కాయ్ .. రాజా కాయ్..!

May 8,2024 10:43 #Kai .. Raja Kai..!
  • అభ్యర్థి గెలుపు, మెజార్టీలపై పందేల హోరు
  • దెందులూరు, ఉండి వంటి స్థానాల్లో పోరు రసవత్తరం

ప్రజాశక్తి – ఏలూరు ప్రతినిధి : ఎన్నికల పోలింగ్‌ దగ్గర పడుతున్న కొద్ది బెట్టింగుల జోరు ఊపందుకుంది. ప్రతి నియోజకవర్గంలోనూ అభ్యర్థి గెలుపు, మెజార్టీలపై పందేలు హోరెత్తుతున్నాయి. ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో 14 అసెంబ్లీ, రెండు పార్లమెంట్‌ స్థానాలు ఉన్నాయి. అక్కడా, ఇక్కడా అనే తేడా లేకుండా ప్రతి నియోజకవర్గంలోనూ పందేలు సాగుతున్నాయి. దెందులూరు, ఉండి వంటి నియోజకవర్గాల్లో రాజకీయం రసవత్తరంగా మారడంతో పందెంరాయుళ్లు అదేస్థాయిలో రెచ్చిపోతున్నారు. నరసాపురంలో ఫలానా పార్టీ అభ్యర్థి గెలుస్తారంటూ కోసు పందేలు సైతం వేస్తున్నట్లు తెలుస్తోంది. అత్యధిక పందేలు అభ్యర్థి గెలుపుపై సాగుతుండగా, అభ్యర్థి గెలుస్తాడన్న ధీమా ఉన్న నియోజకవర్గాల్లో మెజార్టీపైనా పందేలు కాస్తున్నారు. ఎన్నికల పందేల్లో విచిత్రమైన పరిస్థితి కన్పిస్తోంది. వైసిపి అభిమానులు టిడిపి గెలుస్తుందని పందేలు కాస్తుండగా, టిడిపి అభిమానులు వైసిపి అభ్యర్థులు గెలుస్తారని పందేలు కాస్తుండటం గమనార్హం. ముఖ్యంగా వివిధ సంస్థలు విడుదల చేస్తున్న సర్వేల ఆధారంగా పందేల జోరు ఊపందుకుంటుంది. ఆచంట నియోజకవర్గంలో టిడిపి నుంచి పితాని సత్యనారాయణ, వైసిపి నుంచి చెరుకువాడ రంగనాథరాజు నువ్వానేనా అన్నట్లు పోటీ పడుతున్నారు. ఆర్థికంగా బలమైన అభ్యర్థులు కావడంతో గెలుపుపై ఇరువురు ధీమాగా ఉన్నారు. దీంతో ఇక్కడ అభ్యర్థి గెలుపుపై ఎక్కువగా పందేలు సాగుతున్నాయి. పాలకొల్లులో గడిచిన రెండుసార్లుగా టిడిపి తరపున నిమ్మల రామానాయుడు గెలిచారు. ఈసారి వైసిపి నుంచి గుడాల గోపి, టిడిపి నుంచి రామానాయుడు తలపడుతున్నారు. నిమ్మల మూడోసారి గెలుస్తాడని కొంతమంది పందేలు కాస్తుండగా, ఈసారి గోపీ గెలుస్తారని మరికొంత మంది పందేలు కాస్తున్నారు. ఇక్కడ అభ్యర్థుల మెజార్టీపై పందేలు సాగుతున్నాయి. నరసాపురంలోనూ అభ్యర్థి గెలుపు, మెజార్టీపైనా పందేలు జోరుగా సాగుతున్నాయి. భీమవరంలో వైసిపి నుంచి గ్రంధి శ్రీనివాస్‌, జనసేన నుంచి పులపర్తి రామాంజనేయులు తలపడుతున్నారు. ఈ స్థానంలో పందేలు పెద్దఎత్తున సాగుతున్నాయి. అభ్యర్థి గెలుపుకంటే మెజార్టీపైనే ఎక్కువ బెట్టింగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఉండిలో టిడిపి నుంచి పోటీ చేస్తున్న రఘురామకృష్ణంరాజు గెలుపోటములపై ఎక్కువగా పందేలు నడుస్తున్నాయి. తాడేపల్లిగూడెం, తణుకులోనూ అభ్యర్థి గెలుపుపై ఎక్కువగా బెట్టింగులు కడుతున్నారు. ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలో టిడిపి నుంచి చింతమనేని ప్రభాకర్‌, వైసిపి నుంచి అబ్బాయిచౌదరి మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్లు ఉంది. దీంతో ఇక్కడ పందేలు మరింత ఎక్కువగా సాగుతున్నాయి. విజేత ఎవరైనా అతి తక్కువ మెజార్టీనే వస్తుందని లెక్కలు కడుతూ మెజార్టీపైనే పందేలు సాగుతున్నాయి. ఏలూరులో అభ్యర్థి గెలుపుపై ఎక్కువగా పందేలు సాగుతున్నాయి. నూజివీడు, చింతలపూడిలో అభ్యర్ధి గెలుపుపై పందేలు సాగుతుండగా, కైకలూరులో అభ్యర్థి మెజార్టీపై పందేలు ఎక్కువగా సాగుతున్నాయి. పోలవరంలో మాత్రం పందేల జోరు కొంత తక్కువగా ఉంది. ఎంపీ స్థానాలపైనా పందేలు పడుతున్నారు. ఏలూరు, నరసాపురం ఎంపీ స్థానాలు ఏ పార్టీ గెలుచుకుంటుందనే దానిపై పందేలు సాగుతున్నాయి. ప్రతి నియోజకవర్గంలోనూ రూ.20 కోట్లకుపైగా పందేలు ఉంటాయని అంచనా. కొంతమంది ఒక్కటిగా కలిసి తలోకొంత వేసుకుని పందేలు కడుతున్నారు. మధ్యవర్తుల ద్వారా ఈ పందేలు సాగుతున్నాయి. పందేలు కాసేవారు మధ్యవర్తిని కలిసి చెబితే అతను వేరొకరిని పందేనికి ఏర్పాటు చేస్తున్న పరిస్థితులు సాగుతున్నాయి. ఈ పందేల విషయం బయటికి పొక్కకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎవరికి ఆనందం.. ఎవరికి బాధో జూన్‌ నాలుగో తేదీన తెలియనుంది.

➡️