మైదానం నుంచి ఎన్నికల బరిలోకి…

May 7,2024 04:44 #2024 election, #leaders, #Sports

మన దేశంలో మైదానంలో రాజకీయాలు, రాజకీయాల్లో ఆటలు సర్వసాధారణమైపోయాయి. అందుకే కాబోలు చాలామంది ఆటగాళ్లు ఒక దశ దాటిన తరువాత మైదానాన్ని వీడి రాజకీయాల్లోకి దూకుతున్నారు. అయితే రాజకీయాల్లో రాణించడమంటే క్రీడల్లో నెగ్గుకొచ్చినంత తేలిక కాదు అని అనతి కాలంలోనే గ్రహించి కొందరు వెనుదిరిగిన వారున్నారు. ఇంకొందరు పట్టు వీడని విక్రమార్కుల్లా పోరాడుతున్నారు. క్రీడల్లో ప్రత్యర్థి స్పష్టంగా అగుపిస్తాడు. ఆట సరైన రీతిలో సాగేందుకు అందరూ నిబంధనలకు కట్టుబడి ఉండాల్సిందే. రాజకీయాల్లో అలా కాదు.ఆట ఇలాగే సాగాలన్న కచ్చితమైన నియమాలేవీఉండవు. ప్రత్యర్థి ఎవరో, ఎటు నుంచి ఎవరు వెన్నుపోటు పొడుస్తారో తెలియదు. ఇక్కడ టక్కు టమార విద్యలతో ప్రజలను మభ్య పెట్టే కళలో ఆరితేరినవారు ఉంటారు. ఇన్ని హర్డిల్స్‌ను దాటి రాజకీయాల్లో రాణించినవారు లేకపోలేదు. అటువంటివారిలో కొందరి గురించి తెలుసుకుందాం!

రాజ్యవర్థన్‌సింగ్‌ రాథోడ్‌

రాజస్థాన్‌కు చెందిన 53 ఏళ్ల ఈ షూటర్‌ 2004 ఏథెన్స్‌ ఒలింపిక్స్‌లో భారత్‌కు తొలి రజిత పతకం సాధించిపెట్టాడు. ఇండియన్‌ ఆర్మీ నుంచి రిటైరయిన తరువాత 2013 సెప్టెంబరులో బిజెపిలో చేరాడు. 2014, 2019లో వరుసగా రెండు సార్లు జైపూర్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందాడు. మోడీ కేబినెట్‌లో మంత్రి పదవి నిర్వహించాడు. 2023 రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికల్లో జోల్వారా నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందాడు. 2023 డిసెంబరు 3న లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేశాడు. రాజస్థాన్‌ ప్రభుత్వంలో ప్రస్తుతం కేబినెట్‌ మంత్రిగా ఉన్నాడు.

కీర్తి అజాద్‌

బీహార్‌కు చెందిన 65 ఏళ్ల ఈ మాజీ క్రికెటర్‌ 1983 వరల్డు కప్‌ సాధించిన జట్టులో సభ్యుడు. అతని తండ్రి భగవత్‌ ఝా అజాద్‌ బీహార్‌ ముఖ్యమంత్రిగా పనిచేశారు. కీర్తి అజాద్‌ బీహార్‌లోని దర్బాంగ లోక్‌సభ నియోజకవర్గం నుంచి రెండు పర్యాయాలు ఎన్నికయ్యాడు. అంతకుముందు ఢిల్లీలోని గోల్‌ మార్కెట్‌అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందాడు. ఢిల్లీ క్రికెట్‌ అసోసియేషన్‌లో అవినీతి అక్రమాలపై అరుణ్‌జైట్లీని బహిరంగంగా విమర్శించినందుకు బిజెపి నుంచి సస్పెన్షన్‌కు గురయ్యారు. 2019లో కాంగ్రెస్‌లో చేరాడు. 2022లో కాంగ్రెస్‌ నుంచి తృణమూల్‌ కాంగ్రెస్‌లోకి జంప్‌ చేశాడు. ప్రస్తుతం తృణమూల్‌ కాంగ్రెస్‌ గోవా రాష్ట్ర ఇంఛార్జిగా వున్నాడు.

గౌతం గంభీర్‌: ఢిల్లీకి చెందిన 43 ఏళ్ల ఈ మాజీ క్రికెటర్‌ 2019లో బిజెపి తరపున తూర్పు ఢిల్లీ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందాడు.రెండేళ్ల క్రితం మహ్మద్‌ ప్రవక్తను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన బిజెపి ప్రతినిధి నూపుర్‌ శర్మను గంభీర్‌ వెనకేసుకొచ్చాడు. నూపుర్‌ శర్మ 2015 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అరవింద కేజ్రీవాల్‌పై పోటీ చేసి చిత్తుగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో ఆమెను అమేథీ నుంచి బరిలోకి దించాలని బిజెపి యోచిస్తోంది. ఆ విషయం అలా వుంచితే గౌతం గంభీర్‌ ఎంపీగా ఉంటూనే కొల్‌కతా నైట్‌ రైడర్స్‌ తరపున ఐపిఎల్‌లో ఆడాడు. ఈ ఏడాది మార్చి 24న రాజకీయాలకు, బజెపికి ఆయనగుడ్‌బై చెప్పాడు.

భయాచుంగ్‌ భుటియా సిక్కింకు చెందిన ఈ 47 ఏళ్ల ఈ ఇండియన్‌ ఫుట్‌బాల్‌ మాంత్రికుడు 2019లోక్‌సభ ఎన్నికల్లో తృణమూల్‌ కాంగ్రెస్‌ తరపున డార్జిలింగ్‌ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయాడు. 2021 బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో సిపిఎం ప్రముఖులు అశోక్‌ భట్టాచార్యకు మద్దతుగా ప్రచారం చేశాడు. తరువాత హమ్‌రో సిక్కిం అన్న పేరుతో సొంత పార్టీని ఏర్పాటు చేశాడు. 2024 ఏప్రిల్‌ 19న పార్లమెంటు తొలివిడతతో బాటు జరిగిన సిక్కిం అసెంబ్లీ ఎన్నికల్లో చామ్లింగ్‌ నేతృత్వంలోని ప్రతిపక్ష కూటమి ఎస్‌డిఎఫ్‌లో చేరి విస్తృతంగా ప్రచారం చేశాడు.

నవజోత్‌సింగ్‌ సిద్దూ

పంజాబ్‌కు చెందిన 60 ఏళ్ల ఈ మాజీ క్రికెటర్‌ 2004 లోక్‌సభ ఎన్నికల్లో అమృతసర్‌ నుంచి బిజెపి టికెట్‌పై పోటీ చేసి గెలుపొందాడు. ఓ క్రిమినల్‌ కేసులో అతడిని దోషిగా నిర్ధారించి జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు ఇవ్వడంతో ఎంపీ పదవికి రాజీనామా చేశాడు. తరువాత ఉన్నత న్యాయస్థానం ఆ తీర్పుపై స్టే ఇవ్వడంతో ఉప ఎన్నికల్లో పోటీ చేసి లోక్‌సభకు తిరిగి ఎన్నికయ్యాడు. 2009 ఎన్నికల్లోనూ సిద్దూ అక్కడి నుంచే నెగ్గాడు. 2016 ఏప్రిల్‌ లో ఆమాద్మీ పార్టీవైపు ఆయన మొగ్గు చూపినప్పుడు బిజెపి రాజ్యసభ సీటు ఇచ్చింది. అయితే మూడు మాసాల తరువాత రాజ్యసభ సభ్యత్వానికి ఆయన రాజీనామా చేసి పనిచేశాడు. 2016 సెప్టెంబరులో ప్రముఖ హాకీ ఆటగాడు ప్రగత్‌ సింగ్‌తో కలసి ఆవాజ్‌ ఇ పంజాబ్‌ అన్న పేరుతో సొంత పార్టీని స్థాపించాడు. అది క్లిక్‌ కాకపోవడంతో దానిని రద్దు చేసి 2017 జనవరిలో కాంగ్రెస్‌ పార్టీలో చేరాడు. ఆ సంవత్సరం జరిగిన పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో అమృతసర్‌ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందాడు. అమరీందర్‌ సింగ్‌ మంత్రివర్గంలో కేబినెట్‌ మంత్రిగా చేరాడు. 2018లో పాకిస్తాన్‌లో ఇమ్రాన్‌ఖాన్‌ ప్రమాణస్వీకా రోత్సవానికి హాజరయ్యాడు. దీనిని అమరీందర్‌ సింగ్‌ తప్పుపట్టాడు. 2019లో మంత్రివర్గం నుంచి సిద్ధూను తొలగించారు.2021 జులైలో సిద్ధూకు పంజాబ్‌ పిసిసి అధ్యక్ష పగ్గాలు అప్పగించారు. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో అమృతసర్‌ తూర్పు నియోజకవర్గం నుంచి సిద్దూ పోటీ చేసి ఆమాద్మీ పార్టీ అభ్యర్థి చేతిలో ఓడిపోయాడు.

అజారుద్దీన్‌  మాజీ క్రికెటర్‌ అజారుద్దీన్‌ 2009లో యుపిలోని మొరదాబాద్‌ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్‌ టిక్కెట్‌పై గెలుపొందారు. 2014లో రాజస్థాన్‌లోని టోంక్‌-సవారు మధోపుర్‌ నుంచి కాంగ్రెస్‌ తరుఫున పోటీ చేసి ఓడిపోయారు. 2018లో కాంగ్రెస్‌ పార్టీ ఆయన్ను తెలంగాణ కాంగ్రెస్‌ కమిటీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా నియమించింది. 2023లో తెలంగాణాలోని జూబ్లిహిల్స్‌ అసెంబ్లీ సీటు నుంచి పోటీ చేసి ఓడిపోయారు.

కరణ్‌ భూషణ్‌ సింగ్‌

ఉత్తరప్రదేశ్‌కు చెందిన షూటర్‌ కరణ్‌ భూషణ్‌ సింగ్‌ కైసర్‌గంజ్‌ నియోజకవర్గంలో బిజెపి నుంచి పోటీ చేస్తున్నాడు. భారత రెజ్లింగ్‌ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) మాజీ అధ్యక్షుడు సిట్టింగ్‌ ఎంపి బ్రిజ్‌ భూషణ్‌ కుమారుడు కరణ్‌ సింగ్‌. మహిళా రెజ్లర్లపై బ్రిజ్‌ భూషణ్‌ లైంగికంగా వేదింపులకు పాల్పడుతున్న కేసులో ఆయన్ను డబ్ల్యుఎఫ్‌ఐ సస్పెండ్‌ చేసింది. ఈ విషయం దేశమంతటా చర్చనీయాంశం కావడంతో బ్రిజ్‌ భూషణ్‌ సీటును ఆయన కుమారుడికి బిజెపి కట్టబెట్టింది.

సిపిఎం నుంచి గెలిచిన జ్యోతిర్మయి
జ్యోతిర్మయి సిక్దార్‌ పశ్చిమబెంగాల్‌కు చెందిన 59 ఏళ్ల ఈ మాజీ క్రీడాకారిణి 2004లోక్‌సభ ఎన్నికల్లో కృష్ణానగర్‌ నియోజకవర్గం నుంచి సిపిఎం తరపున పోటీ చేసి గెలుపొందింది. రెండు సార్లు ఆసియాడ్‌ 800 మీ. పరుగుపందెం విజేత అయిన సిక్దర్‌ 2009లో తృణమూల్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి చేతిలో ఓడిపోయింది. కొంతకాలం పాటు రాజకీయాలకు దూరంగా ఉన్న ఆమె 2019లో తృణమూల్‌ కాంగ్రెస్‌లో చేరి కొంత కాలం తరువాత బిజెపిలోకి దూకింది.

టిఎంసి నుంచి యూసఫ్‌ పఠాన్‌
క్రికెటర్‌ యూసఫ్‌ పఠాన్‌ బెర్హంపుర్‌ నియోజకవర్గం నుంచి టిఎంసి తరుఫున పోటీ చేస్తున్నారు. ఇటీవలే ఈయన టిఎంసిలో చేరి టిక్కెట్టు సంపాదించారు. పశ్చిమ బెంగాల్‌ కాంగ్రెస్‌ ప్రెసిడెంట్‌ అధిర్‌ రంజన్‌ చౌదరి యూసఫ్‌తో పోటీ పడుతున్నారు.

➡️