారు. డిజైన్లలో ఆమోదం, తరుచూ కాంట్రాక్టు కంపెనీలను మార్చడం వల్ల పురోగతి ఆలస్యమవుతోందనీ పేర్కొంది. టన్నెల్‌ బోరింగ్‌ మెషిన్‌కు బదులు మనుషులు, బ్లాస్ట్‌ మెషిన్లతో డ్రిల్లింగ్‌ వేయాలనే నిర్ణయం వల్ల పెద్దఎత్తున మిషనరీ వృథాగా పోయిందని తెలిపింది. బడ్జెట్‌ లోకేటాయింపులు చూపిస్తున్నా చెల్లింపుల్లో తీవ్ర జాప్యం ఉన్నట్లు గుర్తించారు. మొత్తం బడ్జెట్‌ ఆథరైజేషన్లో రూ.2190 కోట్లకుగాను రూ.1270 కోట్లు మాత్రమే చెల్లించినట్లు గుర్తించామని కాగ్‌ నివేదిక పేర్కొంది. చెల్లింపుల్లోనూ ఒప్పందాలను ఉల్లంఘించి అదనంగా చేసినట్లు గుర్తించింది. పనులు ప్రారంభించి 17 సంవత్సరాలు పూర్తయినా ప్రాజెక్టు ఇంకా అసంపూర్తిగానే ఉందని, దీనివల్ల కరువు పీడిత ప్రాంతానికి ప్రాజెక్టు నిర్మాణ ఉద్దేశం నెరవేరకుండా పోతోందని తెలిపింది.

➡️