పొంతన లేని జిడిపి లెక్కలు

Mar 3,2024 10:38 #Business
  • పడిపోయిన ఆదాయ, వినిమయం అయినా వృద్థి గణంకాల ఉరకలు..?

న్యూఢిల్లీ : మోడీ సర్కార్‌ విడుదల చేసిన జిడిపి గణంకాలకు వాస్తవ అంశాలకు అమాంతం పొంతన లేకుండా పోయింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికం (క్యూ3)లో జిడిపి 8.4 శాతం పెరిగిందని ఎన్‌ఎస్‌ఒ గణంకాలు విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ లెక్కలు గృహ వినియోగం, ఆదాయ పరిస్థితి వాస్తవికతకు విరుద్దంగా ఉన్నాయి. గడిచిన నాలుగేళ్లలో వాస్తవ ఆదాయాల్లో కేవలం 3 శాతం మాత్రమే పెరుగుదల ఉందని 11 ఏళ్ల తర్వాత జాతీయ వ్యయ సర్వే (2022-23) విడుదల చేసిన లేబర్‌ ఫోర్స్‌ సర్వే (పిఎల్‌ఎఫ్‌ఎస్‌)లో పేర్కొంది. అనేక వినియోగదారుల ఉత్పత్తుల కంపెనీలు డిమాండ్‌ కొరతను ఎదుర్కొంటున్నాయి. దిగుమతుల్లోనూ భారీ తగ్గుదల, వ్యయాల్లో తగ్గుదలను సూచిస్తున్నాయి. 2023 డిసెంబర్‌ త్రైమాసికంలో దిగుమతులు 22 శాతం పతనం కాగా.. ఎగుమతుల్లో స్వల్పంగా 0.9 శాతం పెరుగుదల ఉంది. ప్రయివేటు వినిమయంలో 0.7 శాతం తగ్గుదల నమోదయ్యింది. ప్రజల ఆదాయాలు, వ్యయాలు, పొదుపు అంశాలు బలమైన వృద్థిని తెలియజేస్తాయి. కానీ.. ప్రజల ఆదాయాల్లో పెద్ద పెరుగుదల లేకపోగా.. ఖర్చులు అమాంతం పెరగడంతో పొదుపు స్థాయిలు తగ్గిపోయాయి. రోడ్లు, రైల్వేలు, రక్షణ రంగ తదితర మౌలిక రంగ వసతులు 5.2 శాతం పెరుగుదల ఉండొచ్చని ఇటీవలి మధ్యంతర బడ్జెట్‌లో కేంద్రం అంచనా వేసింది. ఇది కూడా దేశీయ డిమాండ్‌లో తగ్గుదలను చూపిస్తోంది. గడిచిన జనవరిలో ఎనిమిది ప్రధాన మౌలిక రంగాల వృద్థి 3.6 శాతానికి పరిమితమై.. 15 నెలల కనిష్ఠాన్ని తాకింది. రిఫైనరీ ఉత్పత్తులు, ఎరువులు, ఉక్కు, విద్యుత్తు తదితర రంగాల్లో పనితీరు పేలవంగా చోటు చేసుకుందని స్వయంగా కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన గణంకాల్లో తేలింది. దేశ పారిశ్రామిక ఉత్పత్తి సూచీలో ఏకంగా 40.27 శాతం వాటా కలిగిన ఎనిమిది అత్యంత ప్రాధాన్యత కలిగిన రంగాలు పేలవ ప్రదర్శన కనబర్చుతుంటే.. మరోవైపు జిడిపి భారీగా పెరగడం బిజెపి సర్కార్‌ మాయాజాలాన్ని స్పష్టం చేస్తోందని నిపుణులు పేర్కొంటున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌ నుంచి డిసెంబర్‌లో ఎఫ్‌డిఐల్లో ఏకంగా 13 శాతం పతనమై 32.03 బిలియన్‌ డాలర్లకే పరిమితమయ్యాయి. కంప్యూటర్‌ హార్డ్‌వేర్‌, సాఫ్ట్‌వేర్‌, ట్రేడింగ్‌, సేవలు, టెలికం, ఆటో, ఔషధ, రసాయన రంగాల్లో ఎఫ్‌డిఐలు దిగజారినట్టు తేలింది. ఆదాయాలు తగ్గడం, దిగుమతుల్లో పతనం, ఎగుమతులు అంతంత మాత్రమే, ఎఫ్‌డిఐల్లో క్షీణత నేపథ్యంలో మరోవైపు జిడిపి అమాంతం పెరుగుదల తీవ్ర అనుమానాలకు దారి తీస్తోంది.

➡️